హరిత విప్లవమా, హరించే మార్గమా?
ABN , First Publish Date - 2023-10-03T02:58:53+05:30 IST
నాదొక వ్యవసాయ కూలీ దళిత కుటుంబం. ఆకలితో పస్తులతో అల్లాడిన అనేక కుటుంబాల్లో నాదీ ఒకటి. నా తల్లిదండ్రులు నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం పనుల్లో రాళ్ళెత్తిన కూలీలు. ఇప్పుడు...
నాదొక వ్యవసాయ కూలీ దళిత కుటుంబం. ఆకలితో పస్తులతో అల్లాడిన అనేక కుటుంబాల్లో నాదీ ఒకటి. నా తల్లిదండ్రులు నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం పనుల్లో రాళ్ళెత్తిన కూలీలు. ఇప్పుడు నా గ్రామంలో మంచినీళ్ళు కొనుక్కొని తాగుతున్న వారు. ఇది 1970 – 1980 మధ్య జరిగిన మా ఊరి కథ. ఒంగోలుకు దక్షిణంగా పది మైళ్ళ దూరంలో నేను పుట్టిన గ్రామం కారుమంచి ఉంది. వర్షాకాలం తప్ప, ఎండాకాలం నీరు ఉండని మూసి – ఇనగలేరు అనే రెండు ఏరుల మధ్య మా ఊరు ఉంది. ఊరికి దక్షిణాన మూసీ ఏరు ఉంటే, ఉత్తరాన ఇనగలేరు ఉంటది. తూర్పున పది మైళ్ళు కోండ్ర వేసినట్టు పోతే, బంగాళాఖాతం ఉంది. ఎండాకాలం ఊరికి నీటి ఎద్దడి ఉన్నా, భౌగోళికంగా చాలా అందమైన ఊరు మాది. ఊరి మధ్యలో ఇరవై నాలుగు ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువుకు వాయువ్యంగా పంట పొలాల నించి వర్షాకాలం నీటిని చెరువుకు తీసుకువచ్చే వరవ ఉంది. మూసి ఏరు అవతల దక్షిణం నుంచి మొదలై ఆరు కిలో మీటర్ల పరిధిలో ఏరు మూడు వంపులు తిరిగి ఉంటది. ఆ మధ్య ప్రాంతం అంతా ఇసుక నేలల్లో, నల్లరేగడి నేలల్లో మామిడి తోపులు, జామ, సపోటా, నేరేడు, సరివి తోపులు ఉన్నాయి. ఊళ్ళో కొంగల తోపు అనే పెద్ద చింతతోపు ఉండేది. అదంతా లక్షలాది పెద్ద సైబీరియా కొంగలు, పెలికాన్ కొంగలు, ఇంకా రకరకాల పక్షులతో నిరంతరం పక్షి కుటుంబాల కలకల రావాలతో నిండి ఉండేది. ఆ మధ్య నెల్లూరు జిల్లాలోని పక్షుల కేంద్రం నేలపట్టులో బైనాక్యులర్స్‌తో అక్కడి పక్షులను చూసినప్పుడు నాకేమీ పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే, నా చిన్నప్పుడే మా ఊరిలో అంతకంటే దగ్గరగా, వైభవంగా, సంఖ్యలో ఎక్కువగా చూసిన కొంగలతోపులోని పక్షులు మా ఊరి వారికి ఎంతో కనువిందు, వీనుల విందు చేశాయి కదా అని అనిపించింది.
మా ఊరికి కోడెల కారుమంచి అని పేరు. ఎందుకంటే, ఊరి నిండా ఒంగోలు ఎద్దులు, ఆవులు, కోడెదూడలు, పెయ్యదూడలు ఉండేవి. దున్నపోతులు, పాడి బర్రెలు, పడ్డదూడలు, దున్నకుర్రలు ఉండేవి. ఊళ్ళో ఏ రోడ్డు చూసినా, పొలాలకు పోయే ఏ డొంక చూసినా, పేడకళ్లు దర్శనమిచ్చేవి. ఈ పేడని, గొడ్లు తిని వదిలేసిన పచ్చిమేతనీ రైతులు పంట పొలాలకి ఎరువుగా వేసేవారు. జనాలు పచ్చిపేడతో ఇళ్లు, మట్టిగోడలు అలుక్కుని, ఇళ్ళముందు పేడనీళ్లతో కళ్ళాపి చల్లుకునేవారు.
మా వూరు మెట్ట గ్రామం. అయినా గాని, ఎన్నో పంటలకి ఆలవాలం. జొన్న, సజ్జ, రాగి, వరిగ, ఆళ్ళు, కొర్రలు, నల్లనువ్వులు, తెల్లనువ్వులు, బుడ్డ సెనగ, వేరు శెనగ, కంది, పెసర, పిల్లిమిసర, అలసంద, మినుము, దోస, బుడ్డ దోస, ఇట్లా ఎన్నో పంటలు పండేవి. నా చిన్నప్పుడు, పగలూ రాత్రి కూడా జొన్న సంగటి, సజ్జ సంగటి, రాగి సంగటి, వరిగె అన్నం ఎక్కువగా తిన్నాము. పొలం పనికి వెళ్ళేటపుడు, వచ్చేటపుడు కందికాయలో, పెసరకాయలో, పిల్లిమిసర కాయలో, అలసంద కాయలో, సజ్జ, జొన్న కంకులో, దోసకాయలో, పండిన నువ్వులో, అలా ఏవో కొన్ని చేలల్లోంచి అందుకుని, చిరుతిండ్లుగా కడుపు నింపుకునే అవకాశం ఉండేది. చెయ్యెత్తు పెరిగిన గోగు పట్టెల్లోకి దూరి బుట్టెడు గోంగూర దూసుకొచ్చి పచ్చడిగానో, కూరగానో చేసుకునే వాళ్ళు ఊరి జనాలు. నా చిన్నతనంలో కోమటింటికి జొన్నలు కొలిచి ఇచ్చి సరుకులు తెచ్చుకునే వాళ్ళం. చిన్నప్పుడు గొడ్లు కాయడానికి వెళ్ళి డొంకల్లో ఉండే చిన్న చిన్న గుంటల్లో, కందకాలలో, కాల్వల్లో, కుంటల్లో, వర్షపు నీరు ఎక్కడ నిలవ వుంటే అక్కడల్లా దోసిళ్లతో ఎత్తుకుని అమృతం తాగినట్లు తాగి దాహం తీర్చుకునే వాళ్ళము. వర్షాకాలం, చలికాలాల్లో పొలాల మధ్య నేలపై ఉన్న ప్రతి నీటినీ తాగునీటిగానే చూసినము. నాటి మా ఊరి ఈ వాస్తవికత, నాటి తరానికి అదొక జ్ఞాపకం. ఒక కలగా మిగిలిన జ్ఞాపకం. ఇప్పటి తరానికి ఊహకు సైతం అందని గతం! మా ఊరికి పొగాకు పంట, ట్రాక్టర్లు వచ్చి, పైవాటి నన్నింటినీ లేకుండా నాశనం చేసేశాయి!
గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంత గ్రామాల్లో భూముల్లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే పనులు దొరికేవి. ఇప్పటికీ అంతే. ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో పనులకు వలసలు పోవడం అనేది లేదు. ఎందుకంటే, పట్టణీకరణ అప్పట్లో అంతగా లేదు. ఆకలికి ఓర్చుకుని, కడుపులు మాడ్చుకొని, పోషకాహార లేమితో కూడిన అనేక ఆకలి జబ్బులతో పేద ప్రజలు జీవించిన రోజులవి. దేశంలో తలెత్తిన ఇటువంటి పేదరికం, ఆహార కొరతల నుంచే భారత ప్రభుత్వం అధిక దిగుబడుల పంటలు సృష్టించే వ్యవసాయ విప్లవం తీసుకు రాదలిచింది. ఈ ఉద్దేశం లోంచే భారతదేశంలో హరిత విప్లవం ముందుకు వచ్చింది. ఇండియాలో కొనసాగిన హరిత విప్లవాన్ని రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచీకరణ ప్రారంభంలో వచ్చిన దుష్ఫలితంగా చూడవచ్చునేమో?
నిజానికి మా ఊరికి నాగార్జున సాగర్ కెనాల్ శాంక్షన్ అయింది. కానీ, అప్పటికే పొగాకు మెట్టసాగుగా బాగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇందువల్ల, కాలవ నీటి ద్వారా వచ్చే మాగాణి బురద అంటించుకోడం ఎందుకని మా ఊరి భూస్వాములు అనుకున్నారట. దీంతో, శాంక్షన్ అయిన పంట కాల్వని కూడా, పొరుగూళ్లకు అప్పజెప్పేశారు!
ట్రాక్టర్ల రాకతో, ఇక జీతగాళ్ళు అరకలు కట్టే అవసరం తగ్గింది. పొలాలు దున్నే గొడ్లన్నీ కబేళాలకు తరలించబడి, జాతి నిర్మూలనమయ్యాయి. పశువుల పేడకు బదులుగా, యూరియా, పొటాష్, సూపరు, నత్రజని మొదలగు ఎరువుల పేరుతో చక్కెర మాదిరి రూపంలో, తొక్కిన జొన్నగుండ్లు మాదిరి రూపంలో, కృత్రిమ రసాయనిక ఎరువులు వచ్చేశాయి. తెగుళ్లు, పురుగుల నియంత్రణ కోసం అత్యంత విషపూరిత రసాయనాలు పంటల మీదా, గాల్లో, భూమిపై, నీటిపై ఆహారంపై పేరుకుపోయి ఆరోగ్యంపై విషాలుగా పని చెయ్యడం మొదలయ్యింది. ఈ విధంగా మొత్తం పర్యావరణం కాలుష్యమయమై పోయింది. ఇట్లా రైతుల వేలంవెర్రి లాభాల వేటకు, అధిక దిగుబడుల వ్యసనాలకు, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాలకు సమాజం రోగిష్టిదై పోయింది. ప్రకృతీ, పర్యావరణం మానవ వ్యతిరేకంగా మారింది. ఈ మార్పునకు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఒక్కడే బాధ్యుడు కాడు. నాటి భారత ప్రభుత్వమూ, రైతు వర్గం కూడా బాధ్యత వహించాలి.
కృపాకర్ మాదిగ
సామాజిక ఉద్యమాల కార్యకర్త