వైద్య వృత్తి ధార్మికుడు, సేవాధర్మ విఖ్యాతుడు
ABN , First Publish Date - 2023-10-13T01:08:48+05:30 IST
ఈఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుజాతి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన నలుగురు మహానుభావుల శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు...
ఈఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుజాతి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన నలుగురు మహానుభావుల శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, యలవర్తి నాయుడమ్మ, అక్కినేని నాగేశ్వరరావు ఆ తెలుగు కీర్తి కౌస్తుభాలు. ఈ కోవకు చెందిన ఉదాత్తుడే డాక్టర్ కాసరనేని సదాశివరావు. విద్య, వైద్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో విఖ్యాత సేవా వ్రతుడు సదాశివరావు.
డాక్టర్ కాసరనేని ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై తన జీవన యానాన్ని సాగించారు. పేదల డాక్టర్‌గా పేరు గడించారు. వృత్తి వైద్యం అయినప్పటికీ ప్రవృత్తి సాహితీ పిసాస, రాజకీయ అభిలాష. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో ఎదిగిన సదాశివరావు అక్టోబర్ 13, 1923న గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు శివారు రామచంద్రపాలెంలో జన్మించారు. మేనమామ, స్వాతంత్ర్య సమరయోధుడు పిన్నమనేని సూరయ్య ప్రోత్సాహంతో వైద్యవృత్తిని ఎంచుకున్నారు. గుంటూరులో 1951లో ప్రజా వైద్యశాలను స్థాపించారు. అది పేరుకు మాత్రమే కాదు. ఆచరణలో కూడా ప్రజల వైద్యశాలగా స్థిరపడింది. గ్రామీణ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైద్యులు పలు విధాల వారిని దోచుకునే రోజులవి. ఆ పరిస్థితుల్లో గ్రామీణ పేదల కష్టాన్ని దగ్గర నుంచి చూసిన నేపథ్యంలో వారికి ఉచిత వైద్యాన్ని అందించాలని సదాశివరావు నిర్ణయించుకున్నారు. జీవితాంతం ఆచరించి చూపారు. ప్రజా వైద్యశాల ప్రభుత్వ వైద్యశాలను మరిపించేది. నిరుపేదలైతే మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అమాయకులు అయిన గ్రామీణ ప్రాంత రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆయనకు ధనిక, పేద అనే తారతమ్యం లేదు. వైద్య పరీక్షలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో రోగ నిర్ధారణ చేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. రోగుల కుటుంబాలకు ఆప్తుడుగా వ్యవహరించేవారు. రోగులపట్ల ఆయన చూపించిన వాత్సల్యమే వారిని సగం ఆరోగ్యవంతులను చేసేది.
సదాశివరావు యువ వైద్యులను ప్రోత్సహించేవారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అనేక కొత్త ఆసుపత్రులను ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించారు. దీనికి కారణం సదాశివరావు హస్త వాసిపై ఉన్న నమ్మకమే. రాష్ట్రంలో ఎక్కువ ఆసుపత్రులు ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైద్య రంగాన్ని వ్యాపార దృష్టితో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని ఎప్పుడూ ఆయన చెబుతుండేవారు. ఈ తరం వైద్యులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో విలువలు, విశ్వసనీయత పెరుగుతాయి.
డాక్టర్ సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, ఏకాగ్రత ఆయనలో మూర్తీభవించాయి ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. అన్నింటికంటే సహృదయత, జాలి, దయ, దాతృత్వ స్ఫూర్తి ఆయనను ఉన్నత శిఖరాలపై నిలిపాయి. చదువులపై ఆయనకు ఉన్న అపారమైన ఆసక్తి వివిధ విద్యాసంస్థల అభివృద్ధికి బాటలు వేసేలా చేశాయి. చదువు లక్ష్యం సంపాదన కోసం కాదని, విద్య వివేకాన్ని, సృజనాత్మకతను, సంస్కారాన్ని అందించాలని తపించేవారు. తన విద్యార్థి దశ నుంచే గ్రామీణ పేదలకు విద్యను అందించాలనే తపన ఆయనలో ఉండేది. విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలకు తనవంతు సహాయం అందించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి దానిని కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్దారు. సుదీర్ఘకాలం జేకేసీ కళాశాల పాలకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన దార్శనికత, ముందుచూపుతో రాష్ట్రంలోనే దాన్ని ఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. సాంకేతిక విద్య అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్.వి.ఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనలో, పాలకవర్గంలో పనిచేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా తీర్చిదిద్దారు. ఆయన సతీమణి జయప్రదాంబ పేరుతో ఒక కళాశాలను కూడా నెలకొల్పారు. స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నవ లక్ష్మీ నారాయణ దంపతులు స్థాపించిన శారదా నికేతన్‌కు సదాశివరావు దంపతులు వివిధ రూపాల్లో తమ సేవలను అందించారు. జాతిని సామాజికంగా, ఆర్థికంగా పురోగమన పథంలో నడిపించే శక్తి విద్య, విజ్ఞానానికి, నైపుణ్యానికి మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. అందుకే విద్యా బోధనలో, విద్యా ప్రమాణాలలో ఎక్కడా రాజీపడేవారు కాదు.
చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని సదాశివరావు బలంగా నమ్మేవారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన నియంతృత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ పాలనను నిరసించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న ఆచార్య రంగా అంటే ఎనలేని అభిమానం. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కొత్త రఘురామయ్యపై గుంటూరు నుంచి సదాశివరావు పోటీ చేశారు. అనంతరం తన రాజకీయ గురువైన రంగాపై కూడా పోటీ చేశారు. నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1985లో పెదకూరపాడు నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. రైతుల కోసం అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారు. 1990లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఓటమిపై ఎన్టీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో తన అభిప్రాయాలను సదాశివరావు నిర్మొహమాటంగా ఎన్టీఆర్ ముందుంచారు. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు గానీ సినీ యాక్టర్‌గా కాదని ఆయన సమక్షంలో చెప్పారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగే మహానాడు కార్యక్రమాన్ని వేసవిలో కాకుండా మరో ఋతువులో నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
సాహిత్యం పట్ల సదాశివరావుకు ఎనలేని మక్కువ. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఆయన బాగా చదివారు. పలువురు కవులు, రచయితలను ఒక వేదికపైకి తీసుకువచ్చారు. ప్రతి సందర్భంలోనూ ప్రజల ఆలోచనలతో మమేకమవుతూ వారి ఊహలకు, ఉద్వేగాలకు, అనుభూతులకు, అనుభవాలకు అద్దం పడుతూ ముందుకు నడిచారు. సాహితీ జగత్తులో ఒక నూతన వ్యవస్థ నిర్మాణం కోసం కృషిచేశారు. గుర్రం జాషువాతో కలిసి సాహిత్య సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో తుమ్మల సీతారామమూర్తి, దివాకర్ల వెంకటావధాని, వానమామలై వరదాచార్యులు, ఉత్పల సత్యనారాయణ, కాళోజి నారాయణరావు, సి.నారాయణ రెడ్డి, నాయని కృష్ణ కుమారి, బి.వి. నరసింహారావు, షేక్ నాజర్, మరుపూరు కోదండరామిరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాజన్న కవి, రామలక్ష్మి ఆరుద్ర, మాధవరాయ శర్మ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, నాగళ్ల గురుప్రసాదరావు, బేతవోలు రామబ్రహ్మం, ప్రసాదరాయ కులపతి మొదలైన సాహితీ దిగ్గజాలు పాల్గొనేవారు. తెలుగుదనానికి సదాశివరావు నిలువెత్తు నిదర్శనం. మహోన్నత మానవత్వం, సమున్నత వ్యక్తిత్వం ఆయనది. సమాజంలో విలువలు, విశ్వసనీయతకు ప్రతిరూపంగా నిలిచారు. నీతి, నిజాయితీలే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి కీర్తిశేషుడు అయిన డాక్టర్ కాసరనేనికి ఘనంగా శతజయంతి నీరాజనాలు అర్పిద్దాం.
మన్నవ సుబ్బారావు
(నేడు డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి)