ఆశలు, ఆదర్శాలు

ABN , First Publish Date - 2023-02-28T01:11:39+05:30 IST

రాయ్‌పూర్ ప్లీనరీలో సోనియాగాంధీ పాతికేళ్ళ రాజకీయజీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన, ‘ఇన్నింగ్స్‌ ముగిసింది’ అన్న వ్యాఖ్య, సోనియా...

ఆశలు, ఆదర్శాలు

రాయ్‌పూర్ ప్లీనరీలో సోనియాగాంధీ పాతికేళ్ళ రాజకీయజీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన, ‘ఇన్నింగ్స్‌ ముగిసింది’ అన్న వ్యాఖ్య, సోనియా రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నట్టేనన్న భావన కలిగించాయి. ఈ మాటలు అధ్యక్షబాధ్యతలకు సంబంధించినవే తప్ప, రాజకీయాలనుంచి కాదని కాంగ్రెస్‌ చెబుతున్నప్పటికీ, రాహుల్‌ నాయకత్వంలో సాగిన జోడోయాత్రపై ప్రత్యేక ప్రశంసలతో ఆమె వారసత్వాన్ని ఎలాగూ ఖరారుచేసేశారు. వేలాదికిలోమీటర్ల జోడోయాత్ర తరువాత రాహుల్‌లో వచ్చిన విశేషమైన మార్పు గమనించిన కాంగ్రెస్‌ నాయకులు కూడా గతంలో మాదిరిగా ఆయన ఇకపై అఖరునిముషంలో అస్త్రసన్యాసం చేస్తారని భావించకపోవచ్చును కూడా. ఈ ప్లీనరీ ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేసిందో తెలియదు కానీ, కాంగ్రెస్‌ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహాన్నే నింపింది.

కాంగ్రెస్‌కు కర్ణాటక అంటే గిట్టదనీ, రాష్ట్రానికి చెందిన గొప్పనాయకుడు మల్లికార్జున ఖర్గేను ఆ పార్టీ నామమాత్రంగా అధ్యక్ష హోదాలో కూచోబెట్టిందనీ, నిజానికి చక్రం తిప్పుతున్నవారెవ్వరో అందరికీ తెలుసునని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం బెలగావీలో వ్యాఖ్యానించారు. మేనెలలో కర్ణాటక ఎన్నికలు ఉన్నందున ఇకపై బీజేపీ దృష్టి అంతా ఆ రాష్ట్రంపైనే ఉంటుంది కనుక, వారి ప్రసంగాల్లో ఖర్గేకు ఎక్కడలేని ప్రాధాన్యం దక్కడం సహజం. ఖర్గేను ఆ పార్టీ ఏ విధంగా అవమానిస్తున్నదీ మోదీ వివరించలేదు కానీ, వర్కింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలన్న ఆయన ఆలోచనకు భిన్నంగా నామినేషన్‌ విధానానికి కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సిద్ధపడటం ఇందుకు కారణం కావచ్చు. ఖర్గే అధ్యక్షుడైనంత మాత్రాన గాంధీ కుటుంబీకులు కాంగ్రెస్‌ను పూర్తిగా ఆయనకే వదిలేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఖర్గే కత్తిదూసేదేమీ ఉండదని బీజేపీ విమర్శిస్తున్నట్టుగానే, నడ్డా ఎన్నిమార్లు బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైనా అసలు అమిత్ షాయేనని కాంగ్రెస్‌ కూడా అంటోంది. ఖర్గే నాయకత్వంలో ముందుకు వెళ్ళండి అంటూ ప్లీనరీలో సోనియా చేసిన వ్యాఖ్య ఎన్నికల ముంగిట్లో ఉన్న కర్ణాటక ప్రజలమీద కాస్తంతైనా సానుకూలంగా పనిచేస్తుందేమోనన్న భయం బీజేపీకి ఉండటం సహజం.

అదానీ, మోదీ వేరువేరు కాదనీ, అదానీ కొల్లగొడుతున్న దేశసంపద పరోక్షంగా బీజేపీ బలోపేతానికి ఉపకరిస్తున్నదన్న వాదనను ప్లీనరీలోనూ కాంగ్రెస్‌ కొనసాగించింది. అప్పటి ఈస్టిండియా కంపెనీని, ఇప్పటి అదానీని పోల్చుతూ దేశానికి మరో స్వాతంత్ర్యం కావాలనడం ద్వారా మోదీని సాగనంపాలని చెప్పింది. మోదీ–అదానీ దాడికి మాత్రమే పరిమితం కాకుండా, వివిధ వర్గాలను దగ్గరచేసుకొనే పని కూడా ఆరంభించింది. తనకు ఓటుబ్యాంకుగా ఉన్న వర్గాల్లో భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పించడం, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, తన సిద్ధాంతంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలూ చేసింది. దేశవ్యాప్త కులగణనకు అనుకూలమని ప్రకటించడం ద్వారా అధికశాతం ప్రజలకు సన్నిహితమయ్యే కృషి చేసింది. న్యాయవ్యవస్థలో కోటాలు, కొత్త ఆర్థికవిధానం, మతవివక్షలకు, విద్వేషపూరిత హత్యలకు వ్యతిరేకంగా కొత్త చట్టాల వంటి హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు పార్టీలో యాభైశాతం పదవులు రిజర్వుచేయాలన్న నిర్ణయం మంచి మార్పు.

అవినీతిమయమైన పార్టీగా బీజేపీ సాగించిన విస్తృతప్రచారంతో దెబ్బతిని, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి, ఇప్పటికీ తేరుకోలేక, ఓ కుటుంబపార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌ ప్లీనరీలో ఎన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని ఆదర్శాలు వల్లించినా, క్షేత్రస్థాయిలో ఏ మేరకు యుద్ధం చేయగలుగుతుందో చూడాలి. ఒక యాత్ర అందించిన ఆత్మవిశ్వాసంతో ఈమారు తూర్పునుంచి పశ్చిమానికి మరోయాత్రకు రాహుల్‌ సిద్ధపడుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఇది ఉపకరిస్తుంది కానీ, ఓటర్లను నేరుగా ఆకర్షించలేకపోవచ్చు. పొత్తులకు సిద్ధమని, భావసారూప్యతగల పార్టీలతో కలిసిపనిచేయాలని ప్రకటించడం మంచిదే కానీ, అందుకు విశేషకృషి జరగాలి. పార్టీలో శల్యులనూ శకునులనూ ఏరివేసే పని కూడా మరోపక్క బలంగా సాగాలి. ప్రజల దృష్టిలో ఒక విశ్వసనీయమైన శక్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ చేయాల్సింది ఇంకా మిగిలేవుంది.

Updated Date - 2023-02-28T01:11:39+05:30 IST