ఫాంహౌస్ పాలన ఇంకెన్నాళ్లు?
ABN , First Publish Date - 2023-09-21T01:32:33+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథిగా పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు చెప్పుకోదగిన మార్పులకు గురైందని కాస్త ఉద్యమ అనుభవం...
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథిగా పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు చెప్పుకోదగిన మార్పులకు గురైందని కాస్త ఉద్యమ అనుభవం, రాజకీయ అనుభవం ఉన్నవారు ఎపుడో గుర్తించారు. ప్రజాసామాన్యం మాత్రం చాలా ఆలస్యంగా గుర్తించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనుక్షణం ప్రజలతో మమేకమైన పార్టీ నాయకత్వం రాష్ట్రం సిద్ధించాకా ప్రజల జీవితం నుంచి ఒక్కసారిగా దూరంగా జరిగిపోయింది. తమ చుట్టూ ఒక కోటరీ నిర్మించుకుని ప్రజల జీవితాలతో తమకున్న ఉద్యమ సంబంధాలను అతి దారుణంగా తెంచుకున్నది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు, హామీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలు తెలంగాణ సమాజాన్ని బాగానే ప్రభావితం చేశాయి. అయితే కేసీఆర్ ను తెలంగాణ సమాజం పూర్తిగా ఏనాడూ విశ్వసించలేదన్నదీ బహిరంగ రహస్యమే. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఆ విషయాన్ని ఋజువు చేశాయి. టీఆర్ఎస్ కేవలం 63 సీట్లను మాత్రమే గెలవగలిగింది. ఇది కేసీఆర్‌కు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తెలియజేసింది. ఇదే అంశం ఆ దూరం మరింత పెరగడానికీ ప్రధాన కారణమైంది. ‘ఇంత రాగం తీస్తే... ఇన్ని సీట్లేనా!’ అనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రజలను వదిలిపెట్టి నాయకులకు ఎర వేయడం మొదలుపెట్టాడు. పదవులు, పైసలు, అధికారం ఆశగా చూపించి, వినకుంటే అధికార జులుం చూపెట్టి లోలోపల ఎన్నికల మేనేజ్‌మెంటుతో ప్రతిపక్షాలను నిర్వీర్యపరచి తన బలాన్ని పెంచుకుని రెండవసారి కూడా విజయం సాధించాడు. సాంకేతికంగా కేసీఆర్ గెలుపుకు దగ్గర అయ్యాడే కానీ, ప్రజలకు పూర్తిగా దూరమయ్యాడన్నది ఒక నిష్టుర సత్యం.
ఉద్యమ సమయంలో సకల జనులను ఏక తాటిపై నడిపించిన నేత రాజకీయ వ్యూహాల ఊబిలో చిక్కుకొని ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలగిపోతాయ్ అనుకున్న అనేక సమస్యలు అలాగే ఉండడంతో పాటు కొత్త సమస్యలు అనేకం మేట వేశాయి. అనవసర వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్రతిపక్షాలను అధర్మ పద్ధతుల్లోనైనా నిర్వీర్యపరిచే జిత్తులు, తనయుడిని ముఖ్యమంత్రి చేయాలనే తాపత్రయం, ఏకకాలంలో తాను ఏకంగా దేశ ప్రధానిని కావాలనే దురాశ, తెలంగాణ ప్రజల్లో ప్రాభవం కోల్పోతున్న టీఆర్ఎస్‌ను భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడం అనే చౌకబారు నిర్ణయాల వల్ల కేసీఆర్ ‘మహా ఏటవాలు ప్రయాణం’ మొదలైందని చెప్పవచ్చు. కాస్త ఓర్పుతో, నేర్పుతో, ఉద్యమ సమయంలో ప్రవర్తించిన సంయమనంతో హుందాగా కేసీఆర్ వ్యవహరించి ఉంటే ఒక జ్యోతి బసు లాగా, నవీన్ పట్నాయక్ లాగా సుదీర్ఘకాలం తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది.
కేసీఆర్ ఈ దీనావస్థకు చేరడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమ సమయంలో రేయింబవళ్లు పనిచేసిన ఉద్యమ శక్తులన్నింటితోను సంబంధాలను తెంచుకోవటం ఒక కారణమైతే, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దౌర్బల్యం, దాని ద్వారా పుట్టిన ఆత్మన్యూనతా భావన కేసీఆర్‌లో విపరీత స్థాయిలో పెరిగిపోయాయి. దానికి తోడు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని కేసీఆర్‌కు తలవంపులు తెచ్చింది. కేంద్ర స్థాయిలో ప్రభుత్వం మరింత బలపడడం, తాను అణగదొక్కానని భావించిన కాంగ్రెస్ గ్రాఫ్ కర్ణాటక ఫలితాల తర్వాత ఒక్కసారిగా పైకి లేవడం కేసీఆర్‌కు మింగుడు పడడం లేదు. ఎలాగైనా మూడోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని హాట్రిక్ సాధించాలని గతంలో తాను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోల దుమ్ము దులిపి ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలితంగా కొత్త చిక్కులు అనేకం వచ్చి పడుతున్నాయి. ఆర్థిక భారాలు ఒక వైపు, కోర్టు అక్షింతలు మరోవైపు కేసీఆర్ తల బొప్పి కట్టిస్తున్నాయి. భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువసార్లు హైకోర్టు చీదరింపులు తిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కావచ్చు.
ఎన్నికల సంవత్సరం కావడంతో అనేక వర్గాల ప్రజలు అనేక కోరికలతో రోడ్డెక్కి తమ నిరసనలు తెలియజేస్తూన్న క్రమంలో కేసీఆర్ నిరంతరం ఫాంహౌస్‌లోనే ఉండడం ప్రజలకు, అధికారులకు, పార్టీ నాయకులకు ఒకింత చికాకును తెప్పిస్తున్న విషయం. పక్కనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు పరిపాలనలోనూ, ఇటు జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటే తమ అధినాయకుడు ఫాంహౌసులో రెస్ట్ తీసుకోవడం ఒకింత ఎబ్బెట్టుగానే కనిపించక మానదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పదేళ్ళ క్రితం తెచ్చుకున్న తెలంగాణలో, అభివృద్ధి పేరుతో కట్టుకున్న వైకుంఠధామాలకు ఊర్లకు ఊర్లు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఊర్లు పోయాక, మనుషులు పోయాక మీరు ఏలేది ఎవ్వరినీ?
కె శ్రీనివాసాచారి
సామాజిక కార్యకర్త