స్వేచ్ఛ కోసం పోరాటంలో...

ABN , First Publish Date - 2023-06-25T01:19:44+05:30 IST

దేశచరిత్రలో 25 జూన్, 1975 న ఒక చీకటి అధ్యాయం ప్రారంభమయింది. అదే అత్యవసర పరిస్థితి. అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) ప్రచారక్‌గా...

స్వేచ్ఛ కోసం పోరాటంలో...

దేశచరిత్రలో 25 జూన్, 1975 న ఒక చీకటి అధ్యాయం ప్రారంభమయింది. అదే అత్యవసర పరిస్థితి. అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) ప్రచారక్‌గా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జోన్‌లో పనిచేస్తున్నాను. అందరినీ అరెస్ట్ చేయబోతున్నారని, అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలను జాగృతం చేయాలని, ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఉద్యమాలు నిర్వహించాలని లోక్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో సూచనలు అందాయి.

నేను అప్పుడు ఆర్మూర్‌లో న్యాయవాది భూపతి రెడ్డి గృహంలో ఉన్నాను. ఎమర్జెన్సీ విధించిన విషయం తెలియగానే నా సాధారణ వస్త్ర ధారణ (తెల్లని లాల్చీ, పైజమా)కు భిన్నంగా ప్యాంటు, షర్ట్ ధరించి మారువేషంలో పోలీసులను తప్పించుకొని అజ్ఞాత ప్రదేశానికి చేరుకున్నాను. నా పేరు ధర్మేంద్రగా మార్చుకున్నాను. శిరోజాలను పెంచుకొని, ప్యాంటు, షర్ట్, టైతో బూటు కోటు ధరించి పర్యటనలు చేస్తూ ప్రజలను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జాగృతం చేస్తుండేవాణ్ణి. ఆనాడు పత్రికల్లో ప్రభుత్వ వార్తలు తప్ప ఏ రకమైన వాస్తవిక సమాచారం తెలియనివ్వకుండా సెన్సార్‌షిప్‌ అమలు జరిగేది. వార్తలను సెన్సార్ చేయడం వల్ల దేశంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో ప్రజలకు తెలియకపోయేది. దీంతో మాకు అందిన రహస్యసమాచారాన్ని ఒక బులెటిన్ రూపంలో ప్రచురించి ప్రజలకు, కార్యకర్తలకు వాస్తవాలను తెలియజేసేవాళ్లం.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వద్ద రామేశ్వరపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద రామాలయం ఉంది. అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంజినీర్ వెంకట్ రామ్‌రెడ్డి వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు, అందరూ వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సందేశం పంపాము. సుమారు 250 మంది కార్యకర్తలు, సానుభూతిపరులు అక్కడకు చేరుకున్నారు. కొందరు వంట చేస్తుండగా, మేము దేవుని దర్శించుకొని పైన ఉన్న సమావేశ మందిరానికి చేరుకున్నాం. ఎంతమంది వచ్చారో ఎవ్వరికీ తెలియకుండా చెప్పులు సైతం దాచిపెట్టాం. అయినా, ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ స్పెషల్ బ్రాంచ్ విభాగం అధికారులు పసిగట్టారు. ఒక అధికారి మారువేషంలో అడ్డపంచ ధరించి దేవుని దర్శనం పేరిట అక్కడకు వచ్చాడు. ఎవరెవరు ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఒక్కొక్కరినీ విచారణ చేయసాగాడు. అందరూ తాము సత్యనారాయణ స్వామి వ్రతం కోసం వచ్చామని తెలిపారు. ఎబివిపి నాయకుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి తన పేరు జాన్ గా మార్చుకొని ప్యాంటు, టి షర్ట్ ధరించి మెడలో శిలువ వేసుకొని నా వెంట ఆ సమావేశ స్థలానికి వచ్చారు. ఇంతలో ఆ పోలీసు అధికారి నన్ను గుర్తించి పైకి వస్తున్న విషయాన్ని గమనించాను. సమావేశం సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని మేము గ్రహించాం. వెంటనే ఇంద్రసేనా రెడ్డి (జాన్), నేను ఆ ఆలయం వెనుకవైపున ఉన్న ఇరవై అడుగుల ఎత్తున ఉన్న ప్రహరీ గోడను దూకి అక్కడనుంచి తప్పించుకున్నాం. నేను కొద్దిగా లావుగా ఉండడంవల్ల దూకడంలో నా కాలు మడతబడింది. అక్కడి నుంచి ఇంద్రసేనారెడ్డి, నేను అక్కన్నపేట అనే గ్రామం చేరుకొని, ఒక బస్సులో మెదక్ పారిపోయాము. మేము పారిపోయిన కొద్దిసేపటికే పోలీసులు కొందరు కార్యకర్తలను అరెస్ట్ చేసి ‘దత్తాత్రేయ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ వారిపై ఒత్తిడి చేశారు. మెదక్ నుంచి మేము మరో బస్సులో హైదరాబాద్ చేరుకొని మా రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయాం. ఒక వైపు భయాందోళనలు, మరోవైపు ఏమి జరుగుతున్నదో తెలియని పరిస్థితుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా అత్యవసర పరిస్థితి ఎత్తివేయాలని ప్రజాందోళనలతో ముందుకు సాగాం.

కొన్ని రోజుల తరువాత నేను, నాతో బాటు వరంగల్ విభాగ్ ప్రముఖ్ శ్రీధర్ జీ బెల్లంపల్లిలో మారువేషంలో ఒక చోట భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడం ఆరంభించారు. శ్రీధర్ జీ తన పేరు శ్రీధర్ అని ఒప్పుకున్నారు. నేను మాత్రం ‘దత్తాత్రేయ ఎవ్వరో నాకు తెలియదు, నేను మాత్రం కాదు’ అని నిక్కచ్చిగా చెప్పాను. పోలీసులు నేను మొండివాడినని గ్రహించి, నన్ను వేరే గదిలోకి తీసుకుపోయి ఉంచారు. శ్రీధర్ జీని మీసా క్రింద అరెస్ట్ చేసి వరంగల్ జైలుకి తరలించారు. మరుసటిరోజు కొంత మందలింపు, తీవ్రమైన బెదిరింపులతో టార్చర్ చేస్తామని, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పమని పోలీసులు నన్ను ఎంతో ఒత్తిడి చేశారు. అయినప్పటికీ రెండోరోజు కూడా నేను ఒప్పుకోలేదు. ఇదంతా జరుగుతూండగా, నిజామాబాద్ నుంచి, సెంట్రల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న మురళి (ఇతను గతంలో నాకు పరిచయస్తుడే) అనే హెడ్ కానిస్టేబుల్ అక్కడకు వచ్చాడు. వస్తూనే, ‘నమస్తే సార్. బాగున్నారా’ అని పలుకరించాడు. అంతటితో ఆగకుండా ‘దత్తాత్రేయ గారూ’ అని సంబోధిస్తూ కుశల ప్రశ్నలు వేశాడు. నేను అతడి ప్రతిస్పందించడం గమనించగానే అక్కడున్న పోలీస్ అధికారులందరూ వెంటనే ‘నీ పేరు దత్తాత్రేయ కదా’ అంటూ మొత్తం మీద నన్ను ఒప్పించారు. ప్రధానంగా మూడు విషయాల మీద నాపై ప్రశ్నల వర్షం కురిపించారు. అవి: మీకు డబ్బులు ఎక్కడినుండి వస్తున్నాయి?; మీ రహస్య ప్రదేశాల చిరునామాలు ఏమిటి?; మీకు కమ్యూనికేషన్ ఎలా వస్తుంది, ప్రింటింగ్ ఎక్కడ చేస్తున్నారు?. ఇలా నాపై వరుస ప్రశ్నలతో ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. కరెంటు షాక్ పెడతాం జాగ్రత్త అని హెచ్చరించారు. ఏమి చేసినా పరవాలేదని నేను ధైర్యంగా ఉండడంవల్ల ఇక లాభం లేదని గ్రహించి మీసా క్రింద అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలుకి తరలించారు.

నాతో బాటు జైలులో జన్‌సంఘ్ నాయకులు బంగారు లక్ష్మణ్, ఆలే నరేంద్ర, వరవరరావు, చెరబండ రాజు, ఎం.టి. ఖాన్, నాయిని నర్సింహారెడ్డి, కార్మిక నాయకులు చైతన్య, శీతల్ సింగ్ లష్కరి, ఇంకా జమాతే ఇస్లామీ, ఆనంద్ మార్గ్ సంస్థల నాయకులు ఉండేవారు. మేమంతా కలిసి మెలిసి ఉండేవారం. కొన్ని రోజుల తరువాత మా ఇంట్లో ఒక విషాదం సంభవించింది. మా పెద్దన్న మాణిక్ ప్రభు పచ్చ కామెర్లు సోకి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి నాకు ఒక ఎస్కార్ట్ ఇచ్చి పంపించారు. తరువాత నెల రోజులు పెరోల్ కూడా ఇచ్చారు.

నేను జైలులో ఉన్నప్పుడు మా అమ్మ ఈశ్వరమ్మ వారానికొకసారి పండ్లు తీసుకొని వచ్చి, ములాకత్‌లో నా క్షేమ సమాచారాలు తెలుసుకొని వెళ్లేవారు. మా అమ్మ ఉస్మాన్ గంజ్‌లో ఉల్లిపాయలు అమ్ముతూ చిరువ్యాపారం చేసేవారు. జైల్లో ప్రతివారం నన్ను కలిసినప్పుడల్లా నాకు ధైర్యవచనాలు చెప్పేవారు. ఇక, నా మేనమామ అంజప్ప మా అమ్మను చూసిపోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ‘పెద్దవాడు చనిపోయాడు, రెండోవాడు జైలులో ఉన్నాడు, నువ్వు ఒక్కదానివి ఇంటి బరువు బాధ్యతలు మోయలేకున్నావు. నాకు దగ్గరి మిత్రులైన మేయర్ లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ శాసనసభ్యులు ఎల్.నారాయణ ముఖ్యమంత్రికి సన్నిహితులు. మనవాడు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనని అండర్ టేకింగ్ రాసి ఇస్తే జైలు నుంచి విడిపిస్తాను’ అని మా అమ్మగారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ మా అమ్మ ‘వాడు ఏ తప్పు చేయనప్పుడు అండర్ టేకింగ్ ఎందుకు ఇవ్వాలని’ ఆయన సూచనను తిరస్కరించారు. ములాకత్ సమయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారి ఒకరు రికార్డు చేసుకునే నిమిత్తం అక్కడ ఉండేవారు. అమ్మ నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఎప్పటిలాగే పండ్లు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసింది. ఆ తరువాత మామయ్య ప్రతిపాదన గురించి వివరిస్తూ, నువ్వు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనను అని అండర్ టేకింగ్ ఇస్తే విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పింది. దానికి నువ్వు ఏమన్నావని అమ్మను అడిగాను. ‘నా కొడుకు ఏమైనా ఎవ్వరి పిల్లనైనా ఎత్తుకుపోయాడా, దొంగతనం చేశాడా? ఏమి తప్పు చేసాడని అండర్ టేకింగ్ ఇవ్వాలి’ అని గట్టిగా ప్రశ్నించానని అమ్మ వివరించింది. మా పక్కనే ఉన్న ఆ పోలీసు అధికారి ఆమె మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. మా అమ్మకు రెండుచేతులతో దండం పెట్టి మరీ మెచ్చుకున్నారు. అమ్మ పెద్దగా చదువుకోనప్పటికీ మా ఇంటికి వచ్చే సంఘ్ పెద్దల కర్తవ్యపరాయణత్వం ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లే నాకు అంత ధైర్యాన్ని ఇవ్వగలిగారు. జీవితపర్యంతం మరువలేని ఈ సంఘటన నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది.

బండారు దత్తాత్రేయ

హర్యానా గవర్నర్

(ఎమర్జెన్సీకి 48 ఏళ్లు)

Updated Date - 2023-06-25T01:19:44+05:30 IST