బీజేపీని దక్షిణాది ఆదరించదా?
ABN , First Publish Date - 2023-05-24T00:59:32+05:30 IST
‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రాఫ్ పడిపోతోంది. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో నాలుగైదు రాష్ట్రాల్లో మినహా బిజెపికి పెద్దగా సీట్లు రావు. తెలంగాణలో అయితే బిజెపి ఇక లేచే అవకాశమే లేదు...
‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రాఫ్ పడిపోతోంది. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో నాలుగైదు రాష్ట్రాల్లో మినహా బిజెపికి పెద్దగా సీట్లు రావు. తెలంగాణలో అయితే బిజెపి ఇక లేచే అవకాశమే లేదు..’ అని బిజెపిలో చేరిన మాజీ ఎంపి ఒకరు అన్నారు. ‘కేసిఆర్‌కు, బిజెపి అగ్రనేతలకు అహగాహన ఏర్పడినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం లేదు’ అని మరో మాజీ ఎంపి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలలో అంతర్మథనాన్ని ‘కర్ణాటక’ పురిగొల్పుతున్నట్లు వారి ఆ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పుతున్నాయి.
నిజానికి కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత దక్షిణాదిలో నెగ్గాలంటే తెలంగాణలో విజయం సాధించవలసిన అనివార్య పరిస్థితి బిజెపికి ఏర్పడింది. అయితే కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యే నాటికే తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలే ఇందుకు కారణం. 2022 జూలైలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తర్వాత కొద్ది రోజులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు ఆయన తెలంగాణలో బిజెపి రాజకీయ భవిష్యత్ ఎలా ఉన్నదని అడిగారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో జనసంఘ్ కాలం నుంచీ ఇప్పటి బిజెపికి కొంత బలం ఉన్నమాట నిజమేనని, బండి సంజయ్ ఆ జిల్లాల్లోనే కొంత ఊపు తేగలుగుతున్నారని, మిగతా జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్నదని చెప్పినప్పుడు ఆయన ఏకీభవించినట్లు కనపడింది. బయటనుంచి వచ్చిన నేతలతోనే కాదు, పార్టీలో కొందరు ముఖ్య నేతలతో సంజయ్‌కు సఖ్యత లేదన్న సమాచారం అప్పటికే ప్రధానమంత్రికి ఉన్నది. అయినా ఆయనకు సంజయ్ పట్ల ప్రత్యేకాభిమానం ఉన్న విషయం కూడా అర్థమైంది. నిజానికి ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పలువురు నేతలు ఢిల్లీలో పొగబెట్టేందుకు ప్రయత్నించారు. సకాలంలో సరైన ర్యలు తీసుకుంటే బిజెపియే బిఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా అవతరించే అవకాశం ఉన్నదనే అభిప్రాయం ప్రబలుతున్న రోజులవి. అయితే ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాల మధ్య వాతావరణం మారిపోయింది. సునీల్ బన్సల్ వంటి నేతలు యూపీలో చక్రం తిప్పి ఉండవచ్చు కాని తెలంగాణ వరకు వచ్చేసరికి ఆ చక్రాలు పనిచేసే అవకాశాలు కనపడలేదు.
ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపి నేతలు కింకర్తవ్య విమూఢులైనట్లు కనిపిస్తున్నారు. నిన్నటి వరకూ ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలు కొందరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను గద్దె దించి తమకు పార్టీ పగ్గాలు అప్పజెబుతారని ఆశించారు. ఢిల్లీకి వచ్చి పార్టీ అగ్రనేతలను కలుసుకుని తమకు నాయకత్వం అప్పజెబితే పార్టీ విజయావకాశాలు మెరుగుపడేలా చేస్తామని చెప్పుకున్నారు. కాని ఎన్నిసార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి కీలక నేతల్ని కలుసుకున్నా, సంజయ్‌ను మారుస్తారన్న విషయంలో వారికి నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి అయినా పార్టీని రక్షించేందుకు తమకు నాయకత్వం అప్పగిస్తారన్న చిరు ఆశ మళ్లీ వారిలో బయలుదేరింది. కాని అదేమీ జరగదని గత వారం ఢిల్లీకి వచ్చిన ఈటల రాజేందర్ తదితరులకు కూడా స్పష్టమైపోయింది. సంజయ్‌ను మార్చే ప్రసక్తి లేదని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశంలో బిజెపి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉంటూ అధిష్టానం మూడ్ గమనిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రంగంలోకి దిగి సంజయ్ నాయకత్వంలోనే తాము ఎన్నికలకు వెళతామని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ కవితను అరెస్టు చేయకపోవడానికీ, తమ పార్టీకీ సంబంధం లేదని స్పష్టంగానే ప్రకటించారు. ప్రాప్తకాలజ్ఞుడు మాత్రమే కాదు, బిజెపి ఒరిజినల్ నాయకుడైన కిషన్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేశారంటే అందుకు అనేక కారణాలుంటాయి.
బిజెపి వంటి పార్టీలో బయటనుంచి వచ్చిన నేతలకు పగ్గాలు అప్పజెప్పడం అంతసులభం కాదు. తమ నాయకత్వంలో, తమ భావజాలంలో, తమ ప్రయోజనాలకు తగ్గట్లుగా ఉండగలిగిన నేతలకే అక్కడ ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంస్కృతికి అలవాటుపడ్డ నేతలకు బిజెపి అధిష్ఠానం విలువ నివ్వడం అంత సులభం కాదు. అందరూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మల్లా సంఘ్ భావజాలాన్ని పూర్తిగా జీర్ణించుకోలేరు. బిజెపి బలంగా ఉన్న కర్ణాటకలోనే యడ్యూరప్ప వంటి నేతలను సైతం పక్కకు పెట్టి మోదీ స్వయంగా రంగంలోకి దిగినప్పుడు తెలంగాణలో బయటి నుంచి వచ్చిన పార్టీ నేతల ఒత్తిళ్లకు ఆయన ఎలా లొంగుతారు?
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇతర పార్టీలనుంచి బలమైన నేతలు చేరేందుకు వెనుకాడుతున్నారని, ఇప్పటికే చేరిన నేతలు వెనక్కి వెళ్లే విషయం ఆలోచిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. ‘బిజెపిలో ఎవరూ చేరవద్దని, ఇక్కడ మాకే దిక్కు లేదని మా పార్టీ నేతలే చెబుతున్నారు’ అని బండి సంజయ్ ఇటీవల ఢిల్లీలో ఒక సీనియర్ నాయకుడి వద్ద వాపోయినట్లు తెలిసింది. ఏమైనా హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆ పార్టీ బలోపేతమయ్యే బదులు నీరసించినట్లు, అప్పుడు నీరసించినట్లు కనపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకుంటున్నట్లు కనపడుతోంది. తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉన్నందువల్ల బిఆర్ఎస్‌కు బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు మృగ్యంగా కనపడుతున్నాయి. 2018లో బిజెపి తెలంగాణలో కేవలం 6.98 శాతం ఓట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓటు శాతం 19.65కు పెరిగి 4 సీట్లు గెలుచుకున్నది. 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఆధిపత్యం కనపరచింది. బిజెపి బాగా కష్టపడితే మహా అయితే ఈ అసెంబ్లీ స్థానాల్లోనే గట్టి పోటీ ఇవ్వగలుగుతుందేమోనని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అందుకే తెలంగాణలో తమకు కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ ఉన్నదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దక్షిణాదిలో బిజెపి మనుగడ సాగించగలుగుతుందా అన్న చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కేరళలో బిజెపి ఎంత కష్టపడ్డా ఆ పార్టీ ఓట్ల శాతం రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 16 శాతం నుంచి 11.51 శాతానికి పడిపోయింది. తమిళనాడులో 3.57 శాతం నుంచి 2.62 శాతానికి దిగజారిపోయింది. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బలహీనంగా ఉన్న బిజెపి పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉన్నది. వైసీపీపై ఛార్జిషీటు తయారు చేయాలని ఇటీవల రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినప్పటికీ వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆ పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాలకు హాజరు కాలేదని ఢిల్లీకి నివేదిక అందింది. వైసీపీని ఎదుర్కొనే విషయంలో బిజెపికి చిత్తశుద్ధి లేదని ప్రజలే భావిస్తున్నట్లు కనపడుతోందని, బహుశా నాయకుల వైఖరే ఇందుకు కారణమని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపి అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో సిబిఐలో ఊగిసలాట కనిపిస్తోంది. దీంతో బిజెపి, వైసీపీల మధ్య సంబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో 2019లో వచ్చిన 0.96 శాతం ఓట్లను బిజెపి ఎంత మేరకు, ఎలా అధిగమించగలుతుంది?
మరి 2024 సార్వత్రక ఎన్నికల్లో బిజెపికి దక్షిణాది నుంచి పెద్దగా ప్రయోజనం లభించే పరిస్థితులు ఉన్నట్లు లేవు. దక్షిణాదిలో 129 లోక్‌సభ సీట్లు ఉన్నప్పటికీ గత సార్వత్రక ఎన్నికల్లో కేవలం 29 సీట్లు మాత్రమే బిజెపికి లభించాయి. 2019 సార్వత్రక ఎన్నికల్లో బిజెపికి దేశ వ్యాప్తంగా 303 సీట్లు రాగా అందులో దక్షిణాది నుంచి ఆ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాలేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీట్లు తగ్గే అవకాశాలే కాని పెరిగే అవకాశాలు కనపడడం లేదు. కర్ణాటకలో స్థానిక ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మాత్రమే కాదు, మోదీ, బిజెపి నాయకత్వం ఎన్నికల ప్రచారం చేసిన తీరును కూడా ప్రజలు తీవ్రంగా గర్హించారు. మైనారిటీలు, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ను బలపరిచారని, ఇది జాతీయ స్థాయిలో ప్రతిఫలిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉన్నదని ప్రతాప్ భాను మెహతా వంటి రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం మూలంగా బిజెపికి 25 సీట్లు దక్కినప్పటికీ ఈ సారి అవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పలేము. ప్రజల ఆలోచనా ధోరణి మారడం, కాంగ్రెస్‌లో కదలిక కనపడడం ఇందుకు కారణం కావచ్చు. కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ప్రవేశపెట్టిన ఆ రాష్ట్ర విద్యా మంత్రి బిసి నగేశ్ తన నియోజకవర్గంలోనే విజయం సాధించలేకపోయారు. మతపరంగా రథ యాత్రలు, ఏక్తా యాత్రలు ఒకప్పుడు బిజెపి ఓటు బ్యాంకును పెంచి ఉండవచ్చు. కాని ఎల్లవేళలా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆ యాత్రలు, మతతత్వ ప్రచారంతోనూ ప్రభావితం కాలేరని కర్ణాటక ఎన్నికలు నిరూపించాయి. బిజెపి పట్ల దక్షిణాది ప్రజల వైఖరికి ఇది స్పష్టమైన సంకేతమా?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)