బీజేపీ పులుకడిగిన ముత్యమా?

ABN , First Publish Date - 2023-03-15T01:00:35+05:30 IST

ఢిల్లీమద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుపాలు చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించడం, దేశంలోని ప్రతిపక్ష నేతలు అందరినీ ఏదో ఒక కేసులో...

బీజేపీ పులుకడిగిన ముత్యమా?

ఢిల్లీమద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుపాలు చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించడం, దేశంలోని ప్రతిపక్ష నేతలు అందరినీ ఏదో ఒక కేసులో ఇరికించడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజలకు పంపిస్తున్న సందేశమేమిటి? ప్రతిపక్ష నేతలందరూ అవినీతిలో మునిగిపోయారని, భారతీయ జనతా పార్టీ ఒక్కటే అవినీతి అంటని స్వచ్ఛమైన కమలమని ప్రజలు భావించి తీరాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమని అనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు అవినీతి ప్రాతిపదికపై జరిగితే తమకు రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయని కూడా ఆ పార్టీ భావిస్తున్నట్లు కనపడుతోంది. అది సాధ్యమా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

ఎవరు ఎంత అవినీతికి పాల్పడినా ఆ విషయం తేల్చాల్సింది న్యాయస్థానాలే. దేశంలో న్యాయస్థానాల్లో విచారణ నత్తనడకగా సాగుతున్న తీరుతో ఒక నాయకుడి అవినీతి తేల్చడానికి ఏళ్ల తరబడి పడుతుంది. మోదీ హయాంలో సోదాలు, దాడులు, విచారణల పేరుతో కేంద్ర ఏజెన్సీల హడావిడి, కేసుల సంఖ్య పెరిగినప్పటికీ శిక్ష పడిన వారి సంఖ్య తక్కువే. 17 ఏళ్లుగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కొనసాగుతున్నప్పటికీ కేవలం 23 సందర్భాల్లోనే శిక్షపడింది. ఎవరికి శిక్ష పడిందో, ఎవరికి పడలేదో ప్రజలు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈడీ, సిబిఐ నివేదికలు, విచారణలకు ఎంత పబ్లిసిటీ లభించినప్పటికీ వాటి వల్ల రాజకీయ ప్రయోజనాలు లభించకపోతే మోదీ సర్కార్ నేతృత్వంలోని ఏజెన్సీల కృషి బూడిదలో పోసిన పన్నీరు కావడం ఖాయం. ఈ దేశంలో ప్రతి ఏటా పార్లమెంట్‌కూ, అసెంబ్లీలకు ఎన్నికవుతున్న నేర చరితుల సంఖ్య పెరుగుతుండడం చూస్తే ప్రజలు నేతల నేరాలను పట్టించుకోవడం ఏనాడో మానివేశారని అర్థమవుతోంది. పీవీ నరసింహారావు హయాంలో కేంద్ర మంత్రి కల్పనాథ్ రాయ్ తన మంత్రిత్వ శాఖకు చెందిన అతిథి గృహాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణపై జైలు పాలైనప్పటికీ ఆయన ఎన్నికల్లో గెలుస్తూనే పోయారు. 2జీ కేసులో డిఎంకె నేత కనిమొళి జైలుకు వెళ్లి వచ్చినా గత ఎన్నికల్లో ప్రజలు ఆమెను దాదాపు 60 శాతం ఓట్లతో గెలిపించారు. మూడవది, ప్రజల మద్దతుతో తాము బలం పెంచుకుని రాజకీయంగా ప్రత్యర్థులను ఓడించడం సాధ్యం కానంతవరకూ వ్యక్తులపై అవినీతి ఆరోపణల బూచితో ప్రభుత్వాలను మార్చడం అంత సులభం కాదు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దించేందుకు బీజేపీ రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ విజయవంతం కాలేదు. ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆప్‌ను బీజేపీ దెబ్బతీయలేకపోయింది. తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటే సాధించింది. 11 అసెంబ్లీ సీట్లలో మాత్రమే రెండవ స్థానంలో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడం వల్ల అని చెప్పడానికి వీల్లేదు. బీజేపీ అసలైన బలం నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాల ద్వారా కానీ తేలదు. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం కొందరు వ్యక్తులు, కొన్ని పరిస్థితులవల్లే జరిగింది కాని బీజేపీ బలం పుంజుకొన్నట్లు చెప్పేందుకు తార్కాణం కాదని వాదించేవారు కూడా ఉన్నారు. అందువల్ల ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని తార స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా బీజేపీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను, తెలంగాణలో కేసీఆర్‌ను ఎంతమేరకు రాజకీయంగా బలహీనం చేయగలిగిందీ అని చెప్పేందుకు ఇప్పుడే ఏ కొలమానాలు లేవు. ప్రత్యర్థులపై అవినీతి కేసులతో పాటు బీజేపీ విశ్వసనీయత పెరిగినప్పుడే ఒక రాష్ట్రంలో ఆ పార్టీ విజయావకాశాలను అంచనా వేయవచ్చు. మరి బీజేపీకి అటువంటి విశ్వసనీయత ఉన్నదా?

ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే కర్ణాటకలో మరో నాలుగైదు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ, ఢిల్లీలపై మోదీ సర్కార్ దృష్టి కేంద్రీకరించడం వెనుక మతలబు ఏమిటి? అన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రతిపక్షాల అవినీతిపై దృష్టి సారిస్తే కర్ణాటకలో బీజేపీ భారీ అవినీతిపై అక్కడి ప్రజల దృష్టి మళ్లుతుందా? ఇటీవల కర్ణాటకలో మాదల్ విరూపాక్షప్ప అనే బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని లోకాయుక్త అరెస్టు చేసింది. తన తండ్రి తరఫున రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా అతడిని అరెస్టు చేశారు. తర్వాత జరిగిన దాడుల్లో తండ్రీ కొడుకుల వద్ద రూ.8 కోట్లకు పైగా నగదు దొరికింది. ఈ కేసులో ప్రథమ నిందితుడైన విరూపాక్షప్ప అయిదు రోజుల పాటు పోలీసు అరెస్టును తప్పించుకుని తిరిగి అ తర్వాత హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌తో ఊరట పొందారు. తానెక్కడికీ పారిపోలేదని, ఇంట్లోనే ఉన్నానని విరూపాక్షప్ప చెప్పారు కాని పోలీసులు ఇంటికి వెళ్లి ఎందుకు అరెస్టుచేయలేదన్న ప్రశ్నకు మాత్రం జవాబు లేదు. ఈయన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ లోకాయుక్త దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు మంగళవారం ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఇన్ని జరుగుతున్నా, దేశానికి నీతి పాఠాలు చెప్పే బీజేపీ ఇంతవరకూ ఈ ఎమ్మెల్యేను కనీసం పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు! గతంలో జైన్ హవాలా కేసులో తన పేరు వచ్చినందుకు బీజేపీ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ తనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించనంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఒకప్పుడు అలాంటి నేతలు నేతృత్వం వహించిన బీజేపీకి ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాల అవినీతి మాత్రమే కంటబడడం ఆశ్చర్యం కలుగుతుంది.

యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు 2021లో మధ్యలోనే ముఖ్యమంత్రిని మార్చి బసవరాజ్ బొమ్మైకి పట్టం కట్టారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కాలంలో వేల కోట్ల అవినీతి జరిగినప్పటికీ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు కాని ఎవరినీ శిక్షించిన దాఖలాలు లేవు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ప్రకారం యడ్యూరప్పపై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 14 కేసులు యావజ్జీవ శిక్ష, 4 పదేళ్ల జైలు శిక్ష విధించదగ్గవి. కాని కేంద్ర ఏజెన్సీలు ఏనాడూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి బొమ్మై పాలనలో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందాలంటే 40 శాతం ముడుపులు చెల్లించాల్సిందేనని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసి చాలా కాలమైంది. అధికారులు పెద్ద ఎత్తున లంచాలు అడుగుతున్నారంటూ కర్ణాటకలో 13వేల పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు అసోసియేషన్లు కూడా మోదీకి లేఖ రాశాయి. ఆఖరుకు మత పీఠాలకు కూడా 30 శాతం లంచాలు తీసుకుని మరీ నిధులు విడుదల చేస్తున్నారని ప్రముఖ లింగాయత్ మఠాధిపతి దింగలేశ్వర్ స్వామీజీ అధికారికంగా ప్రకటించారు. తాను చేసిన సివిల్ పనులకు నిధులు విడుదల చేయాలంటే 40 శాతం ముడుపులు చెల్లించాల్సిందేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి కేఎస్ ఈశ్వరప్ప డిమాండ్ చేశారని నోట్ రాసి మరీ కాంట్రాక్టరైన ఒక బిజెపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఉపాధ్యాయులు, ఎస్ఐల నియామకంలో కూడా భారీ కుంభకోణం బహిర్గతమవడంతో అనేకమందిని అరెస్టు చేశారు కాని ఈ కుంభకోణం వెనుక ఉన్న పెద్ద తలకాయల జోలికి పోలీసులు పోలేదు. వీటన్నిటిపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణకు ఆదేశించలేదు? మోదీ కేంద్ర ఏజెన్సీలను ఎందుకు రంగంలోకి దించలేదు?

కర్ణాటకలో మిగతా అనేక రాష్ట్రాల మాదిరే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. మరి అవినీతిపై పోరాడుతున్నట్లు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని ఎందుకు అరికట్టడం లేదు? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ అవినీతిని కొనసాగించడం, ఉపేక్షించడమా? ప్రపంచ స్థాయిలో ఏ నివేదికను చూసినా ప్రజా సేవలు అందుబాటులో వ్యక్తుల పలుకుబడితో పాటు అత్యధిక స్థాయిలో అవినీతి శాతం భారతదేశంలో అధికంగా ఉన్నదని అర్థమవుతుంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని 180 దేశాల్లో అవినీతి విషయంలో భారత్‌ది 78వ స్థానం కాగా, కర్ణాటకలో ముడుపులు చెల్లించి తమ పనులు చేయించుకున్న వారు నూటికి 63 శాతం మంది ఉంటారని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో అయితే వీరి సంఖ్య 78 శాతం. కర్ణాటకలో డబ్బులు చెల్లించకుండా పనులు పూర్తి చేసుకోగలిగేది నూటికి ఏడుగురు మాత్రమే కాగా ఉత్తరప్రదేశ్‌లో నూటికి 11 మందికి మాత్రమే అలా పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రజలకు ఆహార ధాన్యాల రేషన్ విషయంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని ఆ రాష్ట్ర స్వంత అకౌంటెంట్ జనరల్ నివేదికే తేల్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి గురించి విస్తారంగా ప్రస్తావించవచ్చు.

అందువల్ల కేవలం అవినీతి ఆధారంగా దేశంలో ప్రతిపక్షాలపై బీజేపీ రాజకీయ పోరాటం చేయాలనుకుంటే అది ఎల్లవేళలా సాధ్యపడదు. ఒకవేళ చేసినా ప్రతిపక్షాలు కూడా ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి’ అని పలికే అవకాశాలూ ఉన్నాయి. న్యాయదేవత చేతిలో త్రాసు పైన, కత్తి క్రిందకు ఉండడానికి ప్రధాన కారణం ముందు న్యాయాన్ని సమతుల్యంగా అమలు చేసిన తర్వాతే శిక్షించాలని అర్థం. బీజేపీ హయాంలో న్యాయదేవత కళ్లకు గంతలు తీసేసి కేవలం విపక్షాలనే చూస్తున్నదా అని అనుమానం వేస్తోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-03-15T01:00:35+05:30 IST