విపక్షాలపై విజృంభిస్తున్న మోదీ!

ABN , First Publish Date - 2023-05-31T01:52:50+05:30 IST

చరిత్ర పుటల్లో ఓటమిని ఏ మాత్రం సహించలేని వారు అనేకమంది మనకు కనపడతారు. ఒక చిన్న ఓటమి ఎదురైందంటే ఆ ఓటమిని కప్పిపుచ్చేందుకు ప్రత్యర్థి శిబిరాలపై...

విపక్షాలపై విజృంభిస్తున్న మోదీ!

చరిత్ర పుటల్లో ఓటమిని ఏ మాత్రం సహించలేని వారు అనేకమంది మనకు కనపడతారు. ఒక చిన్న ఓటమి ఎదురైందంటే ఆ ఓటమిని కప్పిపుచ్చేందుకు ప్రత్యర్థి శిబిరాలపై మరింత బీభత్సంగా దాడి చేసేందుకు పూనుకుంటారు. అనేక ఆయుధాలను ఒకేసారి వాడతారు. ప్రత్యర్థిపై విరుచుకుపడడంలో సానుభూతి కానీ, తార్కికత కానీ, ఒక్కోసారి యుద్ధ నియమాలను కానీ ఏ మాత్రం పాటించబోరు. ప్రజాస్వామ్యం, పరస్పర మర్యాదలు వంటివి వారికి శుష్క విలువలుగా కనిపిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తుంటే ఇప్పుడు ఆయన గాయపడిన బెబ్బులిలా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పరాజయ పరిస్థితిని విజయంగా మార్చేందుకు, కనీసం హంగ్ అసెంబ్లీని తెచ్చేందుకు మోదీ భీకరంగా పోరాడారు. అన్ని బలాలనూ మోహరించి విశృంఖలంగా ప్రచారం చేశారు. కాని అనూహ్యంగా కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ రావడంతో ఆయన దిగ్భ్రాంతి చెందినట్లు కనపడింది. ఈ దిగ్భ్రాంతిని మరిచిపోయేందుకు, పార్టీ నేతలు కూడా పరాజయం గురించి ఆలోచించకుండా చేసేందుకు, తన నాయకత్వంపై రణగొణ ధ్వనులు వినపడకుండా ఉండేందుకు, అదే సమయంలో ప్రత్యర్థి శిబిరంలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగకుండా ఉండేందుకు నరేంద్రమోదీ అనేక ఆయుధాలు ఒకేసారి ప్రయోగిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి తన 9 సంవత్సరాల పాలన గురించి కనీవినీ ఎరుగని రీతిలో ప్రచారం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ రంగంలోకి దిగేలా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షుల నుంచి ఒక మోస్తరు నేతల వరకూ తన పాలనను ఆకాశానికి ఎత్తుతూ గుణగానం చేయమని ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాలతో స్తంభించిపోయాయి. రకరకాల రంగురంగుల దుస్తులతో మోదీ దిగిన ఫోటోలతో బుక్‌లెట్‌లు వివిధ భాషల్లో దేశమంతటా పంచిపెట్టారు. ఈ పుస్తకాల్లో మోదీకి తప్ప మరే మంత్రికీ, నేతకూ స్థానం ఉండదన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన మూడు దేశాల పర్యటనలో మోదీ పాత్రకు కూడా అమోఘమైన ప్రచారం కల్పించారు. వీటన్నిటికీ తోడు పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని భూనభోంతరాళాలు దద్దరిల్లాయా అన్న రీతిలో జరిపారు.

వర్తమాన కాలానికి అనుగుణంగా ఒక దేశం కొత్త పార్లమెంట్‌ను నిర్మించు కోవడం, పైగా వలసవాద శకలంగా ఉన్న పాత పార్లమెంట్‌ను వదుల్చుకోవడం ఒక అద్భుత పరిణామం. అభివృద్ధి అనేది నిరంతర పరిణామం. ఆధునిక యుగంలో, కొత్త కొత్త టెక్నాలజీలు ప్రవేశించిన సమయంలో అద్భుతమైన భవనాలను నిర్మించుకోవడలో ప్రత్యేకత ఏమీ లేదు. అయితే ఈ భవనాలు ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుస్తున్నాయా అన్నదే ప్రధానం.

ప్రజాస్వామిక మందిరమైన పార్లమెంట్‌ను అత్యద్భుతంగా నిర్మిస్తే దాని ప్రారంభోత్సవం కూడా అంతే ప్రజాస్వామికంగా జరగాలి. పార్లమెంట్ ప్రారంభించేముందు సభానేతగా ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పర్చి దాని చరిత్రాత్మక ప్రాధాన్యతను వివరించి నాయకులు అందరు హాజరు కావాలని అహ్వానించాలి. ముఖ్యమంత్రులతో స్వయంగా మాట్లాడి రమ్మని కోరాలి. కాని అవేవీ జరగలేదు. నిజానికి పార్లమెంట్ ప్రారంభం నాటికే ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకూ మధ్య సంబంధాలు పునరుద్ధరించలేనంత స్థాయిలో చెడిపోయాయి. కనుక ఈ చరిత్రాత్మకమైన సన్నివేశంలో అధికార, ప్రతిపక్షాల సభ్యులు స్నేహపూర్వక వాతావరణంలో కలుసుకుని పరస్పరం అభినందించుకుంటారని మనం కలలో కూడా ఊహించలేము. విషాదకరమైన విషయం ఏమంటే చరిత్రలో నిలిచిపోగలిగిన ఈ ఘట్టంలో అధికార పార్టీకి తప్ప మరే పార్టీకీ పెద్దగా స్థానం లేకుండా పోయింది. ఎన్డీఏ యేతర పార్టీల ముఖ్యమంత్రుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరూ హాజరుకాలేదు. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి మాత్రమే కాదు, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి కూడా ఎక్కడా కానరాలేదు. మీడియా ప్రతినిధులను పరిమితంగా ప్రధానమంత్రి కార్యాలయం అనుమతించిన తర్వాతే లోపలికి రానిచ్చారు. మొత్తం ప్రారంభోత్సవం నరేంద్రమోదీ పట్టాభిషేకంలా జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. మోదీ ఒక్కరే లోపలికి ప్రవేశించడం, తనకోసం ఎంతో వినయంగా ఎదురు చూస్తున్న స్పీకర్ భుజం తట్టి ముందుకు సాగడం, యజ్ఞంలో పాల్గొనడం, రాజదండాన్ని స్వీకరించడం, మోకరిల్లడం, పార్లమెంట్‌ను ప్రారంభించడం అంతా నాటకీయంగా కనిపించింది. బహుశా ఈ ఘట్టంలో తాను తప్ప మరెవరూ కనపడకుండా ఉండేందుకే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో చాలా కాలంగా ప్రతిపక్షాలతో సంఘర్షణాయుత వాతావరణాన్ని ప్రారంభించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయోధ్య, కాశీ కారిడార్ల ప్రారంభోత్సవాలు తానే చేసినప్పుడు, ఆఖరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా తానే ప్రారంభించినప్పుడు పార్లమెంట్ భవనం లాంటి బృహత్తర కట్టడం ప్రారంభంలో ఇతర ముఖాలు కనపడేందుకు ఆయన ఎందుకు వీలు కల్పిస్తారు? అహం బ్రహ్మస్మి అనుకునే మోదీ రాచరిక స్వభావానికి అనుగుణంగానే రాజదండం ఆలోచన ఆయన అస్మదీయులకు తట్టింది. బ్రిటిష్ జెండా దిగిపోయి రెపరెపలాడిన జాతీయ పతాకం కంటే గొప్పదా ఈ రాజదండం? రాజదండం చేతబూని మోదీ నూతన పార్లమెంట్‌లో తిరుగాడుతున్నప్పుడు గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గుజరాత్ అల్లర్ల సమయంలో గుర్తు చేసిన రాజధర్మం గురించి ఆయనకు ఏ మాత్రం గుర్తువచ్చి ఉండదు. తాను ఈ దేశ చక్రవర్తినని, తన అధికారానికి తిరుగులేదని, ముఖ్యమంత్రులు సామంతులని ఒక నాయకుడు అనుకున్నప్పుడు రాజు దైవాంశసంభూతుడు అనుకునే మఠాధిపతులు, పూజారులు, భక్తిపారవశ్యంలో మునిగిపోయే వందిమాగధులు కూడా ఉంటారు. కాలం మారిందని అనుకోవడం ఒక భ్రమేనేమో!

మోదీ 9 ఏళ్ల పాలన గురించి చర్చించాల్సి వస్తే 2014లో ఆయన అధికారంలోకి వచ్చే ముందు భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను ఒకసారి తిరగేయాల్సి ఉంటుంది. ఈ మానిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన పండితుడు డా.మురళీ మనోహర్ జోషీ ఆ తర్వాత తెరమరుగైనట్లే ఈ మానిఫెస్టోలో ఉన్న అంశాల్లో అత్యధికం ఇప్పుడు బిజెపికి కూడా గుర్తుండి ఉండవు. పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఎంత మేరకు ఉపయోగపడుతోంది? కనీసం తమ చేతుల్లో ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలను ఎంతమేరకు అదుపులో తేగలిగారు? బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక కోర్టులను ఎక్కడ స్థాపించారు? కొవిడ్ సమయంలో ప్రాణావసర మందులను అక్రమ నిల్వ చేసి భారీ ధరలకు అమ్ముకున్న విషయం నిజం కాదా? యూపీఏ హయాంలో పదేళ్లపాటు ఉపాధి లేని అభివృద్ధి జరిగిందని విమర్శించిన బిజెపి హయాంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరగడమే కాని తగ్గిన పరిస్థితులు లేవని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఎన్నిసార్లు ప్రకటించింది? విదేశాలకు తరలిపోయిన నల్లధనాన్ని ప్రాధాన్యతా ప్రాతిపదికగా తిరిగి తెస్తామన్న వాగ్దానం ఎంతమేరకు నెరవేరింది? అధికారం ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నాయకత్వంలోని టీమ్‌కే పరిమితం కాదని, ముఖ్యమంత్రులను అభివృద్ధిలో, నిర్ణయ క్రమంలో భాగస్వాములను చేస్తామన్న వాగ్దానం అమలులోకి వచ్చిందా? వస్తే రాష్ట్రాల అధికారాలను కేంద్రీకృతం చేసే చట్టాలను ఎందుకు ప్రవేశపెడతారు? నీతీఆయోగ్ వంటి సమావేశాలను ముఖ్యమంత్రులు ఎందుకు బహిష్కరిస్తారు? మానిఫెస్టోలో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు పారదర్శక, బహిరంగమైన, జవాబుదారీ పాలనకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయా? కార్పొరేట్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చేవారు, బ్యాంకులకు లక్షలకోట్లు ఎగవేసే వారి వివరాలు ఎందుకు బయటపెట్టరు? ప్రభుత్వానికి రాజ్యాంగం తప్ప మరేదీ ప్రాణప్రదం కాదని మానిఫెస్టోలో చేసిన ప్రకటన బూటకమని గత 9 సంవత్సరాల్లో అమలైన దారుణాలు రుజువు చేయడం లేదా?

2024లో ఎన్నికలు జరిగేందుకు మరో ఏడాది ఉన్నప్పటికీ దేశంలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే ప్రవేశించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం దేశమంతటా వ్యాపించకుండా ఉండేందుకే మోదీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే తన ఉధృతిని ప్రారంభించారు. కర్ణాటక ఎన్నికల్లో మతాన్ని ఆయుధాన్ని వాడుకున్న తీరు మరింత విజృంభించి వాడుకోవాలని మోదీ టీమ్ నిర్ణయించిందని పార్లమెంట్ భవనం ప్రారంభించిన తీరును బట్టి చూస్తే అర్థమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో మోదీయే సర్వస్వమై ప్రచారం చేసిన విధంగా ఇప్పుడు ప్రతి రోజూ, ప్రతి ఘట్టంలోనూ మోదీ సర్వాంతర్యామియై కనపడేందుకు నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే కర్ణాటక కేడర్‌కు చెందిన అధికారిని సిబిఐ ఛీఫ్‌గా నియమించిన తీరు ప్రత్యర్థులపై దాడులకు ఎలాంటి తెరిపీ ఉండదని, ఇలాంటి దాడులు మరింత తీవ్రతరమవుతాయని అర్థం అవుతోంది, కర్ణాటక ఎన్నికల్లో గెలిచామని, భావసారూప్యత గల పార్టీలతో కలిసి అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ భ్రమిస్తే అది మోదీని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. అవతలి వైపు ఉన్నది సామాన్యుడు కాదు. అన్ని ఆయుధాలను ఏకకాలంలో ఉపయోగించి ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియకుండా చేయడంలో ఆయనను మించిన వారులేరు. రానున్నవి కేవలం ఎన్నికలు, రాజకీయ సమరం మాత్రమే కాదు, మోదీ ప్రారంభించిన భీకర మాయాయుద్దం కూడా. ఈ రణరంగంలో ప్రతిపక్షాలు కకావికలు కాకుండా, ప్రజలు మాయలో పడకుండా చూడడం ఎంతవరకు సాధ్యం?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-05-31T01:52:50+05:30 IST