ఘటనాఘటన సమర్థులకూ గడ్డు రోజులు!

ABN , First Publish Date - 2023-04-05T03:22:46+05:30 IST

‘వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న తపన తప్ప నాకు వేరే పని ఏమీ లేదు. హోంమంత్రిగా ఉన్నా, ఈ విషయమై నేను ఎంత సీరియస్‌గా ఉన్నానో తెలుసా? విభేదాలు పక్కన పెట్టండి...

ఘటనాఘటన సమర్థులకూ గడ్డు రోజులు!

‘వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న తపన తప్ప నాకు వేరే పని ఏమీ లేదు. హోంమంత్రిగా ఉన్నా, ఈ విషయమై నేను ఎంత సీరియస్‌గా ఉన్నానో తెలుసా? విభేదాలు పక్కన పెట్టండి, కష్టపడి అంతా కలసికట్టుగా పనిచేయండి’ – ఇవి, నెల రోజుల క్రితం తనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్న మాటలు. ఆయన వారితో దాదాపు అయిదు గంటల పాటు తెలంగాణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించి చర్చించారు. ఇవాళ దేశంలో పలు రాష్ట్రాల బీజేపీ నేతలు, ముఖ్యమంత్రులు, ఇతర మిత్రపక్షాల నేతలు తమ రాజకీయ వ్యూహం గురించి చర్చించాలంటే అమిత్ షాను కలుసుకోక తప్పదు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం వారు ఎన్ని రోజులైనా వేచి చూస్తారు. గత వారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆరుగంటల పాటు వేచి చూసిన తర్వాత రాత్రి 11 గంటలకు అమిత్ షాను కొద్ది నిమిషాలసేపు కలుసుకోగలిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఇతర అంశాలను ఆయన ఏకరువు పెట్టుకున్నారు. అమిత్ షాను కలిసిన తర్వాతే ఆయనకు నిర్మలా సీతారామన్ అపాయింట్‌మెంట్ లభించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుడిభుజం నాదెండ్ల మనోహర్ తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ గురించి అమిత్ షాతో చర్చించేందుకు రెండు రోజులు వేచి చూడాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతల కన్నా రాజకీయ వ్యూహరచనకే అమిత్ షా ఎక్కువ సమయం కేటాయిస్తారనడంలో సందేహం లేదు.

సాధారణంగా ఎంతో జటిలంగా ఉన్న సమస్యలపై మోదీని కలుసుకున్న తర్వాతే అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తుంది. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీల ముందున్న కేసుల విషయంలోనే కాదు, న్యాయస్థానాల్లో కూడా జటిలంగా ఉన్న సమస్యలకు కూడా మోదీ, అమిత్ షాలను కలుసుకున్న తర్వాత ఎంతో కొంత పరిష్కారం లభించడం యాదృచ్ఛికం అని అనుకోవడానికి వీలు లేదు.

నేడు దేశ పాలనా వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు పూర్తిగా నరేంద్ర మోదీ, అమిత్ షా చేతుల్లోనే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పార్లమెంట్‌లో ఏ బిల్లులు ఎప్పుడు ప్రవేశపెట్టాలన్నా, ఏ చర్చను అనుమతించాలన్నా, ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా మోదీ, అమిత్ షాల ఆమోదం అవసరం. ఉభయ సభాధ్యక్షులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు కేవలం నిమిత్తమాత్రులుగానే వ్యవహరిస్తుంటారు. చాలా నిర్ణయాలు ఈ నాయక ద్వయం మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతాయి. సెంట్రల్ హాలులో ఎంపీలు, జర్నలిస్టులను అనుమతించడం, గ్యాలరీ కమిటీలు వేయడం నుంచి విలేఖరులకు పాస్‌లు ఇవ్వడం వరకు నిర్ణయాలు తీసుకునేందుకు సభాధ్యక్షులు వెనుకాడడం వెనుక రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. గత మూడు వారాలుగా పార్లమెంటు ఉభయ సభలు రోజూ స్తంభించిపోతునప్పటికీ ఈ ప్రతిష్టంభణను తొలగించేందుకు ప్రభుత్వం వైపు నుంచి కనీస ప్రయత్నం కూడా కనపడడం లేదు. ఏమిటి ఇందులోని ఆంతర్యం? ఎవరికీ తెలియదు. మంత్రిత్వ శాఖలు, సిబిఐ, ఈడీ, ఆదాయపన్నుశాఖ వంటి ఏజెన్సీల నుంచి రాష్ట్రాల వ్యవహారాల వరకు దేశంలోని సమస్త అంశాలపై ఆ ఉభయుల దృష్టి విస్తరిస్తూ ఉంటుంది. శివుని ఆజ్ఞ అయితే కాని చీమయినా కుట్టదు అన్నట్లుగా మోదీ, షాల ఆజ్ఞ అయితే కాని దేశంలో కీలక పరిణామాలేవీ జరగవు అని బీజేపీ నేతలు సైతం అంటుంటారు. ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన ప్రదర్శనలు జరిగినా ఈ అగ్ర నాయకులు ఇరువురూ చలించకపోవడం వల్లే మిగతా నేతలు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. పార్టీ చేసే కీలక నిర్ణయాలన్నీ మోదీ– షాల పైనే ఆధారపడి ఉండడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా నిమిత్తమాత్రుడే.

మోదీ, షాలు వేర్వేరు వ్యక్తులు కారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏ సమస్యా రాకుండా, ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడం, చెప్పిన పనిని సమర్థంగా నెరవేర్చడం అమిత్ షా బాధ్యత. 16వ ఏట 1980లో ఆర్ఎస్ఎస్‌లో చేరిన అమిత్ షా 1985లో బిజెపిలో చేరి తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచీ మోదీతో ఆయనకు అవినాభావ సంబంధం ఏర్పడింది. నిజానికి వైఎస్, కేవీపీలను ఆత్మ, అంతరాత్మ అంటారు కాని, నిజమైన ఆత్మ, అంతరాత్మలు మోదీ, అమిత్ షాలే!

‘అమిత్ షా ఎప్పుడు నిద్రపోతారో ఎవరికీ తెలియదు. ఏ రాత్రి 2 గంటలకో, 3 గంటలకో ఆయన ఇంట్లోకి వెళితే కాని మేము నిద్రపోవడానికి వీలు లేదు’ అని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒకరు చెప్పారు. మళ్లీ తెల్లవారుజామునే ఆయన పనిచేసేందుకు సిద్ధమవుతారు. మోదీ తప్ప ఎవరూ ఆయన గురించి అంతా తమకు తెలుసునని చెప్పలేరు. ఎప్పుడు ఏమి చేస్తారో, ఏ పరిణామం వెనుక ఆయన హస్తం ఉన్నదో, ఎవర్ని ఎప్పుడు అందలమెక్కిస్తారో, ఎవరిని అధఃపాతాళానికి తొక్కివేస్తారో ఎవరూ ఊహించలేరు.

కాంగ్రెస్ హయాంలో అమిత్ షాను సుప్రీంకోర్టు గుజరాత్ నుంచి దూరంగా ఉంచింది. ఆ సమయాన్ని వృధా చేయకుండా మోదీ దేశ రాజకీయాల్లో ప్రవేశించేందుకు తగిన వాతావరణాన్ని అమిత్ షా కల్పించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అసెంబ్లీలోనూ, లోక్‌సభలోనూ అత్యధిక సీట్లను సాదించడం వెనుక అమిత్ షా వ్యూహరచన ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రచారం, ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకుంటే ఆయన ఆకర్షణను ఓట్లుగా మలిచేందుకు వ్యూహరచన చేయగలిగిన శక్తి అమిత్ షాకు మాత్రమే ఉన్నది.

‘కాంగ్రెస్ హయాంలో నన్ను ఒక ఎన్‌కౌంటర్ కేసులో అరెస్టు చేసి సిబిఐ విచారించినప్పుడు నరేంద్రమోదీ పేరు చెప్పాల్సిందిగా నన్ను రోజుల తరబడి ఒత్తిడి చేశారు, కాని నేను అందుకు అంగీకరించలేదు’ అని ఇటీవల ఒక మీడియా సదస్సులో చెప్పిన అమిత్ షా నిజంగా మోదీ అంతరాత్మే, సందేహం లేదు. ఇప్పుడు అమిత్ షా కనుసన్నల్లోనే సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి మరి. ఒకప్పుడు గుజరాత్ నుంచి తనను దూరం చేసిన న్యాయస్థానాలు, 90 రోజుల పాటు తనను జైలులో ఉంచిన కేసులు ఆయనకు వ్యవస్థల తీరుతెన్నులను అర్థం చేసుకోవడాన్ని నేర్పాయి. ఇప్పుడు అవే ఆయన పట్టులోకి వచ్చాయి.

దాదాపు పదేళ్ల పాటు దేశ రాజకీయాలను తమ పట్టులో ఉంచుకున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలు 2024 సమీపిస్తున్న కొద్దీ ఏ విధంగా పావులు కదపాలన్న విషయంలో తీవ్రంగా తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాను తప్పుడు ప్రచారాలకు వాడుకోవడం, పుల్వామా–బాలాకోట్, అయోధ్య, కాశీ వంటి భావోద్వేగాలు కల్పించడం, కులాలను ఉపకులాలుగా చీల్చడం, బిఎస్‌పిని మాత్రమే కాక, ఎంఐఎం వంటి చిన్నా చితక పార్టీలను కూడా ఉపయోగించుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడం, ఇతర పార్టీలను బలహీనం చేయడంలో అమిత్ షా పాత్ర ఎంతో ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా, ప్రభుత్వాలను పడగొట్టడం, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా కూడా ఆయన పార్టీని బలోపేతం చేయగలిగారు. గత కొన్నేళ్లుగా ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీలను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థులను బలహీనం చేయడంలో బీజేపీ అగ్రనేతలు ఆరితేరిపోయారు. ఈ ఇద్దరి ధాటికి తట్టుకోలేక మొత్తం ప్రతిపక్షం కకావికలైందనడంలో సందేహం లేదు.

అయితే రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయడం, ప్రతిపక్షాలను బలహీనపరచడం ఒక దశ వరకు ఎవరైనా ఆమోదిస్తారు. ఇతర పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకోవడం, చిన్నచిన్న పార్టీలను ప్రయోగించి ఓట్లు చీల్చడం, ఆకర్షణీయమైన వాగ్దానాలు చేయడం, ఆఖరుకు ధన బలాన్ని ప్రయోగించడం కూడా రాజనీతిలో భాగమే అని అనుకోవచ్చు. కానీ ప్రత్యర్థుల గొంతు నులిమే రాజకీయాలు చేసినప్పుడు ఆ రాజనీతి కుటిలమైన దుర్మార్గమైన నీతిగా మారుతుందనడంలో సందేహం లేదు.

అయితే ఇవాళ కర్ణాటకలో గెలిచేందుకు మళ్లీ యడ్యూరప్పపై ఆధారపడడం, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాననడం, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ తప్ప వేరే గత్యంతరం లేకపోవడం, రాజస్థాన్‌లో వసుంధరా రాజే ఆధిపత్యానికి తలొగ్గి ఆమెకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశాలపై చర్చ జరిగితే తమ బలహీనతలు బయటపడతాయేమోనని భయపడడం, కార్పొరేట్ సంస్థలే రాజకీయాలు , విధానాలు నిర్ణయించే స్థితికి రావడం, ఆఖరుకు రాహుల్ గాంధీపై పాత కేసును త్రవ్వి తీసి ఆయనకు శిక్షపడేలా చేసి పార్లమెంట్ నుంచి బహిష్కరించడం తదితర పరిణామాల ద్వారా మోదీ, అమిత్ షాల ఆత్మవిశ్వాసం మునుపటిలా లేదని అనిపిస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం అధికారం కోల్పోయిన ప్రతిపక్షాల అవినీతి కుంభకోణాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా బిజెపి ప్రతిష్ట పెరుగుతుందనే భ్రమలో ఉండడం కూడా వారి అమ్ముల పొదిలో అస్త్రాలు అయిపోయాయన్న అభిప్రాయాన్ని ఏర్పరుస్తోంది. కుటిలమైన ఆలోచనలన్నీ మానేసి ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలను, పారదర్శకమైన నిర్ణయాలను, ఎన్నికల రాజకీయాలను అనుమతించేందుకు, మీడియాతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, దేశంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించేందుకు, కొత్త దిశలో చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలు ఇప్పటికైనా ఈ అగ్రనేతలకు ఎందుకు రాకూడదు?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-04-05T03:22:46+05:30 IST