మన దౌత్యనీతికి ప్రాతిపదిక ఏమిటి?

ABN , First Publish Date - 2023-03-08T01:15:13+05:30 IST

‘ప్రపంచంలో అతి పెద్ద దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు’ అని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవల ముంబైలో తన పుస్తకావిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు...

మన దౌత్యనీతికి ప్రాతిపదిక ఏమిటి?

‘ప్రపంచంలో అతి పెద్ద దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు’ అని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవల ముంబైలో తన పుస్తకావిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘హనుమంతుడు దౌత్యనీతికి మించి వ్యవహరించి శ్రీలంకకు నిప్పు పెట్టి వచ్చాడు; శ్రీకృష్ణుడు అందుకు భిన్నంగా ఓపికగా వ్యవహరించి శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకూ వేచి చూసి ఆ తర్వాత తల నరికి చంపాడు’ అని జైశంకర్ అన్నారు. జరాసంధుడు, ద్రోణుడు తదితరులను వధించేందుకు శ్రీకృష్ణుడు అనుసరించిన ‘వ్యూహాత్మక వంచనల’ గురించి కూడా ఆయన వివరించారు.

ఇతిహాసాలు, చరిత్ర పుటలలోని అనేక సంఘటనలు మన నిత్య జీవితంలో కూడా కనపడతాయి. ప్రహ్లాదుడు లాంటి సచ్ఛీలుడు కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధాలు మాట్లాడవచ్చునని చెప్పాడు. వర్తమానంలోనూ రావణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు మనకు తారసపడతాయి. మన జీవితాలకు సమీపంగా ఉన్నందువల్లే మహాభారతం లాంటి ఇతిహాసాలు ఇప్పటికీ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచిపోయాయి.

నిజానికి భారతదేశంలో చాలా మంది మేధావులు, తాము చేస్తున్న వాదనలను సమర్థించుకోవడానికి విదేశీ పండితుల ఉవాచల్ని ఎక్కువగా ఉటంకిస్తుంటారు. ఇవి మితిమీరినప్పుడు భారతదేశంలో మేధావులు లేరా, లేక భారతదేశం ఒక అపరిణత మార్గంలో ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతాయి. ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్య, సంస్కృతులకు చెందిన వారిని అటుంచినప్పటికీ ఆధునిక కాలంలో మేధావులుగా పరిగణన పొందిన వివేకానందుడు, అంబేడ్కర్, మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజాజీ, ఎంఎన్ రాయ్, తరిమెల నాగిరెడ్డి లాంటి వారిని కూడా ఉటంకించడం అరుదుగా కనపడుతుంది. వీరందరూ ఒకే భావజాలం కలవారు కాకపోవచ్చు కాని సమాజంలో మార్పుల విషయంలో ప్రత్యామ్నాయం గురించి యోచించినవారు.

అయితే పౌరాణిక, ఐతిహాసిక ఉదాహరణలతో ఆధునిక సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించడం సరైనదేనా? ఆలోచించాల్సిన విషయమిది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విపరీత పరిణామం బాగా కనపడుతోంది. ప్రతిదానికీ పొంతన ఉన్నా, లేకపోయినా ఒక సంస్కృత వాక్యం ఉటంకించడం, పురాణ పురుషుల చర్యల్ని ఉదహరించడం పరిపాటి అయిపోయింది. నేటి కాలంతో పొసగని అభూతకల్పనలు, అద్భుతాలతో ప్రస్తుత చర్యల్ని సమర్థించుకోవడం ఎల్లెడలా కనిపిస్తోంది. వాట్సాప్ యూనివర్సిటీల్లో ఇలాంటి గత కాల యాత్రికులు అధికంగా కనిపిస్తున్నారు. సంఘ్ పరివార్ పెద్దల దృష్టిని ఆకర్షించడానికి, తమ పదవులు కాపాడుకోవడానికి పౌరాణిక విశేషాలు ఉటంకించే వారు కూడా లేకపోలేదు. అయితే ఇలాంటి ఉదాహరణలు జైశంకర్ లాంటి వారు ఇస్తున్నారంటే అది మనుగడ కోసమా, లేక చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారా అని యోచించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం శ్రీకృష్ణుడిలా వ్యవహరిస్తున్నామా, లేక హనుమంతుడిలా ప్రవర్తిస్తున్నామా అనేది జైశంకర్ చెప్పగలరా? మనం ఏం చేయకపోయినా సమర్థించుకోవడానికి పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏదో ఘట్టం ఉండనే ఉంటుంది సుమా!

ప్రపంచ దేశాలతో ఏ దేశ సంబంధాలు అయినా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాలం తెచ్చిన, తెస్తోన్న మార్పులే ఆ సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటాయి. సమయం మనది కానప్పుడు వ్యూహాత్మక మౌనం పాటించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. భారతదేశం చాలా చిన్న దేశమని, చైనా వంటి పెద్ద దేశంతో యుద్దం చేయలేమని జైశంకర్ ఆ మధ్య ఏ వ్యూహం ప్రకారం ప్రకటించారు? భారత– చైనా సత్సంబంధాలు మెరుగుపడినప్పుడే ఈ శతాబ్దం ఆసియాది అవుతుందని కూడా ఆయన అంతకు ముందు ప్రకటించారు.

అత్యంత కీలకమైన జీ–20 దేశాల సమావేశాలు మన అధ్యక్షతన దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో భారతదేశం ఏ సందేశం ఇస్తున్నదన్న విషయమై ప్రపంచం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఒకవైపు జీ–20 సమావేశాలు జరుగుతుండగా అత్యంత కీలకమైన షాంఘై కోపరేషన్ ఆర్గనేజేషన్ తొలి మంత్రిత్వ స్థాయి సమావేశం కూడా వచ్చే వారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ–20, వచ్చేఏడాది ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశాలు భారతదేశంలోనే జరుగనున్న రీత్యా ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న విషయం స్పష్టం కానున్నది. ఈ రెండు సమావేశాల్లోనూ రష్యా, చైనాల పాత్ర అత్యంత కీలకం. ఈ సమావేశాలకు చైనా రాకపోతే ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడమే కాక చైనాపై ఆర్థికంగా ఆధారపడిన అనేక దేశాలు కూడా గైర్హాజరయ్యే ప్రమాదం ఉన్నది. ఎంత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఇప్పటికీ విదేశీ వాణిజ్యంలో మనం చైనాపై ఆధారపడి ఉన్నాం. గత ఐదేళ్లలో చైనా నుంచి మన దిగుమతులు 29 శాతం పెరిగాయని మన వాణిజ్య మంత్రే గత ఏడాది లోక్ సభలో ప్రకటించారు. ఈ సమావేశాల్లో భారత్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా, రష్యాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. సరిహద్దు వివాదాల రీత్యా భారత్, చైనాల మధ్య సంక్లిష్టమైన సంబంధాలు నెలకొనివున్నాయి. జీ–20, ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశాల మూలంగా కొద్దికాలం ఈ వివాదాలను ప్రక్కన పెట్టేందుకు ఉభయదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే బాలిలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కరచాలనం చేశారు. జైశంకర్ తాజా ప్రకటనలను కూడా ఈ నేపథ్యంలోనే చూడవలసి ఉంటుంది.

అయితే ఇండోనేషియా వంటి చిన్నదేశం జీ–20కి నాయకత్వం వహించడానికీ, మనం నాయకత్వ వహించడానికి ఎంతో తేడా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటి వరకూ ఇంచుమించు 75 దేశాల్లో పర్యటించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో తానే చక్రం తిప్పుతునట్లుగా వ్యవహరించారు. భారతదేశం విశ్వగురు స్థానం పొందుతున్నట్లు మనం చెప్పుకున్నాం. అయితే, ఇటీవల జరిగిన జీ–20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోనే కాదు, ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశాలు కూడా సంయుక్త ప్రకటనను విడుదల చేయడంలో విఫలమయ్యాయి. అన్ని చోట్లా ఉక్రెయిన్ యుద్ధమే అడ్డువచ్చింది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాల ఒత్తిడి వల్ల చర్చలు ముందుకు సాగలేదని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రకటించారు. ఇక అగ్రదేశాధినేతలు హాజరయ్యే సెప్టెంబర్‌లో జీ–20 శిఖరాగ్ర సమావేశాల నాటికి భారత్ ఏదైనా మార్పు తీసుకువస్తుందో లేదో వేచి చూడాల్సి ఉన్నది.

విద్యాధికుడైన జై శంకర్ విద్యార్థి దశలో స్వేచ్ఛా ఆలోచనాపరుల గ్రూపులో ఉన్నవారు. దౌత్యవేత్తగా అనేక దేశాల్లో పనిచేశారు. చైనాలో సుదీర్ఘకాలం మన రాయబారిగా ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆయనకు క్షుణ్ణమైన పరిజ్ఞానం లేదని చెప్పలేము. భారత– అమెరికా అణు ఒప్పందంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. మరి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో ఆయన స్వంత ఆలోచన ఎక్కడైనా ప్రదర్శిస్తున్నారా అన్న విషయం అనుమానంగా కనపడుతోంది. గతంలో హక్సర్, పార్థసారథి, దామోదరన్, కె. సుబ్రహ్మణ్యం వంటి ఆలోచనాపరులు మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసినట్లు కనపడేవారు. ఇప్పుడు మన విదేశాంగ నీతి దేనివల్ల ప్రభావితం అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అందువల్ల ‘ఉద్దతుల మధ్య పేదలకుండతరమె’ అన్నట్లుగా అటు పశ్చిమ దేశాల కూటమి, ఇటు చైనా, రష్యాల ఒత్తిడి మధ్య భారతదేశం నలిగిపోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇది జీ–20 దేశాల మధ్య ఉద్రిక్తతల్లో వ్యక్తమవుతోంది. మనకు నిర్దిష్టమైన చైనా విధానం అంటూ ఏమీ లేదని మాజీ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు జీ–20, ఎస్‌సిఓ సమావేశాలు మన దేశంలో జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని ప్రచారం చేస్తున్నారు. ఏఐసిసి ప్లీనరీ ముగిసిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లడం యాదృచ్ఛిక పరిణామం కాదు. పార్లమెంట్‌లో మైక్రోఫోన్లను నిలిపివేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, మాట్లాడిన దాన్ని రికార్డుల్లో లేకుండా చేస్తున్నారని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, సరిహద్దుల్లో చైనా సైన్యం ప్రవేశం, వీటన్నిటి గురించీ పార్లమెంట్‌లో చర్చించకుండా తమను అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆరోగ్యకరం. భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడితే ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, అమెరికా, యూరప్‌ల కన్నా అతి పెద్ద దేశమైన భారత్‌లో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతే అది ప్రపంచానికే ప్రమాదకరం’ అని రాహుల్ ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్షాలపై కేంద్ర ఏజన్సీలను ప్రయోగిస్తున్న తీరు చూస్తుంటే భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వంలోకి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని కేసీఆర్‌తో సహా 8 ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

జైశంకర్ తండ్రి కె. సుబ్రహ్మణ్యం కూడా విదేశాంగ నిపుణుడు. ఆయన ఫార్ములా ప్రకారమే భారతదేశం అణ్వస్త్ర రాజ్యాల బృందంలో చేరింది. ఆయన కూడా దౌత్యనీతిని, దేశంలో జరిగే పరిణామాలను విశ్లేషించేటప్పుడు పౌరాణిక ప్రతీకల్ని ఉపయోగించుకునేవారు. ప్రజలను పరిరక్షించలేని వారు అసురులని ఆయన గుజరాత్ అల్లర్ల గురించి వ్యాఖ్యానించారు. హిందూ జీవన విధానానికి ప్రమాదం ఇతర మతాలనుంచి లేదని, హిందూ ధర్మాన్ని వక్రీకరించిన వారి నుంచి ఉన్నదని ఆయన ఒక వ్యాసంలో అన్నారు. గతం, భవిష్యత్‌ల మధ్య ఊగిసలాటలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలలో తన పాత్రను నిర్వచించుకోలేని దుస్థితిలో ఉన్నదని చెప్పక తప్పదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-03-08T01:15:13+05:30 IST