కర్ణాటక ఇవ్వబోయే సందేశమేమిటి?
ABN , First Publish Date - 2023-04-12T01:15:48+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గత నాలుగు రోజులగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గత నాలుగు రోజులగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో తల మునకలై ఉన్నారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై బిజెపి అధిష్ఠానం ఇంత తీవ్రంగా కసరత్తు చేయడం ఇదే మొదటి సారి. నాలుగు రోజుల పాటు చర్చలు జరిపినా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా వారు ఖరారు చేయలేకపోయారు. ఎవరిని పోటీలో దింపినా గెలుస్తారన్న విషయంలో పూర్తి విశ్వాసం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అయితే ఎవరికి సీటు నిరాకరిస్తే ఎంత నష్టం జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొని ఉండడం కూడా మరో ముఖ్యమైన కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో భాగమైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బిజెపి రాజకీయాల్లో కూడా భాగమయ్యాయి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను డిమాండ్ చేసిన విధంగా సీట్లు కేటాయించేందుకు అధిష్ఠానం అంగీకరించే పరిస్థితి కనపడకపోవడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసంతృప్తితో సోమవారం రాత్రి బెంగళూరు వెళ్లిపోయారు.
కర్ణాటక బిజెపిలో అధికార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన అధికార కేంద్రమైన యడ్యూరప్ప పట్టు నుంచి బిజెపిని తప్పించేందుకు ఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సఫలమవుతాయో చెప్పలేం. ఢిల్లీ పెద్దలు మోదీ, అమిత్ షా కర్ణాటక రాజకీయాలను శాసించాలనుకున్నా, శాసించ గల పరిస్థితిలో లేరు. ఉత్తరాదిన చక్రం తిప్పినట్లు దక్షిణాదిన చక్రం తిప్పడం అంత సులభం కాదని మోదీ, షా లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజానికి ఉత్తరాదిన కూడా యోగి ఆదిత్యనాథ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని వారు తగ్గించలేకపోతున్నారు. కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి మరో నేతకు అప్పగించడంలో మోదీ, షాలు విజయం సాధించగలిగారు కాని పార్టీకి విజయసారథ్యం వహించగలిగిన మరో నాయకుడిని వారు గుర్తించలేకపోయారు. అంతేగాక యడ్యూరప్ప ఆధిపత్యాన్ని తగ్గించలేకపోతున్నారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఫిబ్రవరిలో తన 80వ జన్మదినం సందర్భంగా యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రకటించారు. అయినప్పటికీ యడ్యూరప్పను విస్మరించి బిజెపి అధిష్ఠానం కర్ణాటకలో రాజకీయాలు చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు నాలుగు రోజుల ముందు హోంమంత్రి అమిత్ షా బెంగళూరులో ముఖ్యమంత్రి బొమ్మైని తీసుకుని యడ్యూరప్ప ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. ఎన్నికల తర్వాత విజయేంద్ర (యడ్యూరప్ప కుమారుడు)కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానంతో ఆ కురువృద్ధుడిని శాంతింపచేసేందుకు అమిత్ షా ప్రయత్నించారు. మిగతా రాష్ట్రాల్లో 75 ఏళ్లు దాటిన నేతల్ని ప్రక్కన పెట్టగలిగిన మోదీ, షాలు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో అంత సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రమేయం లేకుండా తన కుమారుడికి, ఇతరులకు యడ్యూరప్ప సీట్లు ప్రకటించే స్థితిని అడ్డుకోవడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేయవలిసి వస్తోంది.
నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ లాంటి నేతలు సైతం మోదీ హవాలో ఓడిపోయారు. ఈ గెలుపులో యడ్యూరప్ప పాత్ర కన్నా మోదీ పాత్రే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంతకు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ, సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనపడినప్పటికీ బిజెపి మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. అయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మోదీ–షాలు యడ్యూరప్ప మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, అవినీతి, వారసత్వ పాలనను కొనసాగించేందుకు వీలు కల్పించారు. యడ్యూరప్ప కాలంలో జరిగిన ఘోరమైన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో యడ్యూరప్ప మాట్లాడిన ఆడియో రికార్డులు కూడా బయటకు పొక్కినప్పటికీ వాటిని విస్మరించారు. దత్తాత్రేయ హొసబలె, సిఆర్ ముకుంద్, సంతోష్ వంటి ఆర్‌ఎస్ఎస్ అగ్ర నేతలు కర్ణాటకకు చెందిన వారైనప్పటికీ, కర్ణాటకలో బిజెపి అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ రాష్ట్ర్లంలో అరాచక, అవినీతి పాలనను అరికట్టలేకపోయారు. పైగా ఆర్‌ఎస్ఎస్ నేతలే అవినీతికి పాల్పడుతున్నారని పేరు తెచ్చుకున్నారు.
కర్ణాటకలో వారసత్వ రాజకీయాలను, ఘోరంగా విస్తరించిన అవినీతిని అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారసత్వ పాలనను, అవినీతిని విమర్శించడం విచిత్రం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తాను చేసిన ఉపన్యాసం మోదీ కర్ణాటకలో కూడా చేయగలరా? ఇవాళ ఆ అవినీతి, వారసత్వ రాజకీయాల వల్లే కర్ణాటకలో ఆయన, షా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులను నిర్ణయించలేని దుస్థితిలో ఉన్నారు. ఇంతెందుకు? ఇప్పటికీ ఎన్నికల తర్వాత ఒకవేళ త్రిశంకు అసెంబ్లీ ఏర్పడితే జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి నేతలు ఇప్పటికే కుమారస్వామితో రహస్య మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసినా ఏదో రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి పెద్దలు ఎందుకు ఇంత తహతహలాడుతున్నారు? గతంలో ఆపరేషన్ కమల్ పేరిట కర్ణాటకలోనే కాక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి పూనుకున్నప్పుడు ‘అదంతా రాజనీతిలో భాగం’ అని యడ్యూరప్ప సమర్థించుకున్నారు. ‘కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని చెప్పలేం కాని ప్రభుత్వం మాత్రం బిజెపి ఏర్పాటు చేస్తుంది. వెంటనే కాకపోయినా లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ మేమే కర్ణాటకలో అధికారంలోకి వస్తాం’ అని ఒక బిజెపి నాయకుడు చెబుతున్నారంటే దేశ రాజకీయాలు ఏ క్రమంలో సాగుతున్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
కర్ణాటకలో ఏదో రకంగా గెలిచేందుకు లేదా కాంగ్రెస్‌ను సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేసేందుకు బిజెపి శాయశక్తులా ప్రయత్నించడం సహజమే. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తే ఇతర రాష్ట్రాల్లో దాని ప్రభావం పడే అవకాశం ఉండదని చెప్పలేం. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే ఇక దక్షిణాదిన ఆ పార్టీ అడుగుపెట్టే పరిస్థితులు తగ్గిపోతాయి. అంతేకాకుండా తమకు ఉత్తరాది పార్టీగానే గుర్తింపు కొనసాగుతుందనే భయం బిజెపికి లేకపోలేదు. అందువల్ల బిజెపి అగ్రనేతలు కర్ణాటక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
దక్షిణాదిన తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బిజెపి నేతలు నానారకాల దక్షిణాది నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. కేరళలో ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సిఆర్ కేశవన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిలో తమకు ఇంకా ఉనికి ఉన్నదని చెప్పేందుకు బిజెపి అగ్రనేతలు ప్రయత్నించారు. 2019లో సోషల్ మీడియా కార్యకర్తగా పార్టీలో చేరిన అనిల్ ఆంటోనీ నిష్క్రమణ మూలంగా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని కేరళకు చెందిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ మీడియా ప్యానెలిస్టుగా ఉన్న కేశవన్‌కు రాజాజీ మనుమడన్న పేరు తప్ప, వేరే గుర్తింపు ఏమీ లేదు. ఇక నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వల్ల బిజెపికి ఏమైనా రాజకీయ ప్రయోజనం లభిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఆయనను ముఖ్యమంత్రిగా ఎందుకు నియమించారని ఒక రోజు సెంట్రల్ హాలులో అహ్మద్ పటేల్‌ను అడిగితే రాయలసీమకు చెందినవాడైనందువల్ల జగన్ ఉద్ధృతిని అరికడతారని, హైదరాబాదీ అయినందువల్ల తెలంగాణ సమస్య రాకుండా చూస్తాడని భావిస్తున్నామని జవాబిచ్చారు. ఈ రెండు అంశాల్లో ఆయనెంత వరకు విజయవంతం కాగలిగారో బిజెపి నాయకులకు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా బిజెపికి దక్షిణాది నాడి తెలియదని చెప్పేందుకు మాత్రమే ఈ చేరికలు దోహదం చేస్తాయి.
బిజెపిలో చేరుతున్న వారిని, బిజెపి భావజాలాన్ని అభిమానిస్తున్న వారిని చూస్తుంటే రాజకీయాల్లో సైద్ధాంతిక దృక్పథం కన్నా అవకాశవాదం, స్వప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘ఏం చేస్తాం? కాంగ్రెస్ అనుకున్నంతగా పుంజుకోవడం లేదు, సరైన నాయకత్వం లేదు. అందువల్ల మాకు బిజెపి తప్ప వేరే శరణ్యం ఏమిటి?’ అని ప్రశ్నించేవారు మాత్రమే కాదు, ‘మాపై కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ, సిబిఐ దృష్టి నుంచి తప్పించుకోవాలంటే బిజెపిలో చేరడం మినహా గత్యంతరం లేదు’ అని చెప్పే నేతలు కూడా లేకపోలేదు. ఈ రెండు రకాల వారిని తప్ప తమ సైద్ధాంతిక బలం, సుపరిపాలన, అభివృద్ధి, పారదర్శకమైన విధానాలు, ప్రజాస్వామిక వ్యవహార శైలి ద్వారా ఆకట్టుకునే శక్తిని బిజెపి సమకూర్చుకోలేకపోతోంది. నిజానికి నేతల కన్నా ఒక్కోసారి ప్రజలే వివేకవంతులన్న అభిప్రాయం కలిగిస్తారు. కొంతకాలం భావోద్వేగాల్లో కొట్టుకుపోయినా, తర్వాత తేరుకుని అవినీతి, అసమర్థ, దుర్మార్గ పాలనను వదుల్చుకుంటారు. భారత ప్రజాస్వామ్యంలో చెప్పుకోదగ్గ విషయం ఇదే.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)