ఎర్రకోట దాటిన మాటలు ఎక్కడ ఫలిస్తున్నాయి?
ABN , First Publish Date - 2023-08-16T03:00:12+05:30 IST
ప్రసంగాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిన నాయకుడు, బహుశా, ఈ దేశంలో మరొకరు లేరేమో?! లేరని ఇటీవల లోక్ సభలో మోదీ వెలువరించిన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో స్పష్టమయింది...
ప్రసంగాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిన నాయకుడు, బహుశా, ఈ దేశంలో మరొకరు లేరేమో?! లేరని ఇటీవల లోక్ సభలో మోదీ వెలువరించిన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో స్పష్టమయింది. ఎక్కడ ప్రసంగించినా సరే, ఎన్నికల సభల్లో మాదిరే ఆయన ప్రసంగిస్తారని ప్రతీతి. పార్లమెంట్‌లో ప్రసంగించినా, ఎర్రకోటపై నుంచి ప్రసంగించినా, ఆఖరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను ప్రారంభించిన సందర్భంలో ప్రసంగించినా మోదీ కళ్ల ముందు ఎన్నికలే కనపడతాయి!
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ ప్రసంగించేందుకు ప్రధాని మోదీ ఒక పెద్ద పుస్తకాన్నే సభలోకి తీసుకువచ్చారు. ఒక ఉపన్యాసం వెలువరించేందుకు ఆయన ఎంతగా సిద్ధపడి వస్తారో అన్నదానికి ఇది నిదర్శనం. ‘మీరు సభలో నినాదాలు చేయకండి’ అని లోక్‌సభ స్పీకర్ ఇరు పక్షాలనూ అనేకసార్లు అభ్యర్థించారు. అయినప్పటికీ అధికార పక్ష సభ్యులతో కలిసి మోదీ తానే స్వయంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మోదీ మహాశయుడు ఆ ఈశాన్య భారత రాష్ట్రంలో సంభవిస్తున్న దురదృష్టకర, గర్హనీయ పరిణామాలపై కాకుండా ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌ను విమర్శించేందుకే తన సమాధానంలో అత్యధిక సమయాన్ని కేటాయించారు.. విపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత మాత్రమే మణిపూర్ గురించి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల వాకౌట్‌పై ప్రతిస్పందిస్తూ విపక్షాల వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా? తన మీద చెత్త వేసి, అబద్ధాలు చెప్పి పారిపోయారని తిట్టారు. మణిపూర్‌పై ప్రధానమంత్రి మౌనం పట్ల నిరసనగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మోదీ చేత చెడా మడా తిట్టించుకునేందుకు ప్రతిపక్షాలే ఒక రకంగా ఆయనకు అవకాశం కల్పించాయి. రాహుల్ గాంధీ కొన్ని అంశాలను బలంగా ప్రస్తావించినా ఇంకా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడగలిగిన శక్తిని సంపాదించుకోలేదు. రాహుల్ మాట్లాడితే ఇలాగే మాట్లాడతారులే అన్న అభిప్రాయం కలిగిస్తున్నారు. అయినప్పటికీ మోదీ రెచ్చిపోయి మాట్లాడేందుకు రాహుల్ వీలు కల్పిస్తున్నారు. తనను కదిలిస్తే చాలు మోదీ పెద్ద పెట్టున విరుచుకుపడుతున్నారు. తరాలను, వంశాలను, పేర్లను ప్రస్తావించి దుమ్మెత్తి పోస్తున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అని చెప్పేందుకు ఇప్పుడే ఆస్కారం లేదు. ఈ దేశంలో కేవలం ప్రసంగ బలంతో ఎవరూ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. మోదీయే తన ప్రసంగాలతో ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించి పెట్టలేకపోయిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం నరేంద్రమోదీ ఎర్రకోటపై నుంచి 89 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తనకు ఏదైనా కల వచ్చినా అది ప్రజలకోసమేనని, తనకు చెమట పట్టినా అది ప్రజలకోసమేనని మోదీ ఆ ప్రసంగంలో చెప్పడం ఆశ్చర్యకరం. తాను ఊపిరి పీల్చినా అది ప్రజలకోసమే అని చెప్పడాన్ని ఆయన మరిచిపోయినట్లున్నది. విచిత్రమేమంటే మోదీ అనే తన పేరును తానే ఈ ప్రసంగంలో ఏడుసార్లు ఉచ్ఛరించారు. సంస్కరణలు తెచ్చే సాహసాన్ని మోదీకి ప్రజలే కల్పించారని, మోదీ ఒకదాని తర్వాత మరొకటిగా పలు సంస్కరణలు తెచ్చారని, మోదీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మార్చేందుకు వాగ్దానం చేస్తున్నారని, చెప్పిన దానికంటే ముందుగా మోదీ నూతన పార్లమెంట్‌ను కట్టారని ఆయన ఇలా పలుసార్లు తన పేరును తానే ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే మోదీ తన మోహంలో తానే పడిపోయారని, తన ప్రసంగం వెల్లువలో తానే కొట్టుకుపోతున్నారని అర్థమవుతోంది.
లోక్‌సభ వర్షాకాల సమావేశాలు పూర్తయి, మళ్లీ ఎన్నికల సీజన్ ప్రవేశించినందువల్ల మోదీ ప్రసంగాలను అనేకసార్లు వినే అవకాశం ఇక ప్రజలకు లభించనుంది. అయిదు రాష్ట్రాలఎన్నికలు, సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న రీత్యా ఆయన సుడిగాలిలా దేశమంతా పర్యటించి ప్రసంగించేందుకు ఇప్పటికే బీజేపీ వ్యూహరచన చేసింది. బీజేపీ ఎన్నికల వ్యూహరచనలో ప్రధానాంశం మోదీ ప్రసంగాలు చేసే సభలను నిర్ణయించడం. మధ్యప్రదేశ్‌లోనైతే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మోదీ కేంద్రిత ప్రచార వ్యూహాలను సంసిద్ధం చేశారు. ‘మోదీ కే మన్ మే బసే ఎంపి, ఎంపి కే మన్ మే బసే మోదీ’ (మోదీ మనసులో మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ మనసులో మోదీ) అన్న నినాదంతో ఆ కీలక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది రాజస్థాన్‌లో ప్రాంతాల వారీగా మోదీ ప్రసంగాలు చేయాల్సిన సభలు ఇప్పటికే నిర్ణయమయ్యాయి.
భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా తయారయిందంటే దేశంలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి మోదీ తప్ప మరే నాయకుడు కనపడడం లేదు. నిజానికి ప్రతిపక్షాలను బలంగా తిప్పిగొట్టగలిగిన నేతను బీజేపీ ఈ తొమ్మిదేళ్లలో రూపొందించుకోలేదు. ప్రసంగించగలిగిన వారికి అవకాశాలు కల్పించలేదు. అందువల్ల మోదీ తప్ప వారికి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. స్మృతి ఇరానీ వంటి నేతలు మాట్లాడగలిగినప్పటికీ వారి స్థాయి పార్లమెంట్, విలేఖరుల సమావేశాలకు మించదు. రెండవశ్రేణి నాయకులని తయారు చేసుకోకపోవడం, చప్పట్లు కొట్టే కార్యకర్తలుగా ఎంపీలను సైతం మార్చుకోవడం మూలంగా మోదీయే ప్రతి చిన్నా చితక దానికి రంగంలోకి దిగి మాట్లాడాల్సి వస్తోంది. అందువల్ల మణిపూర్‌పై అమిత్ షా మాట్లాడతానన్నా ప్రతిపక్షాలు ఒప్పుకోకుండా మోదీ రంగంలోకి దిగేవరకూ ఒత్తిడి పెంచారు. బహిరంగ సభల్లో తప్ప పార్లమెంట్‌లో మాట్లాడడానికి అంతగా ఇష్టపడని మోదీ చేత మాట్లాడించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకైనా వారు వెనుకాడలేదు.
సరే, మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ప్రసంగాన్నీ ఆయన ఆసక్తిదాయకంగా చేయగలుగుతున్నారా అంటే అదీ కనపడడం లేదు. ప్రతి ప్రసంగంలోనూ అంతకు ముందు చేసిన ప్రసంగంలో ఉన్న అంశాలే కనపడుతున్నాయి. తొమ్మిది సంవత్సరాలుగా మోదీ అధికారంలో ఉన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలు ఆయన గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అకృత్యాల గురించే మాట్లాడారు. ఎమర్జెన్సీ గురించి, ముఖ్యమంత్రులను మార్చడం గురించి, అవినీతి గురించి, వారసత్వ పాలన గురించి కొన్ని వందలసార్లు విమర్శించారు. అధికారంలో లేనిపార్టీ గురించి అవే విమర్శలను ఎన్నిసార్లు చేస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి తక్కువ మాట్లాడి, తన పాలన గురించి ఎక్కువ మాట్లాడితే మోదీకి ఉపయోగం ఉండేదేమో. ప్రతిపక్షాలను మాటిమాటికీ విమర్శించడమే కాదు, వాటిని వెంటాడి, వేటాడి వారంతా గదిలో పిల్లిని బంధిస్తే తిరగబడే పరిస్థితిని మోదీ కల్పించుకున్నారు. ఇవాళ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాలు ఐక్యమవుతున్నాయంటే, రాహుల్ గాంధీ వైపు జనం చూడడం మొదలు పెట్టారంటే అందుకు మోదీ అవలంబించిన వైఖరే కారణమేమో అనిపిస్తోంది. ‘మోదీ వర్సెస్ ఎవరు’ అన్న ప్రశ్నకు ఆస్కారం లేకుండా ‘మోదీ మినహా ఎవరైనా ఒకటే’ అన్న నినాదంతో ప్రతిపక్షాలు ఏకమయ్యే పరిస్థితిని ఆయనే కల్పించినట్లున్నది.
పోనీ మోదీ తన ప్రభుత్వం గురించి చెప్పుకుంటున్న వివరాల్లో పూర్తి వాస్తవాలు ఉన్నాయా అంటే ఇది కూడా చర్చనీయాంశమే అవుతుంది. ఇందుకు ఆయన ఎర్రకోటపైనుంచి యువత గురించి మాట్లాడిన మాటలే నిదర్శనం. ఈ దేశంలో యువతకు అవకాశాలకు కొదువలేదని, ఎన్ని అవకాశాలు కావాలన్నా అన్నిటినీ సృష్టించవచ్చని అన్నారు. ‘యువతకు ఆకాశమే హద్దు’ అని ఆయన ప్రకటించారు. నిజంగా ఈ పరిస్థితి దేశంలో ఉన్నదా అని సమీక్షించుకోవడం అవసరం. ఈ దేశంలో యువత పరిస్థితిపై ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ‘ద క్రూక్డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా– ఎస్సేస్ ఆన్ ఏ రిపబ్లిక్ క్రైసిస్’ అన్న పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. భారతదేశంలో వివిధ రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగులు, కార్మికుల కొరత లక్షల సంఖ్యలో ఉంటుదని అంచనా. ఉద్యోగం పొందలేని, నైపుణ్యానికి పనికిరాని యువత ఈ దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ‘స్కిల్ ఇండియా’ అని మోదీ ఇచ్చిన నినాదం ఆచరణలో అంతగా విజయవంతం అయిన దాఖలాలు లేవు. స్టార్టప్‌ల గురించి ఆయన ఇచ్చిన వివరాలు నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ దేశంలోని 25 శాతం పాఠశాలల్లో 2020 కల్లా నైపుణ్య శిక్షను అందించాలని 2015లో ప్రకటించారు. ఇంతవరకు ఎంతమందికి నైపుణ్యం అందించారో అన్న విషయంలో డేటా కనీసం నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద కూడా లేదు. చదువుకున్న వారిలో కూడా ఉద్యోగం పొందగలిగినవారు 50 శాతమే ఉంటారని ఇండియా స్కిల్స్ నివేదిక తెలిపింది. బిటెక్, ఎంబిఏ, ఎంసిఏ తదితర కోర్సులు చదివిన వారిలో సగం మందికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు. చాలీచాలని జీతాలు పొందే యువకులు ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రతి ఏడాదీ లేబర్ మార్కెట్‌లో ప్రవేశించే కోటిన్నర మంది యువతలో 65 నుంచి 75 శాతం మందికి ఉద్యోగాలు పొందే అర్హత లేకుండా పోతోంది. ఈ నైపుణ్య అగాధం వల్ల జీడీపీ రీత్యా 1.6 ట్రిలియన్ డాలర్లు కోల్పోతున్నామని ఒక ఐటీ కంపెనీ అంచనా వేసింది. ఏ మాత్రం తెలివితేటలున్న యువకులు కూడా డిగ్రీ పూర్తికాగానే అప్పోసప్పో చేసి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకోవల్సిన పరిస్థితి దేశంలో నెలకొన్నది. మన దేశంలో చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే విదేశీవిద్యార్థులు ఎంతమంది? ఎందుకు మన విద్యావిధానం ఈ విషయంలో విఫలమవుతోంది? అమృత కాలం గురించి కలలు పంచిపెట్టే మోదీ ప్రసంగాలు ఆసక్తికరంగా, వీనుల విందుగా ఉండవచ్చు. కాని వాస్తవం కఠోరంగా ఉన్నది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)