అరెస్ట్ వెనక ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’!

ABN , First Publish Date - 2023-09-27T01:49:23+05:30 IST

చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న బలమైన కారణం జగన్‌రెడ్డి ‘ప్రతీకారం’ అని మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులుగా చలామణి అవుతున్న...

అరెస్ట్ వెనక ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’!

చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న బలమైన కారణం జగన్‌రెడ్డి ‘ప్రతీకారం’ అని మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులుగా చలామణి అవుతున్న వారి విశ్లేషణల్లో కూడ అంతకుమించి కొత్త కోణం వెలికి రావటం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ ‘న్యాయమే’ననే వైసీపీ నాయకులు, తొత్తు మేధావులు కూడా చంద్రబాబు ఏదో అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికే ప్రయాస పడుతున్నారు. చంద్రబాబును ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా పరిమితంగా పరిగణిస్తే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఇంతకు మించి పరిణతి ప్రదర్శించలేవు. గత 70 ఏళ్ల భారత చరిత్రలో, 40 ఏళ్ల తెలుగు రాష్ట్రాల భూత, భవిష్యత్, వర్తమానాల్లో ఏ కాలంలోనూ చంద్రబాబు లేని సమాజాన్ని ఊహించుకోవటం సాధ్యం కాదు. అటువంటి చంద్రబాబు అనే ఒక ‘వ్యవస్థ’ను కూకటివేళ్లతో శాశ్వతంగా పెకలించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఉపరితల విశ్లేషణలను పక్కనబెట్టి, రాజకీయ సామాజిక తంత్రంలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ (Inoculum Effect) ను ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో గమనిస్తే, పొంచి ఉన్న ప్రమాదాలు, చీకటి కోణాలు వెలుగు చూస్తాయి.

చంద్రబాబు అరెస్ట్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల ప్రేరేపణతోనే జరిగింది అనటంలో సందేహం ఉండాల్సిన పనిలేదు. ఈ వయస్సులో కూడ చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, అలుపులేకుండా గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేయటం, ప్రజల్లో అంతులేని ఆదరణ పొందుతుండటం గురించి సొంత పార్టీ నేతల నుంచి, జనసేన నుంచే గాక ఇంటలిజెన్స్ ద్వారా కూడా కేంద్రానికి సమాచారం ఉంది. నిజానికి చంద్రబాబు, తెలుగుదేశం కనుమరుగైతే గాని, భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోకి అడుగు పెట్టలేదని మోదీకి, అమిత్ షాకు కూడా అర్థమైంది. పోనీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొంటే కేవలం కొన్ని సీట్లతో సరిపెట్టుకోవలసిందే. కానీ, ఆంధ్రలాంటి ప్రకృతి వనరులు అపారంగా ఉన్న ధనిక రాష్ట్రం నుంచి గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి వీలు ఉండదు. ఆ అవకాశం జగన్‌రెడ్డి వంటి తొత్తులు ముఖ్యమంత్రులుగా ఉంటేనే సాధ్యం. లేదా బీజేపీనే స్వయంగా రాష్ట్ర పగ్గాలు పడితే ఇక ఆకాశమే హద్దు. ఒకసారి తెలుగుదేశం స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే ఆ తరువాత వైసీపీ నుంచి రాష్ట్రానికి సులభంగా విముక్తి కలిగించవచ్చు. జగన్‌రెడ్డి కేసులు కేంద్రం చేతిలో ఉన్నంత కాలం అతడిని ఉంచటమా, పీకేయటమా అన్నది బీజేపీకి మంచి నీళ్లు తాగినంత సులువు. కాబట్టి సమస్యల్లా చంద్రబాబు, తెలుగుదేశమే.

చంద్రబాబును, తెలుగుదేశాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి ఆ స్థానంలో బీజేపీ రావాలంటే పన్నాల్సిన పన్నాగాలను జగన్‌కే అప్పచెప్పింది కేంద్రం. సామాజిక సిద్ధాంతాలలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అనే సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం– ఏదైనా తీవ్రమైన సామాజిక చర్యకు ఒడిగట్టే ముందు అతి తక్కువ స్థాయిలో దానిని (తాము భవిష్యత్తులో చేపట్టబోయే దానిని) సూచనగా ప్రజలలోకి వదులుతారు. ప్రజల్లో వచ్చే స్పందనను జాగ్రత్తగా అంచనా వేస్తారు. ముందు ప్రజల్లో కొంత అలజడి, వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుందని గ్రహించి పోలీసులను, అవసరమైతే పారామిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచుతారు. మొదటిసారి పొంగులా వచ్చి చల్లారిన తరువాత, వెంటవెంటనే తీవ్ర చర్యలకు దిగుతారు. ప్రజలు గతంలో చేసిన ప్రతిఘటన రెండవసారి చేయలేరు. వారు క్రమంగా ఈ తీవ్ర చర్యలకు అలవాటు పడిపోతారు. అంటే మశూచి వ్యాధి రాకుండా ముందుగా ఇచ్చే వాక్సిన్ లాంటిది అన్నమాట. అందువల్ల దీనికి ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అని పేరు వచ్చింది.


ఉదాహరణకు, గుజరాత్ అల్లర్లు అక్కడి అప్పటి ప్రభుత్వ సహకారంతోనే జరిగాయి. మోదీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. గుజరాత్ అల్లర్లలో ముస్లింలు దారుణ హింసకు గురైనా, ముస్లింలకు ప్రభుత్వం కావాలనే రక్షణ కల్పించకుండా దారుణాలు జరిపించినా, హిందువులు మోదీని హీరోగా భావించారు. అందుకే నేటిదాకా బీజేపీయే గుజరాత్‌ను పాలిస్తున్నది. నాడు గుజరాత్ అల్లర్లలో ఏమి జరిగిందో ప్రజలకు తెలియపర్చాలని బీబీసీ చేసిన ప్రయత్నానికి కేంద్రం ఎలా అడ్డుపడిందో తెలిస్తే గాని మనకు ఈ రాష్ట్రంలో రాబోయే రావణ కాష్టం గురించిన ఒక అంచనా, ఆలోచనా రాదు. తమకు వ్యతిరేకంగా ఏమైనా రాస్తారనిపిస్తే ఆ మీడియాని సమూలంగా నాశనం చేసి, కేసులు పెట్టి వేధించే విషయంలో మోదీకి, జగన్‌కు, కేసీఆర్‌కు తేడా ఏమీ లేదు. వీరంతా కన్నుమూసే వరకూ అధికారంలో ఉండాలని కోరుకునేవారే. అందుకు అవసరమైతే దేనికైనా సిద్ధపడతారు. వీరు అవినీతి దురంధరులు కానీ తాము ఎంతో నిజాయితీపరులమని, తమ వ్యతిరేక వర్గంలోని వారే భయంకర అవినీతిపరులని ప్రచారం చేస్తుంటారు. నెహ్రూ, గాంధీ, సోనియా అవినీతికి పాల్పడి దేశాన్ని నాశనం చేసారని మోదీ ప్రచారం చేస్తే, చంద్రబాబు అంత అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని జగన్ అంటాడు.

గతంలో జగన్, రాజశేఖర రెడ్డి అవినీతి బాగోతాలు వెలుగుచూసినప్పుడు తొలుత నిర్ఘాంతపోయిన తెలుగు ప్రజలు అనంతరకాలంలో నిరంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తూన్నా పెద్దగా స్పందించటం మానేశారు. పైగా అందరు నాయకులు అవినీతిపరులే, వీళ్ళకోసం మనం ఎందుకు పోరాటాలు చేయాలి అని నిశ్చయించుకొంటారు. ఇలాగే, చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి నాయకులపైన నిజాయితీ లేనివారిగా ముద్ర వేస్తే వారు అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీయవచ్చు అన్నదే బీజేపీ, వైసీపీ పథకం. అందులో భాగంగానే పవన్ పైన ‘దత్తపుత్రుడు’, ‘ప్యాకేజీ పుత్రుడు’ వంటి ఆరోపణలు. ఎప్పుడైతే అవి పనిచేయట్లేదు అనే భావన కలుగుతుందో అప్పుడు ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’లో రాజకీయ తంత్రానికి తెరలేపుతారు. ఇందులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ముందు ముందు లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని, ఉగాది తరువాత తెలుగుదేశం ఉండదని బొత్స సత్యనారాయణ వంటివారు అనటం వెనకాల ఇదే సిద్ధాంతం ఉంది. అది ఆషామాషీగా అన్నది కాదు. ఉన్నత పోలీస్ అధికారులు, జడ్జీలతో సహా అందరూ ఏకపక్షంగా ప్రవర్తించటానికి కారణం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వారికి అందుతున్న ఉప్పే. న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కత్తి పట్టడం తప్ప వేరే మార్గం లేదనడానికి కారణం కూడా చూచాయగా ఇందుకు సంబంధించిన కొన్ని శకునాలు ఆయనకు అర్థం కావటమే. సొంత బాబాయిని చంపించి నిర్భయంగా తిరుగుతున్నవాడిని మోదీకి దత్తపుత్రుడిగా అభివర్ణించిన నిర్మలమ్మ మాటలను విస్మరించడానికి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రజలు, రాజకీయ నాయకులు భయపడటం నిష్కారణమేమీ కాదు.

డా. కొప్పరపు నారాయణమూర్తి

Updated Date - 2023-09-27T01:49:23+05:30 IST