విమోచన తరువాతనే విలీనం, సమైక్యత!
ABN , First Publish Date - 2023-09-15T00:47:47+05:30 IST
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించాలని, అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని, విమోచన పోరాటాల చరిత్రను పాఠ్యాంశాలలో ఉంచాలని...
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించాలని, అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని, విమోచన పోరాటాల చరిత్రను పాఠ్యాంశాలలో ఉంచాలని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1998 సెప్టెంబర్ 17 నాడు, స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి దాదాపు వంద మంది స్వాతంత్ర్య సమరయోధులను, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను ఎల్.కె. అద్వానీ సన్మానించారు. అందులో నారాయణరావు పవార్, వందేమాతరం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ అంశం అందరికీ ఆమోదయోగ్యం కావాలని, అన్ని రాజకీయ పార్టీలకు వినతిపత్రాలను అందించడంలో బీజేపీ వెనుకంజ వేయలేదు. సంవత్సరాల తరబడి సెప్టెంబర్ 17 నాడు, అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఉదయాన్నే కలెక్టర్, పోలీసు కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, తెలంగాణాలోని అన్ని జిల్లాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అరెస్టు అయ్యారు, వందల సంఖ్యలలో కార్యకర్తలు లాఠీ చార్జీలకు గాయాలపాలయ్యారు. ఇది సంవత్సరాల తరబడి కొనసాగింది. అయితే ఆజాదీ కా అమృతోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం విజయాన్ని సాధించింది. కేంద్ర హోంమంత్రి అధికారికంగా హైదరాబాదులో విమోచన ఉత్సవాన్ని గత సంవత్సరం నిర్వహించారు, ఈ సంవత్సరమూ నిర్వహించబోతున్నారు.
రాష్ట్రప్రభుత్వం కూడా ఒకమెట్టు దిగివచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే పేరు మాత్రం ‘జాతీయ సమైక్యతా దినం’ అని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాదు సంస్థానంలో వున్న జిల్లాలు మాత్రం విమోచనదినాన్ని ఘనంగా ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించుకోవడం విశేషం. విమోచన తరువాతనే విలీనం, జాతీయ సమైక్యతలాంటి పదాలు వస్తాయి. సెప్టెంబర్ 17 నాడే కేంద్ర హోంశాఖా మాత్యులు అధికారికంగా విమోచన దినంలో పాల్గొనడం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ఆ ఉత్సవాలను జరపడంలాంటి వైరుధ్య విధానం అసమంజసం.
అసలు ఆపరేషన్ పోలో ఎందుకు జరిగింది? హైదరాబాద్ సంస్థాన ప్రజలను నియంత నిజాం నుంచి, రజాకర్ల పాలన నుంచి విముక్తులను చేయడానికా? లేక, ప్రజలు–నిజాం కలిసి భారతదేశంలో విలీనం కావడానికా? నిజాం ఎందుకు లొంగిపోయాడు?... ఇలాంటి విచిత్ర ప్రశ్నలకు తావిస్తున్నారు ప్రస్తుత రాష్ట్ర పాలకులు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన 15 ఆగస్టు 1947 నాడే హైదరాబాదు సంస్థానాన్ని నిజాం భారతదేశంలో విలీనం చేస్తే అసలు సమస్యలే ఉండకపోయేది. ఆనాడు విలీనం కాలేదు కాబట్టే ఆ పదాన్ని ఇప్పుడు ఉపయోగించలేము. నిజాం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదు సంస్థానం స్వతంత్ర దేశం అని, తాను రాజునని ప్రకటించుకొని భారతదేశాన్ని ధిక్కరించడమే గాక, 29 నవంబర్ 1947 నాడు చేసుకున్న స్టాండ్ స్టిల్ ఒప్పందానికి భిన్నంగా భారత కరెన్సీని హైదరాబాదు సంస్థానంలో రద్దు చేయడం, పాకిస్థానుకు 20 కోట్లు ఇస్తామని అంగీకరించడం, భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడం, పాకిస్థాన్ తనను గుర్తించింది కాబట్టి సిడ్నీ కాటన్ అనే ఆయుధాల అక్రమ సరఫరాదారునితో ఒప్పందాలను కుదుర్చుకొని భారతదేశానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావటం వంటి చర్యలకు పాల్పడ్డాడు. అంతేగాక, హైదరాబాదు సంస్థానంలో ఉన్న మెజారిటీ ప్రజలపైన హింసను ప్రజ్వలింపచేసాడు. లక్షలాది రజాకార్ల సైన్యంతో ఖాసిం రజ్వీ నిజాముకు తోడై నరకాన్ని సృష్టించారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17 నాడు యుద్ధానికి ముహూర్తం పెట్టారు. హైదరాబాదు సంస్థాన ప్రజలకు విముక్తి లభించింది.
మిలిటరీ గవర్నర్ పాలన మొదలైన వెంటనే విలీనం తదితర అంశాల సంబంధించి ఇతర రాష్ట్రాల మాదిరిగా వ్యవహరించేందుకు అవకాశం కలిగించాలని నిజాం ఒక ఆదేశం జారీ చేశాడు. 1949 నవంబర్ 23న భారత రాజ్యాంగ సభ తయారు చేసిన రాజ్యాంగం హైదరాబాదు సంస్థానానికి కూడా వర్తిస్తుందని నిజాం ఒక ఫర్మానా జారీ చేసాడు. ఆ విధంగానే వర్తిస్తుందని ఒకరోజు మొదలు నిర్ణయం తీసుకొని 1950 జనవరి 26న నిజామును రాజ ప్రముఖ్‌గా నియమించారు. విలీన ప్రక్రియ అప్పుడే ముగిసింది అని ఒక వాదన.
చరిత్ర పాలకుల చేతిలో మైనపు ముద్ద అవుతుంది, దానితో ఇష్టం వచ్చిన రూపాన్ని తయారు చేస్తారు. అదే చరిత్ర అని ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తారు. జనం కూడా చరిత్రకారుల భ్రమలో పడిపోతారు. వాస్తవ చరిత్ర చెప్పినా వారు నమ్మరు. కాలానికి కనికరం లేదు, అది దేనికోసం ఆగదు కాబట్టే అవకాశం వచ్చినప్పుడు చరిత్రను సరిదిద్దటానికి ఉద్యమాలు అనివార్యం అవుతాయి.
దేశ స్వాతంత్ర్య ఉద్యమం అప్పుడు పుట్టనేపుట్టని బీజేపీ ఎందుకు విమోచన ఉద్యమాన్ని చేపట్టిందని, ఆ హక్కు వారికి లేదని కొందరు వాదిస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పుట్టనివారికి ఇప్పుడు జెండా వందనం చేసే హక్కు లేదని అనలేము. అందుకే చరిత్రను తిరగరాయడానికి అన్ని హక్కులతో హోంశాఖా మాత్యులు అమిత్ షా సెప్టెంబర్ 17 నాడు సికింద్రాబాదులోని పరేడు గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించబడుతున్న తెలంగాణా విమోచన ఉత్సవంలో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఇప్పుడైనా కొందరి అనుమానాలు నివృత్తి అవుతాయి.
నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో రాత్రింబవళ్ళు నిరంతరంగా శ్రమించిన ఎంతోమంది అజ్ఞాత వీరులు ఈ సమాజాన్ని రక్షించారు. ఒక ఉదాహరణ వందేమాతరం రామచందర్ రావు. వీరి అసలు పేరు వావిలాల రాంచందర్ రావు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలుకు పోయిన రోజు వందేమాతరం నినాదంతో దద్దరిల్లజేశాడు. క్రూరులైన అధికారులు కొరడా దెబ్బల శిక్షను విదిస్తే ప్రతిదెబ్బకు వందేమాతరం అని నినదించాడు. అప్పటినుండి ఆయన వందేమాతరం రామచందర్ రావుగా పిలవబడుతారని వీరసావర్కర్ మహారాష్ట్రలోని పండరిపూర్‌లో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అతిరథ మహారథులను ఓడించాడు. ఓడినవారి పేర్లు చిరస్థాయిగా చరిత్రలో నిలిచాయి కాని, ఆయన పేరిట ఏ కాలేజి గాని, ప్రాజెక్టు గాని లేదు.
నారాయణరావు పవార్ కొందరికే తెలుసు. ఆర్యసమాజ్‌లో పని చేశారు. నిరంకుశ నిజాం పాలనను అంతమొందించడానికి ఆయన పైన జగదీశ్ ఆర్య, గండయ్యలతో కలిసి బాంబు దాడి చేశాడు. అది గురి తప్పింది ఆయనను పట్టుకొని నిజాం పోలీసులు విచక్షణా రహితంగా హింసించి కేసు పెడితే మరణ శిక్ష విధించబడింది. విమోచన తరువాత విడుదల అయ్యాడు. ఒక భగత్ సింగ్ లాంటి వీరుని చరిత్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల మటుమాయమయింది.
గుండె నుంచి శరీరం వేరుగా ఉండడానికి వీలు లేదని, భారత్ లాంటి శరీరంలో, గుండె లాంటి హైదరాబాదు విలీనం కావాలని నినదించిన ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ను 1948 ఆగస్టు 21 నాడు దారుణంగా హత్యచేశారు రజాకార్లు. టాంకుబండుపైన ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని విమోచన ఉద్యమ సందర్భంగా బీజేపీ డిమాండు చేసినా ఎవరికీ పట్టకపోవడం ఎంత దారుణమో ఆజాది కా అమృతోత్సవం సందర్భంగా అందరూ ఆలోచించాలి. పైన పేర్కొన్న ముగ్గురే కాకుండా ఎంతోమంది అజ్ఞాత వీరులు కనుమరుగైపోకుండా చూడాలి.
ఆత్మగౌరవాన్ని ఎవరు రూపుమాపలేరు. ఈ సందర్భంగా పోలాండ్ దేశ చరిత్రలోని ఒక సంఘటనను మనం మననం చేసుకోవాలి. 1614లో రష్యన్లు పోలాండ్‌లోని వార్సా నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు, వారు అక్కడి ప్రధాన కూడలిలో ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కేతాడ్రల్‌ను నిర్మించారు. ఆ తరువాత అక్కడి ప్రజలు ఈ కేతాడ్రల్‌ను కుల్చివేసారు. తాము ప్రార్థనలు చేసుకుంటున్న చర్చినే కూల్చుకుంటారా! అని ఆశ్చర్యపోవచ్చు. కానీ రష్యన్లు చర్చి నిర్మాణం చేసినా అది మతపరమైన కారణాలతో కాదని, కేవలం సంతుష్టీకరణతో తమను మభ్యపెట్టడానికి అని పోలండ్ ప్రజలు భావించారు. అందుకే ఆత్మగౌరం కట్టలు తెంచుకొని చర్చి కూల్చివేతకు దారితీసింది. ఇప్పుడు మనం దేన్నీ కూల్చేది గానీ, కాల్చేది గానీ లేకున్నా పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చరిత్రను భావితరాలకు అందించాల్సిన గురుతరమైన బాధ్యత మనపైన ఉన్నది.
చెన్నమనేని విద్యాసాగరరావు
మహారాష్ట్ర మాజీ గవర్నర్