దారి తప్పిన దర్యాప్తు సంస్థలు

ABN , First Publish Date - 2023-03-08T01:12:38+05:30 IST

నేరదర్యాప్తు సంస్థలు తమ విధి నిర్వహణను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తున్నాయా? రాజకీయ అభిమాన దురభిమానాలు లేని వారు సైతం అవి అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా...

దారి తప్పిన దర్యాప్తు సంస్థలు

నేరదర్యాప్తు సంస్థలు తమ విధి నిర్వహణను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తున్నాయా? రాజకీయ అభిమాన దురభిమానాలు లేని వారు సైతం అవి అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని గట్టిగా అభిప్రాయపడుతున్నారు. నిజానికి శక్తిమంతమైన నేర దర్యాప్తు సంస్థలను పాలకులు దుర్వినియోగం చేయడమనేది ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభం కాలేదు. అయితే మూకుమ్మడి స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం మాత్రం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సిబిఐ మాత్రమే వాటి ‘అస్త్రం’గా ఉండేది. అయితే ఇప్పుడు దానికి ఈడీ, ఐటీ విభాగాలు కూడా తోడయ్యాయి. కేంద్రం ఉస్కో అనగానే ఇవి పరిగెత్తుకుంటూ దాడులకు వస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఒకప్పుడు కార్పొరేట్ రంగం మాత్రమే ఈ నేర దర్యాప్తు సంస్థలకు లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాలకులు తమ సైద్ధాంతిక వ్యతిరేకులు అయిన ప్రతి ఒక్కరిపై నేర దర్యాప్తు సంస్థలను ఏదో ఒక రీతిలో ప్రయోగిస్తున్నారు. ఇదొక విపరీత పరిణామం. ఈ కారణంగానే నేర దర్యాప్తు సంస్థల తీరుతెన్నుల వలన క్రమేణా ఆందోళన పెరుగుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ చట్ట సభల్లో రాజకీయ పక్షాల అధిక్యత ఆధారంగా నడుస్తుంది. మరి రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి నేర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరైన విషయం కాదు. కనుకనే దర్యాప్తు సంస్థల ప్రస్తుత తీరుతెన్నులను కొన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.

నేర దర్యాప్తు పారదర్శకంగా జరిగినప్పడే దానికి సార్ధకత ఉంటుంది, దర్యాప్తు సంస్థలకు గౌరవం ఉంటుంది, ఎప్పుడయితే పారదర్శకత లోపించి కక్షపూరితంగా భయభ్రాంతులకు గురిచేసే దిశగా దర్యాప్తు జరుగుతుందో దాని ఉద్దేశం నీరుగారుతుంది. లోప భూయిష్టమైన దర్యాప్తు పూర్తయి చట్టం తన పని తాను పూర్తిచేసే లోపే ప్రసారమాధ్యమాలు తమ పని పూర్తిచేస్తాయి! అంటే బురద చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తాము మోపుతున్న అభియోగాలు న్యాయస్థానాల పరిశీలనలో నిలువ లేవని తెలిసి దర్యాప్తు సంస్థలు వ్యూహాత్మక సమాచారాలతో మీడియా ద్వారా శిక్షిస్తాయని చెప్పవచ్చు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలో ఆర్థిక నేరాల దర్యాప్తు విషయంలో అత్యున్నతస్థాయి సంస్థ. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌తో సహా పానిపూరి తిని పేటియం ద్వారా చేసిన చెల్లింపు వరకు సమగ్రంగా దర్యాప్తు చేసే విధానం దాని సొంతం. మనీ లాండరింగ్ అనే ఏకైక ఆరోపణపై ఈ సంస్థ చేసే దర్యాప్తు శిక్ష కంటే కూడా కఠినాతి కఠినం. కొన్ని సార్లు ఇది చేసే దర్యాప్తు తీరు హాస్యాస్పదంగా ఉంటుంది.

భారతదేశ చరిత్రలోనే భారీగా పన్ను ఎగవేతకు పాల్పడిన వ్యక్తిగా హైదరాబాద్ నగరానికి చెందిన హసన్ అలీ ఖాన్‌ను ఆదాయపన్ను శాఖ తప్పుగా చిత్రీకరించింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈడీ కేసు నమోదు చేసింది. దుబాయిలో ఒక హోటల్‌లో పెట్టుబడితో పాటు స్విజర్లాండ్‌లోని బ్యాంకులలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లుగా అతనిపై 2007లో ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ లో సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి నిజాం నవాబుకు చెందిన ఖరీదయిన వజ్రాలను, ఇతర సామగ్రిని దొంగలించి విక్రయించిన సొమ్ముతో విదేశాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా హసన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. వాస్తవానికి సాలార్ జంగ్ మ్యూజియంలో ఎలాంటి దొంగతనం జరుగలేదని విచారణలో తేలింది, పైగా మ్యూజియంలో వజ్రాలు వగైరా ఏమీ లేవు. అసలు నిజాం నవాబులకు సంబంధించి ఎలాంటి వస్తువులు ఆ మ్యూజియంలో లేవు. నిజాం నవాబులు వేరు, సాలార్ జంగ్ వేరు.

పూణేలోని హసన్ అలీ ఖాన్ నివాసంలో లభించిన ఒక పత్రం ఆధారంగా అతని ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొన్నది. ఆ తర్వాత అప్పీలేట్ ట్రిబ్యునల్ అతని ఆదాయం పది కోట్ల రూపాయలు మాత్రమే అని తేల్చింది. తమకు లభించిన పత్రం నకిలీదని కూడ ఆదాయపు పన్ను శాఖ అంగీకరించింది. తప్పుడు 1 లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఆధారంగా విచారించిన ఈడీ మాత్రం చార్జిషీట్ సమర్పించడానికి పదకొండు సంవత్సరాలు తీసుకొంది! ఈ కేసులో నేరం రుజువయితే ముద్దాయికి పడే శిక్ష మూడేళ్లు మాత్రమే. అయితే హసన్ అలీ ఖాన్ పదకొండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి చివరకు ఇటీవల జైలులో కన్నుమూసాడు. శిక్షకంటే విచారణ సందర్భంగా అనుభవించిన మానసిక క్షోభను ఇక్కడ ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది.

ప్రతిష్ఠాత్మక వ్యాపార, మీడియా సంస్థలు నేర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవినీతి సొమ్ములో భాగస్వామ్యం ఉండే రాజకీయ నాయకులు సహజంగా జడుస్తారు. దర్యాప్తు సంస్థలేమో అస్మదీయుల అక్రమాలపై కళ్ళు మూసుకుని తస్మదీయులను మాత్రమే వేటాడుతున్నాయి. ఇదే అసలు విషాదం. అందుకే నేర దర్యాప్తు సంస్థల తీరుతెన్నుల పట్ల ఆక్రోశం, ఆందోళన.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-03-08T01:12:44+05:30 IST