నాటి ఔదార్యం నేటి పాలనలో సాధ్యమా?

ABN , First Publish Date - 2023-09-08T00:55:21+05:30 IST

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక పోగా ఉన్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించుతున్నారు...

నాటి ఔదార్యం నేటి పాలనలో సాధ్యమా?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక పోగా ఉన్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించుతున్నారు. స్థానిక నేతలకు కప్పం చెల్లించలేక కొందరు, ఉన్నతస్థానాల్లో ఉన్నవారికి భాగస్వామ్యం ఇవ్వలేక మరికొందరు పక్క రాష్ట్రాల బాట పడుతున్నారు. ఇక, రాజకీయ వేధింపులతో ఉన్న పరిశ్రమలు ఊడ్చుకుపోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్ ఇటీవల మాట్లాడుతూ అమర రాజా బ్యాటరీస్ సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణకు పోయిందని, తమ వేధింపుల వలన కాదని మాట్లాడారు.

రాష్ట్రంలో పలు పరిశ్రమలు ఉన్నా, వాటిలోని కీలకమైన విభాగాల్లో రాష్ట్రేతరులు ఎక్కువగా ఉంటారు. కాని అమర రాజా బ్యాటరీస్ సంస్థ ఇందుకు భిన్నం. సాంకేతిక నిపుణులు అవసరమైనా సంస్థ అధిపతి గల్లా రామచంద్రనాయుడు జిల్లా వాసులకే శిక్షణ ఇచ్చి స్థానికులకు ఉపాధి కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర రాజా బ్యాటరీస్ సంస్థ అంశంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కొన్ని వందల మంది చిత్తూరు జిల్లాలో ఉపాధి కోల్పోయారు. అమర రాజా కన్నా జిల్లాలో నిరుద్యోగ యువతే భారీగా నష్టపోయింది.

ఒకసారి గతంలోకి వెళ్దాం. అమర రాజా బ్యాటరీస్ సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు సతీమణి అరుణకుమారి కాంగ్రెస్ పార్టీతో రాజకీయం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా చేసి, ఆ పార్టీలో క్రియాశీలంగా ఉన్న రోజులవి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన సంస్థ అని చూడకుండా జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను ఆమోదించి ఆమర రాజా పరిశ్రమ విస్తరణకు భూమి కేటాయించారు. అలాంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేడు సాధ్యమని మంత్రి అమర్‌నాథ్ చెప్పగలరా?

చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అరుణ కుమారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. టీడీపీ అభ్యర్థి ఓటమి చెందారు. తొలి నుంచి కూడా ఈ కుటుంబం మూలాలు కాంగ్రెస్‌తో ముడిపడి ఉన్నవే. అరుణ కుమారి తండ్రి, ప్రముఖ స్వాతంత్య్ర యోధులు, కాంగ్రెస్ నేత స్వర్గీయ పి. రాజగోపాలనాయుడు ప్రేరణతోనే అమర రాజా సంస్థ అవతరించింది. అదికూడా ఏదో పట్టణ ప్రాంతాల్లో కాకుండా స్వంత జిల్లాలో కొండలు గుట్టల్లో తొలుత సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో కాకుండా అటవీ ప్రాంతంలో ఒక మారుమూలన అది ఏర్పడింది. తిరుపతి సమీపం కరకంబాడి ఫ్యాక్టరీ మెయిన్ గేటు నుంచి చివర సరిహద్దుకు వంద అడుగులకు పైగా ఎత్తు వుంటుంది. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న కాలంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు కీలకపాత్ర వహించడం అందరికీ తెలుసు. చంద్రబాబు స్వంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అరుణకుమారి వుంటే రాజకీయ వైరం ఎలా ఉండివుంటుందో ఎవరైనా ఊహించగలరు. 1994 ఎన్నికల్లో అరుణకుమారి ఓడిపోతే, చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1999 ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓడి, అరుణ కుమారి గెలుపొందారు. ఇదీ ఆనాటి రాజకీయ నేపథ్యం. ఈ పరిస్థితుల్లో సహజంగానే రెండు కుటుంబాల మధ్య వైరం తారా స్థాయిలో ఉంటుంది. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. స్థానిక రాజకీయాల్లో రామ్మూర్తి నాయుడు అరుణకుమారి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా ఉండేది. ఈ పరిస్థితుల్లో అమర రాజా సంస్థల భవిష్యత్తు గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరిగేటివి. కాని చంద్రబాబు నాయుడు ఏనాడూ ముఖ్యమంత్రిగా వాటి విషయంలో జోక్యం చేసుకోలేదు.


ఈ పూర్వ రంగంలోనే, అమర రాజా బ్యాటరీస్ సంస్థకు కరకంబాడి వద్ద గల ఫ్యాక్టరీ విస్తరణకు ప్రభుత్వ భూమిని చంద్రబాబు నాయుడు 1995– 99 మధ్య కాలంలో మంజూరు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంజూరు చేసిన భూమిని కూడా వివిధ సాకులతో వెనక్కి తీసుకున్న నేటి వైసీపీ పాలనలో ఇలాంటి సంఘటన సాధ్యమా? రాజకీయాలు పక్కన బెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు ఎక్కువగా రావాలని, ఉపాధి పెరగాలన్న అంశానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చినందున, కేవలం జిల్లా కలెక్టర్ నివేదికతో ఇది సాధ్యమైంది. ఈ వ్యవహారంలో ఆనాడు జిల్లాకు కలెక్టరుగా ఉండి నిజాయితీ పరుడుగా పేరుపొందిన ఐఎఎస్‌ అధికారి నరసింగరావు కీలక పాత్ర పోషించారు. నేడు పాలకుల అడుగులకు మడుగులొత్తే ఐఎఎస్‌ అధికారులు ఈ సంఘటనతో తలదించుకోవలసి వుంటుంది. ఈ రోజు ఏ అధికారి అయినా సాహసం చేసి పరిశ్రమల విస్తరణకు, అదీ పాలకపక్ష వ్యతిరేక పార్టీ నేతకు చెందిన సంస్థకు, ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపగలరా? ఆనాడు ఇది సాధ్యమైంది. అదేమీ రహస్యంగా కూడా జరగలేదు. అమర రాజా బ్యాటరీస్ సంస్థ పత్రికా ప్రతి నిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందులో నేను రిపోర్టరుగా పాల్గొన్నాను. జిల్లా కలెక్టర్ నరసింగరావుతో పాటు పత్రికల వారికి ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీ ఆవరణను చూపెట్టి దాని విస్తరణకు కావలసిన భూమి గురించి గల్లా రామచంద్ర నాయుడు ఆ సమావేశంలో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. కొంతకాలం తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతికేస్తున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ప్రతిపాదనను చంద్రబాబు ఆమోదించరనే ప్రచారం సైతం ఊపందుకొన్నది. రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు.

ఒకరోజు ఏదో సమాచారం కోసం జిల్లా కలెక్టర్ నరసింగరావును కలిసిన సందర్భంలో ఈ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఆయన చెప్పిన సమాచారం విని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అమర రాజా బ్యాటరీస్ సంస్థకు ప్రభుత్వ భూమి మంజూరు అయిందని, తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే వాస్తవ పరిస్థితి చెప్పానని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ‘నీ మీద ఉన్న నమ్మకంతో’ భూమి కేటాయింపు చేసినట్లు చంద్రబాబు తనతో చెప్పినట్టు కూడా కలెక్టర్ నరసింగరావు అన్నారు. ఆ రోజు నాలో పెద్దగా స్పందన లేదు కాని, ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల అవి ప్రత్యర్థి పార్టీకి చెందినవనే కారణంతో వేధింపులకు పాల్పడటం, ఈ అంశంలో ప్రభుత్వానికి సాగిలబడుతున్న నేటి ఐఎఎస్‌ అధికారుల తీరూ చూసి నివ్వెరపోవలసివస్తోంది.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-09-08T00:55:21+05:30 IST