మోదీ మ్యాజిక్ సరిపోతుందా?
ABN , First Publish Date - 2023-01-18T23:40:30+05:30 IST
నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారా? ఉపాధి కల్పన, దారిద్ర్య నిర్మూలన, అభివృద్ధి, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామిక నిర్ణయాలు...
నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారా? ఉపాధి కల్పన, దారిద్ర్య నిర్మూలన, అభివృద్ధి, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామిక నిర్ణయాలు, అవినీతి నిర్మూలన, వ్యవస్థలు సమర్థంగా పనిచేయడం... ఇలాంటి అనేక రంగాల్లో పూర్తి సంతృప్తీకరణ సాధించామా? భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడల్లా పార్టీ కొత్త నినాదం కోసం వెతుకుతుంటుంది. ఆ కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో దేశంలో పాలన, రాజకీయాలు పూర్తి సంతృప్తి కలిగించే దశకు చేరుకున్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక తీర్మానంలో ప్రశంసించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన తాను ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు దేవేంద్ర ఫడణవీస్ పూర్తి సంతృప్తికరంగా ఉన్నారేమో కాని దేశంలో నిజంగా ప్రజలు ఏఏ విషయాల్లో మోదీ పాలన పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారో చెప్పాలంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది.
ఏ ప్రభుత్వమైనా తాను చేసిన ఘనకార్యాలను చెప్పుకుంటుంది. ఇన్ని కోట్ల మందికి ధాన్యం సరఫరా చేశాం, ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ అయింది, ఇన్ని ఇళ్లు నిర్మించాం అని ప్రకటనలు చేస్తుంది. ప్రభుత్వ ప్రకటనలే పార్టీ ప్రచారం చేసుకుంటుంది కాని ఎంతమేరకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారో చెప్పేందుకు వారి వద్ద కొలమానాలు లేవు. ఈ దేశంలో ఎంతమంది ఉపాధి లేక రోడ్లపై తిరుగుతున్నారో, ఎంతమంది ఉపాధి కోల్పోయారో, ఎంతమంది పేదరికంలో ఇంకా చిక్కుకున్నారో పరిశీలిస్తే ఎంతమంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో అర్థమవుతుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వంటి సంస్థలు భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకూ ఎలా పెరిగిపోతున్నదో ఇప్పటికే గణాంక వివరాలు విడుదల చేశాయి. ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున పంపిణీ చేసినందువల్లే భారతదేశంలో తీవ్ర పేదరికం కొంత శాతం మేరకు తగ్గిందని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థలు చెప్పాయి. తాజాగా ‘ప్రధానమంత్రి గరీబ్ అన్న కల్యాణ్ యోజన’ను నిలిపి వేసినట్లు వార్తలు వస్తున్నాయి. పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ నిలిపివేసిన తర్వాత మాత్రమే దేశంలో పేదరికం ఏ స్థాయికి చేరుకుంటుందో ఒక అంచనా ఏర్పడుతుంది. అసలు దేశంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఉపాధి కల్పన కల్పించగలిగితే జనాభాలో 60 శాతం మందికిపైగా ఉచితంగా ధాన్యాలు పంపిణీ చేయవలిసిన అగత్యం ఎందుకుంటుంది? ఈ దేశంలో పేదరికం స్థాయి ఆదివాసీలు, దళితులు, ఓబీసీల్లో అత్యధికంగా ఉన్నదని యుఎన్‌డిపి ప్రచురించిన గ్లోబల్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకటించింది. అటువంటప్పుడు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు ఒక రాజకీయ పార్టీ ఎలా చెప్పుకోగలుగుతుంది? భారత ప్రజలు ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అనారోగ్యంతో కునారిల్లుతుంటే, కనీస సౌకర్యాలు లేకుండా పేదలు మగ్గుతుంటే వందలకోట్లు ఆర్జించిన గుప్పెడు మంది మాత్రమే అత్యంత విలాసంగా జీవిస్తున్నారు. దేశంలోని 50 శాతం జనాభా చేతుల్లో 3 శాతం సంపద మాత్రమే ఉంటే 60 శాతం సంపద కేవలం 5 శాతం అనుభవిస్తున్నారు అని ‘ఆక్స్‌ఫామ్ ఇండియా’ తాజా నివేదిక తెలిపింది. మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా దేశంలో అయిదు శాతంగా ఉన్న అదానీ, అంబానీ తదితర కుబేరులనే పూర్తిగా సంతృప్తి పరిచారా? అన్న ప్రశ్నకు ఈ నివేదిక ఆస్కారం కలిగిస్తోంది.
పేదరికం, ఉపాధి కల్పనల విషయంలో మాత్రమే కాదు, అవినీతి నిర్మూలన, ఆర్థిక నేరస్థులను శిక్షించడం, వ్యవస్థలు సరిగా పనిచేసేలా చేయడం, సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం విషయంలో కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు సంతృప్తి కలిగించేలా పనిచేసిందా? అన్న విషయాలు కూడా చర్చనీయాంశం కావాల్సి ఉన్నది. పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు దాఖలయ్యాయి. సిబిఐ డైరెక్టర్ కూడా బోనులో నిలుచోవాల్సివచ్చింది. యూపీఏ హయాంలో డిఎంకె, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఆర్‌జెడి, జెఎంఎం, కాంగ్రెస్ నేతలు కూడా కేసుల ఉచ్చులో చిక్కుకున్నారు, కొందరు జైళ్ల పాలయ్యారు కూడా. మిత్రపక్షాలు, స్వపక్షాలని చూడకుండా వారు అస్మదీయులను సైతం జైలుకు పంపిన తార్కాణాలు ఉన్నాయి. వారు బహిర్గతం చేసుకున్న కుంభకోణాలనే బిజెపి ఉపయోగించుకుని బిజెపి అధికారంలోకి వచ్చింది. నాడు కనుక ఒక్క కుంభకోణం కూడా బయటకు రాకుండా అన్ని వ్యవస్థల్నీ ఇప్పటిలా అష్టదిగ్బంధనం చేసి ఉంటే, కాగ్ లాంటి సంస్థల నోరు నొక్కి ఉంటే, తమ విజయాలను గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసుకుని ఉంటే బిజెపికి రాజకీయ ప్రయోజనం కలిగేదా? అప్పుడు రాజకీయాలకోసం వ్యవస్థల్ని ఉపయోగించుకోలేదని చెప్పలేము కాని మోదీ హయాంలో గతంలో కంటే పచ్చిగా వ్యవస్థల్ని ఉపయోగించుకోవడాన్ని, కేవలం ప్రత్యర్థులపైనే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న తీరును కాదనలేము. అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డి విషయంలో 12 ఏళ్లుగా సిబిఐ కోర్టు ముందు విచారణ కొనసాగడం న్యాయాన్ని అపహాస్యంపాలు చేయడమేనని సుప్రీంకోర్టు ఆరునెలల క్రితం వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ దేశంలో వ్యవస్థలు ఎంత సంతృప్తికరంగా పనిచేస్తున్నాయో చెప్పవచ్చు.
అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు నుంచి తీవ్ర మందలింపులకు, నిరసనలకు గురవుతూనే మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సర్టిఫికెట్ల ద్వారా తమ స్వచ్ఛతను నిరూపించుకోవాలని ఆరాటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను వివరించిన నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాలు పెగాసస్ స్పైవేర్, రాఫెల్, పెద్ద నోట్ల రద్దు, ఈడీ తదితర విషయాల్లో ప్రధానమంత్రిపై దుష్ప్రచారం చేశాయని, అయితే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నిర్దోషిగా ప్రకటించిందని అన్నారు. నిజానికి పెగాసస్ స్పైవేర్ విషయంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందా? ఈ స్పైవేర్ ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, విమర్శకులు, కేంద్రమంత్రులు తదితరులపై ప్రయోగించామో లేదో జాతీయ భద్రతా కారణాల వల్ల చెప్పలేమని కేంద్ర హోంశాఖ మాటిమాటికీ తప్పించుకుంది. అసలు దర్యాప్తులో ప్రభుత్వం ఏ మాత్రం పాలుపంచుకోలేదు. అంతేకాదు, తమకు ప్రభుత్వం పూర్తిగా సహకరించలేదని నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానం విషయంలో కాగ్ నివేదికను పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పంచుకోలేదు. యుద్ధ విమానాల ధర, విమానాల సంఖ్య తగ్గింపు, అనిల్ అంబానీ భాగస్వామి అయిన తీరు, నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలను పూర్తిగా విస్మరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చట్ట వ్యతిరేకం ఏమీ కాదని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో ప్రకటించింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న తీరును కానీ, దాని పర్యవసానాలను కానీ, ప్రభుత్వం అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడాన్ని కానీ విస్మరించింది. రిజర్వు బ్యాంకు ఈ విషయంలో తన వివేకాన్ని ఏ మాత్రం ప్రదర్శించలేదని, తన అభ్యంతరాల విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిందని, కేవలం 24 గంటల్లో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న ఇచ్చిన అసంతృప్తి తీర్పును కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించిందో లేదో చెప్పవచ్చు. ఈడీని ప్రత్యర్థులపై ఎడాపెడా ప్రయోగించడాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడూ సమర్థించలేదు. మనీలాండరింగ్ చట్టాన్ని సమర్థిస్తూ తానిచ్చిన తీర్పునే సమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అంతేకాదు, ఈడీ లాంటి సంస్థలు ప్రవేశించినప్పుడల్లా కేసుల విచారణ ఆలస్యమవుతుందని ఇటీవలే జస్టిస్ షా వ్యాఖ్యానించిన విషయం మరిచిపోరాదు. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తమకు క్లీన్ చిట్ ఇచ్చాయని సంబరపడిపోతూ బిజెపి రాజకీయ తీర్మానంలో చేర్చుకోవడం హాస్యాస్పదం. నిజానికి ముగిసిపోయిన అంశాలపై మళ్లీ చర్చ జరగడానికి నిర్మలా సీతారామన్ అవకాశం కల్పించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానాలైనా, సామాజిక ఆర్థిక తీర్మానాలైనా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రసంగం అయినా, మరే నేత ప్రసంగం అయినా సారాంశం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కీర్తించడమే అన్న విషయం స్పష్టమవుతోంది. మోదీయే అయోధ్యలో గుడి కట్టించారని, కాశీ కారిడార్‌ను విస్తరించారని, మోదీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘సంతృప్తికర స్థాయి’లో అమలు అవుతున్నాయని ప్రశంసించకపోతే తమకు మనుగడ ఉండదని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతీ ఆరునెలలకోసారి జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి కానీ, విదేశాంగ విధానం గురించి కానీ విశ్లేషణాత్మక చర్చలు జరిగిన దాఖలాలు ఏనాడూ కనపడవు. అన్ని నిర్ణయాలను ప్రశంసిస్తూ, ఒకే ఒక్క నాయకుడిని ఆకాశానికెత్తడమే ధ్యేయంగా, దేశంలో అందరూ సంతృప్తికరంగా ఉన్నారని ప్రకటించి వెళ్లిపోవడమే జాతీయ కార్యవర్గ సమావేశాల ఉద్దేశంగా కనిపిస్తోంది. నాయకత్వం పార్టీపై తమ పట్టు బిగించుకోవడానికి కూడా ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. బహుశా మోదీ సారథ్యంలో ‘అఖండ’ విజయాలను సాధించామని ఊదరగొడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారానే రానున్న ఎన్నికల్లో విజయం సాధించగలమని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజయాల ఆధారంగా దేశంలో అన్ని అసెంబ్లీలు గెలవాలని, లోక్‌సభ కోసం ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చినప్పటికీ అందుకు కేవలం మోదీ మ్యాజిక్ సరిపోతుందా అన్నది అనుమానమే.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)