జగమొండి... రణచండి
ABN , First Publish Date - 2023-10-17T01:32:31+05:30 IST
ఆత్మరక్షణ ఒకరిది ఆధిపత్య ప్రదర్శన మరొకరిది వైరి చండ్రనిప్పులు కురిపిస్తుంటే ఊపిరాడకుండా ఉచ్చుబిగుస్తుంటే....
ఆత్మరక్షణ ఒకరిది
ఆధిపత్య ప్రదర్శన మరొకరిది
వైరి చండ్రనిప్పులు కురిపిస్తుంటే
ఊపిరాడకుండా ఉచ్చుబిగుస్తుంటే.
అస్తిత్వం కోసం ఆరాటముండదా?
మాతృభూమి సంరక్షణకై లక్ష్యసాధనుండదా?
ఆత్మాభిమానం కట్టలు తెంచుకు కదం తొక్కదా?
అంతరాత్మ న్యాయాన్యాయాల విచక్షణెరుగదా?
మరిగే రక్తం ఉరకలేయక ఊరుకుండునా?
ప్రతిఘటించక మానుకొనునా?
మీ ఆయుధాల వర్తకంలో
బలిపీఠమెక్కేదెందరు?
మీ రాజ్య విస్తరణ కాంక్షలో
నలిగి నాశనమయ్యే వారెందరు?
యేడాది కాలంగా దాడి మీద దాడి చేస్తూ
ఆ దేశాన్ని పరుశరామ ప్రీతి చెయ్యమని
మీకు లైసెన్స్ ఇచ్చిందెవరు?
సార్వభౌమాధికార దేశ
భౌగోళిక హద్దులు చెరపడానికి
కొండచిలువై మింగడానికి.. అసలు మీరెవ్వరు?
స్వదేశంలో చుక్కెదురౌతున్నా
ప్రపంచ రాజ్యాలు వెలివేస్తున్నా
భూగోళమంతా నిరసనల హోరు ధ్వనిస్తున్నా
మీలో పరివర్తన లేదు.. పశ్చాతాపం లేదు
మీ దుశ్చర్యను... మీ దుర్నీతిని
తలవని రోజంటూ లేదు
పగటి కలల పూర్వవైభవం మీది
గొంతెమ్మ కోర్కెల అభిజాత్యం మీది
లొంగుబాటు మీకు ప్రీతి
తిరుగుబాటు వారి ఖ్యాతి
మోకరిల్లే వారంటే మీకిష్టం
ఎదురొడ్డి నిలిచేవారంటే మీకు కష్టం
యుద్ధం అనివార్యమంటే ప్రపంచానికి నష్టం
జీవరసాయనికాయుధాల బూచి చూపి
‘కాకి’ పళ్ళ లెక్క తేల్చాల్సిందేననే
మీ కుతంత్రాల వెనుకున్న నిగూఢార్థాలేమిటో
విజిగీషలేమిటో... లోకానికి తెలియదా పుతిన్?
ప్రపంచ పటంలో ఉక్రెయిన్ అంతర్థానమే
మీ ప్రభకు పునరుత్థానమా పుతిన్!
ఆత్మగౌరవపోరులో
అసువులు బాసే అమరులెందరు!?
శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం కోల్పోయే
అభాగ్యులెందరు? శరణార్థులెందరు?
అమ్ములపొదిలో ఆయుధాలు తీస్తానని
మాటిమాటికి బెదిరించకు
అణ్వస్త్రాలతో ‘గ్లోబల్’ యుద్ధానికి కాలుదువ్వకు
విశ్వజననిని వల్లకాడు చేయకు
శాంతిని, క్రాంతిని, ప్రగతిని అడ్డుకోకు
జగమెుండిగా రణచండిగా నడుచుకోకు
పుతిన్... ఓ పుతిన్!
కంచర్ల విజయభాస్కర్