RK KOTTAPALUKU: భయం నీడన జగన్‌!

ABN , First Publish Date - 2023-01-08T00:57:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా? రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయించడం చూస్తే ఈ సందేహం కలుగుతోంది...

RK KOTTAPALUKU: భయం నీడన జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా? రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయించడం చూస్తే ఈ సందేహం కలుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగి మొత్తం 11 మంది దుర్మరణం చెందడంతో దాన్ని సాకుగా తీసుకున్న ప్రభుత్వం జీవో నెంబర్‌ 1 జారీ చేసింది. చంద్రబాబు రోడ్‌షోలకు జనం పోటెత్తుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యం కూడా ఉండటంతో ప్రభుత్వ ఉద్దేశంపై సహజంగానే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో స్వేచ్ఛగా తిరగకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించడం జగన్మోహన్‌ రెడ్డి నిజస్వరూపాన్ని చెప్పకనే చెబుతోంది. కందుకూరు, గుంటూరులో రెండు విషాదాలు జరిగినంత మాత్రాన సొంత నియోజకవర్గానికి వెళ్లే హక్కును కూడా ప్రతిపక్ష నాయకుడు కోల్పోతారా? ప్రజల ప్రాణాలు కాపాడటానికే ర్యాలీలు, సభలను నిషేధించామని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వాదనలు నిజమైతే అధికార పార్టీ నాయకులు మాత్రం రోడ్డుపై ర్యాలీలు, సభలు యథేచ్ఛగా ఎలా నిర్వహించగలుగుతున్నారు? ఈ ప్రశ్నకు పోలీసుల వద్ద కూడా సమాధానం ఉండదు. రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు జరుపుకోకుండా నిషేధించే అధికారం అసలు ప్రభుత్వానికి ఉంటుందా? బ్రిటిష్‌ కాలంలో 1861లో తెచ్చిన చట్టం ప్రకారం జీవో నెం.1 జారీ చేయడం సమర్థనీయమా? సమర్థనీయమే అనుకుంటే 1861 నాటి చట్టంలోని సెక్షన్‌ 30 చెబుతున్నది ఏమిటి? ఆ సెక్షన్‌కు ప్రస్తుతం పోలీసులు ఇస్తున్న నిర్వచనం ఏమిటి? 1861 నాటి చట్టంలోని సెక్షన్‌ 30 ప్రకారం ర్యాలీలు, సభలు నిషేధించే అధికారం పోలీసులకు ఉండదు. సెక్షన్‌ 30లోని సబ్‌ సెక్షన్‌ 3 ప్రకారం ర్యాలీలు, సభలు జరుపుకోవాలనుకునేవారు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరే అధికారం మాత్రమే ఈ సెక్షన్‌ పోలీసు అధికారులకు కల్పిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ర్యాలీలు, సభలను గంపగుత్తగా నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేసే సమయంలో సంబంధిత అధికారులు సొంత బుర్ర ఉపయోగించిన దాఖలాలు లేవు. సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వం 1861లో డీఎస్పీ, ఆ పైస్థాయి అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఒక చట్టం తెచ్చింది. అప్పట్లో కిందిస్థాయి పోలీసు ఉద్యోగులలో భారతీయులే ఎక్కువగా ఉండేవారు. స్వాతంత్య్ర పోరాట ఆకాంక్షలను మొగ్గలోనే తుంచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేయడానికి విపరీత అర్థాలతో అమలు చేయాలనుకోవడం దుర్మార్గమే అవుతుంది. ముఖ్యమంత్రి ఏదనుకుంటే అది జీవో రూపంలో జారీ చేయడానికి అధికారులు పోటీపడటం వింతగా ఉంది. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుందాం. తాను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానని, ఎవరికైనా చెప్పి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయించాలని కూచిపూడి నాట్య ప్రముఖుడు నటరాజ రామకృష్ణ అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డిని కోరారు. ఎవరికి చెప్పాలి? అని సంజీవరెడ్డి ప్రశ్నించగా అప్పట్లో నిర్మాణదశలో ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీరుకు చెప్పండని రామకృష్ణ సూచించారు. డబ్బు సహాయం చేయమని ప్రభుత్వ అధికారులకు తాను చెప్పలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలా అయితే ప్రాజెక్టు వద్ద తమ బృందంతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటానని, టికెట్లు అమ్మించి పెట్టమని చీఫ్‌ ఇంజనీర్‌కు సూచించడంతో పాటు సదరు నృత్య ప్రదర్శనకు హాజరు కావాల్సిందిగా నీలం సంజీవరెడ్డిని రామకృష్ణ కోరడం, ఆయన అంగీకరించడం జరిగింది. అయితే అప్పట్లోనే 5, 10 రూపాయలుగా టికెట్ల ధరలను నిర్ణయించడంతో వాటిని ఉద్యోగులకు అంటగట్టలేక చీఫ్‌ ఇంజనీర్‌ తలపట్టుకోగా, కాంట్రాక్టర్లు చొరవ తీసుకుని కష్టనష్టాలకోర్చి తలా ఒక చేయి వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ప్రాజెక్టు వద్ద పనిచేసిన ఒక విశ్రాంత అధికారి నాకు లేఖ ద్వారా తెలియజేశారు. ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వ్యక్తిత్వానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడదే రాయలసీమకు చెందిన జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నది ఏమిటి? ఫక్తు పాలెగాడి వలే పాలన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టేవారిపైనా, ప్రశ్నించే వారిపైనా కక్ష గడుతున్నారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థను కూడా ఉపేక్షించడంలేదు. నిబంధనలను అతిక్రమించడం వల్ల న్యాయస్థానం మెట్లు ఎక్కుతూ చివాట్లు తింటున్న అధికారులు కూడా ఆదిలోనే అభ్యంతరం పెట్టకుండా ముఖ్యమంత్రికి ఊడిగం చేయడంలోనే అలౌకికానందాన్ని పొందుతున్నారు. జీవో నెంబరు 1 జారీ చేసిన అధికారులు కూడా ఈ కోవలోకే వస్తారు.

ర్యాలీలు, సభలు మాత్రమే కాకుండా ఎక్కడ జనసమూహాలు గుమిగూడినా భద్రతా ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు కూడా భద్రతా ఏర్పాట్లు చేసే పోలీసులు ప్రతిపక్ష నాయకుల ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేయకపోవడం ఆక్షేపణీయం కాదా? గుంటూరులో ఈ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ర్యాలీలకు, సభలకు భద్రత కల్పించడం లేదా? అన్న సందేహం కూడా కలుగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమాలకు వేల మంది పోలీసులను నియమించే అధికారులు ప్రతిపక్ష నాయకుడి సభకు కనీస భద్రత కల్పించలేరా? జగన్మోహన్‌ రెడ్డి సైకాలజీని పరిశీలిస్తే కందుకూరు, గుంటూరు దుర్ఘటనల వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. జనం భారీగా గుమిగూడినప్పుడు తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకొని తొక్కిసలాటకు వ్యూహ రచన చేసి ఉండవచ్చు కదా? చంద్రబాబు సభలకు, ర్యాలీలకు జనం పెద్దగా రావడంలేదని, అయినా జనం వచ్చారని చెప్పుకోవడానికి ఇరుకు సందులలో సభలు పెట్టుకుంటున్నారని జగన్‌ అండ్‌ కో వాదిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా! తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించి ఉంటే సరిపోయేది కదా! అలా చేయకుండా ఏకంగా జీవో నెం.1 జారీ చేశారంటే ప్రభుత్వం ఎవరికో, ఎక్కడో భయపడుతోందని భావించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డితో పాటు ఆయన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేశారు. ఈ రెండు సందర్భాలలోనూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అప్పుడు పాదయాత్రలకు ఆయన ఎటువంటి ఆటంకాలూ సృష్టించలేదు. అవసరమైన మేరకు భద్రత కల్పించారు. దరఖాస్తు చేసుకుంటే పాదయాత్రకు, సభలకు అనుమతిస్తామని పోలీసులు కోరినా జగన్మోహన్‌ రెడ్డి ఖాతరు కూడా చేయలేదు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ కూడా ఇవే ఇరుకు రోడ్లపై సభలు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలలో దురదృష్టకర సంఘటనలు జరగడం అసాధారణం ఏమీ కాదు. అంతమాత్రాన సభలు, ర్యాలీలను ఏ ప్రభుత్వం కూడా నిషేధించలేదు. దేశంలో 29 రాష్ర్టాలు ఉండగా ఒక్క జగన్‌ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలోనే ఈ జీవో జారీ కావడం గమనార్హం. ఇంగితం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా గుంటూరు, కందుకూరు సంఘటనల తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పార్టీలపరంగా, ప్రభుత్వపరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించి ఉండేవారు. ప్రతిపక్షాలతో చర్చించడం ఏమిటి నాన్సెన్స్‌ అని జగన్మోహన్‌ రెడ్డి అనుకున్నట్టున్నారు. అంతే.. తన ఫ్యాక్షన్‌ బుర్రకు పదునుపెట్టి చంద్రబాబు జనాన్ని కలుసుకోకుండా కట్టడి చేస్తే పోలా! అని జీవో జారీ చేయించినట్టున్నారు. కనీస వెరపు ఉండే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేరు. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయడాన్ని వివేకం ఉన్న వారందరూ సమర్థిస్తున్నారని సలహాదారుడిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు గానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వివేకం, విజ్ఞత ఉన్నవారు ఎవరూ ఈ దుష్ట చర్యలను సమర్థించడం లేదు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ర్టాలలో కూడా ఆయన పాదయాత్ర జరిపారు. ఎక్కడా ఎవరూ అడ్డుకోలేదే! రాహుల్‌ గాంధీ పాదయాత్రలో కూడా జనం విశేషంగా పాల్గొంటున్నారు. అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు భద్రత కల్పించాయే గానీ అభ్యంతరపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నారని స్పష్టమవడం లేదా?

అనుక్షణం విధ్వంసకర ఆలోచనలు!

జీవో నెం.1 ద్వారా ఎవరినో భయపెట్టాలనుకున్న జగన్‌ రెడ్డి వ్యూహం బెడిసికొడుతోంది. కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబుకు ఆటంకాలు సృష్టించి ఉండకపోతే ఆయన పర్యటనకు కూలి మీడియాలో ప్రచారం లభించి ఉండేది కాదు. పోలీసుల ఓవరాక్షన్‌ కారణంగా విధిలేని పరిస్థితులలో వక్రీకరణతోనైనా కూలి మీడియాలో చంద్రబాబుకు చోటు లభించింది. చంద్రబాబు లేదా పవన్‌ కల్యాణ్‌ సభలు పెట్టుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన ప్రజాభిప్రాయం జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతుందా? అలా అయితే 1861లో ప్రత్యేక పోలీసు చట్టాన్ని తెచ్చిన బ్రిటిష్‌ పాలకులు స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయగలిగారా? సిపాయిల తిరుగుబాటు తర్వాత స్వాతంత్య్ర కాంక్ష మరింత పెరిగిందే గానీ తగ్గలేదు కదా! చివరికి బ్రిటిష్‌ పాలకులు తలవొంచి మనకు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిపోయారు కదా! జగన్‌రెడ్డి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎందుకు జరుగుతుంది? తన బటన్‌ నొక్కుడు చూసి ప్రజలంతా మురిసిపోతున్నారని జగన్‌ అండ్‌ కో నిజంగా నమ్ముతుంటే చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ర్యాలీలు నిర్వహిస్తావో, సభలు పెట్టుకుంటావో నీ ఇష్టం అని చంద్రబాబును వదిలేసి ఉండవచ్చు కదా? ఈ కారణంగానే వివేకం, విజ్ఞత కలిగి ఉన్న కొంత మంది మంత్రులు, అధికార పార్టీ నాయకులు జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో మరికొంత వ్యతిరేకత ఏర్పడుతుందే గానీ ఉపయోగం ఉండదని వారంతా అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్న దుష్ట ఆలోచనలు చేసే బదులు 50 శాతానికి పైగా ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్న తనకు కేవలం మూడున్నరేళ్లలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందా అని జగన్‌ ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. అధికారం శాశ్వతం కాదు– ఇవాళ తాను అమలుచేస్తున్న విధానాలే భవిష్యత్తులో తన పాలిట శాపాలుగా మారతాయని ఆయన ఎందుకు అంగీకరించలేకపోతున్నారో తెలియదు. తెల్లారి లేస్తే ఎవరిపై కేసు పెట్టాలి? ఎవరిని అరెస్టు చేయించాలి? ఎవరి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలు పంపాలి? అనే విధ్వంసకర ఆలోచనలు చేసే ముఖ్యమంత్రికి ఎంతటి జనాదరణతో అధికారంలోకి వచ్చినా చివరకు పతనం తప్పదు. భయపెట్టి బతకాలనుకున్న వారు ఎవరూ విజయం సాధించలేదు. జగన్‌ రెడ్డి మాత్రం మినహాయింపు ఎందుకవుతారు? బిల్లులు చెల్లించకపోవడం వల్ల చేసిన అప్పులు చెల్లించడం కోసం కాంట్రాక్టర్లు దొంగతనం చేయాల్సిన దుస్థితి ఏర్పడినందుకు చింతించాల్సింది జగన్‌ మాత్రమే. విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు చెల్లించకుండా వారిని జేబు దొంగలుగా మార్చాలనుకుంటున్నారా? అని హైకోర్టు నిలదీయడం జగన్మోహన్‌ రెడ్డికి నామోషీగా అనిపించకపోవచ్చును గానీ ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు అది అవమానమే. రాష్ట్రంలో పుట్టినందుకు ప్రజలు చింతిస్తున్నారని జగన్‌రెడ్డి సొంత బావ బ్రదర్‌ అనిల్‌ తాజాగా వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? ఎంత పెద్ద ఫ్యాక్షనిస్టు అయినా ప్రత్యర్థులను భయపెడుతున్నానని భ్రమిస్తూ భయం నీడలోనే బతుకుతాడు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా ప్రతిపక్షాలను భయపెడుతున్నానని భ్రమిస్తూ భయంతో బతుకుతున్నారు.

నవ్విపోదురుగాక..

తన అధికారానికి ప్రమాదం పొంచి ఉందని గుర్తించి భయపడుతున్న జగన్‌రెడ్డి, ప్రజలను మభ్య పెట్టడం కోసం సరికొత్త మాయోపాయాలను తెర మీదకు వదులుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెత్తందార్లకు, పేదలకు మధ్య పోరాటం జరుగుతున్నదని ఆయన సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే బాటలో నీలి మీడియా, కూలి మీడియా కూడా ఇదే పల్లవిని అందుకున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండకపోతే పేదలకు చదువు అందుబాటులోకి వచ్చి ఉండేది కాదన్న స్థాయి వరకు ఈ ప్రచారం జరుగుతోంది. ఎంతోమంది పేదవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగడాన్ని మనం చూశాం. అయినా జగన్‌ దయతోనే పేదలకు చదువు అందుబాటులోకి వచ్చిందని ప్రచారం చేయడం రాజశేఖర రెడ్డిని కూడా అవమానించడమే. ఇంతకూ పేదలు ఎవరో తెలుసు కానీ పెత్తందార్లు ఎవరో తేలాల్సి ఉంది. పేదల తరఫున తాను పోరాటం చేస్తున్నానని జగన్‌ కొత్తగా బిల్డప్‌ ఇస్తున్నారు. తనకు సొంత పత్రిక, చానల్‌ లేదని కూడా నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారి వారసులు ఎవరికీ తాడేపల్లి, హైదరాబాద్‌, బెంగళూరు, ఇడుపులపాయ తరహాలో ప్యాలెస్‌లు లేవే? జగన్‌రెడ్డికి ఉన్నన్ని వ్యాపారాలు కూడా లేవే? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ ముఖ్యమంత్రి కుమారుడు కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తలేదే? మాజీ ముఖ్యమంత్రులు అయిన నీలం సంజీవరెడ్డి, డాక్టర్‌ చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, ఎన్టీరామారావు వారసులు ఎవరూ ఆస్తులు, వ్యాపారాలలో జగన్మోహన్‌ రెడ్డితో పోటీ పడే పరిస్థితిలో లేరే! ఇద్దరు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పంచనే బతుకుతున్నారు కదా? ఏ మాజీ ముఖ్యమంత్రి కుమారుడి మీద కూడా లేనటువంటి సీబీఐ, ఈడీ కేసులు జగన్‌పైనే ఎందుకున్నాయి? ఊరికో ప్యాలెస్‌ నిర్మించుకున్న జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే అసలైన పెత్తందారు. ఆయన చెబుతున్న పెత్తందారులు ఎవరికీ జగన్‌కు ఉన్నన్ని ఆస్తులు, వ్యాపారాలు లేవే? అంతటి విలాస జీవితం కూడా లేదే? అయినా తనను తాను అభినవ చెగువేరా, పుచ్చలపల్లి సుందరయ్య, అల్లూరి సీతారామరాజు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లతో పోల్చుకుంటూ ప్రచారం చేయించుకుంటున్న జగన్‌రెడ్డి కపట విన్యాసాలు చూశాక ఎవరికైనా దిమ్మ తిరిగి బొమ్మ కనపడకుండా ఉంటుందా? చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ఆయన ఏమైనా తన తండ్రి ఖర్జూర నాయుడు ఆస్తులు అమ్మి ప్రజలకు ఇస్తున్నాడా? అని ఇదే జగన్‌ అండ్‌ కో ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు జగన్‌రెడ్డి ఏమైనా తాత రాజారెడ్డి పోగేసిన ఆస్తులు అమ్మి బటన్లు నొక్కుతున్నారా? లేదే! అప్పులు చేసి పంచిపెడుతూ అపర దానకర్ణుడిలా పోజు కొట్టడం ఏమిటి? తన ప్రత్యర్థులను గజదొంగలతో జగన్మోహన్‌ రెడ్డి పోల్చుతున్నారు. అసలైన గజదొంగ తానేనన్న విషయం ప్రజలు మరచిపోవడానికే ఇలా అంటూ ఉండవచ్చు. జగన్‌రెడ్డి అంతటి విలాసవంతమైన రాజప్రాసాదాలలో జీవితం గడుపుతున్న ముఖ్యమంత్రి మరొకరిని మనం చూడలేదు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. పేదల తరఫున పోరాడే వాడికి అనతికాలంలో అంత సంపద పోగెయ్యడం సాధ్యమా? అయినా ఇతరులను పెత్తందారులుగా పోల్చే తెంపరితనం వచ్చిందంటే ప్రజలు ఉట్టి అమాయకులు అన్న బలమైన అభిప్రాయం జగన్‌లో ఉండి ఉంటుంది. నిజానికి ఇంతటి అధికార దర్పాన్ని కూడా గత ముఖ్యమంత్రులు ఎవరూ ప్రదర్శించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మినహాయిస్తే దేశంలోనే సొంత పత్రిక, చానల్‌ పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్‌ రెడ్డే. అయినా తనకు సొంత మీడియా లేదని చెబుతున్నారంటే ఆయన కళ్లకు ప్రజలు ఎలా కనబడుతున్నారో? ప్రజలను మభ్యపెట్టే వ్యూహాలతో పాటు ప్రతిపక్షాలను అణచివేసే విధానాలతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చునని జగన్‌ కలలు కంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడినట్టుగా జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుణ్ని కూడా బతకనివ్వరు. తాడేపల్లి ప్యాలెస్‌ లేదా విశాఖలోని రుషికొండపై తలపెట్టిన ప్యాలెస్‌ అధికారానికి తలవంచే బానిసలు మాత్రమే కనిపిస్తారు. జగన్‌ వంటి విపరీత మనస్తత్వం ఉన్నవారిని దీర్ఘకాలం భరించడం కష్టం. అందుకు ప్రకృతి కూడా సహకరించదంటారు. అందుకే ప్రజలు కళ్లు తెరుస్తున్నారు. అది చూసి అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. దుర్మార్గులు చేసే విధ్వంసం వల్ల కలిగే నష్టం కంటే విజ్ఞుల మౌనం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని నెపోలియన్‌ బోనపార్టీ ఎప్పుడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విజ్ఞులు అంటూ ఎవరైనా ఉంటే జీవో నెం.1 వంటి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. భయంతో మేధావుల నోళ్లు పెగలకపోతే ప్రజలే ఆ విజ్ఞత ప్రదర్శిస్తారు. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలో వారే చూసుకుంటారు.

అక్కడా కులాల రొచ్చేనా?

ఈ విషయం అలా ఉంచితే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో తెలుగువారి మధ్య జరిగిన ఘర్షణలు, వాటికి కూలి మీడియా పూసిన రంగు రోత పుట్టిస్తోంది. తెలుగువాళ్లు ఎంతో మంది పొట్టచేతబట్టుకొని అమెరికా వెళ్లి ఉన్నతంగా బతుకుతున్నారు. అయితే అదే సమయంలో వారి బుద్ధులు కుంచించుకుపోతున్నాయి. కుల వైషమ్యాలతో కుళ్లిపోతున్నారు. ఈ మధ్యలో రాజకీయాల యావ. అమెరికాలోని తెలుగువాళ్లు ప్రాంతాలుగా, కులాలుగా విడిపోయి ప్రస్తుతం రాజకీయ పార్టీలవారీగానూ విడిపోయి కలహించుకోవడం విషాదం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి సంబంధం ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మాత్రం వారికి ఏం సంబంధం? అమెరికాలో వారి జీవితాలలో ఎలాంటి మార్పూ ఉండదు కదా? అయినా బతుకుదెరువు కోసం వెళ్లిన వారికి కులాలు, రాజకీయాలు ఎందుకు? విమానం ఎక్కే ముందే కులాన్ని వదిలిపెట్టి భారతీయులుగా మారిపోయేవారు మళ్లీ విదేశీ గడ్డపై కాలు మోపాక కులం తగిలించుకోవడం ఎందుకు? తమను తాము ఎన్‌ఆర్‌ఐలుగా చెప్పుకొనే ఈ ప్రబుద్ధులు కులాల రొచ్చులో కూరుకుపోతుండటం మహా విషాదం!

ఆర్కే

Updated Date - 2023-01-08T08:30:21+05:30 IST