లోతుల్లోకిపోని తీర్పు

ABN , First Publish Date - 2023-01-04T03:16:59+05:30 IST

ఆరేళ్ళనాటి పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ చేపట్టినా, అది అనుసరించిన ప్రక్రియలో ఏలోపాలూ లేవంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు...

లోతుల్లోకిపోని తీర్పు

ఆరేళ్ళనాటి పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ చేపట్టినా, అది అనుసరించిన ప్రక్రియలో ఏలోపాలూ లేవంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నరేంద్రమోదీ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం. జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పాలకపక్షం నుంచి కొలీజియం విధానం మీద విమర్శలు తీవ్రం కావడం, అది పంపిన జాబితాలను తిరగ్గొట్టడం, న్యాయమూర్తుల సెలవులమీదా ప్రజాప్రయోజన వ్యాజ్యాలమీదా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వంటివి పెద్దనోట్ల రద్దువంటి కీలకమైన కేసులు సుప్రీంకోర్టులో తీర్పుకు సిద్ధంగా ఉన్నందునే అని న్యాయవిశ్లేషకులు కొందరు అంటూంటారు. మోదీ ప్రభుత్వం ఒక రాత్రివేళ దేశప్రజల జీవితాలను, భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో ప్రక్రియాపరంగా ఏ తప్పూ చేయలేదని యాభైఎనిమిది పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పిన నేపథ్యంలో, అది తమ చర్యను సమర్థించిందని బీజేపీ చెప్పుకోవచ్చు, ఆ తీర్పులో కనీసం ఒకటైనా అసమ్మతి స్వరం ఉన్నందున, కేసుబలంగా వాదించిన కాంగ్రెస్‌ నాయకుడు పళనియప్ప చిదంబరం ఊరడిల్లనూవచ్చు.

ఆరేళ్ళ తరువాత కనుక, ఆర్థిక నిర్ణయాన్ని వెనక్కుతిప్పలేమనీ, విధాన నిర్ణాయాల్లో న్యాయసమీక్షకు చాలా పరిమితులుంటాయనీ, కార్యనిర్వాహక వ్యవస్థ వివేచనను తాము ప్రభావితం చేయలేమనీ అంటూనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అత్యధికులకు ఆశ్చర్యం కలిగించలేదు. చాలా కేసుల్లో వాదోపవాదాలు ఉధృతంగా సాగుతున్నప్పుడు అటార్నీని ఉద్దేశించి న్యాయమూర్తులు వేసిన ఘాటైన ప్రశ్నలకు, చేసిన వ్యాఖ్యలకు, అంతిమంగా వెలువడిన తీర్పులకు మధ్య సంబంధం ఉండదు. ప్రక్రియ సక్రమంగానే ఉన్నదని న్యాయస్థానం నిర్థారించినంత మాత్రాన, పెద్దనోట్ల రద్దు నిర్ణయం సామాన్యులపైనా, ఆర్థికవ్యవస్థపైనా వేసిన తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు అంతత్వరగా మాసిపోవు. నిర్ణయాన్ని తిరగదోడలేం కానీ, అది వివిధరంగాలపై వేసిన దీర్ఘకాలిక ప్రభావం విస్తృతమైన అధ్యయనాలు, విశ్లేషణలకు అర్హమైనదే. కోట్లాదిమంది సామాన్యుల, చిన్నవ్యాపారుల, చిన్నతరహాపరిశ్రమలను రోడ్డునపడేసి, కనీసం రెండుశాతం అభివృద్ధిరేటును ప్రభావితం చేసిన చర్యకాబట్టి, ముగిసిన అధ్యాయం అని అటకెక్కించేయలేం.

దురదృష్టం ఏమంటే, మోదీ ప్రభుత్వం నోట్‌బందీ ప్రకటించినా, సర్జికల్‌ దాడులు చేసినా, వాటికి సమీపకాలంలోనే కీలకమైన ఎన్నికలు ఉండటంతో అనుమానాలు, విమర్శలు ఎక్కువగా ఉంటాయి. నోట్‌బందీ వెనుక ప్రకటిత లక్ష్యాల్లో కొన్ని నెరవేరినా బాగుండేది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమన్న ఒకానొక లక్ష్యం అనతికాలంలోనే డొల్లదని తేలిపోయింది. ఇప్పుడు దేశంలో రెట్టింపు నగదు చలామణీలో ఉన్నది. నల్లధనం అడ్డంగా దొరిపోయి, ప్రభుత్వ బొక్కసం నిండుతుందన్నారు కానీ, పరిమిత కాలవ్యవధిలోగా బదలాయింపు సాధ్యంకాక కొందరు నిస్సహాయుల దగ్గర మిగిలిపోయిన నాలుగుచిరిగిన నోట్లు వినా మొత్తం కరెన్సీ వెనక్కువచ్చేసింది. పెద్దనోట్లలోనే నల్లధనం, ఉగ్రవాదం ఉన్నదని వాదించి వాటిని రద్దుచేసినవారు కొత్తగా రెండువేలరూపాయల నోటు ఎందుకు తెచ్చారో, ఇప్పుడు ఆ పార్టీకే చెందిన పెద్దలు చట్టసభసాక్షిగా దానిని ఎందుకు రద్దుచేయాలని కోరుతున్నారో తెలియదు. ప్రకటిత లక్ష్యాలే అసమగ్రమైనప్పుడు, నిర్ణయం వెనుక ఆంతర్యాలూ ఎవరికి మాత్రం తెలుస్తాయి. ఆ లక్ష్యాలు నెరవేరకున్నా, ఆంతర్యాలూ ఆర్థంకాకున్నా, కనీసం తీర్పులైనా కొన్ని ప్రశ్నలు వేస్తాయనీ, నిలదీస్తాయన్న ఆశకూడా చివరకు మిగల్లేదు.

తమ అభీష్టానికి, రాజకీయప్రయోజనాలకు అనుగుణంగా పాలకులు చిత్తంవచ్చిన నిర్ణయాలు చేయకుండా అడ్డుపడడానికే స్వతంత్రవ్యవస్థలున్నది. వాటిని కూడా త్రోసిరాజని ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నప్పుడు, న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులు ఆ దూకుడు నిర్ణయాలకు అడ్డుకట్టవేసి, భవిష్యత్తు ప్రమాదాన్ని నివారించడానికి తోడ్పడేవిధంగా ఉంటే బాగుండేది. కీలకమైన కేసుల్లో కూడా ఇటీవలికాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఆ ఆశ మిగలకుండా చేస్తున్నది. కార్యనిర్వాహక వ్యవస్థను నిలదీసే, ఢీకొట్టే అంశాల లోతుల్లోకి పోకుండా వెలువడిన ఈ తీర్పులో, భవిష్యచర్చకు కాస్తంతైనా అవకాశం మిగిల్చింది జస్టిస్‌ నాగరత్న నోటివెంట వచ్చిన ఆ నాలుగుమాటలే.

Updated Date - 2023-01-04T03:17:02+05:30 IST