కుబేరుల రాజ్యం

ABN , First Publish Date - 2023-01-17T02:17:23+05:30 IST

ధనికులంతా అతివేగంగా అపరకుబేరులవుతున్న దృశ్యం కనిపిస్తూనే ఉంది కానీ, అది ఎంతటి ఉధృతంగా జరుగుతున్నదో...

కుబేరుల రాజ్యం

ధనికులంతా అతివేగంగా అపరకుబేరులవుతున్న దృశ్యం కనిపిస్తూనే ఉంది కానీ, అది ఎంతటి ఉధృతంగా జరుగుతున్నదో సోమవారం విడుదలైన ఆక్స్‌ఫామ్‌ నివేదిక మరోమారు గణాంకాలతో మనముందు ఉంచింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశాల సందర్భంగా ‘సూపర్‌రిచ్‌’ అంతా డావోస్‌లో జతకూడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, హెచ్చుతున్న అసమానతలను గుర్తుచేసే కర్తవ్యాన్ని ఈ సంస్థ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశానికి సంబంధించి, ఆక్స్‌ఫామ్‌ ఇండియా విడుదలచేసిన వివరాల ప్రకారం 5శాతం భారతీయుల చేతుల్లో 60శాతం దేశసంపద ఉంటే, సమాజంలో దిగువున ఉన్న యాభైశాతం జనాభా దగ్గర మూడుశాతం మాత్రమే ఉంది. ‘సర్వైవల్‌ ఆఫ్‌ ద రిచెస్ట్‌: ఇండియా స్టోరీ’ పేరిట విడుదలైన ఈ నివేదిక ప్రకారం, భారతదేశం 2012–2021 మధ్యకాలంలో సృష్టించిన సంపదలో 40శాతం కుబేరుల వద్దకే చేరింది. దేశంలో బిలియనీర్ల సంఖ్య రెండేళ్ళకాలంలో 102నుంచి 166కు పెరిగింది.

ఆకలి, ఉపాధిలేమి, ధరలపెరుగుదల, అనారోగ్యం ఇత్యాది సమస్యలతో భారతదేశం బాధపడుతూంటే, బిలియనీర్లు మాత్రం వేగంగా వృద్ధిచెందుతున్నారు. మరోపక్క, నిరుపేదల సంఖ్య నాలుగేళ్ళకాలంలో ౧9కోట్ల నుంచి 35కోట్లకు పెరిగింది. కరోనా, తదనంతర ప్రభావాల వల్ల నిరుపేదల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిని, ఉన్నది కూడా ఊడ్చుకుపోయింది. ఇదే సంక్షోభకాలంలో పదిశాతం ధనికుల ఆదాయం డెబ్బయ్‌శాతానికిపైగా, ఐదుశాతం ధనికుల ఆదాయం అరవైశాతానికి పైగా పెరిగింది. ఈ వృద్ధి విపత్తుముందుకాలంకంటే ఎంతో ఎక్కువ. ప్రపంచంలోకెల్లా అత్యధికశాతం నిరుపేదలున్న భారతదేశంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో కూడా ఈ నివేదిక వివరించింది. 2019లో ప్రభుత్వం ముప్పైశాతం కార్పొరేట్‌ పన్నును 22శాతానికి తగ్గించడం, కొత్తగా నమోదైన కంపెనీలు పదిహేనుశాతం పన్నుమాత్రమే కడితే సరిపోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నందున సుమారు 2లక్షలకోట్లు నష్టపోయిందనీ, దీనిని భర్తీచేసుకోవడానికి జీఎస్టీ పరిధిలోకి కొత్త ఉత్పత్తులు చేర్చడం, పన్నురేట్లు పెంచడం, చమురుమీద అధిక సుంకాలు విధించడం, అప్పటికే ఉన్న మినహాయింపులను ఎత్తివేయడం వంటి చర్యలు ప్రధానంగా సామాన్యుల నడ్డివిరిచాయన్నది నివేదిక సారాంశం. కార్పొరేట్లకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, మినహాయింపుల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం దాదాపు లక్షకోట్లు నష్టపోయింది. ధనికులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఇలా దోచిపెడుతున్నందున మిగతా సమాజం శిక్షభరించక తప్పలేదు. దిగువున ఉన్న యాభైశాతం మొత్తం జీఎస్టీలో మూడింట రెండువంతులు ప్రభుత్వానికి చేరుతూండగా, మిగతా ఒకవంతు నలభైశాతంమందినుంచి వసూలు అవుతున్నది.

సామాన్యులను పేదలనూ పీల్చిపిప్పిచేస్తున్న పరోక్షపన్నులమీద ప్రభుత్వం దృష్టిపెట్టడాన్ని ఆక్స్‌ఫామ్‌ ఆక్షేపించింది. ఈ దేశంలో కొందరే పన్నులు చెల్లిస్తుంటే పేదలంతా ఉచితంగా తినికూర్చుంటున్నారన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. కానీ, సంపాదించున్నదానిలో అత్యధికం ఖర్చుచేసేదీ, తద్వారా అధికంగా పన్నులు చెల్లించేదీ సమాజంలో దిగువున ఉన్న యాభైశాతమేనని ఈ నివేదికచెబుతోంది. ఈ కారణంగానే, కనీసం అత్యవసర సరుకులపైన అయినా జీఎస్టీ తగ్గించి పేద, మధ్యతరగతిని ఆదుకోమని నివేదిక కోరుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, భారతీయ బిలియనీర్లమీద ‘వెల్త్‌టాక్స్‌’ విధించమని కూడా అంటోంది. కరోనా కష్టకాలంలో దేశ ఆర్థికరంగాన్ని నిలబెట్టడానికి ఈ పనిచేయమంటూ సూచించినందుకు కొందరు అధికారులను మోదీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. బిలియనీర్ల మొత్తం ఆస్తిమీద ఒకేఒక్కమారు మూడుశాతం పన్నువేస్తే ఐదేళ్ళపాటు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిరాఘాటంగా నడిచిపోతుందనీ, రెండుశాతం పన్నువేస్తే మూడేళ్ళపాటు పోషకాహారలేమిని తరిమికొట్టవచ్చునని లెక్కలు చెబుతున్నాయి. అదానీ ఆస్తిమీద నామమాత్రంగా పన్నువేసినా దేశాన్ని ఏయేరంగాల్లో ఉద్ధరించవచ్చునో, దేశాన్ని ఎంతకాలం నెట్టుకురావచ్చునో వివరిస్తోంది. రెండేళ్ళ దేశబడ్జెట్‌కు సమానంగా ఆస్తులున్న అపరకుబేరులమీద వెల్త్‌టాక్స్‌, విండ్‌ఫాల్‌ టాక్స్‌, వారసత్వపుపన్ను, మూలధనలాభాలపై పన్ను అంటూ ఏవేవో విధించి సమాజంలోని అట్టడుగువారిని ఉద్ధరించాలని హితవుచెబుతోంది. సంపన్నుల, కార్పొరేట్‌ రంగసేవలో పూర్తిగా తరించిపోతూ, వారిని మహాసంపన్నులుగా తీర్చిదిద్దే లక్ష్యసాధనలో ఉన్న పాలకుల చెవిముందు శంఖం ఊదుతున్నది.

Updated Date - 2023-01-17T02:17:32+05:30 IST