Weekend Comment by Rk: పాప ప్రక్షాళనకు వేళాయె!
ABN , First Publish Date - 2023-06-18T00:29:26+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఆణిముత్యాల వంటి రెండు మాటలు వెలువడ్డాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలిచాక అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నది మొదటిది కాగా, మన దేశంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలన్నది...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఆణిముత్యాల వంటి రెండు మాటలు వెలువడ్డాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలిచాక అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నది మొదటిది కాగా, మన దేశంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలన్నది రెండోది. ఆయన నోటి వెంట ఈ మాటలు వింటున్నప్పుడు ముచ్చటేసింది. ఫక్తు ఫ్యూడల్ లక్షణాలు పుణికి పుచ్చుకుని ఎనిమిదిన్నరేళ్లుగా తెలంగాణను రారాజుగా ఏలుతున్న కేసీఆర్‌లో ఇంత మార్పు రావడం ఆశ్చర్యంగా ఉంటుంది మరి. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన నాటి నుంచి ఆయన దళిత జపం చేస్తున్నారు. మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో దళితులు ఎంతగా వివక్షకు గురయ్యారో తెలిసిందే. అదే విధంగా అమెరికాలో కూడా నల్ల జాతీయులు దశాబ్దాలుగా.. ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా వివక్షను చవిచూశారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ వివక్ష కొంత తగ్గిందన్నది ఒక అభిప్రాయం. నల్ల జాతీయుడు అయిన బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాక ఆ జాతికి చెందిన వారిలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. తెల్ల జాతీయుల దురాగతాలు కొంతమేర తగ్గాయి. బహుశా ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని వివక్షకు గురవుతున్న జాతికి చెందిన ఒబామా అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందని కేసీఆర్ చెబుతున్నట్టుంది. అంటే అణచివేతకు గురైనవారి చేతికే అధికారపగ్గాలు అందాలన్నది కేసీఆర్ అభిప్రాయం కావచ్చు. ఈ మార్పును ఆహ్వానించాల్సిందే. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌లో సంఘ సంస్కర్త లేకపోలేదు. ఆయనలోని సంఘ సంస్కర్త అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మేల్కొంటాడు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించడంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుండా తానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇందుకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడే పుట్టిన తెలంగాణ బిడ్డ బతికి బట్టకట్టాలంటే తన నాయకత్వమే శరణ్యమని ఆయన సమర్థించుకున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచన ఆయన మనసు పొరల నుంచి మాయమైంది. అలా అని దళిత జనోద్ధరణ జరిగిపోయిందా అంటే అదీ లేదు. తెలంగాణలో దళితుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. రెండు గ్లాసుల విధానం ఇప్పటికీ అక్కడక్కడ అమలవుతోందని వార్తలు వస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల వెనక్కు వెళితే తెలంగాణలో దళితుల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారిని అంటరానివారిగా పరిగణించేవారు. దొరల గడీల ముందు నడిచే అర్హత కూడా వారికి ఉండేది కాదు. కాలికి చెప్పులు వేసుకుంటే గుడ్లురిమి చూసేవారు. కాలక్రమంలో ఈ పరిస్థితులలో కొంత మార్పు వచ్చింది. దళితుల పట్ల వివక్ష ప్రదర్శించిన నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్, ఈ కారణంగానే కాబోలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. అణచివేతకు గురైన దళితుల చేతికి అధికారం అందినప్పుడే పరిస్థితులలో మార్పు వస్తుందన్నది కేసీఆర్ ఉద్దేశం అయి ఉంటుంది. నిజం కూడా అదే కదా! స్వాతంత్య్రం వచ్చాక స్వదేశంలో అధికారంలో వాటా లభించిన తర్వాతే దళితుల జీవితాలలో కొంతమార్పు వచ్చింది. ఆయా ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాల వల్ల వారికి కొంత రక్షణ కూడా లభించింది. తమ జీవితాలలో వచ్చిన ఈ మార్పుకు ప్రధాన కారణమైన అంబేడ్కర్‌ను దళితులు దేవుడిగా కొలుచుకుంటున్నారు. అంబేడ్కర్‌ను మించిన దళిత జనోద్ధారకుడిగా పేరు తెచ్చుకోవాలన్నది ఇప్పుడు కేసీఆర్ అభిమతంగా ఉన్నట్టుంది. అందుకే అమెరికాలో నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాకే అక్కడ పాప ప్రక్షాళన జరిగిందని ఆయన అంటున్నారు. కేసీఆర్ చెబుతున్న దాని ప్రకారం ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా దళితుడు ఎన్నికైతేనే ఆ వర్గాల జీవితాల్లో మార్పు వస్తుంది. ఇంతకంటే గొప్ప ఆలోచన ఏముంటుంది? దొర ఏందిరో... దొర పీకుడేందిరో అని గర్జించిన తెలంగాణ సమాజంలో కూడా వివక్ష పూర్తిగా తొలగిపోవాలంటే కేసీఆర్ చెబుతున్నట్టు ఆ వర్గాల చేతికే అధికార పగ్గాలు అందాలి.
మరాఠాల సీఎం ఎవరో?
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శమని ఆయా రంగాలలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, కేసీఆర్ అండ్ కో ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనవంటి విజనరీకి తెలంగాణలో చేయడానికి ఇంకేమీ మిగలలేదన్నట్టుగానే కేసీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా మారినందున మిగతా రాష్ర్టాలతో పాటు దేశమంతటా ఇదే మోడల్ అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. తరచుగా మహారాష్ట్రలో పర్యటిస్తూ తన బీఆర్‌ఎస్‌ను విస్తరించే పనిలో పడ్డారు. తెలంగాణ మాదిరి మహారాష్ట్ర కూడా బంగారు మహారాష్ట్రగా మారాలంటే తనకే అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కోరుతున్నట్టుగా మరాఠాలు కూడా అమాయకంగా కేసీఆర్ మాయలో పడిపోయి బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారు? కొత్తగా ఏర్పడిన తెలంగాణ బతికి బట్టకట్టాలంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే లాభం లేదని చెప్పి తానే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుంటారా? కేసీఆర్ ఉద్దేశం ప్రకారం మహారాష్ట్ర గానీ, మరో రాష్ట్రం గానీ తెలంగాణ వలె అభివృద్ధి చెందాలంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి లేదా ప్రధానమంత్రి అవ్వాలి. ఒక వ్యక్తి ఒక రాష్ర్టానికి మించి ఎక్కువ రాష్ర్టాలకు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని రాజ్యాంగం అనుమతించదు. మరెలా?
కేసీఆర్‌కు విముక్తి కల్పించాల్సిన తరుణం!
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేసీఆర్ చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు కనుక మళ్లీ మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటే ఆయనకు బోరు కొట్టదా? మరెలా? అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండబోతున్నారు కనుక త్వరలో జరగబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రభృతులు అసలు విషయాన్ని బయటపెట్టేశారు. అయితే కేసీఆర్ తాజాగా చేసిన ప్రవచనానికి ఇది విరుద్ధం. వివక్షకు, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం జరగాలంటే వారి చేతికే అధికార పగ్గాలు అందాలని కేసీఆర్ చెప్పారు కదా! తెలంగాణలో కూడా పాప ప్రక్షాళన జరగాలంటే దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా! రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి దళితుడు ముఖ్యమంత్రి అయితే సమర్థంగా నడిపించలేడని కేసీఆర్ పరోక్షంగా చెప్పారు. నిజమే కాబోలు అని ప్రజలు కూడా నమ్మి ఆయనను రెండవ పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా తన నాయకత్వంలో అభివృద్ధి చెందిందని ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చివేసినందున ఇప్పుడైనా తెలంగాణను పాలించే అర్హత దళితులకు వస్తుందో లేదో కేసీఆర్ ముందుగా చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు కనుక ఆయన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఆయనకు మాత్రం చేయడానికి ఏముంటుంది? ఆ మాత్రం దళితులు చేయలేరా? చేయలేని పరిస్థితి ఉంటే అమెరికాలో మాదిరి తెలంగాణలో పాప ప్రక్షాళన మరి ఎప్పుడు జరగాలి? కల్వకుంట్ల కుటుంబానికే అధికారం పరిమితం కావాలనుకుంటే పాప ప్రక్షాళన జరగదు కదా? ఈ విషయాన్ని కేసీఆర్ సీరియస్‌గా ఆలోచించాలి. కాలం కలసి వస్తే, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం మొత్తంలో పాప ప్రక్షాళన జరగవచ్చు కూడా. ప్రధానమంత్రిగా తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా కుమారుడు ఉంటే బాగుండదేమో! కేసీఆర్ అండ్ కో చెబుతున్న మాటల ప్రకారం తెలంగాణకు ఇకపై కల్వకుంట్ల కుటుంబం అవసరం లేదు. మహారాష్ట్ర వంటి ఇతర రాష్ర్టాలను, ఆ తర్వాత దేశాన్ని ఉద్ధరించే మహదావకాశం ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి లభించింది. అమెరికాలో బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినట్టుగానే మన దేశంలో, ముందుగా తెలంగాణలో, ఆ తర్వాత మిగతా రాష్ర్టాలలో దళితులను ముఖ్యమంత్రులుగా చేయడం ద్వారా అంబేడ్కర్‌ను మించిన పేరు ప్రతిష్ఠలు తెచ్చుకొనే అవకాశం కూడా కేసీఆర్‌కు ఇప్పుడు లభించింది. ఈ అభిప్రాయం కూడా ఆయనదే. దళిత జనోద్ధరణ విషయంలో మహాత్మా గాంధీని మించి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకొనే మహదావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు. ఒకప్పుడు దళితులను హీనంగా చూసిన సామాజికవర్గానికి చెందిన కేసీఆర్, స్వయంగా పాప ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు కనుక శుభం భూయాత్! అని మనం కూడా అనేద్దాం. మహారాష్ట్ర మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ర్టాలలో కూడా విస్తృతంగా పర్యటించి బీఆర్‌ఎస్‌ను పటిష్ఠం చేస్తానని కేసీఆర్ చెబుతున్నందున ఆయనకు ఆ వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి కేసీఆర్‌కు విముక్తి కల్పించడం ద్వారా ఆయన సేవలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రావడానికి తెలంగాణ ప్రజలే సహకరించాలి. తెలంగాణలో పాప ప్రక్షాళన జరగాలంటే దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలి! కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో గానీ ప్రజలకు మాత్రం ఇంతకంటే మంచి అవకాశం రాదు. తెలంగాణ బాటలోనే మొత్తం దేశం ప్రపంచానికే రోల్ మోడల్ అవ్వాలంటే తన నాయకత్వమే శరణ్యం అని కేసీఆర్ కూడా చెబుతున్నారు కదా! ఈ విషయాన్ని దళితులు కూడా సీరియస్‌గా ఆలోచించాలి. తెలంగాణ సమాజం నుంచి ఒక గొప్ప నాయకుడిని దేశానికి అందించిన ఘనత ఇక్కడి ప్రజలకు దక్కుతుంది. కల్వకుంట్ల కుటుంబానికి కూడా విశ్రాంతి లభిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న కేసీఆర్ కల కూడా నెరువేరుతుంది. కేసీఆర్ పెద్ద మనసుతో ఇస్తున్న ఈ ఆఫర్‌ను వదులుకోవడం వివేకం అనిపించుకోదు. కేసీఆర్‌ను దేశం మీదకు వదిలేస్తే బరాక్ ఒబామా మాదిరి మన దేశంలో ఎక్కడ చూసినా దళితులే ముఖ్యమంత్రులుగా కనిపిస్తారు. ప్రధానమంత్రి పదవి ఒక్కటి మాత్రం కేసీఆర్‌ను తీసుకోనివ్వండి. దళితులు ముఖ్యమంత్రులు అయితే కనీసం రాష్ర్టాలలోనైనా పాప ప్రక్షాళన జరుగుతుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి మాత్రం ఎక్కడికి పోతుంది? మొత్తం దేశంలో కూడా పాప ప్రక్షాళన జరిగి తీరుతుంది! కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారు!
ప్రజలు గెలవడమంటే ఇలాగా?
ఇప్పుడు మహారాష్ట్రలో కేసీఆర్ చేసిన రెండవ ప్రకటన విషయానికి వద్దాం. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలని వాక్రుచ్చారు. కొంతకాలం క్రితం ఇదే కేసీఆర్ తమది ఫక్తు రాజకీయ పార్టీ అని, తాము సత్రాన్ని నడపడం లేదని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బరాబర్ నిర్ణయాలు తీసుకుంటామని కూడా వివరించి చెప్పారు. మనుషుల్లో మార్పు రావడం సహజం. ఇప్పుడు కేసీఆర్‌లో కూడా మార్పు వచ్చి ఉంటుంది. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పుడే ఆయనలో మార్పు కనిపిస్తుంది. సంఘసంస్కర్త బయటకు వస్తాడు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలవాలని చెప్పడం కూడా ఇదే కోవలోకి వస్తుందో లేదో తెలియదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని అనుకోవడం మాత్రం ఉదాత్తమైన ఆలోచనే అని చెప్పవచ్చు. అయితే దురదృష్టవశాత్తు 2014, 2018 ఎన్నికల్లో ప్రజల తీర్పును చెరబట్టడం ద్వారా ప్రజలను ఆయనే స్వయంగా ఓడించారు. 2014లో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాల తరఫున ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో కలిపేసుకున్నారు. ప్రజల తీర్పుకు అర్థం లేకుండా చేశారు. తద్వారా ప్రజలను ఓడించారు. అప్పుడంటే ప్రభుత్వా నికి వ్యతిరేకంగా కుట్ర జరిగే అవకాశం ఉందని చెప్పి నమ్మించారు. 2018లో ఏం అవసరం వచ్చింది? కేసీఆర్‌కు సంపూర్ణ మెజారిటీ లభించింది కదా? అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులను కలిపేసుకున్నారు. మళ్లీ ప్రజల తీర్పును చెరబట్టడం ద్వారా ప్రతిపక్ష సభ్యులను ఎన్నుకున్న ప్రజలను ఓడించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులను మరో పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు? సిగ్గు ఉండాలి.. అని ఇదే కేసీఆర్ ఒకప్పుడు ఆక్రోశించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలే గెలవాలని చెబుతున్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఎలా గెలుస్తారు? ప్రజల తీర్పు ట్యాంపరింగ్ జరగకుండా ఎలా ఉంటుంది? తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తానే ముఖ్యమంత్రి కావడం ద్వారా అప్పుడు కూడా ప్రజలను ఆయనే ఓడించారు కదా? కేసీఆర్ చేతిలో ప్రజలు అనేక సందర్భాలలో ఓడిపోయారు. నిరసనలు, ధర్నాల ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కల్పించగా, కేసీఆర్ పాలనలో ధర్నా చౌక్‌ను ఏకంగా ఎత్తేయడం ప్రజలను ఓడించడం కాదా? తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేకుండా చేయడం ప్రజలను ఓడించడం కాదా? తన అడుగులకు మడుగులొత్తని మీడియాను వేధించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? ఇదే కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను చెరబట్టిందని విమర్శిస్తుంటారు మరి! తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మందికి పాలనలో ప్రమేయం లేకుండా చేసి వర్గ శత్రువులుగా ప్రకటించుకోవడం అంటే ప్రజలను గెలిపించినట్టా? ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిలో కొన్ని కుటుంబాలకే అరకొర సాయం చేస్తూ తన రాజ్య విస్తరణ కాంక్ష కోసం తెలంగాణ ప్రజలకు చెందిన వందల కోట్ల సొమ్మును ప్రచారం కోసం ఖర్చు చేయడం ప్రజలను వంచించడం కాదా? 2014 ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? 2014లో ఎన్నికల ఖర్చుల కోసం అప్పులు కూడా చేసిన కేసీఆర్, ఇప్పుడు తొమ్మిదేళ్లు తిరిగేసరికి దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు భరించగల స్థాయికి ఎదగడం తెలంగాణ సమాజాన్ని గెలిపించినట్టా? తన ఫ్యూడల్ మనస్తత్వానికి చిహ్నంగా అక్కడక్కడా కొన్ని భవనాలను, టవర్లను అవసరం లేకున్నా నిర్మించి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సదరు భవంతులను నిర్మించానని చెప్పుకోవడం ప్రజలు గెలిచినట్టు ఎలా అవుతుంది? రాచరికపు వ్యవస్థలో రాజప్రాసాదాలు నిర్మితమయ్యాయి. అధికారదర్పానికి, ధన బలం ప్రదర్శనకు ఆనాటి రాజులు వాటిని నిర్మించడం వాస్తవం కాదా? నాటి నిజాం పాలకులు కూడా ఇలాగే ప్యాలెస్‌లు కట్టారు కదా? అప్పుడు ప్రజలు సుఖశాంతులతో జీవించి ఉంటే తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? ఇప్పుడు ప్రజలకు ప్రాజెక్టులను చూపించి ఆ మాటున వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకోవడమంటే ప్రజలు గెలిచినట్టు కాదే? ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే ఇదే కేసీఆర్ తెలంగాణ సొమ్ము దోపిడీకి గురవుతోందని విమర్శించడం వాస్తవం కాదా? ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాగా తెలంగాణ సొత్తును దోచుకుంటున్నారన్న పెద్దమనిషి, ఇప్పుడు కబ్జా చేసే అవసరం లేకుండా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దోపిడీ అవదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో జిల్లా స్థాయిలో మంత్రులు, శాసనసభ్యులూ అదే చేస్తున్నారు. అయినా ప్రజలే గెలుస్తున్నారని కేసీఆర్ చెప్పగలరా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి తాను ధర్మకర్తగా ఉంటానని, ప్రజల సొత్తుకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన ఇదే కేసీఆర్, ఇప్పుడు రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా వ్యవహరించడం నిజం కాదా? తెలంగాణలో మావోయిస్టుల ఉనికే లేకుండా పోయిందని చెబుతూనే ప్రొఫెసర్ హరగోపాల్ వంటి వారిపై ఇప్పుడు ‘‘ఊపా’’ కేసు పెట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? ఉమ్మడిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అనుకోవడం, ప్రతిపక్షాల అవసరమే లేదని అనడం నిరంకుశత్వం కాదా? చైతన్యవంతమైన ప్రగతిశీల తెలంగాణలో మునుపటి పరిస్థితులు మళ్లీ నెలకొనడానికి కేసీఆర్ పాలన కారణం కాదా? పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని దొరల రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించడం ప్రజలను గెలిపించడం అవుతుందా? నేను ఇచ్చేవాడిని, నీవు తీసుకొనేవాడివి అన్నట్టుగా సమాజాన్ని మార్చివేయడం పురోగమనం అవుతుందా? అభ్యుదయం అని చెప్పగలమా? ఎన్నికల్లో ప్రజలు గెలవడం అంటే పాలకులు వారికి జవాబుదారీగా ఉండడం. ఇందుకు విరుద్ధంగా రాజ్యం వీరభోజ్యం అన్నట్టు విర్రవీగడం ఏమిటి? ప్రజల సొమ్మును అందినకాడికి దండుకోవడం అంటే ప్రజలు ఓడిపోయినట్టే. అనుభవించిన అధికారం, వెనకేసుకున్న సంపాదన చాలవనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలే గెలవాలని కేసీఆర్ చెబుతున్నారు. నిజమే, తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే గెలవాలని మనం కూడా కోరుకుందాం. తెలంగాణ అవసరం తనకు లేదన్నట్టుగా కేసీఆర్ ప్రకటనలు కూడా ఉంటున్నాయి. కేసీఆర్ అవసరం లేదని ప్రజలు కూడా భావించాలంటారా సారూ! అవును.. పాప ప్రక్షాళన జరగాల్సిందే. ఆ శక్తి ప్రజల చేతుల్లోనే ఉంది. దేశం కోసం తాను చేయాల్సింది ఎంతో ఉందని స్వయంగా కేసీఆర్ చెబుతున్నందున ఆయనకు ఆ అవకాశం కల్పించడమా? లేదా? అన్నది తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలి. తాను చెబుతున్న ప్రవచనాల్లో నిజాయితీ ఉంటే కేసీఆర్ కూడా ఇందుకు సహకరించాలి. ‘‘నా స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వండి’’ అని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయడం ద్వారా కేసీఆర్ కూడా పాప ప్రక్షాళన చేసుకుంటారని ఆశిద్దాం!
ఆర్కే