కేసీఆర్‌ రాజకీయానికి భూములు బద్దలు

ABN , First Publish Date - 2023-04-09T01:01:58+05:30 IST

ప్రతిపక్షాల కూటమి నాయకత్వాన్ని తనకు అప్పగిస్తే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని తానే భరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టుగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఒక వీడియో విడుదల చేశారు...

కేసీఆర్‌ రాజకీయానికి భూములు బద్దలు

ప్రతిపక్షాల కూటమి నాయకత్వాన్ని తనకు అప్పగిస్తే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని తానే భరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టుగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో బయటకు రాగానే కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిది? అని తెలంగాణలోని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే ఆ వెంటనే పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాల్సిన ఈ డబ్బు వ్యవహారం ఇంత చప్పగా ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల వ్యవహారాన్ని పిరంగా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్‌ ధన బలాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ఎన్నికల వ్యయాన్ని భరించే శక్తి నిజంగా కేసీఆర్‌కు ఉందా? ఉంటే ఆయన వద్ద అంత డబ్బు ఎక్కడిది? ఏ సందర్భంలో ఆయన ఈ మాట అన్నారు? అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని చెప్పుకొంటున్న కేసీఆర్‌ వ్యవహార శైలిని నిశితంగా గమనించిన వారికి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది. జాతీయ రాజకీయాలలో తనతో కలసి వచ్చే ప్రాంతీయ పార్టీల నాయకులు కొందరికి కేసీఆర్‌ భారీ మొత్తాలను ఆఫర్‌ చేస్తున్నారని నేను కొంత కాలం క్రితమే వెల్లడించాను. కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఆఫర్‌ చేశారని చెప్పాను. ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితితో చేతులు కలిపితే ఎన్నికల వ్యయం కింద వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుకుంటానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఆఫర్‌ ఇచ్చిన విషయాన్ని కూడా అదే సమయంలో వెల్లడించాను. అయితే ఈ విషయాన్ని జనసైనికులు ఆవేశపడి అపార్థం చేసుకున్నారు. నిజం నిప్పు వంటిది. ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇప్పుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ కూడా ఎన్నికల వ్యయం గురించి చెబుతున్నారు. అయితే కేసీఆర్‌ ఈ మాటలను ఎక్కడ.. ఎవరి వద్ద.. ప్రస్తావించారన్నది రాజ్‌దీప్‌ వెల్లడించలేదు గానీ, మాకున్న సమాచారం ప్రకారం ఎన్నికల వ్యయం ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతోనే కేసీఆర్‌ తరఫున కొంతమంది పంచుకున్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడితే మొత్తం వ్యయాన్ని భరిస్తామని కేసీఆర్‌ దూతలు స్పష్టంచేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ధనబలంతో తెలంగాణలో ఆధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్‌, జాతీయ రాజకీయాలలో కూడా అదే ఫార్ములాను అమలు చేయాలని అనుకుంటున్నట్టున్నారు. ఎన్నికల వ్యయాన్ని తాను భరిస్తానని ఎవరికీ హామీ ఇవ్వలేదని కేసీఆర్‌ గానీ, బీఆర్‌ఎస్‌ నాయకులు గానీ ఇంతవరకు ఖండించలేదు. అంటే నిప్పూ నిజమే.. పొగా నిజమే అని భావించాలి. ప్రగతి భవన్‌ నుంచి కాలు బయటపెట్టకుండానే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఆయా రాష్ర్టాలకు చెందిన కొంతమందిని పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు 200 వరకు అసెంబ్లీ సీట్లు లభిస్తాయని పగటి కలలు కంటున్నారు. ప్రతిపక్ష నాయకుల బలహీనత తెలంగాణలో కలసి వస్తున్నది కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి ఉండదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్న కొంతమంది ప్రముఖులు కేసీఆర్‌ ఆఫర్‌ చేసే డబ్బుకు లొంగబోరు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌ను ఇలాంటి ప్రలోభాలతో లొంగదీసుకోగలరా? తెలంగాణ అనే చిన్న రాష్ర్టానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం వరకు కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కొన్ని రాష్ర్టాలలో అధికారంలో ఉంది. తెలంగాణ కంటే ఆర్థికంగా బలమైన రాష్ర్టాలు ఎన్నో ఉన్నాయి. అయినా జాతీయ రాజకీయాలను కూడా డబ్బుతో శాసించవచ్చునని కేసీఆర్‌ భావించడం విచిత్రంగా ఉంది. కేసీఆర్‌ ఆలోచనలు సఫలమవుతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఆయన వద్ద ఇంత డబ్బు ఎలా సమకూరింది? అన్నదే మున్ముందు ప్రధాన అంశం అవుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడిన కేసీఆర్‌ వద్ద ఎన్ని వేల కోట్లు ఉండి ఉండాలి! బడ్జెట్‌ పరంగా తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే అయి ఉండవచ్చును గానీ కేసీఆర్‌ ధనవంతుడు కాదు గదా! 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నికల ఖర్చు కోసం అప్పులు చేసిన ఇదే కేసీఆర్‌, ఈ తొమ్మిదేళ్లలో ఇతర పార్టీలకు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారు? దేశంలో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ వద్ద కూడా లేనంతగా కేసీఆర్‌ పార్టీ వద్ద వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరాయి? ఎన్నికల బాండ్ల రూపంలో ప్రస్తుత బీఆర్‌ఎస్‌కు విరాళాలు ఇవ్వడానికి ప్రైవేటు కంపెనీలు ఎందుకు పోటీ పడుతున్నాయి? అసలు తెలంగాణలో ఏమి జరుగుతోంది? ఈ అంశాలపై లోతైన పరిశోధన అవసరం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కేసీఆర్‌ వద్ద ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు పోగయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా ఉన్నవారు తెలంగాణ వనరులను చెరబట్టారని, భూములను కబ్జా చేశారని ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ అండ్‌ కో ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకుడు కూడా సాహసించని విధంగా ఇప్పుడు తెలంగాణలో దోపిడీ జరుగుతోందన్నది వాస్తవం. అభివృద్ధి పేరిట భారీ దోపిడీకి తెర లేపారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డిని మించి తెలంగాణలో ఇప్పుడు దోపిడీ జరుగుతోందా? అంటే కాదనలేని పరిస్థితి! హైదరాబాద్‌ మహానగరం ప్రస్తుత పాలకులకు పాడి ఆవుగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించని భూములను ఇప్పుడు సునాయాసంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వానికి చెందవలసిన వందలు, వేల ఎకరాల భూములు ప్రైవేట్‌ వ్యక్తుల పరమవుతున్నాయి. న్యాయవ్యవస్థను అడ్డు పెట్టుకొని 111 జీవో పరిధిలో ఉన్న భూములకు కూడా మినహాయింపులు ఇస్తున్నారు. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. నిజాంల కారణంగా హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి దఖలు పడ్డాయి. కాలక్రమంలో ఈ భూములపై కన్నేసిన కొంతమంది ఏవో కాగితాలు సృష్టించి వాటిని కాజేశారు. అయితే వాటిని ముట్టుకోవడానికి గానీ, ప్రైవేటు పరం చేయడానికి గానీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. కేసీఆర్‌ పాలనలోనే ఇది సాధ్యమవుతోంది. గతంలో ఎవరైనా కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందినా ప్రభుత్వం అప్పీళ్లకు వెళ్లేది. ఇప్పుడు అలా జరగడం లేదు. హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో వంద ఎకరాల భూమిని ప్రభుత్వ వివాదం నుంచి తప్పించి ప్రైవేట్‌ వ్యక్తులకు క్లియర్‌ చేస్తే కనీసం వెయ్యి కోట్లు వచ్చి పడుతున్నాయి. పాలకులకు ఈ భూములు కల్పతరువులుగా మారాయి. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం వెయ్యి ఎకరాలకు పైగా వివాదాస్పద భూములు ప్రైవేటు పరమయ్యాయి. ఇవే కాకుండా భూ వినియోగ మార్పిడి, మాస్టర్‌ ప్లాన్‌ నుంచి మినహాయింపులు ఉండనే ఉన్నాయి. నివాసేతర భూములను నివాస జోన్‌లోకి మార్చడం కోసం భూ విలువలో 20 శాతం వసూలు చేస్తున్నారు. ఈ భూ బాగోతాలన్నీ చెప్పాలంటే నెల రోజుల పాటు సీరియల్‌గా పత్రికల్లో ప్రచురించాల్సి వస్తుంది. భూముల వ్యవహారమే కాకుండా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో కూడా భారీ అవినీతి చోటుచేసుకుంటోంది. అభివృద్ధి పేరిట హైదరాబాద్‌లో భవనాల ఎత్తు, ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)పై పరిమితులు ఎత్తేశారు. ఒక ఎకరం భూమిలో ఐదు లక్షల అడుగులకు పైగా భవనాల నిర్మాణానికి అనుమతిస్తున్నారు. 40 అంతస్తులు, 50 అంతస్తుల భవనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. ఇందులో కూడా భారీ అక్రమాలు జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏమిటి? అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 50, 60 అంతస్తుల భవనాలకు తగినన్ని రోడ్లు ఉన్నాయా? ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ ఉన్న సర్వీస్‌ రోడ్లను ఇప్పటికే వెడల్పు చేయాల్సిన దుస్థితి. భవనాల నిర్మాణం పూర్తి కాకముందే నానక్‌రామ్‌గూడ, కోకాపేట తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. పాలకుల ధనదాహం ఆధునిక హైదరాబాద్‌ను ముంచేయబోతున్నది. దేశంలో మరే నగరంలో లేని విధంగా హైదరాబాద్‌లో మాత్రమే ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు ఎత్తేయడం ఏమిటి? అనుమతులు ఇస్తున్నవారూ, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్న వారూ బాగానే ఉంటారు. అక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏమిటి? తెలంగాణ జాతిపితగా చెప్పుకొనే కేసీఆర్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మహానగరం హైదరాబాద్‌కు భవిష్యత్తు లేకుండా చేస్తున్న కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ఏమి సాధిస్తారు? దేశంలోని అన్ని నగరాలనూ ఇలాగే ధ్వంసం చేస్తారా?

బాండ్ల ద్వారా బ్లాక్‌ టు వైట్‌!

ఇప్పుడు ఎన్నికల బాండ్ల విషయానికి వద్దాం. ప్రైవేట్‌ కంపెనీలు తమ లాభాల నుంచి కొంత మొత్తాన్ని అధికారికంగా రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చే వెసులుబాటును ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును తనకు అనుకూలంగా మలచుకున్న కేసీఆర్‌, తన వద్ద నగదు రూపంలో పేరుకుపోయిన డబ్బును ఎన్నికల బాండ్ల రూపంలోకి మార్చుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వంతో అవసరం ఉన్న కంపెనీలకు నగదు ఇచ్చి అంతకు సమానంగా ఎన్నికల బాండ్లు తీసుకోవడం ఈ కొత్త పద్ధతి. అంటే నగదును ఎన్నికల బాండ్ల రూపంలో మార్చుకొని వైట్‌ మనీగా చేసుకుంటున్నారు. ఇలా చేయడం మనీలాండరింగ్‌ కిందకు వస్తుందో లేదో తెలియదు. ఈ మార్పిడి కారణంగానే బీఆర్‌ఎస్‌ వద్ద వెయ్యి కోట్ల రూపాయల వరకు నగదు నిల్వలు ఉన్నాయి. మొత్తంమీద తెలంగాణ సంపదను ఆసరాగా చేసుకొని జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వనరులు ఏ మేరకు దోపిడీ అయ్యాయో తెలియదు గానీ ఉద్యమ నాయకుడి పాలనలో మాత్రం భారీ దోపిడీకి తెరలేచింది. తమాషా ఏమిటంటే కేసీఆర్‌ పాలనలో అత్యధిక ప్రయోజనం పొందింది కూడా ఆంధ్రకు చెందిన వ్యాపారులే. ఇప్పుడు ఇతర రాష్ర్టాలలో రాజకీయంగా బలపడటం కోసం తెలంగాణ సంపదను కేసీఆర్‌ తరలిస్తున్నారు. ఈ విషయం అర్థమైతే తెలంగాణ సమాజంలో కచ్చితంగా అలజడి ఏర్పడుతుంది. తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయని నమ్మడం వల్లనే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ వెంట నడిచారు. ఇప్పుడు కంచే చేను మేస్తున్నదంటే ప్రజలు సహించబోరు. జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్‌ తప్పుగా అంచనాలు వేసుకుంటున్నారు. అందుకే వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకోవడం కోసం వందలు, వేల కోట్ల రూపాయలు వెదజల్లడానికి సిద్ధపడుతున్నట్టున్నారు. దీనివల్ల మొదటికే మోసం రావొచ్చు. అదే జరిగితే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా అక్రమంగా సంపాదించిన సొమ్ము పరాయి రాష్ర్టాల పాలవుతుంది.

జనాన్ని ముంచే జగనామిక్స్‌!

తనకు అంగ బలం, అర్థ బలం, మీడియా బలం లేదంటూ చిలకలూరిపేటలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోటి నుంచి బీద అరుపులు విన్నాక ఆయన నటనకు ఆస్కార్‌ అవార్డు కూడా సరిపోదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని గతంలో అనేవారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి మాటలకు కూడా అర్థాలు వేరే అని కలుపుకొని చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాలలో అర్థ బలం, అంగ బలం, మీడియా బలం జగన్‌కు మించి ఎవరికుంది? ఆ మాటకొస్తే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికే రికార్డులకెక్కారు. ‘నా ఎకనామిక్స్‌ వేరే. అవి మీకు అర్థం కావు’ అని ఆ మధ్య శాసనసభలో జగన్మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాట మాత్రం నిజం. జగన్‌ అనుసరిస్తున్న ఆర్థిక శాస్ర్తాన్ని తలపండిన ఆర్థిక పండితులు కూడా అర్థం చేసుకోలేరు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచి పెడుతూ ఆ మాటున సొంత లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడమే జగన్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానం. రాష్ట్రంతో పాటు ప్రజలను కూడా అప్పులపాలు చేస్తూ ఆర్థికంగా అందనంత ఎత్తుకు తాను ఎదగడం జగన్‌కు మాత్రమే తెలిసిన ఆర్థిక శాస్త్రం. మచ్చుకు జగన్‌కు చెందిన రెండు కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలిద్దాం. అధికారంలో లేనప్పుడు 2018లో జగన్‌కు చెందిన సాక్షి పత్రికకు తొమ్మిది కోట్ల రూపాయల నష్టం రాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఆ పత్రిక లాభం అమాంతం 139.9 కోట్ల రూపాయలకు పెరిగింది. 2018లో భారతీ సిమెంట్‌ లాభం 191 కోట్ల రూపాయలు కాగా, 2020–2021 నాటికి 329 కోట్ల రూపాయలకు పెరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆర్థిక నైపుణ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఇదే విధంగా పెరిగిందని ఆయన చెప్పగలరా? జగన్‌ కంపెనీలు మాత్రమే లాభాల్లో పరుగులు తీస్తుండగా రాష్ట్రం అప్పుల పాలవడం ఏమిటి? రాష్ట్రం ఆర్థికంగా పతనమైందని, అభివృద్ధి కుంటుపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అంగీకరించారు కదా! అధికారంలో లేనప్పుడు నష్టాల్లో ఉన్న తన పత్రికను అధికారంలోకి రాగానే వందల కోట్ల రూపాయల లాభాల్లోకి ఎలా తీసుకురాగలిగారో జగన్‌ చెప్పాలి కదా! తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సొంత పెట్టుబడి లేకుండా ప్రపంచ చరిత్రలోనే లేనివిధంగా వందల కోట్ల రూపాయలు సమీకరించి పత్రికను, చానల్‌ను ప్రారంభించిన జగన్‌కు తానే అధికారంలో ఉన్నప్పుడు లాభాలు ఆర్జించి పెట్టడం కష్టం కాదు కదా! చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికీ ప్రకటనలు జారీ చేస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి వందల కోట్ల రూపాయలను సొంత మీడియాకు తరలించిన జగన్‌ ఎకనామిక్స్‌ను అర్థం చేసుకోవడం నిజంగానే కష్టం. సొంత కంపెనీల విషయంలోనే కాకుండా రాష్ట్ర వనరులను చెరబట్టడం లేదా అనుచరులకు అప్పగించడం ద్వారా చేస్తున్న దోపిడీ లెక్క వేరే. ఒక్క కృష్ణపట్నం పోర్టు కొనుగోలు వ్యవహారంలోనే వెయ్యి కోట్లు సొంతం చేసుకున్న ఘనాపాఠిని గుర్తించకపోతే ఎలా? అయినా తనకు అర్థ బలం లేదనీ ఆయన చెబితే ప్రజలు నమ్మాల్సిందే. దీన్నిబట్టి ఆయన దృష్టిలో జనం అమాయకులన్న మాట. అంగ బలం విషయానికి వద్దాం. బంధుమిత్రులను బలగంగా చెప్పుకొంటాం. దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబంతో పాటు ఆయన ఆత్మలు, అంతరాత్మలు కూడా ఇప్పుడు జగన్‌కు దూరంగా ఉన్నారు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి సతీమణి భారతి కుటుంబాన్ని జగన్‌ చేరదీశారు. దీంతో బంధువుల కొరత తీరిపోయింది. ఇక మిత్రులంటారా.. జగన్‌కు మిత్రులు ఎవరో చెప్పలేని పరిస్థితి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పినట్టుగా, జగన్‌కు ఉండే సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే. మిత్రులైనా, మరెవరైనా ఆర్థికంగా ప్రయోజనం లేని పక్షంలో దగ్గరకు రానివ్వరు. ఇక మీడియా బలం విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్షాలకు కనీస ప్రచారం కూడా ఇవ్వకుండా, వారికి చోటే లేకుండా నియంత్రిస్తున్న ఘనత జగన్‌ సొంతం. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని న్యాయ వ్యవస్థను కూడా నియంత్రించే పనిలో ఉన్నారు. గిట్టని మీడియాను వేధిస్తున్నట్టుగానే గిట్టని న్యాయమూర్తులను బదిలీ చేయించగలిగే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు చెప్పండి! అంగ బలం, అర్థ బలం, మీడియా బలం విషయంలో జగన్‌తో ఎవరైనా సరితూగగలరా? తాను ఏం చెప్పినా జనం నమ్ముతారన్నది ముఖ్యమంత్రి విశ్వాసం. ఈ కారణంగానే రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసి కూడా జగనన్నే భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ రంగులతో ఉన్న సంచులను తగిలించుకొని ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటాయి. నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక వ్యాపారంలోకి దిగినవారు ఇసుకకు డిమాండ్‌ లేక నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి! గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన పాలనను వెక్కిరిస్తున్నప్పటికీ ప్రతిరోజూ వచ్చే కలెక్షన్లు లెక్కబెట్టుకుంటూ మురిసిపోవడం జగన్‌కే చెల్లుతుంది. అయినా జగనన్నే మా భవిష్యత్తు అని నమ్మి మళ్లీ తనకే అధికారం కట్టబెట్టాలని ఆయన కోరుతున్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ప్రజలు మళ్లీ ఆయనకే అధికారం ఇస్తే? నా మటుకు నాకైతే జగన్‌ రెడ్డి ఇంకో పర్యాయం అధికారంలోకి వస్తే గానీ రాష్ట్ర విధ్వంసం సంపూర్ణం కాదన్న అభిప్రాయం కలుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు అని తెలంగాణకు చెందిన ఒకరిని ప్రశ్నించగా, ‘ఏం జరుగుతోందో చూస్తూ కూడా ఎవరు అధికారంలోకి వస్తారని ప్రశ్నించడాన్ని బట్టి మీకు జరిగిన నష్టం చాల్లేదనిపిస్తోంది’ అని బదులిచ్చారు. ఇందులో నిజం ఉంది. అప్పులతో మాత్రమే కాలం గడుపుతున్న జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని గాడిన పెట్టడానికి ఏంచేస్తారో ముందుగా చెప్పాలి. అప్పులు పుట్టినంత కాలం బటన్లు నొక్కుతుంటా అని చెప్పడానికైతే జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఉజ్వల భవిష్యత్తు కోసం తన ఇద్దరు కూతుళ్లను విదేశాల్లో చదివించుకుంటున్న జగన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రజలు కూడా తమ పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి మంచి జీవితం లభించాలని కోరుకుంటారని విస్మరిస్తే ఎలా? పథకాల పేరిట విదిల్చే ముష్టిపై ఆధారపడాలా? ఈ ఒక్క విషయమై సంతృప్తికర సమాధానం చెప్పిన మీదట జగనన్నే భవిష్యత్తు అని చెప్పుకొంటే అర్థం ఉంటుంది. ఈ దిశగా కార్యాచరణ లేకుండా బటన్లకే పరిమితం అయ్యే మనిషిని నమ్ముకుంటే అడుక్కుతినడానికి కూడా ఏమీ మిగలదు. తేల్చుకోవాల్సింది జనమే. తాను కుబేరుడిగా మారుతూ ప్రజలను బికారులుగా మార్చే ముఖ్యమంత్రి ఎవరూ గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందరు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. జగన్‌ మాయ నుంచి ప్రజలు బయటపడి తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఆశిద్దాం. అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఏమి మిగిలి ఉంది కనుక జగనన్నే మా భవిష్యత్తు అనుకోవడానికి!

ఆర్కే

Updated Date - 2023-04-09T01:01:58+05:30 IST