RK Kothapaluku: కేసు ఓడు.. భూమి కోల్పో!
ABN , First Publish Date - 2023-05-07T00:53:00+05:30 IST
న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వ ఆస్తులు, భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులతో ఏర్పడిన వివాదాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయి. ఆ కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చేలా...
న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వ ఆస్తులు, భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులతో ఏర్పడిన వివాదాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయి. ఆ కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేయాలని అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌ను ఏ ముఖ్యమంత్రైనా కోరతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలకాలంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 8 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఒక భూ వివాదంలో ప్రభుత్వ వాదన వీగిపోయేలా చూడాల్సిందిగా కేసీఆర్ కోరడాన్ని సంబంధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూవివాదాల్లో ప్రభుత్వాలు ఎంత దూరమైనా వెళతాయి కానీ.. భూమిపై హక్కును వదలుకోవు. కింది కోర్టులలో తీర్పులు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వచ్చిన సందర్భాలలో పై కోర్టులకు అప్పీల్‌కు వెళతాయి. ఇలా సుప్రీంకోర్టు వరకూ ప్రభుత్వం వెళుతుంది. ఇటువంటి వ్యాజ్యాలలో ప్రభుత్వంతో పోరాడలేక ప్రైవేటు వ్యక్తులు మధ్యలోనే అలసిపోతారు. ఫలితంగా అత్యంత విలువైన భూములు ప్రభుత్వానికి దఖలుపడతాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ వేల కోట్ల రూపాయల విలువచేసే భూముల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ భూముల విషయంలో ప్రభుత్వం తన హక్కు కోల్పోవలసి వస్తే ప్రజల సంపద ప్రైవేటు వ్యక్తులపరమవుతుంది. ‘‘న్యాయ స్థానాల నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకోండి.. భూములు సొంతం చేసుకోండి’’ అనే నినాదం ఇప్పుడు తెలంగాణలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ కేసులలో తుది తీర్పులు పెండింగ్‌లో ఉన్నందున ఆయా భూములు ప్రస్తుతానికి పరులపాలు కాలేదు. తెలంగాణలో కొంతమంది అధికారులు కూడా నియమ నిబంధనలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడానికే తామున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివారిలో అరవింద్ కుమార్, జయేశ్ రంజన్ ముందు వరుసలో ఉంటారు. పాలకులకు ఊడిగం చేయడంలో ఏ మాత్రం సంకోచం లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు ఏడెనిమిదేళ్లుగా కీలక శాఖల్లోనే పాతుకుపోయారు. తెలంగాణలో ఎంతోమంది అధికారులు ఉన్నప్పటికీ ఐదారుగురి చేతుల్లోనే కీలక శాఖలు ఉన్నాయంటే పాలకులు, అధికారులు ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవచ్చు. 2014లో మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిక్కచ్చిగా వ్యవహరించేవారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా గానీ, భూముల వివాదంలో గానీ ఎవరు జోక్యం చేసుకున్నప్పటికీ, చివరకు తన కుటుంబసభ్యులు అడిగినప్పటికీ సహించవద్దనీ, పట్టించుకోవద్దనీ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే కేసులు ఓడిపోండి అని అంటుండటంతో ఎవరికివారు అందినంత దోపిడీకి పాల్పడుతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచే కేసీఆర్ వ్యవహార సరళిలో మార్పు వచ్చిందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తుల పాల్జేయాలనుకోవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రారంభంలో ఉత్తరాదిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు, సరిహద్దు ఘర్షణలలో మృతి చెందిన వీరజవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించిన కేసీఆర్, ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెట్టుబడి పెడుతున్నారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇందుకు అవసరమైన నిధుల కోసం భూములపై కన్నేశారు. భూముల డీల్స్ అన్నీ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాటి గురించి చెప్పుకొందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదారేళ్లపాటు ప్రభుత్వ పెద్దల నుంచి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఒత్తిళ్లు ఉండేవి కావు. కిందిస్థాయి అధికార పార్టీ నాయకులు కూడా వారి జోలికి పోకుండా కట్టడి చేసేవారు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వాలని పై నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే 10 కోట్ల వరకు సహాయం చేసే కంపెనీలకు కూడా ఇప్పుడు టార్గెట్ విధిస్తున్నారు. ఈ హిట్ లిస్టులో ఫార్మా రంగం ముందుంది. రెండు పెద్ద కంపెనీలను 200 కోట్ల రూపాయల వరకు బాండ్లు ఇవ్వాలని ఆదేశించారు. అందులో ఒక కంపెనీకి చెందినవారు ‘‘ప్రభుత్వం నుంచి మేం ఏమీ ఆశించలేదు. అయినా అంత మొత్తం ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇవ్వగలం?’’ అని ప్రశ్నించగా మీరు ఇక్కడే వ్యాపారం చేస్తున్నారుగా అని బదులిచ్చారట. మరో కంపెనీ వారు మాత్రం ప్రస్తుతానికి 100 కోట్ల మేరకు బాండ్లు ఇచ్చుకున్నారట. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం కంటే ముందు నుంచీ అధికారంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు కూడా ఢిల్లీలో సొంత పార్టీ కార్యాలయాలు లేవు. దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కూడా ఢిల్లీలో కార్యాయాలు ఏర్పాటు చేసుకోలేదు. అలాంటిది కేసీఆర్ మాత్రమే ఢిల్లీలో భారత రాష్ట్ర సమితికి సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి ఉంది. అప్పటివరకూ ఎన్ని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులపరం చేస్తారో చూద్దాం. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ వ్యవహారం ప్రభుత్వానికి చుట్టుకుంది. ఇందులోనుంచి కేసీఆర్ ఎలా బయటపడతారో చూడాలి. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీల నాయకులెవరూ కేసీఆర్ వలే డబ్బుతో చక్రం తిప్పలేదు. ఇది కేసీఆర్ మాత్రమే ఎంచుకున్న విధానం. ఈ పోకడలను గమనిస్తున్న తెలంగాణ సమాజం రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూద్దాం!
జగన్ రాయబేరాలు!
ఇప్పుడు ఏపీ విషయానికొద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో విజయం పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందా? అధికారంలోకి వచ్చాక తనకు దూరమైన వారిని, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? బంధాలు, అనుబంధాలను కూడా ఖాతరు చేయకుండా కాదనుకున్నవారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆస్తుల పంపకం విషయమై ఏర్పడిన వివాదం కారణంగా జగన్ సోదరి షర్మిల ఆయనకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్ల మధ్య మాటామంతీ కూడా లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చేవరకూ తమను ఉపయోగించుకున్న జగన్, ఆ తర్వాత తమను కరివేపాకులా తీసిపారేయడంపై షర్మిల దంపతులు ఆగ్రహంగా ఉన్నారు. ఆస్తులను పంచివ్వడానికి జగన్‌రెడ్డి నిరాకరించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని తమ వ్యాపారాలకు నష్టం చేయడం, అక్కడితో ఆగకుండా తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి తమకు నష్టం చేయడంపై షర్మిల దంపతులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో షర్మిల భర్త బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల వరకూ షర్మిల, విజయలక్ష్మితో పాటు బ్రదర్ అనిల్ కూడా జగన్ విజయం కోసం కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన క్రైస్తవులను జగన్‌వైపు మళ్లించడంలో బ్రదర్ అనిల్ పాత్ర విస్మరించలేనిది. మారిన పరిస్థితులలో ఇదే బ్రదర్ అనిల్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు వ్యతిరేకంగా చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించి క్రైస్తవులలో కొంతమందైనా దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిసి జగన్ అండ్ కో కలవరపాటుకు గురవుతున్నారు. బ్రదర్ అనిల్ బయటపడి ప్రచారం చేస్తే జరిగే నష్ట తీవ్రతను గుర్తించిన జగన్‌రెడ్డి విరుగుడు చర్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తనకు నమ్మినబంటు అయిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తల్లి విజయమ్మ వద్దకు రాయబారానికి పంపారు. జగన్ నుంచి క్రైస్తవులను దూరం చేయకుండా బ్రదర్ అనిల్‌ను కట్టడి చేయవలసిందిగా విజయలక్ష్మిని వేడుకోవడమే ఈ రాయబారం ఉద్దేశం. పుత్రరత్నం నుంచి అందిన సందేశాన్ని విన్న విజయమ్మ.. షర్మిల సంగతి ఏమిటని ప్రశ్నించారట. ఆస్తుల వివాదం పరిష్కరించుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు కదా అని విజయలక్ష్మి అన్నారని తెలిసింది. సజ్జల రాయబారం ఫలించకపోవడంతో ముఖ్యమైన బంధువులను మళ్లీ రాయబారానికి పంపారు జగన్మోహన్‌రెడ్డి. ఈ బృందంలో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, చెన్నైలో నివసించే జగన్ కజిన్ అనిల్ ప్రభృతులు ఉన్నారు. ఈ దఫా పంపిన సందేశమేమిటంటే 2024 ఎన్నికలలో జగన్‌కు నష్టం చేయకుండా సైలెంట్‌గా ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే ఆస్తుల పంపకం పూర్తిచేస్తామని జగన్ తరఫున వీరు హామీ ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో జగన్మోహన్‌రెడ్డి నైజం తెలిసిపోవడంతో ఈ ప్రతిపాదనను షర్మిల దంపతులు నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం కాకపోతే 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎలా పరిష్కారమవుతుందని షర్మిల దంపతులు ప్రశ్నిస్తున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. 2019లో అధికారంలోకి రాగానే జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లారు. ప్రభువును దర్శించుకుని ప్రార్థన కూడా చేయకముందే, ఆస్తులు ఆ క్షణం పంచుకుందామని జగన్ ప్రతిపాదించారట. ఊహకు కూడా అందని ఈ ప్రతిపాదన, అది కూడా క్రైస్తవులు పవిత్ర ప్రదేశంగా భావించే జెరూసలెంలో జగన్ నోటి నుంచి రావడంతో దిగ్ర్భాంతికి గురైన షర్మిల ఆ తర్వాత బోరున విలపించినట్టు తెలిసింది. జగన్ నిజరూపం లీలామాత్రంగా తెలియడంతో అప్పటికి షర్మిల మౌనంగా ఉండిపోయారట. నిజానికి సోదరుడు అధికారంలోకి వస్తే తాను రాజ్యసభకు వెళ్లవచ్చని షర్మిల భావించారట. అదేమీ జరగకుండానే ఏవో కొన్ని ఆస్తులను పంచేసి షర్మిలను వదిలించుకోవాలని జగన్ భావించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. మొత్తంమీద ఆస్తుల పంపకం తేలకుండానే జెరూసలెం పర్యటన పూర్తిచేసుకుని వచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకు షర్మిల దంపతులకు జగన్ నుంచి పిలుపు వచ్చింది. షర్మిల దంపతులు వెళ్లేసరికి ఆస్తులకు సంబంధించి ఒక జాబితాను జగన్ సిద్ధం చేసుకున్నారు. షర్మిల వాటా కింద ఇవ్వాలనుకుంటున్న కొన్ని ఆస్తుల జాబితాను జగన్ చదివి వినిపించగా, సరస్వతి సిమెంట్ కంపెనీ తనకే ఇవ్వాలి కదా అని షర్మిల ప్రశ్నించారు. తర్జనభర్జన అనంతరం జగన్‌రెడ్డి అందుకు అంగీకరించారట. మొత్తంమీద షర్మిలకు ఇవ్వాలనుకుంటున్న పది ఆస్తులపై ఆమెకే పూర్తి హక్కు ఉంటుందని స్టాంపు పేపర్‌పై రాసి సంతకం చేసి జగన్ ఇచ్చారు. తనకు రావాల్సిన మొత్తం ఆస్తులను కాకుండా.. కొన్ని ఆస్తులనే ఇవ్వజూపడం, అందులోనూ తాను కోరుకున్న ఆస్తులను నిరాకరించడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ అప్పుడు మౌనంగానే ఉన్న షర్మిల దంపతులు తిరిగి వెళ్లిపోయారు. దీంతో అధికారంలో తనకు ఏ పాత్రా లేకుండా చేయడంతోపాటు ఆస్తులను కూడా న్యాయబద్ధంగా పంచలేదన్న అభిప్రాయంతో ఉన్న షర్మిల, అప్పటి నుంచి రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలతో అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగింది. ఒప్పంద పత్రంపై స్వయంగా పేర్కొని సంతకం చేసిచ్చిన ఆస్తులు కూడా షర్మిలకు బదిలీ కాలేదు. ఇద్దామనుకున్న వాటినైనా ఇస్తే బావుంటుంది కదా అని విజయలక్ష్మి చేసిన సూచనను కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టారట. ఈ లోపు వివేకానందరెడ్డి హత్య కేసులో చోటుచేసుకున్న ట్విస్టులతో డాక్టర్ సునీతకు మద్దతుగా షర్మిల నిలిచారు. ఆ తర్వాత షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడం జగన్ ఆగ్రహానికి కారణమైంది.
ఎవరికీ నో హ్యాపీస్!
మొత్తంగా ఆస్తుల వివాదంతో మొదలైన గొడవ ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రదర్ అనిల్ అడపాదడపా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని క్రైస్తవులకు వివరించడం మొదలుపెట్టారు. తన పాలనపై ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత ఉన్నందున ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎంతో కొంత శాతం దూరమైతే 2024 ఎన్నికలలో ఒడ్డున పడటం కష్టమని జగన్ అండ్ కో ఆందోళన చెందుతున్నారు. ఫలితంగానే ఈ రాయబారాలు! అన్నాచెల్లెళ్ల మధ్య పరస్పర విశ్వాసం కొరవడినందున ఒకరి ప్రతిపాదనను మరొకరు తిరస్కరిస్తున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదని, జగన్ అధికారంలోకి వచ్చాక మైనింగ్ కార్యకలాపాలను మొత్తంగా కట్టడి చేయడం షర్మిలను అధికంగా బాధించిందని చెబుతున్నారు. ఆయా కంపెనీలలోకి ఇన్వెస్టర్లు కూడా రాకుండా అడ్డుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే బంధువులు నెరపిన రాయబారం కూడా ఫలించలేదు. అంతేకాదు రాయబారానికి వచ్చినవాళ్లు కూడా జగన్ వద్ద తాము బావుకుంటున్నదేమీ లేదని, పిలిచినప్పుడు మాత్రమే వెళ్లి చేయమని చెబుతున్న పనులు చేస్తున్నామని గోడు వెళ్లబోసుకున్నారట. దీన్నిబట్టి జగన్ చుట్టూ ఉంటూ కెమెరాల ముందు జబ్బలు చరుచుకుంటున్నవారు కూడా మనసులో సంతోషంగా లేరని స్పష్టమవుతోంది. జగన్ తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో చెన్నైలో నివసించే కజిన్ అనిల్‌ను ప్రతివారం కలుసుకుందామని చెప్పి ఆ తర్వాత నెలకు ఒకసారికి కుదించారట. ఆ తర్వాత అవసరమైనప్పుడు నేనే పిలుస్తాలే అని జగన్ నోటి నుంచి రావడంతో కజిన్ అనిల్ నిర్ఘాంతపోయారట. షర్మిలతో రెండు దఫాలుగా రాయబారాలు నడిపినా ఫలితం రాకపోవడంతో కింకర్తవ్యం అన్న ఆలోచనలో జగన్ అండ్ కో ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు కొడుకు, ఇటు కూతురికి నచ్చచెప్పలేక విజయలక్ష్మి సతమతమవుతున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్‌రెడ్డి మరికొన్ని అడుగులు వెనక్కి వేసి షర్మిల కోరుకున్న ఆస్తులను ఇప్పటికిప్పుడు పంచి ఇచ్చే సంధి చేసుకుంటారా? లేక సమరానికి సిద్ధపడతారా? అన్నది మరికొద్ది రోజులలో తేలిపోతుంది. ప్రస్తుతానికైతే షర్మిల దంపతులు వెనకడుగు వేసే మూడ్‌లో లేరు.
అవినాశ్.. అంతులేని కథ!
ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యోదంతానికి వద్దాం. ప్రస్తుతానికి ఈ కేసులో సంబంధీకులందరూ మౌనం పాటిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగన్మోహన్‌రెడ్డి ఆ నలుగురితో సమావేశమైనప్పుడు చిన్నాయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారని నేను గతవారం వెల్లడించాను. దీనిపై వారం గడచినా జగన్ గానీ, ఆ నలుగురు గానీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్పిన విషయాలు వాస్తవం కాదని కూడా ఖండించలేదు. అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఈ విషయాన్ని నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి ‘‘మీరు చెప్పింది నిజమే! అదే రోజు ఈ విషయాన్ని ఆ నలుగురిలో ఇద్దరు మాకు కూడా చెప్పారు’’ అని స్పష్టంచేశారు. ఇప్పుడు సీబీఐ అధికారులు ఏం చేయాలి? ఏం జరిగిందని ఆ నలుగురినీ విచారించి ఉండాల్సింది. వారిలో ఒకరిద్దరిని సంప్రందించడానికి సీబీఐ అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారట. ఆ నలుగురినీ విచారిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దంపతులను కూడా విచారించాల్సి వస్తుంది. బహుశా ఈ కారణంగానే మౌనాన్ని ఆశ్రయించవలసినదిగా సీబీఐకి అదృశ్యశక్తి నుంచి ఆదేశాలు అంది ఉంటాయి. మరోవైపు అవినాశ్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారం కూడా జీళ్లపాకంలా సాగుతోంది. న్యాయస్థానం ఆటంకాలు తొలగిపోయి వారం దాటింది. హైకోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంత అవసరమో చెప్పకనే చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకూ అవినాశ్‌రెడ్డి విషయం ఇలాగే సాగుతూ ఉండవచ్చు. ఆ తర్వాత మరేదో చెప్పవచ్చు. లేదా ఈ లోపుగా సీబీఐ ఫైనల్ చార్జిషీటు దాఖలు చేసి చేతులు దులుపుకోవచ్చు. అదే జరిగితే ఇప్పుడు అవినాశ్‌రెడ్డి అరెస్ట్ అవసరం ఏమిటని న్యాయస్థానమే ప్రశ్నించవచ్చు. ఈ మధ్యలో కొన్ని రోజులుగా మరో విషయం ప్రచారంలోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పకడ్బందీగా ఇరికించడానికి సహకరిస్తే అవినాశ్‌రెడ్డి అరెస్ట్ కాకుండా సహాయం చేస్తామని కొందరు మధ్యవర్తులు ప్రతిపాదించారని విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి, ప్రస్తుతం ఢిల్లీలో జైలులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాల్సి ఉంటుందట. అయితే అందులోకి తనను లాగవద్దని జగన్ చెబుతున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పటివరకూ పార్లమెంట్ ఉభయసభలలో తాము అందించిన సహకారానికి ప్రతిఫలంగా అవినాశ్‌రెడ్డిని కాపాడాలని జగన్ కోరుతున్నారట. ఇప్పుడు తనకు అండగా నిలబడితే 2024లో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతే నమ్మకంగా ఉంటానని జగన్ చెప్పుకొంటున్నారట. ఈ తరహా ప్రచారాలలో అసత్యాలు, అర్ధసత్యాలు ఉండకుండా ఉండవు. వ్యవస్థలు బాధ్యతగా పనిచేయనప్పుడు ఇలాంటి ప్రచారాలకు ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ర్టాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంపొందించడం వంటి అంశాల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ చీకూ చింతా ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతి దానినీ వ్యాపారంగానే చూస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం, అధికారం, వ్యాపారం, నేరపూరిత వ్యూహాలు కలగాపులగమయ్యాయి. ఈ కారణంగానే అధికారం చేజారకుండా చూసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా దగ్గరకు తీసుకుంటారు.. ఎవరినైనా దూరం పెడతారు. కుటుంబసభ్యులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అధికారం కోల్పోతే ఆదాయాన్ని కూడా కోల్పోతానన్నదే ఆయన దిగులు. ఈ పరిస్థితులలో అంతఃపుర కలహాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూద్దాం. అధికారం ఎందుకూ అంటే డబ్బు సంపాదించడానికే అని బలంగా నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుతోనే వ్యక్తులను, వ్యవస్థలను తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు. వివేకానందరెడ్డి హత్య కేసు, రాజధాని అమరావతి విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.
ఆర్కే