Kothapaluku : నియంతృత్వ పోకడల నుంచి ఉపశమనం
ABN , First Publish Date - 2023-05-14T00:39:58+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన మాటల ప్రకారం తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య పొత్తు తథ్యం. అయితే పవన్ కల్యాణ్ ప్రకటనపై...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన మాటల ప్రకారం తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య పొత్తు తథ్యం. అయితే పవన్ కల్యాణ్ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గానీ, కేంద్ర నాయకులు గానీ స్పందించడం లేదు. ఆ పార్టీని కూడా పొత్తుకు ఒప్పిస్తామని బీజేపీ తరఫున జనసేనానే ప్రకటించారు. ఎవరో ఏదో అంటున్నారని, విమర్శిస్తున్నారని త్రిముఖ పోటీకి దిగడం ద్వారా, ఎన్నికల రాజకీయాల్లో బలి కాదలచుకోలేదని స్పష్టంచేయడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ తేటతెల్లం చేయడంతో వైసీపీతో పాటు జగన్ భక్తులలో కలవరం మొదలైంది. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఉంటున్న ఒక సామాజిక వర్గానికి చెందిన యువతను రెచ్చగొట్టడం ద్వారా పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా చూడడం కోసం మంత్రులతో సహా జగన్ భజన చేస్తున్న వాళ్లు నోటికి పని చెబుతున్నారు. జనసేన పరిస్థితి ఏమిటో పవన్ కల్యాణ్ స్పష్టంగా వివరించినప్పటికీ ముఖ్యమంత్రి అవడానికి మీకు దమ్ము లేదా? సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా లేదా? పూజకు పనికిరాని పువ్వు.. అంటూ కొన్ని తీతువు పిట్టలు విమర్శలు మొదలుపెట్టాయి. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకూడదని కోరుకునే జగన్ భక్తులు నిద్రకు కూడా దూరమవుతున్నారు. పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు గానీ ముఖ్యమంత్రి పదవిని అడగండి అని పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో వలె ఈ మూడు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని నమ్మతున్నవాళ్లే ఇప్పుడు కలవరం చెందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన పాలనపై తానే మురిసిపోతున్నారు. ఆయనను సమర్థించేవారు కూడా ఆహా ఓహో అంటూ చిడతలు వాయిస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. జగన్ ప్రభుత్వ పనితీరు నిజంగా అద్భుతంగా ఉంటే పొత్తుల గురించి ఆయన భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్‌కు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పాలన ఉండివుంటే అంతకంటే ఎక్కువ శాతం ఓట్లు రావాలి కదా! అలా వస్తాయని జగన్‌కు వత్తాసు పలికే రాతగాళ్లు, కూతగాళ్లు అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయినా కలవరం ఎందుకో తెలియదు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందన్నది విస్తృత అభిప్రాయం. అయితే జగన్ చుట్టూ ఉన్న భజనపరులకు ఈ అభిప్రాయం వినపడదు. అయినా అందరూ ఉలిక్కిపడుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌ను తిట్టే పనిలో బిజీ అయిపోయారు. నిజానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్‌రెడ్డి సద్వినియోగం చేసికొని ఉంటే ఎవరు ఎవరితో కలిసినా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. గొప్పగా ఆలోచించకపోయినా సంకుచితంగా ఆలోచించకుండా ఉండివుంటే పొత్తులపై ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.
జగన్ దుష్ట తలంపు!
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు జగన్‌రెడ్డి ఏ గతి పట్టించారో మనం చూస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదంటే హైదరాబాద్ మహానగరమే కారణం కాదా? హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం లేకపోయి ఉంటే తెలంగాణలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నారంటే అందుకు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే ఆసరా కదా! ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా రాజధాని కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు జగన్ రెడ్డి కారణం కాదా? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పైసా ఖర్చు లేకుండా రైతులు వేలాది ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. ఇంతటి మహత్తర అవకాశాన్ని కాలదన్నుకున్న జగన్ దుష్ట తలంపులతో అమరావతిని పాడుబెట్టారు. నాలుగేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. పేదలను ముందుపెట్టి రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అమరావతిలో కూడా అదే వికృత క్రీడకు తెర లేపారు. 50 వేల మంది పేదలకు రాజధానిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. జాగ్రత్తగా గమనించిన వారికి ఇది పేదలను వంచించడమే అవుతుందని అర్థమవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్న భూమి ఎవరిది? రైతులది కదా? రైతులు తమ భూమిని ఏ షరతులపై ప్రభుత్వానికి అప్పగించారు? తమ భూమిలో రాజధానిని అభివృద్ధి చేసి తమకు ఇస్తామన్న ప్లాట్లను తమకు కేటాయించాలన్నది ఆ ఒప్పందం సారాంశం. దీన్నిబట్టి రైతులు ఇచ్చిన భూములను ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయకుండా పంచిపెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. రైతులకు, ప్రభుత్వానికీ మధ్య డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ మాత్రమే కుదిరింది. ఆ మేరకు రైతులు తమ హక్కును వదులుకున్నారు. ఈ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించే పక్షంలో ఒప్పందం నుంచి రైతులు తప్పుకోవచ్చు. భూ యజమానులు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల మధ్య డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ జరగడాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా డెవలపర్లు నిబంధనలను పాటించని పక్షంలో భూ యజమానులు ఒప్పందం నుంచి వైదొలగుతామని హెచ్చరిస్తారు. న్యాయస్థానాలు కూడా భూ యజమానుల హక్కులకే ప్రాధాన్యమిస్తాయి. అమరావతిలో కూడా రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇలాంటి డెవలప్‌మెంట్ ఒప్పందమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందానికి తూట్లు పొడవడం మొదలుపెట్టారు. ప్రభుత్వమే ఉల్లంఘనలకు పాల్పడినందున రైతులు తమ భూములను వెనక్కు తీసుకోవచ్చు. ఈ కారణంగానే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో ఒప్పందం ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయకుండా థర్డ్ పార్టీకి ఆ భూములపై ఎటువంటి హక్కూ కల్పించకూడదని స్పష్టంచేసింది. ఈ తీర్పు అమలులో ఉండగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నట్టుగా జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒప్పందం ప్రకారం భూములను అభివృద్ధి చేయకుండా పేదలకు గానీ, మరొకరికి గానీ రైతుల భూములను పంచే అధికారం ప్రభుత్వానికి ఉందా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రైతుల భూములను పందేరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అది ప్రభుత్వ భూమి అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆయన అజ్ఞానానికి లేదా అహంకారానికి చింతించాల్సిందే. ఒప్పందం ప్రకారం ఆయా భూములను అభివృద్ధి చేశాకే మిగిలిన భూమిపై ప్రభుత్వానికి హక్కు దఖలు పడుతుంది. అయినా ఇళ్ల స్థలాల పేరిట పేదలను రెచ్చగొట్టడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలకు చోటులేకుండా చేసిందన్న దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఈ ప్రచారాన్ని హైకోర్టు కూడా కొంతవరకు నమ్మినట్టుంది.
పేదలకు నయ వంచన!
నిజానికి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత మిగిలే భూమిలో ఐదు శాతాన్ని పేదల కోసం చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో కేటాయించింది. ఈ వాస్తవాన్ని మరుగుపరుస్తున్నారు. దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాజధానిలో నలుదిక్కులా ఈ ఐదు శాతం భూములను కేటాయించాలని మాస్టర్ ప్లాన్‌లో నిర్దేశించారు. ఇప్పుడు జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ మాస్టర్ ప్లాన్‌ను ఇష్టమొచ్చినట్టు మార్చారు. రైతుకూ, ప్రభుత్వానికీ మధ్య కుదిరిన డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌కు ఇది విరుద్ధం. మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్న అవసరాలకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాల కోసం కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు తదితర గ్రామాల్లో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కడెక్కడో నివశించే పేదలకు ఈ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏమిటి? భూమిని అభివృద్ధి చేయకుండా ఇళ్ల స్థలాలు ఇస్తే ఉపయోగం ఏమిటి? ఈ వాస్తవం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పేదలను అడ్డుపెట్టుకొని రైతులు–పేదల మధ్య శాశ్వత వైరం సృష్టించాలని కుయుక్తులు పన్నారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చి–డెవలపర్స్ ఇలాగే చేస్తే ఊరుకుంటారా? తాడేపల్లిలో నిర్మించుకున్న ప్యాలెస్ చుట్టుపక్కల పేదలు ఉండకూడదనే కదా గుడిసెలు తొలగించారు? భోగాపురం విమానాశ్రయం కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించారు. అయినా విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ మధ్య ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, అమరావతి రైతులను మాత్రం శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? పైసా నష్టపరిహారం తీసుకోకుండా రైతులు ఇచ్చిన భూములను ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయకుండా వారిని మానసిక క్షోభకు గురిచేయడం ఏమిటి? అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం రైతుల భూములను ఇష్టానుసారం వాడుకొనే అధికారం ప్రభుత్వానికి లేదు. అలా వాడుకోవచ్చని చెప్పే అధికారం న్యాయస్థానానికి కూడా లేదు. రాజధాని నలుమూలలా, అది కూడా అభివృద్ధి చేశాక పేదలకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు కట్టించి ఇవ్వాలిగానీ ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లోనే మొత్తం భూమిని కేటాయించడం ఏమిటి? ఈ వ్యవహారంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు కూడా అపసవ్యంగా ఉంది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తున్నారా? లేదా? అని పట్టించుకోకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని న్యాయస్థానం ఎలా చెబుతుంది? ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది. ఇదే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఒప్పందం ప్రకారం భూమిని అభివృద్ధి చేయకుండా థర్డ్ పార్టీకి రాజధాని భూములపై హక్కు కల్పించకూడదని విస్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత తీర్పు ఆ తీర్పునకు విరుద్ధంగా ఉండవచ్చా? ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తాజాగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనప్పుడు ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య కాకూడదు. అమరావతిని పాడుబెట్టడమే జగన్‌రెడ్డి ఏకైక లక్ష్యం కనుకే ప్రస్తుత తంటా! హైకోర్టు తాజా ఆదేశాల తర్వాత సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా రైతుల భూములను ఇళ్ల స్థలాల కింద కేటాయించడానికి జగన్‌రెడ్డి ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం సదరు ఇళ్ల స్థలాలపై పేదలకు థర్డ్ పార్టీ హక్కు లభిస్తుంది. ఇది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధం. ఇప్పుడు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు కూడా సమర్థనీయంగా లేదు. ద్విసభ్య ధర్మాసనం తన తుది తీర్పులో ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదని స్పష్టం చేసిందే అనుకోండి అప్పుడు పరిస్థితి ఏమిటి? తాజా తీర్పు ప్రకారం ఇళ్ల స్థలాలు పొందే పేదలకు థర్ట్ పార్టీ హక్కు లభిస్తున్నందున వారిని అక్కడి నుంచి ఎవరు ఖాళీ చేయించాలి? హైకోర్టు ఆ బాధ్యత తీసుకోదు కదా! అమరావతి అభివృద్ధికి ఈ పరిస్థితి శాపం కాదా? రైతులతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని గౌరవించకుండా ఆ భూములను పంచిపెట్టుకొనే అధికారం ప్రభుత్వానికి గానీ, పంచిపెట్టుకోండి అని చెప్పే అధికారం న్యాయస్థానానికి గానీ ఉండదు కదా! నిర్ణయించుకున్న లక్ష్యాలకు విరుద్ధంగా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తూ భూములను ఉపయోగించుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఏ న్యాయస్థానమైనా ఎలా చెప్పగలుగుతుంది? ఏ అవసరం కోసం భూములను తీసుకున్నారో ఆ అవసరం కోసమే ఉపయోగించాలన్నది సహజ న్యాయ సూత్రం. విద్యా సంస్థల స్థలాలను ఇతర అవసరాల కోసం వినియోగించడాన్ని ఇదే న్యాయస్థానం గతంలో తప్పు పట్టింది కదా! న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉంటుంది. ఉండి తీరాలి. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నిరాశానిస్పృహలకు గురికావాల్సిన అవసరం లేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించి అమలు చేయని పక్షంలో తమ భూములను తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుకొనే హక్కు రైతులకు ఉంటుంది. ఆ భూములను మళ్లీ వ్యవసాయానికి పనికి రాకుండా చేసి ఉంటే నష్టపరిహారం కోరవచ్చు. ఎవరో రైతు ఇచ్చిన భూమిలోనే శాసనసభ, హైకోర్టును నిర్మించారు. అలా నిర్మితమైన శాసనసభలోనే కూర్చొని రైతులకు ద్రోహం చేయడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా! న్యాయం కోసం రైతులు ఎవరినీ యాచించాల్సిన అవసరం లేదు. అది వారి హక్కు. అమరావతి భూములు జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన పరుల సొమ్ముపై ఆయనకు హక్కు, అధికారం లభించవు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపులపాయలో ఎకరాలకు ఎకరాల్లో ప్యాలెస్‌లు నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు మాత్రం సెంటు భూమి సరిపోతుందని అనుకోవడంలోనే ఆయన వంచన అర్థం కావడం లేదా? లేచింది మొదలు పేదల జపం చేసే జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేస్తున్నది ఏమిటి? సంక్షేమ పథకాల పేరిట ఈ నాలుగేళ్లలో మహా అయితే ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయలు పంచిపెట్టి ఉంటారు. అందుకోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాలకు ప్రచారం పేరిట తన సొంత మీడియా సంస్థలకు ఈ నాలుగేళ్లలో దాదాపు 400 కోట్ల రూపాయలను కట్టబెట్టారు. అంటే, రాష్ర్టాన్ని అప్పులపాల్జేసి కూడా పేదలకు ఇచ్చింది లక్షన్నర రూపాయల వంతున మాత్రమే. సొంతానికి తీసుకున్నది 400 కోట్ల రూపాయలు. ఇంతకంటే దగా ఉంటుందా? మేలుకో ఆంధ్రుడా మేలుకో! జగన్‌రెడ్డి కపటత్వాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఒక్క చాన్స్ అని అడిగితే, నమ్మి అధికారం అప్పగించినందుకు తాము కోల్పోయింది ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు. రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు తెరవాల్సిన వాళ్లు వివిధ కారణాల వల్ల మౌనంగా ఉంటే ఉండవచ్చు గానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ కారణంగానే తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించగానే ఉలికిపాటుకు గురవుతున్నారు.
తెలుగు రాష్ట్రాలపై ప్రభావం
జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు కర్ణాటక ఫలితాలు చూసిన తర్వాతనైనా విజ్ఞత ప్రదర్శిస్తారని ఆశిద్దాం. తెలుగుదేశం–జనసేనతో చేతులు కలపడమా? లేదా? అన్నది భారతీయ జనతా పార్టీ విజ్ఞతకే వదిలేద్దాం. నిజానికి ఆ రెండు పార్టీలకూ బీజేపీ అవసరం లేదు. కర్ణాటకలో హిందుత్వ వాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా కన్నడిగులు ఆ వాదాన్ని తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించడాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. కర్ణాటకలో మోదీ గ్లామర్ పనిచేయలేదని భావించాలి. అధికారం ఉంది కదా అని నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలే అంకుశాన్ని చేతిలోకి తీసుకుంటారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లినా పట్టించుకోని ప్రధానమంత్రి, ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిని మోదీ అలాగే రక్షిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు కాకపోవడం వంటి అంశాలు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోలేవు. నరేంద్ర మోదీని ఢీకొట్టగల సత్తా ఉన్న నాయకుడు దేశంలో లేడన్న భావన ఇక ఉండకపోవచ్చు. తన పోకడల ద్వారా నరేంద్ర మోదీనే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కర్ణాటక ఫలితాలు కచ్చితంగా దోహదం చేస్తాయి. తెలుగునాట కూడా కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరులు అందుతాయి. అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఈ ఫలితాలు ఎంతో కొంత నష్టం చేస్తాయి. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ కావొచ్చు. ఆయనతో స్నేహం చేసిన జేడీ(ఎస్) అధినేత కుమారస్వామి తాజా ఎన్నికల్లో చతికిలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ అగ్ర నాయకులు ఇప్పుడు గుర్తించక తప్పదు. దీంతో బెట్టు వీడి తెలుగుదేశం–జనసేనతో చేతులు కలపడానికి చొరవ తీసుకొనే అవకాశం లేకపోలేదు. నియంతృత్వ పోకడలు ఎక్కడ మితిమీరినా కర్ణాటక వంటి ఫలితాలు దేశ ప్రజలకు ఉపశమనం ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రజాస్వామ్యం బతకాలనుకొనే వారికి మాత్రం కన్నడిగులు నూతనోత్సాహాన్ని కలిగించారు. నియంతృత్వానికి చిరునామాలుగా మారిన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఫలితాలు తుది హెచ్చరికలని చెప్పవచ్చు. కన్నడ ఫలితాలతో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదన్న అభిప్రాయం మళ్లీ బలపడుతోంది. ఇప్పటివరకూ వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన బీజేపీపై కొన్ని అనుమానాలూ, అపోహలూ ఉండేవి. ఎన్నికల్లో గెలుపు కోసం ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అయితే ఇందులో నిజం లేదని పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఫలితాలు రుజువు చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌కు మెజారిటీ రాని పక్షంలో ఏదో జరిగిందని భావించక తప్పదని ఓట్ల లెక్కింపు మొదలయ్యే వరకు పలువురు వ్యాఖ్యానించారు. అయితే ప్రజా తీర్పును ఎవరూ తారుమారు చేయలేరని కన్నడ ఫలితాలతో మరోమారు రుజువైంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి!
ఆర్కే