RK KOTHAPALUKU: షర్మిలా ప్రియాంకం!

ABN , First Publish Date - 2023-05-21T00:40:47+05:30 IST

తెలుగు రాష్ర్టాలలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా పావులు కదుపుతోందా? మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న...

RK KOTHAPALUKU: షర్మిలా ప్రియాంకం!

తెలుగు రాష్ర్టాలలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా పావులు కదుపుతోందా? మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునర్‌వైభవం పొందడం కోసం ప్రియాంకగాంధీ పావులు కదపడం మొదలు పెట్టారు. కర్ణాటకలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించిన ప్రియాంక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై కూడా దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో ఘర్‌వాపసీ కార్యక్రమానికి తెర లేపారు. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. కర్ణాటక ఫలితాల ముందు వరకు తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం అస్పష్టంగా ఉండింది. కేసీఆర్‌తో తలపడే విషయంలో కాంగ్రెస్‌ – బీజేపీ మధ్య పోటీ ఉండేది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కర్ణాటక ఫలితాల ప్రభావం భారతీయ జనతా పార్టీపై పడింది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంక్ష ఆ పార్టీలో బలంగా ఉండింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను బీజేపీలోకి చేర్చుకున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ విజయంతో మునుగోడులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక జరిపించారు. అయితే ఈ దూకుడు వికటించి మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో స్తబ్దత నెలకొంది. పార్టీలోకి చేరికలు కూడా నిలిచిపోయాయి. ఎత్తుగడల విషయంలో ఉత్తరాది వేరు, దక్షిణాది వేరు అన్న వాస్తవాన్ని గుర్తించకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఉత్తరాది మోడల్‌నే దక్షిణాదిలో కూడా అమలు చేయాలనుకుంది. దీంతో ఆ వ్యూహాలు బెడిసికొట్టాయి. దక్షిణాది రాష్ర్టాలలో ఆయా పార్టీల జయాపజయాలు సదరు పార్టీలకు నాయకత్వం వహించే నాయకులను బట్టి ఉంటాయి. వయోభారం కారణంగా యడ్యూరప్పను పక్కనపెట్టడంతో బీజేపీకి కష్టాలు మొదలయ్యాయి. యడ్యూరప్పకు దీటైన ప్రత్యామ్నాయ నాయకులు కనిపించకపోవడంతో బీజేపీ బలహీనపడింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీని సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ కలిసికట్టుగా పనిచేసి విజయ తీరాలకు చేర్చారు. పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది దక్షిణాదిలో ముఖ్యం. నాయకత్వ పటిమ ఆధారంగానే ప్రజల తీర్పు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబును ఓడించడం కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకుని అధికారంలోకి రాగలిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్‌ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి మధ్య కేంద్రీకృతమయ్యాయి. జనసేన కూడా పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత చరిష్మా కారణంగా నిలదొక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ నాయకత్వాన్ని రేవంత్‌రెడ్డికి అప్పగించింది. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్‌ను ఎంచుకుంది.

ఇరువురి నాయకత్వంలో ఆ రెండు పార్టీలు కొంతవరకు బలపడ్డాయి. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టే పరిస్థితి ఏ పార్టీకి ఉంది? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఈ దశలో ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి లాంటివారు బీజేపీలో చేరడం, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు ముదరడంతో బీజేపీది పై చేయిగా అనిపించింది. కర్ణాటక ఫలితాలతోపాటు బీజేపీ అగ్ర నాయకత్వం సాచివేత ధోరణి కారణంగా బీజేపీలో ఎదుగుదల లేకుండా పోయింది. రాష్ట్ర నాయకుల ఆలోచనలు, కేంద్ర నాయకుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా సాగుతున్నాయి. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను తరుణ్‌ ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, ప్రకాష్‌ జీ, బీఎల్‌ సంతోష్‌ జీ వంటివారికి అప్పగించారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి, మొదటి నుంచి బీజేపీలో ఉంటున్న వారికి మధ్య అంతరం ఏర్పడింది. మత ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకోవడాన్ని కొత్తగా పార్టీలో చేరినవారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వైరుధ్యాల గురించి అందరికీ తెలిసిపోవడంతో పార్టీలోకి చేరికలు కూడా నిలిచిపోయాయి. నలుగురిలో చిక్కిన పాము చావదన్నట్టుగా నలుగురైదుగురు కేంద్ర పార్టీ ప్రతినిధులలో ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితి పార్టీ శ్రేణులలో ఏర్పడింది. ఈ పరిస్థితులను గమనించిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుందుడుకు ధోరణులను అవసరాన్ని బట్టి అదుపు చేస్తూ వివిధ కారణాల వలన కాంగ్రెస్‌ పార్టీని వదిలివెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటివారు మనసులో మాట బయటపెడుతున్నారు. ఈ బాటలోనే మరికొందరు ఉన్నారు.

షర్మిలతో కాంగ్రెస్‌ దోస్తీ!

ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంతో పాటు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను కూడా కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనకు మిస్డ్‌కాల్స్‌ వస్తున్నాయి కానీ, ఆ కాల్స్‌కు తాను ఆన్సర్‌ చేయలేదని షర్మిల ప్రకటించినప్పటికీ, దాదాపు నెల రోజుల కిందట షర్మిలతో ప్రియాంక గాంధీ ఫోన్‌లో సుదీర్ఘంగా సంభాషించారు. తెలంగాణలో ఎన్నికలు ముందుగా వస్తున్నందున కలిసి పనిచేద్దామని, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రియాంక ప్రతిపాదించినట్టు తెలిసింది. షర్మిలకు నచ్చజెప్పి కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వానికి సన్నిహితం చేయడంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. బెంగళూరులో ఎక్కువగా ఉండే షర్మిల కుటుంబానికి, డీకే కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరింటికి ఒకరు వచ్చి వెళుతుంటారు. ఈ స్నేహ సంబంధాలతో షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షించడానికి డీకే తన వంతు కృషి చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ షర్మిల అంగీకరించలేదని తెలిసింది. షర్మిల వల్ల తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ప్రయోజనమని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ కారణంగానే ముందుగా తెలంగాణ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసురాలిగా వైఎస్‌ షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా ఉంది. ప్రియాంకతో జరిపిన సంభాషణలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. షర్మిల కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారట! రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు గంపగుత్తగా జగన్మోహన్‌రెడ్డి వైపు మళ్లింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దెబ్బతింది. అదేసమయంలో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించగల చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో లేకపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రియాంక దృష్టి షర్మిలపై పడింది. రాజశేఖరరెడ్డి వారసురాలిగా ఆమెకు పార్టీ నాయకత్వం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే అవకాశం ఉందని, రాహుల్‌ గాంధీ కూడా ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చురుకైన పాత్ర పోషించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చింది. అయితే తెలంగాణలో తన పార్టీ ప్రభావం చూపకుండా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలోకి వెళ్లి కూడా ప్రయోజనం ఉండదని షర్మిల భావిస్తున్నారు. ఈ కారణంగానే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవాలా లేక పొత్తు పెట్టుకోవాలా అన్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ఇంకా నిర్ణయించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సారథ్యం తీసుకోవడానికి షర్మిల అంగీకరించే పక్షంలో 2029 ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నది కాంగ్రెస్‌ నాయకుల ఆలోచనగా ఉంది. క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2024 ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనన్న భావన ఉంది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వ్యవహారం సాఫీగా జరిగిపోతే జగన్‌ ఓటమి తథ్యమన్న భావన బలంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఓడిపోవాలనే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం కోరుకుంటోంది. జగన్మోహన్‌రెడ్డిని ఓడించగలిగితేనే ఆ తర్వాత వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిరిగి ఆకర్షించుకోవచ్చన్నది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని కాంగ్రెస్‌ పార్టీని పునరుజ్జీవింపజేయాలన్నది రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడటం అసంభవంగా కనిపిస్తోంది. జగన్మోహన్‌రెడ్డికి ప్రస్తుతం మద్దతునిస్తున్న వర్గాలు బీజేపీని ఇష్టపడవు. ఈ కారణంగా జగన్‌ అధికారం కోల్పోతేనే ఆంధ్రప్రదేశ్‌లో బలపడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో షర్మిలను ప్రోత్సహించాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను మోసగించగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమను ధిక్కరించడమే కాకుండా, తమ ఓటు బ్యాంకును కూడా గుంజుకున్నారని సోనియా అండ్‌ కో ఆగ్రహంగా ఉన్నారు. ఈ కారణంగానే రానున్న ఎన్నికల్లో ఇటు కేసీఆర్‌, అటు జగన్‌రెడ్డిని ఇంటికి పంపాలని కాంగ్రెస్‌ నాయకత్వం పట్టుదలగా ఉంది. కర్ణాటకలో పార్టీ అధికారంలోకి రావడం కూడా ఇప్పుడు కలిసి వచ్చింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన ముఖ్యులందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి స్కెచ్‌ రెడీ అయింది. మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యూహం ఫలించి ఘర్‌వాపసీ కార్యక్రమం ఊపందుకోనుంది. బీఆర్‌ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీలో చేరాలన్నది తేల్చుకోలేక గుంభనంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ ఇరువురితోపాటు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న మరికొందరు నాయకులు వచ్చే ఒకటి రెండు నెలల్లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇంచుమించుగా అదేసమయంలో బీజేపీలో చేరినవారు కూడా తిరిగి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. కర్ణాటకలో మాదిరి పార్టీలో ఐక్యత సాధించగలిగితే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టం కాదని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బతికించుకోవడం కష్టం కాదని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో మిగిలి ఉన్న నాయకులలో కొందరు జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇప్పటికీ సానుకూలంగా వ్యవహరించడాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు షర్మిలను ఎంచుకుంది. జగన్మోహన్‌రెడ్డి ఆర్థిక ప్రయోజనాలన్నీ తెలంగాణ, కర్ణాటకతో ముడిపడి ఉన్నాయి. ఈ రెండు రాష్ర్టాలలో అధికారంలో ఉంటే జగన్‌రెడ్డిని బలహీనపరచడం తేలిక అని కాంగ్రెస్‌ నాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా కాంగ్రెస్‌ ప్రస్తుత దుస్థితికి కారణమైన జగన్మోహన్‌రెడ్డిని ఢీకొనడానికి అదే రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన షర్మిల మాత్రమే తగిన వ్యక్తి అని కాంగ్రెస్‌ అగ్రనాయత్వం భావిస్తోంది. ఈ కారణంగానే ప్రియాంక చొరవ తీసుకుని షర్మిలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వ ఆలోచనలు, ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై షర్మిల ఫోకస్‌ చేస్తారు. ఆమెకు కాంగ్రెస్‌ నాయకత్వం అప్పగించడంతోపాటు రాజ్యసభకు పంపించాలని కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం తలపోస్తోంది. నిజానికి 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనను రాజ్యసభకు పంపుతారని షర్మిల భావించారు. అలా జరగకపోగా, ఆస్తుల పంపకం విషయంలో తనకు జగన్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని షర్మిల మండిపడుతున్నారు. రాజకీయ పలుకుబడి సంపాదించడం ద్వారానే జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆమె భావిస్తున్నారు. ఈ విషయంలో సంపూర్ణ సహకారాలు అందించడానికి కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ముందుకు వచ్చినందున రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో...!

అవినాశ్‌తో దొంగ–పోలీసాట!

ఇప్పుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో చోటుచేసుకుంటున్న రసవత్తర సన్నివేశాల విషయానికి వద్దాం. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, సీబీఐ అధికారులు దొంగ–పోలీసాట ఆడుతూ ప్రజలకు వినోదాన్ని పంచిపెడుతున్నారు. వివేకా కేసు దర్యాప్తు వ్యవహారంలో సీబీఐ అధికారుల వ్యవహార శైలి రోత పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీబీఐ పట్టుదలగా ఉందన్న అభిప్రాయం కలిగిస్తూనే ఆ వెంటనే సందేహాలకు తావిస్తున్నారు. అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలనుకుంటే సీబీఐకి కష్టమేమీ కాదు. అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని చడీచప్పుడు లేకుండా అరెస్ట్‌ చేయలేదా? అవినాశ్‌ విషయంలో జరుగుతున్న తంతు చూస్తూంటే ఈ దేశంలో ఏ వ్యవస్థను నమ్మాలో తెలియని పరిస్థితి. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రెండు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఇలాంటి ఆదేశాలను ఆమోదించలేమని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో ఇవేమి ఉత్తర్వులంటూ ఆగ్రహం వ్యక్తంచేయడంతో తలపట్టుకోవాల్సిన పరిస్థితి. దర్యాప్తులో సందేహాలకు తావు లేకుండా వ్యవహరించాల్సిన సీబీఐ ఇప్పుడు అవినాశ్‌రెడ్డి విషయంలో ఒకరకంగా కామెడీ పాత్ర పోషిస్తోంది. దీంతో సీబీఐపై గౌరవం పోతోంది. శుక్రవారం చోటుచేసుకున్న డ్రామా దేనికి సంకేతం? ఈ నెల 19న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన అవినాశ్‌రెడ్డి చివరి నిమిషంలో తన తల్లికి బాగోలేదని విచారణకు డుమ్మా కొట్టి పులివెందులకు పయనం కాగా, సీబీఐ అధికారులు ఆయనను అనుసరిస్తూ వెళ్లారు. పులివెందులకు చేరుకోకముందే గంగిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్‌రెడ్డి తల్లిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆమెను పులివెందులకు చెందిన ఓ వ్యక్తి కర్నూలులో నిర్వహిస్తున్న ఆస్పత్రిలో చేర్చారు. అవినాశ్‌ తల్లి పరిస్థితి నిజంగా సీరియస్‌ అయితే హైదరాబాద్‌కు తరలించకుండా కర్నూలు ఆస్పత్రిలో చేర్పించడమేమిటి? తల్లితోపాటు అవినాశ్‌రెడ్డి కూడా అదే ఆస్పత్రిలో ఉండిపోయారు. అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం కూడా బాగోలేదని మధ్యలో ప్రచారం ఒకటి! హైదరాబాద్‌ నుంచి అవినాశ్‌రెడ్డిని అనుసరించిన సీబీఐ అధికారులు కర్నూలు ఆస్పత్రిలోకి వెళ్లి పరిస్థితిని వాకబు చేయకుండా చేతులూపుకొంటూ హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు.. రానూ వచ్చాడు.. అన్న చందంగా సీబీఐ తీరు ఉంది. ఈ ప్రహసనానికి కొసమెరుపుగా అవినాశ్‌రెడ్డికి తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ నెల 22న సీబీఐ ఎదుట హాజరుకావాలన్నది ఆ నోటీసు సారాంశం. అవినాశ్‌రెడ్డిని నిజంగా అరెస్ట్‌ చేయాలనుకుంటే ఈ డ్రామాలన్నీ ఎందుకు? అవినాశ్‌ తల్లి ఆరోగ్యం నిజంగా క్షీణించిందా అని తెలుసుకునే అధికారం సీబీఐ అధికారులకు లేదా? తల్లికి సపర్యలు చేయడానికే తాను కూడా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని జనాన్ని నమ్మించే ప్రయత్నం అవినాశ్‌ చేస్తున్నారు. ఇప్పుడు సీబీఐ అధికారులు ఏం చేయబోతున్నారు.. అవినాశ్‌రెడ్డికి కల్పించిన వెసులుబాటును ఇతర కేసులలో కూడా నిందితులకు కల్పిస్తారా? నిందితులను అరెస్ట్‌ చేయాలనుకుంటే శని, ఆదివారాలు అడ్డు కాదు కదా.. తాను అరెస్ట్‌ కాకూడదని అవినాశ్‌రెడ్డి సంకల్పం తీసుకున్నట్టుగా ఉంది. అదే సమయంలో సీబీఐ కాళ్లు చేతులను ఏదో అదృశ్య శక్తి కట్టిపడేస్తోంది.

తల్లి ఆరోగ్యం బాగోనందున తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని సోమవారం అవినాశ్‌రెడ్డి న్యాయస్థానం తలుపు తట్టవచ్చు. ముందస్తు బెయిల్‌ పొందవచ్చు కూడా. ఇదంతా చూస్తుంటే సామాన్యులకు న్యాయం దక్కుతుందన్న నమ్మకం ఉంటుందా? గజం మిథ్య.. పలాయనం మిథ్య అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. తండ్రిని హత్య చేయించినవారికి శిక్ష పడాలని అలుపెరగని పోరాటం చేస్తున్న డాక్టర్‌ సునీతారెడ్డిని చూసి జాలిపడదాం. అధికారం, డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే ఎవరినైనా చంపవచ్చు. శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఆదుకోవడానికి ఏదో ఒక వ్యవస్థ ఉంటుంది. అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలనుకుంటున్నట్టు సీబీఐ చెబుతోంది. చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. అయినా ఆయన అరెస్ట్‌ కారు. ఈ పరిస్థితికి సామూహికంగా సిగ్గుపడదాం. వివేకా కేసులోనే వాంగ్మూలం ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడైన అజేయ కల్లం మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సీబీఐ అధికారులు ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని ప్రచురించినందుకు ‘ఆంధ్రజ్యోతి’ని తిట్టే క్రమంలో ఈ వ్యాఖ్య చేసిన అజేయ కల్లం.. అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌ విషయంలో చోటుచేసుకుంటున్న డ్రామాకు ఏం సమాధానం చెపుతారు? నిప్పుకు చెద పట్టినట్టుగా అజేయ కల్లం వంటి వారిలో కూడా సర్వీసు చివరిలో అవలక్షణాలు ప్రవేశిస్తాయి కాబోలు. సర్వీసులో ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉండేవి కావు. నిజాయతీపరుడనే పేరుండేది. తన కులం గురించి కూడా తెలియకూడదని పేరు చివర్న ఉన్న ‘రెడ్డి’ పదాన్ని తొలగించుకున్నారు. ఇప్పుడు సహవాస దోషం అనుకుంటా ఆయన కూడా మారిపోయారు. పదవీ విరమణ చేయగానే రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జస్టిస్‌ రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించకూడదంటూ అప్పటి ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన లేఖను ఏకంగా విలేఖరుల సమావేశంలోనే చదివి వినిపించారు. సీబీఐ అధికారులు తన వద్దకు వచ్చి స్టేట్‌మెంట్‌ తీసుకోవడం ‘ఆంధ్రజ్యోతి’కి ఎలా తెలిసింది? సీబీఐ అధికారులే లీక్‌ చేసి ఉంటారు అంటూ అది మంచిది కాదన్నారు. అలా అయితే మార్గదర్శి విషయంలో రామోజీరావును విచారించిన సీఐడీ అధికారులు ఆయన బెడ్‌పై పడుకున్నప్పుడు తీసిన వీడియోను జగన్‌ మీడియాకు ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టాలి కదా? ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనుకుంటే ఎలా? అవినాశ్‌ రెడ్డి అంతర్జాతీయ ఉగ్రవాది కారని సజ్జల అంటున్నారు కానీ అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజు, కొల్లు రవీంద్ర వంటి వారు అంతర్జాతీయ ఉగ్రవాదులని భావించి సీఐడీ వాళ్లు అర్ధరాత్రి అరెస్టు చేశారా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి కదా? అజేయ కల్లం ఈ మధ్య బయట కనిపించడం మానేశారు. హఠాత్తుగా గడ్డం పెంచుకుని విలేఖరుల సమావేశానికి వచ్చిన ఆయనను చాలామంది గుర్తుపట్టలేదు. అదేమిటో గానీ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పుడు క్లీన్‌ షేవ్‌తో శుభ్రంగా కనిపించిన అప్పటి ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణం కూడా ఆ తర్వాత ఇలాగే గడ్డం పెంచుకుని దైవచింతనకు పరిమితం అయ్యారు. ఇప్పడు అజేయ కల్లం వంతు అనుకుంటా. జగన్‌తో చేతులు కలిపిన కొందరిలో ఇలా హఠాత్తుగా దైవచింతన ఏర్పడటానికి కారణం తెలిస్తే.. ఎవరైనా చెబుతారా?

ఆర్కే

Updated Date - 2023-05-21T04:23:31+05:30 IST