RK KOTHAPALUKU: తెలుగు ప్రజల చెవిలో ‘ఉక్కు’ పూలు

ABN , First Publish Date - 2023-04-16T00:42:22+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలలోని రాజకీయ పార్టీల చెవుల్లో పూలు పెట్టింది. కేంద్రం పెట్టింది అనడంకంటే మనవాళ్లు పూలు పెట్టించుకున్నారని చెప్పడం...

RK KOTHAPALUKU: తెలుగు ప్రజల చెవిలో ‘ఉక్కు’ పూలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలలోని రాజకీయ పార్టీల చెవుల్లో పూలు పెట్టింది. కేంద్రం పెట్టింది అనడంకంటే మనవాళ్లు పూలు పెట్టించుకున్నారని చెప్పడం సమంజసం. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ముడిపదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు దరఖాస్తులు పిలవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగరేణి సంస్థ బిడ్‌ వేయనున్నట్టు ప్రకటించడంతో తెలుగు రాష్ర్టాలలోని రాజకీయ పార్టీల డొల్లతనం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిమితులు తెలుసుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల వేటలో మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తమ ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంతోపాటు ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొనడానికై విశాఖ ఉక్కును తాము కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ అండ్‌ కో ప్రకటించుకున్నారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు రంగప్రవేశం చేసి ఆ పనేదో మీరే చేయవవచ్చు కదా? అని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశాయి. అంతలోనే రెండు రాష్ర్టాల మంత్రుల మధ్య మాటల యుద్థం మొదలైంది. ‘మీ బతుకెంత అంటే మీ బతుకెంత’ అని తిట్టిపోసుకున్నారు. ఈ తతంగం జరుగుతుండగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తీ ప్రకటన చేశారు. అంతే... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోవడానికి తమ నాయకుడు కేసీఆరే కారణమంటూ తెలంగాణ మంత్రులతోపాటు బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కూడా బడాయికి పోయారు. ఇంతలోనే కేంద్ర సహాయ మంత్రి నాలుక మడతేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా తేల్చి చెప్పింది. దీంతో మనోళ్లందరూ ఫూల్స్‌ అయ్యారు. అడ్డం పొడవు మాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడంలో సఫలమవుతున్న కేసీఆర్‌ ఆంధ్ర ప్రజలను కూడా బుట్టలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు వికటించాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కానీ, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను కానీ కొనుగోలు చేసి, నడిపేంత ఆర్థిక బలం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. సింగరేణి సంస్థకు కూడా ఆ శక్తి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు నిధులతో అలరారిన సింగరేణి కంపెనీ ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా ఆరగించేసి, అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. అప్పుల కోసం ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఏటా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే అప్పుల కోసం అన్వేషించడం ఏమిటో తెలియదు. ఈ పరిస్థితికి 9 ఏళ్లుగా సింగరేణి సంస్థకు ఎండీగా కొనసాగుతున్న శ్రీధర్‌ సమాధానం చెప్పాలి. ‘తాను దూర కంత లేదు – మెడకో డోలు’ అన్నట్టుగా విశాఖ ఉక్కుకు ముడిపదార్థాలు సరఫరా చేయడం లేదా మూలధనం సమకూర్చేందుకు సింగరేణి సిద్ధం కావడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కేసీఆర్‌ అనుకున్నారు గనుక సింగరేణి అధికారులు ముందూ వెనుకా ఆలోచించకుండా విశాఖ వెళ్లి వచ్చారు. ఉత్తరాంధ్రలో భారత రాష్ట్ర సమితికి 20 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని కాకి లెక్కలు వేసుకుంటున్న కేసీఆర్‌, ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిలో హీరోగా నిలబడటం కోసం విశాఖ ఉక్కు కొనుగోలు నాటకానికి తెరతీశారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించే ఆలోచన కూడా చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగుదునమ్మా అంటూ విశాఖ ఉక్కును కొంటామని ప్రకటనలు చేశారు. ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడి కార్మికులు రోడ్డుపాలయ్యారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ అండ్‌ కో ప్రకటించారు. ఇప్పుడు 2023లో ఉన్నాం. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఉమ్మడి వరంగల్‌లోని ఏపీ రేయాన్స్‌ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్‌ పొరుగు రాష్ట్రంలోని ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడటం, కొనిపారేస్తామని ప్రకటనలు చేయడం వింతగా ఉంటోంది.

ఎందుకంత ప్రేమ...

ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై కేసీఆర్‌కు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? తెలంగాణ ప్రజలు, కార్మికుల కంటే ఆంధ్ర ప్రజలు, కార్మికులే ముద్దు కావడానికి కారణమేంటి? అంటే రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. నిజానికి తన స్వీయ రాజకీయ ప్రయోజనాలే కేసీఆర్‌కు ముఖ్యం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్న వ్యత్యాసం ఆయనకు ఉండదు. తెలంగాణ సెంటిమెంట్‌ అవసరమనుకున్నప్పుడల్లా ఆంధ్ర వాళ్లను బూచిగా చూపిస్తూ వచ్చారు. రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రావాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులను అమానవీయంగా అడ్డుకున్నది ఈ కేసీఆర్‌ కాదా? సరిహద్దులలో పోలీసులను మోహరింపజేసి కరోనా రోగులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్న అంబులెన్సులను వెనక్కి తిప్పిపంపలేదా? నిన్నగాక మొన్న తమ ధాన్యాన్ని హైదరాబాద్‌లో అమ్ముకోవడానికి లారీలలో తరలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర రైతులను అడ్డుకోవడం నిజం కాదా? అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న వారి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలను పంపిన కేసీఆర్‌ ఇప్పుడు ఆంధ్రావాళ్ల కోసం కొట్లాడతాడట! కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందించడం కోసం అధికారులు ఆయా ఆస్పత్రులకు ఫోన్లు చేసి అన్నీ సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇంతలోనే కేసీఆర్‌ రంగప్రవేశం చేశారు. తెలంగాణకు చెందిన, అది కూడా తమవాళ్లకు చెందిన యశోద ఆస్ప్రతి ఉండగా, ఆంధ్ర వాళ్లు ప్రారంభించిన ఆస్పత్రులకు పంపడమేమిటి? అని అధికారులకు సంకేతాలు పంపారు. అంతే... క్షతగాత్రులందరూ యశోదలోనే చేరారు. కారణం తెలియదు కానీ ఇప్పుడదే యశోద ఆస్పత్రి యాజమాన్యంతో ఆయనకు చెడింది. ఇంతవరకూ చిన్నాచితకా చికిత్సలకు కూడా యశోదకు వెళ్లిన కేసీఆర్‌ ఈ మధ్య ఏదో చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. పంటినొప్పి, కంటినొప్పికి కూడా ఢిల్లీకి పరిగెత్తి చికిత్స చేయించుకున్న కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా రోగులను మాత్రం తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదు.

ఇదీ కేసీఆర్‌ ప్రత్యేకత

పరిస్థితులను బట్టి అత్యంత సంకుచితంగానూ, అత్యంత విశాల హృదయంతోనూ ఆలోచించడం కేసీఆర్‌కు వెన్నతోపెట్టిన విద్య. తన కత్తికి రెండువైపులా పదునుంటుందని అనేక సందర్భాలలో ఆయన రుజువు చేశారు. అప్పట్లో... అసెంబ్లీ ఎన్నికలలో దళితుల మద్దతు అవసరమని గుర్తించిన కేసీఆర్‌ దళిత బంధు తీసుకువచ్చారు. కేంద్రంలో తాను అధికారంలోకి వచ్చినట్టుగానే భావిస్తూ దేశవ్యాప్తంగా ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అమలు చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. బాబాసాహెబ్‌ భీంరావ్‌ రాంజీ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా 125 అడుగుల ఆయన విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. తానొక్కడినే దళిత జనోద్ధారకుడినని ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. నిజానికి కేసీఆర్‌ మనసులో దళితుల పట్ల ప్రేమ, గౌరవం ఉండదు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకొందాం! బ్రాహ్మణులకు పాదాభివందనం చేసే కేసీఆర్‌ దళితులకు ఏ సందర్భంలో కూడా పాదాభివందనం చేయడాన్ని మనం చూడలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, నరసింహన్‌ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు వారికి పాదాభివందనం చేయడాన్ని మనం చూశాం! అదే సమయంలో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక్కసారి కూడా పాదాభివందనం చేయలేదు. దీన్నిబట్టి దళితులకు కేసీఆర్‌ మనసులో ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దళితవాదులు పెరగడంతో అంబేడ్కర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా దళితులు అందరూ డాక్టర్‌ అంబేడ్కర్‌ను తమ దైవంగా కొలుస్తున్నారు. ఇంకేముందీ... కేసీఆర్‌ దృష్టి ఆయన మీద పడింది. ఆగమేఘాల మీద అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని తయారు చేయించారు. ‘విగ్రహాలు మీకు–అధికారం మాకు’ అని దళితులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో వ్యక్తి పూజకు, వ్యక్తుల్ని విగ్రహాలను చేసి పూజించే సంస్కృతికి అంబేడ్కర్‌ వ్యతిరేకి. 'I am no worshipper of idols. I believe in breaking them' అని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా సూటిగా చెప్పారు. అణగారిన ప్రజలు తమ చైతన్యానికి స్ఫూర్తిగానో, ధిక్కారానికి ప్రతీకగానో అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో అర్థముంది కానీ, ప్రభుత్వాలు పనిగట్టుకొని భారీ విగ్రహాలను నెలకొల్పడంలో ఏ అర్థమూ లేదు, రాజకీయ ప్రయోజనాలను ఆశించే పరమార్థం తప్ప! అది గుజరాత్‌లో పటేల్‌ విగ్రహమైనా, తెలంగాణలో అంబేడ్కర్‌ విగ్రహమైనా! వాటి ఎత్తు ప్రజల జీవితాల్లో తీసుకురాగల గుణాత్మక మార్పేమీ ఉండదు. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి నోటి మాటలు దాటలేదు. కుల హత్యల కేసుల్లో న్యాయం జరగడంలేదు. సబ్‌ ప్లాన్‌ అమలుకు దిక్కులేదు. ఇలా చెప్పుకొంటూ పోతే అడుగడుగునా దగాపడ్డ దళితులే కనిపిస్తారు. వీళ్లెవరూ 125 అడుగుల విగ్రహాలు కావాలని అడగలేదు. గతంలో ఇదే అంబేడ్కర్‌ జయంతికి ముందురోజు పంజగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్‌ విగ్రహాన్ని కూల్చి చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుడ్ని ఆకాశానికెత్తడం వెనుక ఉన్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు కూడా గుర్తిస్తున్నారు. వ్యక్తిపూజ నియంతృత్వానికి దారి తీస్తుందని అంబేడ్కర్‌ హెచ్చరించారు. ఇప్పుడు తెలంగాణలో వ్యక్తి పూజ మాత్రమే కనిపిస్తోంది. ఫలితంగా కేసీఆర్‌ నియంతలా మారిపోయారు. ఆయన మాటే శాసనంగా చెల్లుబాటు అవుతోంది. అంబేడ్కర్‌ ఆశయాలకు కట్టుబడాలని ఉద్భోదించే కేసీఆర్‌ తాను మాత్రం ఆయన ఆశయాలను ఆచరించకపోవడమే అసలు తమాషా! సంఖ్యాపరంగా వైశ్యులు కూడా దళితుల స్థాయిలో ఉండివుంటే జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా కేసీఆర్‌ 150 అడుగుల ఎత్తులో రూపొందించి ఉండేవారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మాత్రమే వీరి మనసులో మహాత్మాగాంధీ వెనుకబడి డాక్టర్‌ అంబేడ్కర్‌ ముందుకొచ్చారు. ముందు ముందు వీరు జ్యోతీరావ్‌ పూలే విగ్రహం కూడా రూపొందించవచ్చు. అంబేడ్కర్‌ విగ్రహాలను భారీ ఎత్తులో నిర్మించినంత మాత్రాన దళితుల కడుపు నిండదు. కాకపోతే వారిని మాయ చేయవచ్చునని కేసీఆర్‌ వంటి వారు భావిస్తుంటారు. బీసీల అవసరం ఏర్పడితే మహాత్మాపూలే విగ్రహం రూపొందుతుంది. నిజానికి కొన్నేళ్ల క్రితం వరకు జ్యోతీరావ్‌ పూలేకు తెలంగాణలో అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కాచిగూడ చౌరస్తాలో బస్ట్‌ సైజ్‌ విగ్రహం మాత్రమే ఉండేది. జయంతి, వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహాన్ని ఎవరూ పట్టించుకొనేవారు కారు. మరుగునపడిన లేదా నిర్లక్ష్యానికి గురైన మహనీయులను రాజకీయ అవసరాలకోసం విగ్రహాలుగా మార్చి వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో కేసీఆర్‌ చేస్తున్న విన్యాసాలను చూడాలి.

ష్‌ గప్‌చుప్‌...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తమ వల్లే ఆగిపోయిందని కేసీఆర్‌ అండ్‌ కో ప్రచారం మొదలెట్టగానే... కేంద్రం అంతా తూచ్‌ అని ప్రకటించడంతో తెలంగాణ మంత్రులు సైలెంట్‌ అయిపోయారు. సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా కేసీఆర్‌ మాయలో పడిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నైజం తెలుసుకోకుండా కేసీఆర్‌ చొరవ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోతోందని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ మరో అడుగు ముందుకేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని మాకు ఎప్పుడో తెలుసు అని హెచ్చులు పోయారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు యథావిధిగా నోటికి పని చెప్పారు. తెలంగాణ వాళ్లకు బుర్ర లేదంటూ తెలంగాణ ప్రజలను కించపరిచారు. వాస్తవానికి బుర్ర లేనిది ఎవరికో రాష్ట్ర విభజన తర్వాత పలు సందర్భాలలో రుజువు అవుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల మంత్రులు దూషణభూషణలకు దిగడం ద్వారా స్వరాష్ర్టాలలో దిగజారిపోతున్న తమ పరపతిని నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. తెలుగునాట అయోమయం సృష్టించడం ద్వారా తెలుగు వారందరికీ బుర్ర లేదని రుజువు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ వంటి మూతబడిన ఫ్యాక్టరీలను పట్టించుకోని కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకోవడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. సీదిరి అప్పలరాజు అభిప్రాయం ప్రకారం ఆంధ్ర వాళ్లకు తెలివితేటలు ఎక్కువ కనుక కేసీఆర్‌ మాయలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కొందరు సంకేతాలు ఇచ్చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు పోరాటం చేసే పరిస్థితిలో లేనందున ఇంతకాలం తమను అవమానిస్తూ వచ్చిన కేసీఆర్‌ అయినా పోరాటం చేస్తే అదే పదివేలు అని కొద్ది మంది ఆంధ్ర వాళ్లు భావిస్తున్నారట! ప్రైవేటీకరణ విషయంలో తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం కుండబద్దలు కొట్టి చెప్పినందున కేసీఆర్‌ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ అనే ఎండమావిని నమ్ముకొని సింగరేణి కంపెనీతో విశాఖ ఉక్కు బాధ్యత తీసుకొనేలా కేసీఆర్‌ ముందుకు వెళతారా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. హెచ్చులకు పోయి రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు సింగరేణి సంస్థను కూడా ముంచేస్తారా? లేక మనకు ఎందుకులే అని విరమించుకుంటారా? అన్నది వేచిచూడాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా మాయ చేయవచ్చునన్న నమ్మకం కుదిరితే మాత్రం కేసీఆర్‌ ముందుకే వెళ్లవచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతోంటే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ కునారిల్లుతోందంటూ తన సొంత మీడియాలో కేసీఆర్‌ ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అని వేడుకున్న జగన్మోహన్‌ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టుగానే 2024 ఎన్నికల్లో తమకు కూడా ఒక అవకాశం ఇస్తే తెలంగాణ తరహాలో అభివృద్థి చేస్తామని కేసీఆర్‌ అండ్‌ కో ప్రచారం చేయబోతున్నారు.

ఇద్దరూ ఇద్దరే...

ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి ఎవరికెవరూ తీసిపోరు. విశాఖ విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగిందని గత ఎన్నికలకు ముందు జగన్‌ ప్రజలను నమ్మించగలిగారు. ఇప్పుడు అదంతా బూటకమని, అది హత్యాయత్నం కాదని, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడంకోసమే సదరు నాటకానికి తెర తీశానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పిన విషయాన్ని ఎన్‌ఐఏ వెల్లడించింది. నిందితుడు శ్రీనివాసరావు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతుండగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. కోడి కత్తి డ్రామా వెలుగులోకి రావడంతో ‘హమ్మ జగనా!’ అని ఆశ్చర్యపోవడం ఆయన ప్రచారాన్ని నమ్మిన వారి వంతైంది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఈ తరహా ప్రచారమే చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. వివేకా హత్య జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తాజాగా తన తల్లిని లైంగికంగా వేధించడం వల్లనే సునీల్‌ యాదవ్‌ అనే నిందితుడు వివేకాను హత్య చేశాడని ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి తరపు లాయర్‌ హైకోర్టులో చెప్పారు. చాలా కాలం క్రితం విడుదలైన ‘ఎర్రమందారం’ సినిమా కథను యథాతథంగా భాస్కర్‌ రెడ్డి తరఫు లాయర్‌ నిరంజన్‌ రెడ్డి కోర్టుకు చెప్పారు. మున్ముందు మరెన్ని సినిమా కథలు వినిపిస్తారో తెలియదు. మొత్తమ్మీద కోడికత్తి, వివేకా హత్యను రాజకీయంగా వాడుకొని గద్దెనెక్కిన జగన్మోహన్‌ రెడ్డి నిజ రూపాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఫేక్‌ ప్రచారం ద్వారా లబ్ధి పొందడం ఎలాగో తెలుసుకున్న జగన్‌ అండ్‌ కో రానున్న ఎన్నికల్లో కూడా లబ్ధి పొందడానికై అదే ఫేక్‌ ప్రచారంపై ఆధారపడుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఇంత తేలికగా మాయ చేయవచ్చునని గుర్తించిన కేసీఆర్‌ విశాఖ ఉక్కు అంశాన్ని అందుకున్నారు. తెలంగాణ ప్రజలు తన ఎత్తుగడలను ఇకపై నమ్మే పరిస్థితి లేదన్న అనుమానం కేసీఆర్‌ అండ్‌ కోలో ఏర్పడినట్టుంది. మహారాష్ట్రలో బలపడిపోయినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బలపడిపోతామని కేసీఆర్‌ చెప్పుకొంటున్నారు. రాజకీయాల్లో ఆకాంక్షలు ఉండవచ్చుగానీ అవి పగటి కలలుగా మారకూడదు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న విషయం విస్మరించి జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించాలని కేసీఆర్‌ భావించడం వింతగా ఉందని తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ వద్ద వ్యాఖ్యానించారు. ‘‘మహా అయితే మీరు పది సీట్లు గెలవవచ్చు, లోక్‌సభలో మా బలం ఇప్పుడు 39 సీట్లు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య తగ్గదనుకుంటున్నాం. అయినా మా ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేలమీదే ఉంటున్నారు’’ అని కూడా సదరు తమిళ తంబి వ్యాఖ్యానించారట. మబ్బులను చూసుకొని మా ముఖ్యమంత్రి చెంబులో నీళ్లను ఒలకబోసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ ముఖ్యుడొకరు అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే తెలంగాణలో అంత నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా స్వరాష్ట్రంలోని మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించాలన్న డిమాండ్లు ఎన్నికలు సమీపించే కొద్దీ పెరుగుతాయని తెలంగాణ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దళితబంధు గురించి ప్రచారం పెంచిన కొద్దీ ఇతర వర్గాల నుంచి తమకు కూడా అలాంటి పథకం అమలుచేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

జాతీయ రాజకీయాలలో వెలుగొందాలన్న కాంక్షతో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడంకోసం కేసీఆర్‌ ఎంచుకున్న విశాఖ ఉక్కు అంశం ఆయనను ముంచుతుందా? తేలుస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. గత వారం చెప్పినట్టుగా తెలంగాణ వనరులు సొంతం చేసుకుంటూ రాజకీయ జూదానికి తెరలేపిన కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్తును ముందుగా తెలంగాణ ప్రజలే తేల్చబోతున్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఢిల్లీకి పరిమితం కావొచ్చు. లేని పక్షంలో ఫాం హౌజ్‌లో విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో!

ఆర్కే

Updated Date - 2023-04-16T09:12:05+05:30 IST