RK Kothapaluku : చక్రం తిప్పేదెవరు?

ABN , First Publish Date - 2023-04-02T01:00:19+05:30 IST

‘జాతీయ రాజకీయాలలో మీ అవసరం ఉంది. మీరిప్పుడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీలో’ అని కాంగ్రెస్‌ నాయకుడు, దివంగత రాజశేఖర రెడ్డి ఆత్మగా ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఉద్దేశించి...

RK Kothapaluku : చక్రం తిప్పేదెవరు?

‘జాతీయ రాజకీయాలలో మీ అవసరం ఉంది. మీరిప్పుడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీలో’ అని కాంగ్రెస్‌ నాయకుడు, దివంగత రాజశేఖర రెడ్డి ఆత్మగా ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడటం, ఆ వెంటనే ఆయనపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరిగిన సందర్భంగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఈ మాటలన్నారు. గతంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన అనుభవం ఉన్నందున చంద్రబాబు అవసరాన్ని కేవీపీ గుర్తించి ఉంటారు. ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారోగానీ సందర్భం వచ్చినప్పుడల్లా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చరిత్ర తెలుగు వారిది. అయితే ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రాహుల్‌ గాంధీ వ్యవహారంపై స్పందించడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇష్టపడటం లేదు. అధికారంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తిగత కేసుల భయంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిరోధించడానికి బీజేపీ సహకారం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. జన సేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈ కారణంగా ఈ మూడు పార్టీలు కూడా రాహుల్‌ గాంధీ విషయమై సంఘీభావం తెలపలేని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయానికి వస్తే ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నప్పటికీ రాహుల్‌ గాంధీ విషయంలో చొరవ తీసుకోవడం లేదు. జాతీయ స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నప్పటికీ తాను మాత్రం ప్రతిపక్షాల ఐక్యతా సమావేశాలకు దూరంగా ఉన్నారు. విభిన్న రాజకీయ లక్ష్యాలు ఉన్న ప్రతిపక్ష నేతలను ఒక్కతాటిపైకి తీసుకురాగల నేర్పు ఓర్పు కూడా ఆయనకు లేవని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో ఏ పదవీ కోరుకోకుండా తలో దారిలో పయనించే ప్రతిపక్షాల నాయకులను సంఘటితం చేయడంలో చంద్రబాబుకు నేర్పరితనం ఉంది. అయితే ఆయన ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే తన రాజకీయ జీవితం ముగుస్తుందన్న భయంతో పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. దీంతో ఒకప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన తెలుగు జాతికి ఇప్పుడు ఏ పాత్రా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడం వల్ల సంఖ్యాపరంగా కూడా మన నాయకులు బలహీనపడ్డారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు పరస్పర విరుద్ధ రాజకీయ ప్రయోజనాలు ఉన్నందున వారి మధ్య కూడా సఖ్యత ఉండటం లేదు. ఇప్పుడు ఒక్కసారి గతంలోకి వెళదాం. కేంద్రంలో అధికారంలో పాతుకుపోవడం వల్ల నిరంకుశ పోకడలకు పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీపై ఎన్టీరామారావు తనకు రాజకీయాలలో అంతగా అనుభవం లేకపోయినా సమరశంఖం పూరించారు. నాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్ధండులైన నాయకులు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది. తాను చైర్మన్‌గా నేషనల్‌ ఫ్రంట్‌కు అంకురార్పణ చేశారు. లెఫ్ట్‌, రైట్‌ అన్న తేడా లేకుండా కాంగ్రెస్‌ వ్యతిరేకులు అందరినీ సంఘటితం చేశారు. అప్పటికే రాజకీయాలలో అపారమైన అనుభవం ఉన్న అటల్‌ బిహారీ వాజపేయి, యంగ్‌ టర్క్‌ చంద్రశేఖర్‌, బిజూ పట్నాయక్‌, కరుణానిధి, రామకృష్ణ హెగ్డే వంటి మహామహులు ఎన్టీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరించారు. ఎన్టీఆర్‌ చొరవతో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్యంగా అనేక బహిరంగ సభలు నిర్వహించాయి. ఢిల్లీలో ఎన్టీఆర్‌ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయగా, తరువాతి కాలంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన చంద్రశేఖర్‌, వాజపేయి వంటి వారు కూడా ఆయన వెనుక నిలబడి ఉన్న దృశ్యం తెలుగువారి గౌరవానికి ప్రతీకగా ఇప్పటికీ నిలుస్తుంది. అయితే దురదృష్టవశాత్తు 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారు. ఆయన కృషి ఫలితంగా పురుడు పోసుకున్న నేషనల్‌ ఫ్రంట్‌ మాత్రం వీపీ సింగ్‌ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అక్కడితో జాతీయ రాజకీయాలలో ఎన్టీఆర్‌ శకం ముగిసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా రెండు సందర్భాలలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రభుత్వాలను ఏర్పాటు చేయించారు. కమ్యూనిస్టు ఉద్ధండుడైన జ్యోతిబసు వంటి వారితో కలిసి పనిచేశారు. కేంద్రంలో ఏ పదవీ ఆశించకుండా ప్రతిపక్షాల ఐక్యత కోసమే పనిచేశారు. చంద్రబాబు చొరవను, ఓపికను ఇతర ప్రతిపక్ష నాయకులు హర్షించేవారు. ప్రతిపక్షాలు ఒక తాటిపైకి రావాలంటే చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్షాలను సంఘటితం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శత్రుత్వం ఏర్పడింది. రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయారు. దీంతో జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు పోషించిన పాత్ర మరోసారి పోషించే అవకాశం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులు అందరితో ఓపికగా మాట్లాడి, వారిని ఒప్పించి మెప్పించేంత తీరిక, సహనం కేసీఆర్‌లో లేనందున ఆయన ప్రగతిభవన్‌కే పరిమితం అయ్యారు. దీంతో జాతీయ స్థాయిలో తెలుగువారికి పాత్ర లేకుండా పోయింది. ఉత్తరాది నాయకులను కలిసికట్టుగా నడిపించడం ఆషామాషీ కాదు. బహుశా ఈ కారణంగానే చంద్రబాబు మళ్లీ జూలు విదిల్చి జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని కేవీపీ రామచంద్రరావు కోరుకుంటూ ఉండవచ్చు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్ష నాయకులు సంఘటితంగా ఎదురు నిలబడ్డారంటే వారికి వ్యక్తిగత బలహీనతలు లేకపోవడం కారణం కావచ్చు. అందువల్లే కేంద్ర ఏజెన్సీలకు వారు భయపడలేదు. అధికారం పోతుందని ఆందోళన చెందలేదు. ఎమర్జెన్సీని సైతం ఎదిరించి లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో ఒక్కటిగా నిలబడి కలబడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీల నేతలు రాజకీయ అవసరాల కోసం డబ్బు పోగెయ్యడం మొదలైంది. ఈ బలహీనతలనే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ప్రయోగించి ప్రాంతీయ పార్టీల నాయకులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. దీంతో ‘గతమెంతో ఘనకీర్తి కలవాడా..’ అని మాత్రమే పాడుకోవాల్సిన దుస్థితి ‘‘తెలుగోడి’’కి ఏర్పడింది. ఈ దశలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. అయితే ఆయన లక్ష్యం అంతు పట్టకుండా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించబోతున్నానని చెబుతున్న ఆయన అన్ని రాష్ర్టాలలో ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు మాత్రం చెప్పడం లేదు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను విస్తరిస్తానని అంటున్న ఆయన ఇప్పుడు కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తారా? లేక జేడీఎస్‌ నేత కుమార స్వామికి మద్దతు ప్రకటిస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సొంతంగా పోటీ చేయలేకపోయినా, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోకపోయినా బీఆర్‌ఎస్‌ ఏర్పాటే నిరర్థకం అవుతుంది. అయితే ప్రగతిభవన్‌ నుంచి మాత్రం కేంద్రంపై యుద్ధం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో చిక్కుకున్న ఆయన కుమార్తె కవితను తురుపు ముక్కగా ఢిల్లీ పెద్దలు వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ అధికారులు ఆమెను ఇప్పటికే రెండు పర్యాయాలు విచారించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన కేంద్ర ఏజెన్సీలు కవిత విషయంలో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇవాళో రేపో కవితను అరెస్టు చేయబోతున్నారన్న ప్రచారం మినహా ఈడీ అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. కవితను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆ పరిస్థితిని కేసీఆర్‌ తనకు అనుకూలంగా మలచుకుంటారన్న భయం ఢిల్లీ పెద్దలను వేధిస్తున్నట్టుగా ఉంది. కవితను అరెస్టు చేస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనని బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. తన కుమార్తెను జైలుకు పంపితే ప్రజలు, ముఖ్యంగా మహిళల సానుభూతి కోసం కేసీఆర్‌ వ్యూహ రచన చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అది విజయవంతమైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విషయం అటుంచి, గతంలో వలె నాలుగైదు సీట్లకే పరిమితం అవుతుందన్న ఫీడ్‌ బ్యాక్‌ కేంద్ర పెద్దలకు అందిందట. ఈ కారణంగానే కవితపై చర్యలు తీసుకొనే విషయంలో ఈడీ అధికారులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం లేదంటున్నారు. కవిత వ్యవహారం తేలే వరకు జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం బీజేపీకి అనుకూలించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా తెలంగాణపై ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అనర్హత వేటు తర్వాత రాహుల్‌ గాంధీకి దేశవ్యాప్తంగా సానుభూతి ఏర్పడింది. కర్ణాటకలో కూడా సానుభూతి ఉంటే కాంగ్రెస్‌ విజయావకాశాలు మరింత మెరుగు కావొచ్చు. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ పుంజుకొనే అవకాశం ఉంది. అటు బీజేపీ పెద్దలు, ఇటు కేసీఆర్‌ కూడా కర్ణాటక ఫలితాల వరకు కూడా గుంభనంగా ఉంటారని ఒక అంచనా! ఈ నేపథ్యంలో మునుముందు కేసీఆర్‌ అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్నది ప్రస్తుతానికి అస్పష్టం.

రాటుదేలిన రాహుల్‌!

మరోవైపు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని పలు ప్రాంతీయ పార్టీలు అంగీకరించే పరిస్థితిలో లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో రాజీ ధోరణి అవలంభించడానికి కూడా సిద్ధంగానే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం అంటూ కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటివారు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలంటే ఒక అనుసంధానకర్త కావాలి. ఈ బరువు ఎవరు మోస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఒకవేళ కలిసినట్టు కనిపించినా బీజేపీని దీటుగా ఎదుర్కోలేరు. కాంగ్రెస్‌ పార్టీ తల పాత్ర లేదా తోక పాత్ర పోషించాల్సిందే. ఈ విషయమై కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటి వారికి నచ్చజెప్పగల అనుసంధానకర్త అవసరాన్ని అందరూ గుర్తించి తమలో ఒకరికి ఆ బాధ్యత అప్పగించనంత వరకు ప్రతిపక్షాల ఐక్యత ఎండమావే అవుతుంది. అయితే విభేదాలను పక్కన పెట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌తో కలవాల్సిన పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు కల్పిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలకు భయపడి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆరోపించినట్టుగానే ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఆరోపిస్తున్నారు. అంతేగానీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులు అందరినీ జైళ్లలో నింపడం, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అకారణంగా రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడం వంటి నిరంకుశ పోకడల వల్లనే ప్రతిపక్షాలు ఏకమైన విషయాన్ని జనతా పార్టీ ఆవిర్భావం సమయంలో ఇందిరాగాంధీ అంగీకరించలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలు ఉన్నది ప్రతిపక్షాలను వేధించడానికే అన్న అభిప్రాయం దేశ ప్రజలలో ఇంతలా ఏర్పడటానికి మోదీనే కారణం. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ సైతం కేంద్ర ఏజెన్సీల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. షాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీ పేరు చెప్పాలని సీబీఐ అధికారులు అప్పట్లో తనపై ఒత్తిడి తెచ్చారని ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. నాటి అనుభవాల నుంచి ఉత్పన్నమైన పగ, ప్రతీకారాలు ప్రధాని మోదీని కుదురుగా ఉండనివ్వడం లేదు, కాబోలు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి శిక్ష పడటానికి, ఆ వెంటనే ఆయనను అనర్హుడిగా ప్రకటించడానికి మోదీనే కారణమన్న భావన ప్రజల్లో విస్త్రృతంగా ఉంది. ఈ చర్య వల్ల రాహుల్‌ గాంధీలోని నాయకత్వ లక్షణాలు బయటికొస్తున్నాయి. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ చక్కగా మాట్లాడారు. ఎంపీగా రాహుల్‌కు కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం కూడా ప్రధాని మోదీకి నష్టం కలిగించాయని చెప్పవచ్చు. తాను ఒకప్పుడు రైల్వే ప్లాట్‌ఫాంపై టీ అమ్ముకొని పొట్ట పోషించుకున్నానని చెప్పుకొంటున్న ప్రధాని మోదీకి ఎంత సహనం ఉండాలి! ఆ స్థాయి నుంచి దేశ ప్రధానిగా దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగినందుకు అటు దేవుడికీ, ఇటు ప్రజలకూ ఎంతో కృతజ్ఞుడై ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాల్సిన నరేంద్ర మోదీలో అహం ప్రవేశించిందన్న భావన సర్వత్రా వ్యాపించింది. దీర్ఘకాలం అధికారంలో ఉన్నవారిలో సహజంగానే అవలక్షణాలు ప్రవేశిస్తాయేమో! రెండు దశాబ్దాలకు పైగా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అధికారంలోనే ఉన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్‌.కె.ఆడ్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం మోదీ మరచిపోకూడదు. ఎవరైనా తన ప్రస్థానాన్ని మరచిపోతే భవిష్యత్తు చికాకుగా ఉంటుంది. రాహుల్‌ గాంధీ విషయంలో ఆయన హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం మొన్నటిదాకా ఉంది. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నట్టుగా వ్యవహరిస్తే పతనం వేచి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్‌ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే భావించింది. 2014లో ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంత దుర్భలంగా తయారైందో చూస్తున్నాం. నరేంద్ర మోదీ ఇంత బలమైన నాయకుడిగా ఆవిర్భవిస్తారని ఎవరైనా కలగన్నారా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు, విచారణ బెడదను స్వయంగా అనుభవించిన మోదీ, ఇప్పుడు ప్రధానిగా ప్రత్యర్థులను తొక్కివేయడానికి అదే సూత్రం ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. అణచివేత ప్రతిఘటనలకు దారితీస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తనను వేధించినందువల్లే ప్రధానమంత్రి స్థాయికి చేరుకోవాలన్న పట్టుదల మోదీకి ఏర్పడి ఉండవచ్చు. ఇప్పుడు ఇదే మోదీ నుంచి వేధింపులకు గురవుతున్న వాళ్లు తాత్కాలికంగా లొంగిపోయినట్టు కనిపించవచ్చు గానీ అవకాశం కోసం ఎదురుచూడకుండా ఉంటారా?

అవసరార్థపు స్నేహం!

ఇక దేశంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు వింతగానూ, విస్తుగొలిపేవిగానూ ఉంటున్నాయి. ప్రధాని మోదీ విద్యార్హతలు తెలియజేయాలని కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు గుజరాత్‌ హైకోర్టు 25 వేల జరిమానా విధించడం ఈ కోవలోకే వస్తుంది. ప్రధాని విద్యార్హతలు తెలుసుకొనే హక్కు ఈ దేశ పౌరులకు ఉండదా? వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను తొలగించాలని సుప్రీంకోర్టు బలంగా సూచించడంతో సీబీఐ డైరెక్టర్‌ కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలి? దర్యాప్తు అధికారిగా ఎవరుండాలి? అని కోరుకునే హక్కు నిందితులకు ఉండదన్నది సెటిల్డ్‌ లా. వివేకా కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితుడైన శివశంకర్‌ రెడ్డి భార్య సీబీఐ అధికారి రాంసింగ్‌ను మార్చాలని కోరడం గమనార్హం. అయితే రాజకీయంగా, లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా, అదీ కుదరకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా సాధించుకోవడం ప్రస్తుత రాజనీతిగా ఉంది. ఈ పోకడలే ప్రతిపక్షాల ఐక్యతకు పునాదులు వేస్తున్నాయి. ప్రధాని మోదీ ఉదారత్వం, హుందాతనం ప్రదర్శించని పక్షంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఏకం కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదే పరిస్థితి వస్తే అనుసంధానకర్తగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కాంగ్రెస్‌–భారతీయ జనతా పార్టీలు నమ్మదగిన పార్టీలు కాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీపై ఆయనకు ఉన్న అభిప్రాయం ఎటువంటిదో స్పష్టమవుతోంది. తనపై అవినీతి కేసులు నమోదు కావడానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీపై జగన్‌కు కోపం ఉండటంలో ఆశ్చర్యం లేదు గానీ, ఆ కేసుల నుంచి ప్రస్తుతానికి తనను రక్షిస్తున్న బీజేపీపై కూడా వ్యతిరేక భావం ఉండటం గమనార్హం. అంటే అవసరార్థం మాత్రమే కేంద్ర పెద్దలతో జగన్‌రెడ్డి స్నేహాన్ని నటిస్తున్నారు. ప్రధాని మోదీకి ఈ విషయం తెలియదా!

ఆర్కే

Updated Date - 2023-04-02T02:29:40+05:30 IST