RK Kothapaluku: కేసీఆర్‌ను ఢీకొట్టేదెవరు?

ABN , First Publish Date - 2023-03-05T00:44:46+05:30 IST

అదృష్టవంతుడిని చెరిపేవాడు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాలలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే...

RK Kothapaluku: కేసీఆర్‌ను ఢీకొట్టేదెవరు?

అదృష్టవంతుడిని చెరిపేవాడు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాలలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అదృష్టవంతుల జాబితాలో వేయాల్సి వస్తుందేమో? రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలే ఇందుకు కారణం. ‘తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే. నాకు వేరే పని ఏమీ లేదు.. ఇకపై తెలంగాణ పైనే దృష్టిపెడతాను’ అని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఇటీవల రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల వద్ద వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాట చాలా రోజుల నుంచి అంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు మరో తొమ్మిది నెలల వ్యవధి మాత్రమే ఉంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదో తెలియని అయోమయం ఇప్పటికీ నెలకొని ఉంది. భారతీయ జనతా పార్టీ పుంజుకున్నట్టు కొన్ని రోజులు, కాంగ్రెస్‌ పార్టీ పుంజుకున్నట్టు మరికొన్ని రోజులు వార్తలు వస్తుంటాయి. ఈ రెండు పార్టీలలో కేసీఆర్‌ను ఢీకొట్టే పార్టీ ఏదో తెలియని అయోమయం ప్రజలలో ఇప్పటికీ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను కొట్టిపారేయలేని పరిస్థితి. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంటుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్‌ మూడవ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక దశలో బలపడుతున్నట్టు కనిపించింది. అంతలోనే సీనియర్స్‌ పేరిట ఆ పార్టీని అంతర్గత కుమ్ములాటలు కమ్మేశాయి. దీంతో భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్‌ను ఢీకొట్టగలదు అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఆ పార్టీ ఒక స్థాయికి మించి పెరగడం లేదు అన్న అభిప్రాయం ప్రస్తుతం వినబడుతోంది. ఇందుకు కారణాలను గుర్తించడానికి నిరాకరిస్తున్న బీజేపీ పెద్దలు ఉత్తరాది రాష్ర్టాలలో అమలుచేస్తున్న మోడల్‌నే తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు. ఉత్తరాది రాజకీయాలు వేరు– దక్షిణాది రాజకీయాలు వేరు అన్న విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్లామర్‌కు యువత మాత్రమే ఆకర్షితులవుతున్నారు గానీ 40 ఏళ్ల పైబడిన వాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు బీజేపీ భావజాలంతో మమేకం కాలేకపోతున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎదుగూబొదుగూ లేదన్నట్టుగా ఉంది. పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలని అమిత్‌ షా ఆదేశిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఫలితాలు సాధించలేకపోతున్నది. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రమే నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి ఉండటం ఇందుకు కొంత కారణం. కొంత కాలం క్రితం బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత స్తబ్దత ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున షెల్టర్‌ కోసం బీజేపీలో చేరిన వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత పార్టీలో ఇమడలేక స్తబ్దుగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. 2019 తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరి ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో పార్టీకి ఊపు వచ్చింది. రఘునందన రావు, ఈటల రాజేందర్‌ వంటి బలమైన అభ్యర్థులు లభించడంతో దుబ్బాక, హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మునుగోడులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి అతి విశ్వాసంతో ఓడిపోయారు. మొత్తంమీద బలమైన అభ్యర్థులు రంగంలో ఉన్నప్పుడే బీజేపీ తన ప్రభావం చూపించగలిగింది. ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. ఎన్నికలకు ఎంతో వ్యవధి లేకపోయినా బీజేపీ ఇప్పటికీ అభ్యర్థుల కొరతతో సతమతం అవుతోంది. అదే సమయంలో వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఉక్కపోతకు గురవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్ల పార్టీ కేంద్ర పెద్దలకు సదభిప్రాయం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులలో ఒక వర్గం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నది. ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. దీంతో అంతర్గత కలహాల విషయంలో కాంగ్రెస్‌తో బీజేపీ కూడా పోటీపడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. కాకపోతే కాంగ్రెస్‌ నాయకుల వలె బీజేపీ నాయకులు బహిరంగంగా స్వరాలు వినిపించడం లేదు. వివిధ రాష్ర్టాలలో విజయాలను ఆస్వాదిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్టేనని కలలు కంటోంది గానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడం లేదు. ఉత్తరాదిలో వలే నరేంద్ర మోదీ పేరు చెబితేనో, తెర వెనుక ఆరెస్సెస్‌ చేసే కృషి వల్లనో తెలంగాణలో ఓట్లు పడిపోవు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే బీజేపీ బలంగా ఉంటోంది. అయితే కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో జెండా ఎగురవేయలేదా? పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోలేదా? అని బీజేపీ సిద్ధాంతకర్తలు వాదిస్తుంటారు. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పార్టీ విధానాలను మార్చుకుని నవతరంతో కనెక్ట్‌ అవడంలో కమ్యూనిస్టులు విఫలం కావడంవల్లనే ఆయా రాష్ర్టాలలో బీజేపీ పుంజుకుంది. ఈ కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ కూడా వెనుకబడింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలా కాదే? తెలంగాణలో అభ్యుదయ భావాలు, వామపక్ష భావజాల వాసనలు ఇంకా పోలేదు. ఈ కారణంగానే బీజేపీ ప్రభావం యువతకు మాత్రమే పరిమితం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చేయి కలిపిన అనేక మంది నిరసిస్తున్నారు. అయితే వారు బీజేపీ విధానాలను అంతకంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గాలకు భరోసా ఇచ్చి దరి చేర్చుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమవుతోంది. ఈ పరిస్థితి కేసీఆర్‌కు కలసి వస్తోంది. ఈ కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దిలాసాగా ఉండగలుగుతున్నారు.

ఇటు రేవంత్‌.. మరి అటు?

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా రేవంత్‌ రెడ్డిని ప్రజలు కొంతవరకు అంగీకరిస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే అలాంటి ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా సాధ్యం కాదు. తెలంగాణ సమాజంపై కేసీఆర్‌ ముద్రను తేలికగా కొట్టిపారేయలేం. ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకించే వారు కూడా ప్రత్యామ్నాయం ఎక్కడ? అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించని బీజేపీ అగ్రనాయకత్వం ‘ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించడం మా విధానం కాదు’ అని అంటోంది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవడం కష్టం అన్న వాస్తవాన్ని బీజేపీ పెద్దలు గుర్తించకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌. మోదీ–అమిత్‌ షా వ్యూహాలు మాత్రమే తెలంగాణలో ఫలితాలు తీసుకురావు. తెలంగాణలో బీజేపీ పుంజుకున్న మాట వాస్తవం. అయితే కేసీఆర్‌ను ఓడించడానికి ఈ బలం సరిపోదు. ఇక నుంచి బీజేపీ మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి, సుపరిపాలన, సమర్థ నాయకత్వం ప్రాతిపదికగా ఎదిగితే తప్ప కేసీఆర్‌ను ఢీకొనలేదని చెప్పవచ్చు. ఈ కారణంగానే బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు పార్టీలో చురుగ్గా కనిపించడం లేదు. మరోవైపు ఆరెస్సెస్‌ భావజాలంతో పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికీ పొసగడం లేదు. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న నాయకుల మాటలకే పార్టీ కేంద్ర ప్రతినిధులు ప్రాధాన్యం ఇస్తారన్న అభిప్రాయం కొత్తగా పార్టీలో చేరిన వారిలో ఉంది. ఏదో ఆశించి బీజేపీలో చేరినవారిలో నెలకొన్న అసంతృప్తి ఆ పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారింది. ఈ కారణంగానే పార్టీలో కొత్తగా చేరికలు ఉండటం లేదు. కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేక అనేక మంది అయోమయంలో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలి అని తేల్చుకోలేని వారు ఎవరైనా నిర్దిష్టమైన హామీలు ఆశిస్తారు. అదే సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వారిలో కలిగించాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్‌లో చేరాలనుకొనే వారు వెనకడుగు వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో పరిస్థితి మెరుగ్గా ఉందా? అంటే అదీ లేదు. బీజేపీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. ఈ పరిస్థితి కేసీఆర్‌కు కలసి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన విధానాలను మార్చుకోకుండా, తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోకుండా అధికారంలోకి రావాలని అనుకోవడం పగటికలే అవుతుంది. ఇకపై తన సమయాన్నంతా తెలంగాణ కోసమే కేటాయిస్తానని అమిత్‌ షా చెప్పినప్పటికీ పార్టీ ఎదుగుదలకు ప్రధాన ప్రతిబంధకాలను గుర్తించకుండా ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేసినా ఫలితం ఉండదు. కేవలం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న తెలంగాణ కోసం అంత శ్రమ తీసుకోవాలా? పార్టీ ఎత్తుగడలను మార్చుకోవాలా? అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు. కర్ణాటకలో పరిస్థితులకు.. తెలంగాణలోని పరిస్థితులు భిన్నమైనవి. కర్ణాటకలో కులాల ప్రాబల్యం ఉన్నప్పటికీ అక్కడ బలంగా ఉన్న మఠాల ప్రభావం ప్రజలపై ఉంటుంది. ఆ కారణంగానే బీజేపీ అక్కడ బలపడగలిగింది. తెలంగాణలో మఠాలు లేవు. ప్రజలను ప్రభావితం చేయగలిగిన మఠాధిపతులు కూడా లేరు. మరో రెండు నెలల్లో కర్ణాటకలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం తెలంగాణపై ఎంతో కొంత ఉంటుందన్న అభిప్రాయం ఉండనే ఉంది. మరోవైపు హిందూ భావజాలం ఉన్నవారు బీజేపీ వైపు ఆకర్షితులు కాకుండా తనవైపు తిప్పుకోవడం కోసం దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రిని అభివృద్ధి చేసిన ఆయన ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంపై దృష్టి పెట్టారు. మరోవైపు మైనారిటీలు దూరం కాకుండా మజ్లిస్‌ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇందుకు విరుగుడు వ్యూహాలు రూపొందించుకోకుండా మతాన్ని మాత్రమే నమ్ముకుంటోంది. రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ సభ్యులను ఢిల్లీకి పిలిపించుకొని ఉపన్యాసాలిచ్చి పంపే బదులు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకాలను గుర్తించడంపై అమిత్‌ షా దృష్టి పెట్టాలి. చేరికలను ప్రోత్సహించాలని చెబుతున్నప్పటికీ చెప్పుకోదగిన నాయకులు ఎవరూ బీజేపీలో చేరడానికి ఎందుకు ముందుకు రావడంలేదో ఆయన తెలుసుకోవాలి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలుగా ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆ మధ్య రాష్ట్ర ఇంచార్జి చేసిన ప్రకటన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కలకలం రేపింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనప్పుడు పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసేంతటి సిద్ధాంతబద్ధులు ఉత్తరాదిలో వలె తెలంగాణ బీజేపీలో ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. రాజకీయంగా భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోతే గతంలో వలె మూడు నాలుగు సీట్లకే బీజేపీ పరిమితం అవుతుంది. మత ప్రాతిపదికన పనిచేస్తున్నప్పటికీ తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ బలపడకపోవడానికి కారణం ఏమిటో అమిత్‌ షా గుర్తించాలి. ఇతర పార్టీల వారు చేరిన తర్వాత మాత్రమే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చింది. ఇప్పుడు వారిలో నిరాశానిస్పృహలు చోటుచేసుకోవడంతో కొత్తగా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా అభ్యర్థులను పార్టీ అధిష్ఠానమే ఖరారు చేస్తుంది. అయితే రాష్ట్ర నాయకులు పార్టీ అధిష్ఠానం నిర్ణయాలను ప్రభావితం చేయగలరు. తమకు కావలసిన వారికి పార్టీ టికెట్లు ఇప్పించుకోగలరు. బీజేపీలో ఈ పరిస్థితి లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గానీ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గానీ తమను నమ్ముకున్న వారికి పార్టీ టికెట్‌ ఇప్పించగలిగే స్థితిలో లేరని చెబుతారు. పార్టీ తరఫున పనిచేసే దూతలతో పాటు ఆరెస్సెస్‌ ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్ర నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేస్తుంటుంది. దీంతో బీజేపీలో చేరితే టికెట్‌ సంగతి ఏమిటి? అని ప్రశ్నించే వారికి బీజేపీ రాష్ట్ర నాయకులు భరోసా ఇవ్వలేకపోతున్నారు. అదే సమయంలో ‘ఇక్కడ మా పరిస్థితే అగమ్యగోచరంగా ఉంటోంది. మీకేం హామీ ఇవ్వగలం?’ అని బీజేపీలో కొత్తగా చేరిన నాయకులు నిట్టూరుస్తున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించడానికి కమిటీ వేయడం కూడా వ్యూహాత్మక తప్పిదం అని అంటున్నారు. ఎవరైనా ఇతర పార్టీలకు చెందిన వారిని రహస్యంగా సంప్రదించి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తారు. చివరి నిమిషం వరకు ఇదంతా గుట్టుగా జరుగుతుంది. అన్నీ అనుకూలిస్తేనే ఫిరాయింపులు ఉంటాయి. ఇందుకు భిన్నంగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల సమాచారం ముందుగానే లీక్‌ అవుతోందట. భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్యేను ఆ మధ్య సంప్రదించినప్పుడు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి విషయం తెలిసిపోయింది. దాంతో సదరు ఎమ్మెల్యే ముఖం చాటేశారు. రహస్యంగా జరగాల్సిన వాటిని బహిరంగంగా, బహిరంగంగా జరగాల్సిన వాటిని రహస్యంగా చేయడంవల్లనే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని బీజేపీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే పార్టీ టికెట్‌కు ఎవరు భరోసా ఇస్తారు? ఎన్నికల ఖర్చుకు ఎవరిపై ఆధారపడాలి? అన్న విషయంలో స్పష్టత లేనందునే చేరికలను ప్రోత్సహించండి అని అమిత్‌ షా ఎన్నిసార్లు చెప్పినా ఏమీ జరగడంలేదు. చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు సైతం పార్టీ టికెట్‌, నిధుల విషయంలో హామీ ఇచ్చే అధికారం లేదు. ఆ మాటకొస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు కూడా ఆ అధికారం లేదు. ఇలాంటి అనేక సమస్యలు బీజేపీ ఎదుగుదలకు అవరోధంగా ఉంటున్నాయి. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంటోంది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇటువంటి పరిస్థితినే కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు సమాంతరంగా ఉండాలన్నదే ఆయన అభిప్రాయం. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి బలపడితే తన అధికారానికి ముప్పు ఏర్పడుతుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయా పార్టీల్లోని తన మనుషుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని విరుగుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా, స్థానిక నాయకులకు నిర్ణయాధికారాలను బదిలీ చేయకుండా మూస పద్ధతిలోనే వ్యవహరించాలని అనుకుంటే తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరేయడం అంత సులభం కాదు.

కాంగ్రెస్‌కు ద్వారాలు తెరిచి..

మరోవైపు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేరువ అవడం కోసం కేసీఆర్‌ దారులను తెరిచే ఉంచుకుంటున్నారు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ నెల ఒకటవ తేదీన చెన్నైలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం నిర్మించడం అసాధ్యం అని తేల్చిపారేశారు. అదే సమయంలో తన జన్మదిన వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ఆహ్వానించలేదు. గత నెల 17న తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ సభకు స్టాలిన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగలేదు. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేసి బీజేపీతో ఢీకొంటున్నప్పటికీ స్టాలిన్‌ వంటి వారు కేసీఆర్‌ను నమ్మడం లేదు. కేసీఆర్‌ను మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కూడా స్టాలిన్‌ ఆహ్వానించలేదు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రధాన నాయకులను ఆయన నమ్మడం లేదని అంటారు. బీజేపీని వ్యతిరేకించే విషయంలో కేసీఆర్‌ ఎన్ని చెబుతున్నా ఆయనను నమ్మలేమని స్టాలిన్‌ తన పార్టీ ముఖ్యుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం. కాంగ్రెస్‌ విషయంలో కేసీఆర్‌కు స్పష్టత లేకపోవడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే జాతీయ అంశాలలో కేసీఆర్‌ సందర్భాన్ని బట్టి కాంగ్రెస్‌తో గొంతు కలుపుతున్నారు. తెలంగాణలో కూడా అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని రాయపూర్‌లో జరిగిన ప్లీనరీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ నుంచి తనకు నిజంగా ముప్పు ఏర్పడితే కాంగ్రెస్‌తో ఎన్నికలకు ముందు గానీ, తర్వాత గానీ చేతులు కలపడానికి కేసీఆర్‌ వెనుకాడకపోవచ్చునన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో బీజేపీని నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా ఇటువంటి ప్రచారం జరుగుతుండవచ్చు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో చోటుచేసుకొనే పరిణామాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని ఎంచుకుంటుంది? అన్నదే చర్చనీయాంశంగా ఉంది. ఉత్తరాది రాష్ర్టాలలో ముస్లింల ఓట్లు చీల్చడం ద్వారా తన విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి మజ్లిస్‌ పార్టీని బీజేపీ ప్రయోగిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. అదే నిజమైతే తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీయడం కోసం మజ్లిస్‌ పార్టీతో అత్యధిక స్థానాలకు పోటీ చేయిస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ప్రస్తుతానికి మజ్లిస్‌ పార్టీతో కేసీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీఆర్‌ఎస్‌ ప్రయోజనాలకు భిన్నంగా మజ్లిస్‌ వ్యవహరించకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్‌ పార్టీకి కూడా ఇబ్బందే. మొత్తంమీద తెలంగాణలో ఉన్న భిన్నమైన పరిస్థితులు బీజేపీకి ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూలతలను అధిగమించి అధికారంలోకి రావాలంటే బీజేపీ ఎంతో శ్రమించాలి. అదే సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఈ కారణంగా ప్రస్తుతానికి కేసీఆర్‌ అదృష్టవంతుడిగానే కనిపిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకుంటున్న ఆయన కలలు నెరవేరతాయో లేదో కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలంగాణలో మాత్రం ఆయనకు మేలు జరిగే అవకాశమే ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్‌, బీజేపీలలో ఏదో ఒక పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలే ఎంచుకోవాలి. తెలంగాణ ప్రజలలో ఈ విజ్ఞత లేకపోలేదు. కేసీఆర్‌ అదృష్టవంతుడిగా నిలబడతారో? దురదృష్టవంతుడిగా మిగిలిపోతారో? చూద్దాం!

ఆర్కే

Updated Date - 2023-03-06T23:35:23+05:30 IST