బతుకంతా పుస్తకానికే..!
ABN , First Publish Date - 2023-09-27T01:44:34+05:30 IST
పుట్టింది సముద్ర తీర ప్రాంతంలోని కుగ్రామమైనా బతుకంతా పుస్తకానికే అన్నట్టు జీవించారు. ఉన్నత చదువులు చదివి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూ రాజీనామా చేశారు...
పుట్టింది సముద్ర తీర ప్రాంతంలోని కుగ్రామమైనా బతుకంతా పుస్తకానికే అన్నట్టు జీవించారు. ఉన్నత చదువులు చదివి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూ రాజీనామా చేశారు. హైదరాబాదు హైకోర్టులో న్యాయవాది వృత్తి చేస్తూ కాదనుకొని వచ్చేశారు. నెల్లూరులో నామమాత్రంగా న్యాయవాది వృత్తి చేస్తూ ఆరు దశాబ్దాలపాటు చారిత్రకమైన వర్ధమాన సమాజం, నెల్లూరు టౌన్ హాలు కోసం కృషిచేసిన సాహితీవేత్త ఆగస్త్యరెడ్డి వెంకురెడ్డి. సాహితీవేత్తగా దాదాపు ఏడు శతకాలు, ఖండకావ్యాలు, వ్యాసాలు, సమీక్ష వంటి గ్రంథాలను వెలువరించినా, నిరంతరం అభ్యుదయ సాహిత్యానికి కృషిచేసిన వ్యక్తి. శ్రీ నెల్లూరు వర్ధమాన సమాజం కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా, రావు బహదూర్ రేబాల లక్ష్మీ నర్సారెడ్డి పబ్లిక్ హాల్ (టౌన్ హాల్) కార్యదర్శిగా దాదాపు 52 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తూ సాహిత్యంతో, పుస్తక భాండాగారంతో, సాహిత్య సభలతో బతకంతా పుస్తకాలతో గడిపిన సాహితీ యోధుడు వెంకురెడ్డి.
నెల్లూరు నగర సాంస్కృతిక అధికార భాషా సంఘ సభ్యులుగా దశాబ్దం పాటు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా, తిక్కన విజ్ఞాన కేంద్ర వ్యవస్థాపక కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ తన జీవితకాలాన్ని పుస్తకాల కోసం, సాహిత్యం కోసం ఖర్చు చేసిన కలం యోధుడు. తెలుగు కవులను, పండితులను పలు ప్రాంతాల నుంచి ఆహ్వానించి టౌన్ హాల్‌లో ఉపన్యాసాలు ఇప్పించారు. సీమ సాంప్రదాయం ప్రకారం వారికి సన్మాన సత్కారాలు నిర్వహించేవారు. నెల్లూరు టౌన్ హాల్‌లో సాహిత్య ఉపన్యాసం అంటే పండితులు కూడా ఆసక్తిగా వచ్చేవారు. ఎర్రన, తిక్కన, నన్నయ జయంతుల పేరుతో పుట్టపర్తి నారాయణచార్యులు, పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి, డాక్టర్ కేతవరపు రామకోటిరెడ్డి, ఉండేలా మాలకొండ రెడ్డి, దాశరథి, గుర్రం జాషువా, ఆరుద్ర, డాక్టర్ సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ వంటి ఎందరో పండితులు, కవులను ఆహ్వానించి నెల్లూరు టౌన్ హాలులో ఉపన్యాసాలు ఇప్పించి సింహపురిని సాహితి క్షేత్రంగా మార్చింది కూడా వెంకురెడ్డి కార్యదర్శిగా ఉన్న వర్ధమాన సమాజమే. దాదాపు వేల పుస్తకాలను పురాతన, ప్రాచీన గ్రంథాలు, కావ్యాలను వర్ధమాన సమాజంలో జాగ్రత్తగా భద్రపరచటంలో కృషిచేసిన పుస్తక ప్రియుడు. రాసేవారంటే ఆయనకు అభిమానం ఎక్కువ. అలాగే గ్రంథాలు, కావ్యాలు చదివేవారంటే అక్కున చేర్చుకునేవారు.
1939 అక్టోబర్ 4న సముద్రతీర ప్రాంతం ఈదూరులో జన్మించిన వెంకురెడ్డి, బిఎ వరకు నెల్లూరులోను, ఎంఏ, ఎల్ఎల్‌బి నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తాతగారి వద్ద బాల్యంలో అమరం, ఆంధ్ర సమగ్ర శేషము, తెలుగు నిఘంటువు, బాల రామాయణం, త్రిలింగము, అమరకోశం లాంటి అనేక సాహిత్యాలు, శతకాలు చదవటం వల్ల బాల్యం నుంచి ఆయనకు సాహిత్యం పట్ల అభిలాష ఉండేది. పండితులు మోచర్ల రామకృష్ణయ్య గురువు వద్ద శిక్షణ పొంది, వారి ఆశీస్సులతో సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. నెల్లూరులో పారిశ్రామికవాడను ప్రారంభించేందుకు కృషి చేసి, అందులో మొట్టమొదట పరిశ్రమ కూడా నెలకొల్పారు. కానీ ఆదాయ వనరులు కూర్చే వ్యాపారాలు, వృత్తుల కన్నా సమాజహితం కోరాలనే సంకల్పం వారిలో బలంగా ఉండడం వల్ల సాహిత్య రంగం వైపు కృషి చేశారు. వర్తమాన సమాజం, టౌన్ హాలు లాంటి సంస్థలతో జీవితాన్ని గడుపుతూ బతుకంతా పుస్తకమే, జీవితమంతా సాహిత్యమే అనే బాటలో చివరి వరకు పయనించారు అవివాహితుడైన వెంకురెడ్డి. వీరు సెప్టెంబర్ 22న నెల్లూరులో మరణించారు.
ఈతకోట సుబ్బారావు