ప్రతిపక్షాలపై ఎదురుదాడే మోదీ వ్యూహం
ABN , First Publish Date - 2023-02-15T01:04:34+05:30 IST
ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానాన్ని ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులకు గాని అంత ఇష్టం లేదని...
ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానాన్ని ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులకు గాని అంత ఇష్టం లేదని సోమవారం నాడు ముగిసిన పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ పేరు సైతం ప్రస్తావించడం మోదీకి ఇష్టం లేదని ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమర్థంగా మాట్లాడారు. అయితే ఆయన కేవలం అదానీ పైనే తన విమర్శనాస్త్రాలను ప్రయోగించారు. నిజానికి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకున్న ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఒక్కొక్కదాన్నీ ఎండగడుతూ మాట్లాడేందుకు అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఆయన అదానీనే ప్రధాన విమర్శాంశంగా ఎంచుకోవడాన్ని పార్టీ వ్యూహంగా కొంతమంది భావిస్తున్నారు. సార్వత్రక ఎన్నికలకు ఒక ఏడాది ముందు జరిగిన ఈ బడ్జెట్ సమావేశాల్లో అదానీతో పాటు మోదీ సర్కార్ పనితీరును మొత్తంగా విమర్శించి ఉంటే బాగుండేదేమో అని అన్న వారు కూడా ఉన్నారు. నిజానికి అదానీపై హిండెన్ బర్గ్ నివేదికకు ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పట్టుబడుతూ పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ ఐదు రోజుల పాటు స్తంభింపచేసింది. మరి ఉన్నట్లుండి తన వ్యూహరచనను మార్చుకుని రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొనాలని ఎందుకు నిర్ణయించింది? బహుశా భారత్ జోడో యాత్ర ముగించుకుని వచ్చిన రాహుల్ గాంధీతో పాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు అదానీ గురించి మాట్లాడాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఎవరెన్ని మాట్లాడినా ప్రతిపక్షాలకు జవాబివ్వకుండా వారిపై ఎదురు దాడులు చేసి సభను ఏదో రకంగా ముగించుకోవాలన్న ధోరణి అధికార పక్షం వర్గాల్లో వ్యక్తమయింది.
ప్రశ్నలకు జవాబివ్వలేని వారు ప్రశ్నించిన వారిని దూషించడమో, లేదా వారిని భయభ్రాంతులకు గురి చేయడమో చేస్తారు. నిరంకుశత్వ పోకడలు ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు చేసే పని అది. ఇందిరాగాంధీ అయితే లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన్ని జైలు పాలు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశ్నలకు ఆస్కారం లేకుండా చేయడం మాత్రమే కాదు, ప్రశ్నించిన వారిని తీవ్ర భయాందోళనలకు లోను చేసే పద్ధతిని కూడా అవలంబించడం కనపడుతోంది.
రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దూకుడు వైఖరి అవలంబించారు. అదానీకి తానిచ్చిన అండదండల గురించి జవాబివ్వమని అడిగితే రాహుల్ గాంధీని, ఆయన వంశాన్ని, ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిర కాలం నుంచి జరిగిన నిర్ణయాలను మోదీ తూర్పారబట్టారు. జెపిసి దర్యాప్తును కోరితే ప్రతిపక్షాలు ఈడీని చూసి భయపడి ఏకమయ్యాయంటూ ఆయన అవహేళన చేశారు. రాజకీయ తాత్విక భాషలో ఇలాంటి వైఖరిని ‘అడ్ హోమినెమ్’ అంటారు. ఒక వ్యక్తి వాదనను ఎదుర్కొనేందుకు ఆ వ్యక్తి వాదనలోని కీలక అంశాన్ని పట్టించుకుని జవాబిచ్చే బదులు ఆ వ్యక్తి ప్రవర్తనపై, సంబంధం లేని ఇతర అంశాలపై దాడులు చేసే పద్ధతి ఇది. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్, బ్రిటిష్ తత్వవేత్త జాన్ లాక్, ఇంకా పలువురు తత్వవేత్తలు ఇలా అడ్డంగా వాదించి దాడులు చేసేవారిని ‘అడ్ హోమినెమ్’ నేతలుగా వర్గీకరించారు. తమపై చేసిన ఆరోపణను సమర్థంగా ఎదుర్కొనేబదులు ఆరోపణ చేసిన వారిపైనే ప్రత్యారోపణలు చేయడాన్ని వాటబౌటరీ అని కూడా అంటారు. మోదీ ఈ రెండు కళల్నీ అభ్యసించారు.
భారతదేశ రాజకీయాల్లో ఇలా పరస్పర దాడులు చేయడం తప్ప వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొని ఎటువంటి విచారణకైనా సిద్ధమనే నైతిక పద్ధతిని అనుసరించే రోజులు పోయాయి. అందువల్ల ప్రతిపక్షాలు ‘అదానీ, అదానీ’, ‘అదానీ–మోదీ భాయి భాయి’ అని అరిచినా, ‘వీ వాంట్ జెపిసీ’ అని నినాదాలు చేసినా అవి అరణ్య రోదనలుగా మిగిలిపోయాయి. పార్లమెంట్‌లో ప్రశ్నలను కూడా రికార్డుల నుంచి తొలగించే రోజులు వచ్చాయి. అసలు రికార్డుల్లో లేని వాటి గురించి జవాబివ్వాల్సిన అవసరమేమిటని ప్రభుత్వం సమర్థించుకునే పరిస్థితి వచ్చింది. ఆఖరుకు సుప్రీంకోర్టు అడిగితే అదానీ పేరు బయటకు రాకుండా కాపాడేందుకు హిండెన్ బర్గ్ నివేదిక పర్యవసానాలపై కమిటీ వివరాలను కూడా సీల్డు కవర్‌లో సమర్పిస్తామని ప్రభుత్వం చెప్పడం, కనీసం ఏదో ఒకటి సమర్పిస్తోంది కదా అని సుప్రీంకోర్టు అంగీకరించడం ఆశ్చర్యకరం.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏమి చేయాలి? భారత రాజకీయాలు సంధి దశలో ఉన్నాయి. ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల నాటికి అయినా పుంజుకుంటాయా లేదా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకోగలదో ఆ పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. 545 లోక్‌సభా నియోజక వర్గాలలోని 300కు పైగా స్థానాలలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికీ దయనీయంగా ఉన్నది. 2019 సార్వత్రక ఎన్నికల్లో 421 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో 119 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కలేదు. గెలుచుకున్న 52 సీట్లలో కేరళలోనే అత్యధికంగా 15 సీట్లు రాగా ఆ తర్వాత తమిళనాడులో మిత్రపక్షం పుణ్యమా అని 8 సీట్లు దక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో 67 సీట్లకు పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు దక్కింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, పంజాబ్‌లలో ఒకో సీటు మాత్రమే దక్కింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్రాల్లో మెరుగవుతుందా?
2009లో కాంగ్రెస్‌కు 206 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 33 సీట్లు లభించాయి. ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కలలో కూడా అన్ని సీట్లు వచ్చే అవకాశం ఏ కోశానా లేకపోయినప్పటికీ మిగతా రాష్ట్రాల్లోనైనా 2009లో వచ్చిన ఫలితాలను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించవలసివుంటుంది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో బిజెపిని ఇప్పటికీ ముఖాముఖి ఎదుర్కోగల పరిస్థితి కాంగ్రెస్‌కే ఉన్నది. కనుక ఈ రాష్ట్రాలలో సంఖ్యాబలం పెంచుకునే అవకాశాలు కాంగ్రెస్‌కు లేకపోలేదు. అయితే అందుకు తగ్గ నిర్మాణం గానీ, నాయకత్వం కానీ కాంగ్రెస్‌కు ఉన్నదా అన్నదే సమస్య. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బిజెపికి అత్యధిక సీట్లు లభించాయి. కాంగ్రెస్ ఎంతో కొంత గట్టి పోటీ ఇవ్వగలిగిన రాష్ట్రాల్లో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. 2024లో కాంగ్రెస్ కనీసం 100 సీట్లయినా దాటితే కాని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితులు లేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ మోదీ, ఆయన పార్టీ దూకుడును తట్టుకుని ముఖాముఖిగా బిజెపిని ఢీకొనగల సత్తా కాంగ్రెస్ సంపాదించుకోగలుగుతుందా?
అయితే బిజెపి ధాటికి కళ్లెం వేయగలిగే విషయంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ అవకాశం ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని చెప్పక తప్పదు. ఇప్పటికీ లోక్‌సభలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల బలం కలిపి 355 కాగా మిగతా 190 మంది సభ్యులు ప్రాంతీయ పార్టీలకు చెందినవారే. 2024 ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీల సంఖ్యాబలంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. వీరిలో కచ్చితంగా 150 మంది పరిస్థితిని బట్టి బిజెపికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మెజారిటీకి 50 సీట్లు తక్కువయినా బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని కచ్చితంగా చెప్పేందుకు అవకాశం లేదు. అయినా ఏ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసి ఉంటుంది. బహుశా కేసీఆర్ వంటి నేతలు ఈ దృష్టితోనే పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. లాలూప్రసాద్ యాదవ్, దేవెగౌడ, శరద్ పవార్ వంటి నేతలు వృద్ధులు కావడం, ములాయం సింగ్ యాదవ్, జయలలిత, కరుణానిధి లాంటి నేతలు దివంగతులు కావడం, మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడడంతో జాతీయ స్థాయిలో తనకు నాయకత్వం అవకాశం ఉన్నదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఫలితాలు ప్రకటించిన తర్వాత కానీ ఏ నాయకుడికి జాతీయ స్థాయిలో అవకాశం వస్తుందనేది తేలే అవకాశాలు లేవు. గతంలో దేవెగౌడ, గుజ్రాల్ లాంటి వారిని ప్రధానమంత్రి పదవి వరించింది కదా. వారైనా ఈ విషయాన్ని కలలో ఊహించి ఉంటారా?
ప్రాంతీయ పార్టీలకు ఆధిపత్యం రావాలన్నా కాంగ్రెస్ పుంజుకోవడం ఒక చారిత్రక అవసరం. ఎటొచ్చీ కాంగ్రెస్ ఏమిచేయగలుగుతుందనే విషయంలోనే రాజకీయ పరిశీలకులకు అనుమానాలు ఉన్నాయి. కేవలం అదానీ కుంభకోణాన్ని ఆసరాగా తీసుకుని బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మళ్లించడం అంత సులభం కాదు. పైగా బిజెపి ప్రజల భావోద్వేగాలపై ఆధారపడ్డ పార్టీ. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి తగ్గ భావోద్వేగాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం, చిన్నా చితక పార్టీలను ప్రోత్సహించి ఓట్లను చీల్చడం, జాతీయ స్థాయిలో మోదీని మించిన సమర్థ నేత లేనేలేడని ప్రచారం చేయడం, దేశ భద్రత, సమైక్యత, సుస్థిరత, ఆత్మనిర్భర్ వంటి భారీ పదాలను గుప్పించడం, అన్నిటినీ మించి ప్రత్యర్థుల బలహీనతలను దృష్టిలో ఉంచుకుని సామ, దాన భేద దండోపాయాలను ప్రయోగించడం... ఇత్యాది వ్యవహారాలలో బిజెపి నిష్ణాతురాలైంది.
భారీ డైలాగులు వల్లించడం, ప్రత్యర్థులపై ఎదురు దాడులు చేయడం మినహా ప్రజల ముందుకు వెళ్లేందుకు బిజెపి వద్ద పెద్ద అస్త్రాలు లేనట్లు ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలు స్పష్టం చేశాయి. ఏ అస్త్రాలు లేనప్పుడే తిట్లకు లంకించుకోవడం, చర్చనుంచి పలాయనం చిత్తగించడం జరుగుతాయి. ఎప్పుడో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో జరిగిన నిర్ణయాలపై పదే పదే తూర్పారబట్టడం వల్ల సాధించేదేముంది? చివరకు తననొక్కడినీ ఎదుర్కోలేక పోతున్నారంటూ మోదీ రాజ్యసభలో ఛాతీని చరుచుకున్నారు. తన పార్టీ సభ్యులు, మిత్రపక్షాలు కూడా నిమిత్తమాత్రులేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజా స్వామ్యంలో వ్యక్తి ఆధిపత్యం ఆరోగ్యకరమా? మోదీ, మోదీ అని బల్లలు చరుస్తున్న నేతలకు తాము అనామకులమని, నిర్వీర్యులమని అర్థం కాకపోవచ్చు. ప్రజలకు అర్థం అయ్యే రోజులు మాత్రం రాక తప్పదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)