నాడు జలదీక్ష – నేడు మౌనవ్రతం!

ABN , First Publish Date - 2023-09-17T01:32:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు రక్షణ కరవుయ్యింది. ప్రమాదం ముంచుకొస్తున్నది. 2016లో ప్రతిపక్ష నాయకుడుగా కర్నూలులో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు...

నాడు జలదీక్ష – నేడు మౌనవ్రతం!

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు రక్షణ కరవుయ్యింది. ప్రమాదం ముంచుకొస్తున్నది. 2016లో ప్రతిపక్ష నాయకుడుగా కర్నూలులో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నోరు తెరవడం లేదు. ఈయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాక, కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టివచ్చారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటిదశ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన పంపు బటన్‌ నొక్కి ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో, ఆ అక్రమ ప్రాజెక్టుపై జగన్‌ నేడు నోటికి తాళం వేసుకొన్నారు. మరి, ఆంధ్రప్రదేశ్ నీటిహక్కులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరిరక్షిస్తుంది?

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014’ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్‌ కౌన్సిల్ అనుమతి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉల్లంఘించి మరీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కేసీఆర్‌ ఈ మొదటి పంపింగ్ స్టేషన్ ప్రారంభించారు. ఇది ఇలా ఉంచితే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ చేసిన ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని మొదట 90 టియంసిల కృష్ణా నది వరద జలాలతో చేపట్టినా, ప్రస్తుతం ప్రాజెక్టును చిన్ననీటిపారుదల పద్దుకింద ఉన్న నికర జలాల వాటాలో మిగులంటూ 45 టియంసిలు, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నుండి కృష్ణా నదికి మళ్లించే గోదావరి నది జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వాటా 45 టియంసిలు కలిపి మొత్తం 90 టియంసిల నికర జలాలను ఏకపక్షంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తదనుగుణంగా, ఈ విధమైన కేటాయింపును ఖరారు చేయవలసిందిగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను తాము కోరుతున్నట్లు తెలియజేశారు. అంతేకాదు, ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చినట్లేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను హరించడం కాదా?

ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి దక్షిణ తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్ళిస్తే అభ్యంతరం లేదు. కానీ, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘించి, ఈ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నది. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోరు మెదపడం లేదు, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల సమస్య పట్టనేలేదు. రాష్ట్రం అనాథగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పేర్కొన్న తెలుగుగంగ, హంద్రీ నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారయ్యింది.


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని జలవనరుల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించిన తొమ్మిదవ భాగం సెక్షన్ 84(1) ప్రకారం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణానదీ యాజమాన్య బోర్డుల కార్యకలాపాల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దానికి కేంద్ర జలవనరుల మంత్రి చైర్‌పర్సన్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు. సబ్ సెక్షన్(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ విధులు ఈ విధంగా ఉన్నాయి.

1) గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు పనితీరును పర్యవేక్షించడం (2) గోదావరి లేదా కృష్ణా నదీ జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఏవైనా ఉంటే, నదీ యాజమాన్య బోర్డులు, కేంద్ర జలసంఘం ద్వారా మదింపు చేసి, సిఫారసు చేసిన తరువాత, అవసరమైన చోట ప్రణాళిక మరియు ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేయడం. సెక్షన్ 85లోని నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు, విధులు క్రింద (8–డి) ప్రకారం గోదావరి లేదా కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఏదైనా ప్రతిపాదనను అంచనా వేయడం, సాంకేతిక అనుమతులు ఇవ్వడానికి ముందు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (1956) ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునళ్ల తీర్పుల ప్రకారం ఇప్పటికే పూర్తయిన లేదా రాష్ట్ర విభజన నాటికి (అపాయింటెడ్ డేట్) చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం ఉండదని సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

పదకొండో షెడ్యూలులోని 7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ‘డిపెండబిలిటీ’ ప్రమాణాల ఆధారంగా లభించే జలవనరుల ఆధారంగా ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి తీసుకోకుండా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి వీల్లేదు. ప్రతిపాదనలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించడానికి ముందు సంబంధిత బోర్డు (కృష్ణా/గోదావరి) ముందుగా పరిశీలనచేసి, సాంకేతికంగా ఆమోదించాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా, పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి, ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొంటే కేంద్ర ప్రభుత్వం విధించే జరిమానాలకు, చర్యలకు గురౌతుంది.


శ్రీశైలం జలాశయం యం.డి.డి.ఎల్. 834 అడుగులు. నీటి నిల్వ ఈ స్థాయిలో లేదా దిగువస్థాయిలో ఉన్నప్పుడు తాగునీటి అవసరాలకు తప్ప మరే అవసరానికి వాడడానికి వీల్లేదని 1996 జూన్ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.యం.ఎస్.నెం.69లో పేర్కొన్నారు. కానీ, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి తరలింపు 800 అడుగుల నుండే మొదలవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కోతిగుండు వద్ద కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయం వెనుక జలాలను అప్రోచ్ కాలువ ద్వారా ఈ పథకానికి నీటిని తరలిస్తారు. 2015 జూన్ 10న జీ.ఓ.నెం.105 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతులిచ్చింది. అంటే, రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టు. పనులను 2016లో మొదలు పెట్టారు. సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ. 55వేల కోట్లు. 3200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న తొమ్మిది పంపుల ద్వారా రోజుకు 2 టియంసిల చొప్పున 60 రోజుల్లో 120 టియంసిల తరలింపు దీని లక్ష్యం. మొత్తం ఆరు రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా ఆరు జిల్లాలలోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందజేయడం దీని లక్ష్యం. ఈ పథకానికి వ్యతిరేకంగా నాడు జలదీక్ష చేసిన జగన్మోహన్‌రెడ్డి నేడు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నట్టు?

టి. లక్ష్మీనారాయణ

(ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Updated Date - 2023-09-17T01:32:33+05:30 IST