జగన్ విద్రోహంతోనే కొత్త ట్రిబ్యునల్!
ABN , First Publish Date - 2023-10-10T01:21:14+05:30 IST
అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టు ఉంది కొత్త ట్రిబ్యునల్ నియామకంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం లేవనెత్తి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు నేడు...
అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టు ఉంది కొత్త ట్రిబ్యునల్ నియామకంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం లేవనెత్తి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు నేడు ఈ దుర్గతి పట్టేది కాదు. ఏకీభావం లేదని కేంద్ర మంత్రి పెండింగ్‌లో పెట్టేవారు. అప్పటికీ కేంద్ర మంత్రి ముందుకు పోయి వుంటే, ఏపీ డీసెంట్ నోట్ పెట్టి వుంటే ఈ రోజు కోర్టుకు ఉపయోగపడేది. ఇప్పుడు ప్రధానమంత్రికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫలితం ఇవ్వని ప్రకటన ఒకటి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రాష్ట్ర విభజన చట్టమే కరదీపిక. ఇందులోని సెక్షన్ 89 మేరకు ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంటే మరొక ట్రిబ్యునల్ నియామకం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మిత్రత్వం, తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందాలనే ప్రధానమంత్రి మోదీ దూరాలోచన.. కలగలసి కొత్త ట్రిబ్యునల్ నియామకానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగునీటి రంగాన్ని చావుదెబ్బ కొట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ భావజాలానికి చోటు ఉండదని భావించిన మోదీ రాష్ట్ర విభజన తర్వాత ఒక దాని వెంబడి మరొక దెబ్బ కొడుతున్నారు. ప్రత్యేక హోదా పోయింది. చట్టబద్ధత గల పోలవరం ప్రాజెక్టు విష వలయంలో చిక్కుకొన్నది. ఇప్పుడు మొత్తం సాగునీటికే ఎసరు పెట్టే ట్రిబ్యునల్ వంతు వచ్చింది.
గతంలో కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమకు తీవ్ర అపకారం చేసే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించారు. పైగా కేంద్ర బడ్జెట్‌లో ఏకంగా రూ.5300 కోట్లు కేటాయించారు. గొంతెండి పోతున్న రాయలసీమకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి అడగలేదు. తాజాగా తెలంగాణకు అనుకూలంగా రెండేళ్లుగా పెండింగ్‌లో వున్న కొత్త ట్రిబ్యునల్ ప్రతిపాదనకు నేడు కేంద్రం అనుమతి ఇచ్చింది.
కృష్ణా నదీ జలాలను తిరిగి రెండు రాష్ట్రాల మధ్య పంపకం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ట్రిబ్యునల్ నియామకం వల్ల కేవలం రాయలసీమకు మాత్రమే నష్టం జరుగుతుందని చాలా మంది అపోహ పడుతున్నారు. నిజానికి ఇది మొత్తం రాష్ట్ర సాగునీటి రంగాన్ని కుదిపేయబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత వివిధ వేదికల మీద తెలంగాణ వ్యక్తం చేస్తున్న వాదనలను పరిశీలిస్తే, కృష్ణ డెల్టాతో పాటు సాగర్ కుడి కాలువ కేటాయింపులకు కూడా తెలంగాణ ఎసరు పెట్టబోతోంది. పోలవరం లేక పట్టిసీమ నుంచి వచ్చే 80 టిఎంసిలతో పాటు సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చే జలాలు డెల్టాకు సరిపోతాయని బచావత్ ట్రిబ్యునల్ డెల్టాకు కేటాయించిన 181 టీఎంసీల్లో ఆధునీకరణ కింద 29 టీఎంసీలు (భీమాకు 20, పులిచింతలకు 9)పోగా మిగిలిన మొత్తం 151 టీఎంసీల నీళ్లు బేసిన్‌లో ఉన్న తమ ప్రాజెక్టులకు కేటాయించాలని డిమాండ్ చేసి ఉంది. కాగా సాగర్ కుడి కాలువకు కేటాయించిన 132 టీఎంసీల్లో కోత పెట్టాలని ఈ కాలువ కింద బేసిన్ ఆవలకు నీళ్లు తీసుకుపోతున్నారనే వాదనను విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈపాటికే విచారణాంశంగా చేసి ఉంది. తుదకు అమరావతి రాజధాని ఏర్పడుతున్నందున గుంటూరు కాలువ కేటాయింపులకు కోత పెట్టాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ సాక్షులను తెలంగాణ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఉన్నారు.
ఈ రోజే కాదు. తొలి నుంచి రాయలసీమకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. విభజన చట్టం మేరకు విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ బేసిన్ సమస్యను ప్రబలంగా ముందుకు తెస్తోంది. రాయలసీమ కృష్ణ బేసిన్‌లో లేదని, వేరే బేసిన్‌లో ఉందని కేసీ కెనాల్‌తో పాటు తుంగభద్ర ఎగువ కాలువకు కేటాయించిన నీరు బేసిన్ ఆవలకు తీసుకెడుతున్నారని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ పాటికే మరొక విచారణాంశంగా చేసి ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ మేరకు బచావత్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆపైన మిగులు వుండే నీళ్లు, గోదావరి నుంచి వచ్చే నీళ్లు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతను కొత్త ట్రిబ్యునల్‌కు అప్పగించారు. 2004లో నియమింపబడి 2013 లో తీర్పు ఇచ్చిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఇందులో చేర్చారు. బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలను మినహాయించారు. వాస్తవంలో తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగివుంటే అది బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు నీటి పంపిణీ చేసినపుడే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తలపడిందంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింతగా ద్వేషాలు పెంచడానికే. బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు గెజిట్ నోటిఫై చేయాలని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇంత గందరగోళం దేశంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య, ఏ నదీ జలాల అంశంలో లేదేమో! కృష్ణ యాజమాన్య బోర్డు ఏర్పడి నోటిఫై జరిగినా తెలంగాణ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించ లేదు. శ్రీశైలం రూల్ కర్వ్‌పై సంతకం చేయలేదు. సాగర్‌కు అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి కోసం బోర్డు వద్దన్నా శ్రీశైలం నుంచి నీళ్లు వదలి సముద్రం పాలు చేస్తోంది. ఇంతగా మొండికేస్తున్న తెలంగాణకు అనుకూలంగా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైందంటే ఎలా నమ్మగలం? ఇది కేవలం ఎన్నికల తాయిలం కాక మరేమిటి?
మరోవైపు గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసిన్‌కు తెలంగాణ నీళ్లు తరలిస్తూ, ఏపీ కృష్ణ బేసిన్ నుంచి వేరే బేసిన్‌కు నీళ్లు తరలిస్తోందని యాగీ చేస్తోంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గాని, వైసీపీ ఎమ్మెల్యేలు గానీ దీనిని ఖండిస్తూ ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రితో సహా వైసీపీ నేతలకు, సీమ ఎమ్మెల్యేలకు తెలంగాణలో స్థిరాస్తులున్నాయి. కేసీఆర్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తే వీటికి ముప్పు ఏర్పడుతుందని భయపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎసరు పెడుతున్నారు. అయితే కారు చీకట్లో కాంతిరేఖలా బచావత్ ట్రిబ్యునల్ కొన్ని రక్షణలు కల్పించింది.
బచావత్ ట్రిబ్యునల్ తన తుది తీర్పు చాప్టర్ 7 క్లాజు 14(ఎ)లో కింద విధంగా రక్షణ కల్పించింది. సౌలభ్యం కోసం ఇంగ్లీషు వెర్షన్ యధావిధిగా ఇస్తాను. ‘‘ఎట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది 31 మే 2000, దిస్ ఆర్డర్ మే బి రివైజ్డ్ ఆర్ రివ్యూడ్ బై ఎ కాంపిటెంట్ అథారిటీ ఆర్ ట్రిబ్యునల్, బట్ సచ్ రివ్యూ ఆర్ రివిజన్ షల్ నాట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబల్ డిస్ట్రబ్ ఎనీ యుటిలైజేషన్ దట్ మే హావ్ బీన్ అండర్ టేకన్ బై ఎనీ స్టేట్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది అలకేషన్...’’ ఈ రక్షణ కల్పించబట్టే 2013లో తుది తీర్పు ఇచ్చిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి వెళ్లలేదు. పైగా తన తుది తీర్పులో ఇలాంటి నిబంధన చేర్చింది. వాస్తవంలో రేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వినియోగంలో వున్న నీటిని మరొకరికి కేటాయింపులు చేయలేదు. భారతదేశంలోనే కాదు. అంతర్జాతీయంగా ఈ సహజ న్యాయసూత్రం ఆచరిస్తున్నారు. ఏ ఒక్క ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు నిర్దిష్ట ప్రాంతంలో వినియోగంలో వుంటే వారి కడుపు కొట్టి మరొకరికి కేటాయించిన సందర్భం దేశ సాగునీటి రంగంలో ఇంతవరకు లేదు. బచావత్ ట్రిబ్యునల్ కూడా డెల్టాకు కరుణించి ఎక్కువ నీటి కేటాయింపులు చేయలేదు. ఆ పాటికే కృష్ణా జలాలు వినియోగిస్తున్నందున ఆ కేటాయింపులు చేసింది. ఇప్పుడు గొంతెమ్మ కోర్కెను తెలంగాణ కోరుతోంది.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా కృష్ణలో కేవలం మిగులు నికర జలాలను మాత్రమే బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఈ తీర్పు ఆమోదయోగ్యం కాదని 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కినందున స్టే లభించింది. ఇప్పటికీ ఈ స్టే అలాగే ఉంది. అసందర్భమైనా చెప్పక తప్పదు. తెలంగాణ ఎంతకు తెగబడిందంటే ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు కూడా రాకుంటే నీళ్లో రామచంద్రా అని తల్లడిల్లే కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువల కింద పంట మార్పిడి చేసి మిగులు నీరు తమకు కేటాయించాలని ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కోరి ఉంది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుర్గతి పట్టడానికి ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న స్నేహ సంబంధాలే కారణం. 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలోనూ కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందిన డీపీఆర్ ఆమోదానికి తెలంగాణ యత్నిస్తోంది. ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరడంలేదు? 2020లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రతిపాదన చేసినపుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. ఆ రోజునే విషబీజం పడింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి డీసెంట్ నోట్ పెట్టి వుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దానిని బహిర్గతం చేయాలి. ఆ నోట్ ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా మనకు న్యాయం జరుగుతుంది.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు