త్యాగాల చిరునామా పైలా చంద్రమ్మ

ABN , First Publish Date - 2023-09-23T00:25:23+05:30 IST

బానిస బతుకులు వద్దని విముక్తి కొరకు బంధనాలను తెంచుకోవడం కోసం బందూకులు అందుకున్న రోజులవి. నక్సల్బరి పోరు దారిలో శ్రీకాకుళ ఉద్యమం ఉరకలేస్తున్న రోజుల్లో...

త్యాగాల చిరునామా పైలా చంద్రమ్మ

బానిస బతుకులు వద్దని విముక్తి కొరకు బంధనాలను తెంచుకోవడం కోసం బందూకులు అందుకున్న రోజులవి. నక్సల్బరి పోరు దారిలో శ్రీకాకుళ ఉద్యమం ఉరకలేస్తున్న రోజుల్లో ఆ ప్రభావం పైలా చంద్రమ్మపై బలంగా పడింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో చెల్లూరి చిన్నయ్య, కామమ్మ దంపతులకు ఏడవ సంతానం చంద్రమ్మ. శ్రీకాకుళ పోరులో చంద్రమ్మ బాల్యం నుంచి చురుకైన పాత్ర పోషించారు. పార్టీ రాత్రి పాఠశాలలు పెడితే అందులో అక్షర జ్ఞానం నేర్చుకున్నది. పైలా వాసుదేవరావును టెక్కలి డివిజన్‌కు ఆర్గనైజర్‌గా కేటాయించింది పార్టీ. ఆయన రాజాంను కేంద్రం చేసుకొని పనిచేశారు. సారా వ్యతిరేక ఉద్యమం నడిపారు, కూలిరేట్లు పెంచాలని ఉద్యమించారు.

చురుకుగా పనిచేస్తున్న చంద్రమ్మ గరుడభద్ర కూలి రేట్లు పెంచాలని జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నది. పార్టీ నిర్ణయం మేరకు భూస్వామి మద్ది కామేష్‌ పంట కోతలో పాల్గొన్నది. పంటకోతతో సాయుధ పోరాటం ప్రారంభమైంది. గ్రామాల్లో ఉన్న ముఖ్యులను అజ్ఞాతవాసంలోకి వెళ్ళమని పార్టీ ఆదేశించడంతో ఆ మేరకు చంద్రమ్మ అజ్ఞాతవాసంలోకి వెళ్లి, అనంతరం మహేంద్రగిరిలో ఉన్న గెరిల్లా దళాల వద్దకు చేరుకున్నారు. మొదటగా పుచ్చ అప్పలస్వామి దళంలో చంద్రమ్మ పని చేశారు. పైలా వాసుదేవరావును 1970లో తెంటిలిగం కొండల్లో వివాహం చేసుకున్నారు. 1971లో పాప జన్మించింది. పిల్లలు ఉద్యమానికి ఆటంకం అని విప్లవ సానుభూతిపరులకు పెంపకానికి ఇచ్చి, పేగు బంధం వీడి వర్గ బంధాన్ని ఎంచుకొని దళంలోకి వెళ్లిపోయారు. కవిటి, ఉద్దానం ఏజెన్సీ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొని వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచారు. రైతాంగ ఉద్యమాలలో కీలక భూమిక పోషించారు. గిట్టుబాటు ధర కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీరు కోసం జరిగిన పోరాటాల్లో ముందు భాగాన నిలిచారు. 1/70 చట్టం అమలు కోసం, 5వ షెడ్యూల్లో ఆదివాసీ గ్రామాలన్నీ చేర్చాలని, అటవీ శాఖ అధికారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా అడవులపై, కొండలపై ఆదివాసీలకు హక్కులు దక్కాలని ఆమె అలుపెరగని పోరాటాలు చేశారు. మత్స్యకారులను నిర్వాసితులను చేస్తూ గ్రామాలను ధ్వంసం చేసే సాండ్ మైనింగ్ ట్రైమాక్స్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. షావుకారుల, వడ్డీ వ్యాపారుల దోపిడి నుంచి ఆదివాసీలను విముక్తి చేయడానికి శ్రమించారు. దశాబ్దాల పాటు ఆదివాసీలు పెట్టుకున్న అర్జీలపై స్పందించని పోలీసులు, పాలకులు ఉద్యమంలో రక్తపుటేర్లు పారించారు. రంగామీటియా కొండల్లో జరిగిన కాల్పుల్లో చంద్రమ్మ దీటుగా శత్రువుని ఎదుర్కొని సహచరులను తప్పించి దళాన్ని రక్షించుకుంది. ఎన్నో ఎన్‌కౌంటర్లలో తృటిలో తప్పించుకుంది.

1975 మే 24న మందస మండలం కొండల్లోగామ్‌లో జరిగిన సమావేశంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పైలా వాసుదేవరావు తప్పించుకోగా, చంద్రమ్మ ముళ్ళపొదల్లో పడి పోలీసుల చేత చిక్కింది. మందస పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు. ఆపై కళ్ళకు గంతలు కట్టి అడవిలోకి తీసుకొని వెళ్లి పార్టీ రహస్యాలు చెబితే ప్రాణం మిగులుతుందని హెచ్చరించారు. తల మీద తుపాకీ పెట్టి గాల్లో కాల్పులు జరిపారు. అయినా ‘మావో జిందాబాద్’, ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినాదాలు చేసి ప్రాణాన్ని గడ్డిపరకతో సమానంగా చూసింది ఆమె. పార్వతీపురం కుట్ర కేసుతో సహా అనేక తప్పుడు కేసులలో ఆమెను పోలీసులు ఇరికించారు. భారతదేశంలో పదకొండేళ్ళ సుదీర్ఘజైలు జీవితాన్ని గడిపిన ఏకైక మహిళా రాజకీయ ఖైదీ పైలా చంద్రమ్మ. ఈ విషయాన్ని ప్రముఖ పరిశోధకురాలు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ షర్మిల పురకాయస్థ తన పుస్తకం ‘ఆఫ్‌ కాప్టివిటీ అండ్‌ రెసిస్టెన్స్‌’లో ఎంతో విపులంగా ప్రస్తావించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌ ఇటీవలే దీనిని ప్రచురించింది.


పైలా వాసుదేవరావు 2010లో క్యాన్సర్ వ్యాధితో మరణించినా అధైర్యపడకుండా తన తుదిశ్వాస వరకు పార్టీ నిర్మాణంలో భాగస్వామి అయిన చంద్రమ్మ 2020 సెప్టెంబర్ 23న కొవిడ్ కారణంగా కేజీహెచ్ ఆస్పత్రిలో అమరురాలైంది. చంద్రక్క మరణంతో శ్రీకాకుళం జిల్లా విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించిన త్యాగాల తరం వెళ్లిపోయినట్లు అయింది. ఆమె త్యాగం, పట్టుదల, అంకితభావాన్ని పుణికిపుచ్చుకోవడమే చంద్రమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

వంకల మాధవరావు

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ

శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి

(నేడు టెక్కలి అంబేద్కర్ భవనంలో చంద్రమ్మ వర్ధంతి సభ)

Updated Date - 2023-09-23T00:25:23+05:30 IST