పోలీస్‌చర్య కథనాలు : ప్రాయోజిత జాతీయవాదం
ABN , First Publish Date - 2023-09-22T01:07:09+05:30 IST
దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవస్వామి, జిలానీ బానో మొదలైన వామపక్షవాద, జాతీయవాద సాహితీవేత్తల రచనల గురించి చర్చించినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర, తెలంగాణ సాహిత్య చరిత్రలో...
దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవస్వామి, జిలానీ బానో మొదలైన వామపక్షవాద, జాతీయవాద సాహితీవేత్తల రచనల గురించి చర్చించినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర, తెలంగాణ సాహిత్య చరిత్రలో కనీస ప్రస్తావనకు కూడా నోచుకోని వివిధ సాహిత్య వాచకాలపై నా అధ్యయనంలో ప్రత్యేక దృష్టి పెట్టాను. ఈ అప్రధాన సాహిత్య రచనలను నిశితంగా చదివి, పోలీసు చర్య ఈ రచయితల సాహిత్య వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దిందో చర్చించాను. తద్వారా ఈ పుస్తకం, హైదరాబాద్, తెలంగాణ ప్రామాణిక చరిత్రను నిర్ణయాత్మకంగా ధిక్కరించింది. ఆ కల్లోల కాలంలో సామాన్య ముస్లింల జీవన ప్రస్థానాలు ఎలా ముందుకు సాగాయో అర్థం చేసుకోవడానికి ఆ అప్రధాన సాహిత్య కృతుల అధ్యయనం నాకు విశేషంగా తోడ్పడింది.
సామాన్య ముస్లింలు, హిందువులు మొదలు రచయితల, మతాచార్యుల, రాజకీయ కార్యకర్తల మౌఖిక కథనాలను నా అధ్యయనానికి కేంద్రంగా చేసుకున్నాను. పోలీసుచర్య నాటి నుంచి మౌఖిక ఆధారాలు, లిఖిత కథనాలు ఎలా పరస్పర సంభాషణలో ఉన్నాయో చూపాను. హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ముస్లిం అస్తిత్వానికి, అనుబంధానికి ఒక నిర్దిష్ట అర్థాన్ని మౌఖిక చరిత్రలు, లిఖిత రచనలు ఎలా సంతరింపచేశాయో నేను తర్కించాను. దేశ విభజన పూర్వాపరాలను శోధించేందుకు పలువురు చరిత్రకారులు సాహిత్య ఆధారాలను ఉపయోగించుక్ను తీరుతెన్నులను విపులంగా అవగాహన చేసుకునేందుకు అది నాకు తోడ్పడింది. దేశ విభజన పర్యవసాన హింసాకాండ, పోలీసుచర్య ప్రత్యక్ష సాక్షుల మౌఖిక కథనాలను ఈ పుస్తకంలో పొందుపరిచాను. హింసాకాండను ప్రేరేపించి, హిందువులు, ముస్లింలను వేరు పరచడంలో పోలీసు చర్య మరో దేశ విభజనలాంటిదేనన్న భీకర సత్యాన్ని మౌఖిక వాంగ్మూలాలు ఇచ్చిన పలువురు విస్పష్టంగా చెప్పిన వైనం మీకు ఆ కథనాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
1948–50 సంవత్సరాల మధ్య తెలుగుసాహిత్య రచనల సమీక్షాత్మక అధ్యయనం నాకు ఒక సత్యాన్ని ఎరుకపరచింది. విస్తృత స్థాయిలో జరిగిన రాజకీయ, సాహిత్య, చరిత్ర సంబంధిత చర్చలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న చరిత్ర రచనలపై సైద్ధాంతిక విమర్శకు ఆ సాహిత్య గ్రంథాలు కీలకమైనవని నేను గ్రహించాను. అదే కాలానికి చెందిన మౌఖిక చరిత్రలు, వ్యక్తిగత వ్యాసాలు, జ్ఞాపకాలు, ఆత్మకథల అధ్యయనం కూడా చాలా ముఖ్యమే. ఇందుకు నేను అనేక వాచకాలను సేకరించాను. మౌఖిక చరిత్రలను లిఖిత పూర్వకంగా పొందుపరిచాను. హైదరాబాద్, తెలంగాణ చరిత్రతో ముడివడి వున్న ముస్లిం అస్తిత్వ ప్రశ్నను వివేచించేందుకు వాటిలో కొన్నిటిని ఎంపిక చేసుకున్నాను. దక్షిణాసియాలో వలసపాలన అనంతరం ముస్లిం మనుగడ తీరుతెన్నులు వివిధ జాతీయవాదాలతో ఒక నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత సంభాషణ జరపవలసిన అవసరమున్నదని నా అధ్యయనం ప్రతిపాదిస్తుంది. మరింత ముఖ్యమైన విషయం మరొకటి ఉన్నది. 1948 ఘటనలకు సంబంధించిన సాహిత్య రచనలు, మౌఖిక చరిత్రలు, ప్రపంచ రాజకీయ ఉద్యమాలు, కొత్త ముస్లిం అవతరణల సమ్మేళనాన్ని పరిశీలించడానికి తోడ్పడ్డాయి.
కొత్త ముస్లిం ఎవరు? అతడు చరిత్ర బాధితుడు కాడు, విషాద చరిత్రను ఎదుర్కొని నిలిచిన వ్యక్తి. పోరాటాలు, సైనికీకరణ అయిన నిత్య జీవిత వ్యవహారాలను సమర్థంగా ఎదుర్కొన్న రాజకీయ కార్యకర్తల గురించి చెప్పడానికి ఈ అధ్యయనాన్ని నేను ఉద్దేశించలేదు. వాస్తవ ప్రపంచంలో నిజమైన హీరో అయిన సామాన్య ముస్లింను మాత్రమే నేను దృష్టిలో పెట్టుకున్నాను. 1940వ దశకం తుదినాళ్ల నుంచి అతడి ఉనికి, పౌరసత్వం ప్రమాదంలో పడ్డాయి. అటువంటి భయానక పరిస్థితులలో సామాన్య ముస్లింల నిత్య జీవితం ఎలా గడిచి ఉంటుంది? అదెలా ఉంటుందో చిత్రించిన సాహిత్యరచనలు, మౌఖిక చరిత్రలకు వర్తమాన ప్రాసంగికత ఉన్నది. అవును, ముస్లింల పట్ల విద్వేషం, ముస్లిం వ్యతిరేక చర్చలు, కథనాలు పెరిగిపోతోన్న ప్రస్తుత సందర్భంలో వాటి ఉపయుక్తత విశేషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ముస్లిమేతర రచయితలు, కార్యకర్తలు ‘ముస్లిం తనం’ భావనపై పెడుతున్న శ్రద్ధాసక్తులలో ఆనాటి సగటు ముస్లింల కథలు, చరిత్రలు మరింత ప్రాధాన్యం వహిస్తున్నాయి.
ఈ ‘ముస్లిమేతర’ రచయితల రచనల ఆధారంగా, చరిత్ర రచనలో ప్రభావశీలంగా ఉన్న ఒక వాదనకు ప్రతి వాదన చేయదలిచాను. దక్షిణాసియాలో ముస్లిం అస్తిత్వాన్ని చాల వరకు హిందూ ధర్మం లేదా హిందూ–కేంద్రిత ఆచరణలు; లేదా ముస్లిం కేంద్రిత ఆచరణలు లేదా ఇస్లామిక్ ఆచారాలు నిర్ణయాత్మకంగా నిర్వచిస్తున్నాయన్నదే ఆ వాదన. దక్షిణ భారతీయ ముస్లింలలో స్థానిక లక్షణాలతో పరిఢవిల్లుతున్న వైవిధ్యాన్ని గుర్తించడంలో వివిధ విద్వత్ దృక్పథాలు విఫలమయ్యాయి. జె.పి.బి మోర్ తన ‘ముస్లిం ఐడెంటిటీ, ప్రింట్ కల్చర్ అండ్ ది ద్రవిడియన్ ఫ్యాక్టర్ ఇన్ తమిళనాడు’ (2004)లో ఇస్లామిక్ విలువలలో ఇస్లామేతర హిందూ విలువలు అంతర్లీనంగా ఉన్నాయన్న’ ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త లూయీ డుమాంట్ సూచనను తిరస్కరించారు. ఇస్లామిక్ అధ్యయనాల విద్వాంసుడు ఖుర్రమ్ హుస్సేన్ ఇటీవల తన కొత్త పుస్తకంలో ముస్లింలకు సంబంధించిన చరిత్రాత్మక సంఘటనలను పునర్దర్శించవలసిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. ముస్లిం అస్తిత్వ ప్రశ్నను పునఃతర్కించి, పునర్మూల్యాంకనం చేయడం ద్వారా తమ ఉనికి గురించిన ముస్లిం అవగాహనను పునః రాజకీయీకరణ చేయాలని ఆయన సూచించారు.
ఈ నా అధ్యయనంలో చరిత్ర రచన పద్ధతుల మధ్య ఉన్న నాలుగు పరస్పర సంబంధాలను ప్రస్తావించాను. అవి: (1) జాతీయ వాద/ పాఠ్యగ్రంథ తరహా చరిత్ర రచనను జాతి–రాజ్యం నిర్ణయిస్తుంది. స్థానికుల అభిప్రాయాలను విస్మరించి 1948 పోలీసు చర్యను భారత్‌లో హైదరాబాద్ సంస్థానం ‘విలీనం’గా భారత్ భావిస్తున్న తీరుతెన్నులే అందుకొక నిదర్శనం. ఆ సంఘటనతో సంబంధమున్నవారు చెల్లించిన మూల్యాన్ని భారత రాజ్య వ్యవస్థ పట్టించుకోలేదు. విశాల జాతీయ ప్రయోజనాల పేరుతో కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించిన ఒక సంస్థానాన్ని బలవంతంగా ‘విలీనం’ చేసుకోవడమే పోలీసుచర్య పూర్వాపరాల చరిత్ర. అధికరణ 370ని రద్దుచేసి జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంలో కూడా ఆనాటి తర్కమే ఉన్నదనడంలో సందేహం లేదు. నాడు హైదరాబాదీల, నేడు కశ్మీరీ మనోభావాలను భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. (2) విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయాలు ప్రజల అవగాహనను తీర్చిదిద్దుతాయి పోలీసు చర్యను సామాన్య ప్రజల అవగాహన, జానపద గాథలలో అది ప్రతిబింబించింది. అడ్లూరి అయోధ్య రామ కవి ‘బుర్రకథ’ ఆ అవగాహననే అభివర్ణించింది. ఇటువంటి కథనాలు రాజ్య వ్యవస్థ ప్రచారం చేస్తున్న కథనాలకే మరింత బలాన్ని, ప్రాధాన్యాన్ని సమకూరుస్తాయి. (3) 1948కి పూర్వం, ఆ తరువాత హైదరాబాద్‌లో ఏమి జరిగిందో సమతుల్యతలో అర్థం చేసుకోవడానికి ఒక చరిత్రాత్మక ఘటనను కేంద్రంగా తీసుకుని సమస్త చారిత్రక కథనాలను విశ్లేషించడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశపు కీలక చారిత్రక ఘటనల పట్ల ప్రచలితంగా ఉన్న పొరపాటు దృక్పథాన్ని సరిదిద్దడమే నా పరిశోధన లక్ష్యంగా ఉన్నది. (4) రాజ్య వ్యవస్థ ప్రాయోజిత జాతీయవాదానికి ‘1948’ ఒక ఉదాహరణ. మెజారిటీ వాదం ప్రాబల్యం పెరిగిపోతున్న మన వర్తమానంలో సంభవిస్తున్న ఘటనలను అర్థం చేసుకోవడానికి పోలీసుచర్య, దాని పర్యవసానాల అధ్యయనం విశేషంగా తోడ్పడుతుంది.
అఫ్సర్ మహమ్మద్
(ప్రసిద్ధ తెలుగు కవి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం దక్షిణాసియా అధ్యయన విభాగం సీనియర్ ఫ్యాకల్టీ అఫ్సర్ మహమ్మద్ తాజాగా వెలువరించిన 'Remaking History : 1948 Police Action and the Muslims of Hyderabad' పుస్తకం ఉపోద్ఘాతంలోని కొన్ని భాగాల పరిచయానువాదం)