ప్రపంచం ముందు తలవంపులు
ABN , First Publish Date - 2023-01-14T00:33:41+05:30 IST
పక్షంరోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు జైరామ్‌రమేష్ చేసిన ట్వీట్ ఒకటి బీజేపీ నాయకులకు అమితాగ్రహం కలిగించింది...
పక్షంరోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు జైరామ్‌రమేష్ చేసిన ట్వీట్ ఒకటి బీజేపీ నాయకులకు అమితాగ్రహం కలిగించింది. ‘మేడిన్ ఇండియా దగ్గుమందు మొదట గాంబియాలో డెబ్బైమంది, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌లో పద్దెనిమిదిమంది పిల్లల ప్రాణాలు తీసింది. భారత్ ప్రపంచ ఫార్మసీ అంటూ గొప్పలకుపోయేముందు దేశీయ కంపెనీలపై మోదీ ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించాలి’ అన్నది ఆ ట్వీట్ సారాంశం. ఈ వ్యాఖ్య మోదీమీద కాంగ్రెస్‌కు ఉన్న తీవ్రవ్యతిరేకతకు నిదర్శనమనీ, గాంబియా మరణాలతో భారతదేశానికి సంబంధం లేదని అక్కడి అధికారులు, ఇక్కడి అథారిటీ స్పష్టంచేసినా కాంగ్రెస్ బుద్ధి మారలేదని కేంద్రమంత్రులు అన్నారు. జైరామ్ రమేష్ భారతీయుడు కాదా? అని కొందరు అనుమానించారు. ఉజ్బెకిస్థాన్ మరణాలతో భారతదేశాన్ని ముడిపెట్టినందుకు జైరామ్‌రమేష్‌ను చైనాప్రేమికుడుగా అభివర్ణించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు మహేష్ జెఠ్మలానీ. భారతదేశం ఫార్మసీరంగంలో తనకు పోటీగా ఎదిగిపోతుండటంతో సహించలేని చైనా, అంతర్జాతీయంగా మన పరువుతీయడానికి జైరామ్ రమేష్‌ను ప్రయోగించిందని ఆయన ఆరోపించారు. బుధవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ భారతదేశంలో తయారైన దగ్గుమందు అత్యంత ప్రమాదకారి అనీ, దానికారణంగానే ఉజ్బెకిస్థాన్‌లో పిల్లలు మరణించారని కుండబద్దలు కొట్టేయడంతో, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విధిలేక గురువారం సదరు కంపెనీ ఉత్పత్తి లైసెన్సును రద్దుచేసింది.
విదేశాల్లో పిల్లలమరణాలకు ఇక్కడి దగ్గుమందు కారణమని ఓ విపక్షనాయకుడు అనగానే, మోదీ వ్యతిరేకత, చైనా అనుకూలత వంటి వ్యాఖ్యలతో నోరుమూయించినంత మాత్రాన అంతర్జాతీయంగా మనపరువు నిలవదు. గాంబియాలో డెబ్బైమంది పిల్లలు కన్నుమూసినప్పుడే మనం కళ్ళుతెరిచివుంటే ఉజ్బెకిస్థాన్ ఘటన చోటుచేసుకోకపోయేదేమో! గాంబియాలో పిల్లల మరణాలకూ భారత్ తయారీ నాలుగు దగ్గుమందులకూ సంబంధం లేదనీ, ప్రభుత్వ లాబరేటరీలో వీటిని పరీక్షించినప్పుడు అవి నాణ్యతాప్రమాణాలకు లోబడే ఉన్నట్టు తేలిందని డ్రగ్స్‌కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రపంచ ఆరోగ్యసంస్థకు అప్పట్లో లేఖరాసిన విషయం తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌వో) నియమించిన అత్యున్నస్థాయి కమిటీ దర్యాప్తులో ఇది రూఢీ అయిందన్నది ఆ లేఖసారాంశం. ఈ మందుల్లో ఇథలైన్ గ్లైకాల్, డై ఇథలైన్ గ్లైకాల్ ఉనికేలేదని మెయిడెన్ ఫార్మాకు ఇలా మనం క్లీన్‌చిట్ ఇచ్చుకున్నా, ప్రపంచ ఆరోగ్యసంస్థ జెనీవా లాబరేటరీలో ఆ శాంపిల్స్ పరీక్షింపచేసినప్పుడు ఆ విషరసాయనాల ఉనికి అత్యధికంగా ఉన్నట్టు తేలింది. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటి ప్రత్యేక ప్రస్తావనతో ‘ప్రోడక్ట్ ఎలర్ట్’ జారీ చేసింది. ఆఫ్రికన్ దేశమైన గాంబియా పార్లమెంటు నివేదిక ఒకటి భారతదేశమందులే తమ పిల్లల మరణాలకు కారణమని నిర్థారించింది కూడా. అప్పట్లోనే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ మేడిన్ ఇండియా దగ్గుమందు విషయంలో అన్నిదేశాలకూ హెచ్చరిక చేయడంతో పాటు, మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ అన్ని నిబంధనలనూ ప్రమాణాలనూ ఉల్లంఘించి మందులను తయారుచేస్తున్నదని కూడా తేలింది.
ఉజ్బెకిస్థాన్ తన పిల్లలమరణాల విషయంలో గాంబియాకంటే కఠినంగా, పట్టుదలగా వ్యవహరించింది. అత్యున్నతస్థాయి డ్రగ్‌కంట్రోలర్ సహా అనేకమందిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు, అంతర్గత విచారణలో తేలిన విషయాలను ప్రపంచ ఆరోగ్యసంస్థతో పంచుకుంది. మేరియన్ బయోటెక్ రెండు మందులవల్లే తమ పిల్లలు మరణించారని విస్పష్టంగా తేల్చింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ మందుల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించలేదనీ, విషరసాయనాలు ఉన్నందున వీటిని ఎంతమాత్రమూ వినియోగించకూడదని గతంలోకంటే ఘాటైనవ్యాఖ్యలతో ప్రపంచదేశాలన్నింటినీ హెచ్చరించింది. గతంలో జమ్మూకశ్మీర్‌లోనూ, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఈ రకం దగ్గుమందుల వల్లే పిల్లలు మరణించినట్టుగా రూఢీ అయినా ప్రభుత్వానికి చీమకుట్టలేదు. గాంబియా ఘటన తరువాత మేలుకున్నా ఉజ్బెకిస్థాన్‌లో అవమానం ఎదురయ్యేది కాదు. ప్రపంచ ఫార్మసీగా ఎదగాలన్న ఆశయం మంచిదే. ౪2బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులతో భారతదేశం మూడోస్థానంలో ఉన్నందుకు గర్వించాల్సిందే. కానీ, ఏటా పాతిక బిలియన్ డాలర్ల మందులను ఎగుమతిచేస్తున్నప్పుడు ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడటం, ఫార్మా కంపెనీలపై కఠినంగా వ్యవహరించడం అవసరం. జైరామ్ రమేష్ చెప్పింది కూడా అదే.