పూల సింగిడి
ABN , First Publish Date - 2023-10-12T02:13:38+05:30 IST
అంబరం నుండి సంబురంగా అవనిమీదికి వంగిన పూల సింగిడి నా తెలంగాణ బతుకమ్మ తొమ్మిది రోజుల ఊసులతో...
అంబరం నుండి సంబురంగా
అవనిమీదికి వంగిన
పూల సింగిడి
నా తెలంగాణ బతుకమ్మ
తొమ్మిది రోజుల ఊసులతో
తీరొక్క పువ్వుల బాసలతో
వికసిస్తాయి విరులు వసంతమై
ఊయల ఊపులతో
ఉత్సవమొస్తుంది
చెరువులు బావులూ
నదీ ప్రవాహమ్ములపై
రంగుల రంగుల పూల హంగులై
బతుకమ్మ నాట్యమాడుతుంది
చిత్తూ చిత్తూల బొమ్మగా
శివుడీ ముద్దుల బొమ్మగా
బతుకమ్మ పూజలందుకుంటది
ఆట పాట హృదిని అందుకుంటది
బంతి చామంతులు
గునుగు తంగేడు రుద్రాక్షలు
సీతమ్మజడ రామబాణాల పూలు
పురివిప్పిన నెమళ్లవుతాయి
పుడమి పుడమంతా
పూలబుట్టయినట్టుంటది
అట్ల బతుకమ్మై అలిగిన బతుకమ్మై
వెన్నముద్దల బతుకమ్మై
వేడుకలు ఊయలలూగుతై
ఆటపాటలు పొద్దును దాటి
సద్దుల బతుకమ్మై సాగిపోతది
పల్లె సుద్దులను అద్దుకుని
పదిలమై పోతది
పాటల పూదోటై పోతది
సామూహిక సంరంభమై
కోలాటాల సవ్వడి జేస్తది
సమిష్టి జీవన గీతికై
సమైక్య భావన పతాకై
బ్రతుకు పాటల్ని పల్లవిస్తది
కన్నీటి చెలమల్ని తీసి
కవ్వించుకుంటది
ఆత్మీయ చెలిమితో హత్తుకుంటది
బతుకమ్మ ఓ విజయగాథల అంగడి
సాంస్కృతిక పూల సింగిడి..!
కటుకోఝ్వల రమేష్
(అక్టోబర్ 14 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం)