అరుదైనది ‘మోదీ కళ’!
ABN , First Publish Date - 2023-08-31T04:13:18+05:30 IST
చతుషష్టి (64) కళలలో బతకడానికి నేర్చినవి ఒక రకం అయితే, ఎదుటివారిని నిలువునా ముంచేవి, కీర్తిప్రతిష్ఠలు సంపాదించడానికి నేర్చుకున్నవి రెండో రకం. సాధారణంగా...
చతుషష్టి (64) కళలలో బతకడానికి నేర్చినవి ఒక రకం అయితే, ఎదుటివారిని నిలువునా ముంచేవి, కీర్తిప్రతిష్ఠలు సంపాదించడానికి నేర్చుకున్నవి రెండో రకం. సాధారణంగా ఒకరికి ఒక కళలోనే ప్రావీణ్యం ఉంటుంది. కొంతమందికి రెండు, మూడు, నాలుగు కళలలో కూడా ప్రవేశం ఉంటుంది. కానీ అనేక కళలలో ఒకే వ్యక్తికి ప్రావీణ్యం ఉండడం బహు అరుదు. అది కూడా రెండో రకానికి చెందిన వాటిలో ప్రావీణ్యం ఎంత ఎక్కువగా ఉంటే జనానికి అంతగా టోపీ వేసేయచ్చు. కొంతమంది ఎలాంటి వారినైనా బుట్టలో వేసుకోగలరు. అలాంటి అనేకమందికి నాయకుడు అవ్వాలంటే ఎన్నో కళలలో ప్రావీణ్యం ఉంటేనే కానీ సాధ్యం కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద పార్లమెంటులో జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానాన్ని, ఎర్రకోట ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆయనలో ఎన్ని కళలు దాగి ఉన్నాయో తెలుస్తుంది. అదే మోదీ కళ. 64కళలలో అనేకాన్ని కలిపిందే ఇది.
తమ హయాంలో ప్రభుత్వ బ్యాంకులు, ఎల్‌ఐసి, హెచ్‌ఏఎల్ వంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలు బలోపేతం అయ్యాయని ఆయన ప్రకటించేశారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేయడమే పనిగా పెట్టుకున్నాయన నోటి నుంచి వచ్చిన మాటలివి. ఈ ప్రైవేటీకరణ ఎంతవరకు దారితీసిందంటే, ఆఖరుకు దేశ రాజధానిలోని ఎర్రకోటను కూడా లీజు కిచ్చేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు లక్షలాది రూపాయలు చెల్లించి అద్దెకు తీసుకోవలసిన దుస్థితి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయించిన ఘనుడీయన. 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ఋణాలు ఈయన ప్రభుత్వ హయాంలో మాఫీ అయ్యాయి. ఫలితంగా నేడు ప్రభుత్వ బ్యాంకులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు తోడు, సిబ్బంది నియామకం కూడా లేక బలహీనపడుతున్నాయి. ఇది సరిపోదన్నట్లు వరుసపెట్టి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం, అమ్మివేయడం కూడా జరిగిపోతోంది.
వీరి ఆర్థిక విధానాల వల్ల సంపదంతా అంబానీ, అదాని వంటి అతి కొద్దిమంది శతకోటీశ్వరుల వద్ద పోగు పడుతోంది. సమాజంలో తీవ్ర అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. వరుస ఆక్స్‌ఫామ్ నివేదికలు ఈ దుస్థితికి అద్దంపడుతున్నాయి. వాస్తవం ఇది కాగా, తమ ప్రభుత్వ హయాంలో కోట్ల మంది ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడ్డారని ఆయన గొప్పలు చెప్పారు. కానీ, పేదరికం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రపంచ ఆకలి సూచీలో 121 దేశాలలో మన దేశం 107వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటివి మన కంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలోనే దేశంలో 7.1 కోట్ల మంది భారతీయులు అదనంగా పేదరికంలోకి నెట్టబడ్డారు. వైద్యం ఖరీదుగా మారిపోవడం మూలంగా ఏటా దేశంలో అదనంగా 6.7 కోట్ల మంది పేదలుగా మారుతున్నారు. ధరల పెరుగుదల, ఉపాధి లేమి, తగ్గుతున్న సామాన్యుల ఆదాయాలు, ఆదాయాల వ్యత్యాసం వంటివి మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల పర్యవసానాలు. ఫలితంగా దేశంలో నేడు పేదరికం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజల ఆహార వినియోగం కూడా తగ్గిపోయింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) విడుదల చేసిన లెక్కలను బట్టి భారతదేశంలో తలసరి తృణధాన్యాల వినిమయం 171 కిలోలు. ఇదే ఆఫ్రికా ఖండంలో 190 కిలోలు, అతి తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 205 కిలోలు, ప్రపంచ సగటు 304 కిలోలు ఉంది. చైనాలో, బ్రెజిల్‌లో 360 కిలోలు ఉంది. రష్యాలో 407 కిలోలు, అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లో 494 కిలోలు, యూరపియన్ యూనియన్ దేశాలు, అమెరికాలో 590 కిలోలు. ఎఫ్‌ఎఓ తనంతట తానుగా లెక్కల్ని తయారు చేయదు. ఆయా ప్రభుత్వాలు అందించే సమాచారం ఆధారంగానే వివరాలు రూపొందిస్తుంది. కాబట్టి ఈ లెక్కలు తప్పుడు తడకలని చెప్పి మన ప్రభుత్వం తప్పించుకోడానికి కుదరదు. సంపాదన తిండికే సరిపోకపోతే, ఇక జనం ఎక్కడ నుంచి పొదుపు చేస్తారు. అందుకే ఎల్‌ఐసి వంటి దిగ్గజ సంస్థలలో కూడా పాలసీలు తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. దీనికితోడు, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఒక పక్క ప్రభుత్వ సంస్థ అయిన ఎల్‌ఐసిని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, వాటాలను షేర్ మార్కెట్లో అమ్మకానికి పెడుతూ, తానేదో ఉద్ధరించేస్తున్నట్లు ప్రగల్భాలు పలకడం మోదీకే చెల్లింది.
హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ గొప్ప ప్రభుత్వ సంస్థ. యుద్ధ విమానాలను తయారు చేయడంలో దిట్ట. అలాంటి హెచ్‌ఏఎల్‌ను కాదని, ఈ రంగంలో ఎలాంటి అనుభవం లేని అంబానీ సంస్థకు విదేశీ రాఫెల్ యుద్ధ విమానాలను దిగుమతికి అనుమతినిచ్చింది. ఫలితంగా హెచ్‌ఏఎల్ నష్టపోయింది. అయినా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా హెచ్‌ఏఎల్‌ను తాము బలోపేతం చేశామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అబద్ధాలను కూడా రక్తి కట్టించి, నిజమేమోననే భ్రమలు కొంతమందికయినా కలగజేయగలగడం మోదీకున్న గొప్ప కళ.
వీటితో పాటు తమ ప్రభుత్వానిది నీతివంతమైన పాలనని కూడా ఆయన చెప్పుకున్నారు. గనులు, నదులు, పరిశ్రమలు– సర్వం కార్పొరేట్లకు దోచి పెడుతూ, ఎన్నికల బాండ్ల రూపంలో వారిచ్చిన వేల కోట్ల రూపాయలు అందుకోవడం కూడా నీతేనని జనం భావించాలేమో! అసలు ప్రైవేటీకరణ అంటేనే అవినీతి. కారుచౌకగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మకానికి పెట్టారో చూస్తున్నాం. మరి రిటర్న్ గిఫ్ట్ వీరికి కాక మరెవరికి వస్తుంది. దొరికే దాకా అందరూ దొరలే. ‘‘Privatisation is nothing but briberisation’’ అన్నారు నోబెల్ బహుమతి గ్రహీత జోసఫ్ స్టిగ్లిడ్జ్. మోదీ ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉన్నది ఈ ప్రైవేటీకరణే. ఇలాంటి కళలు వీరి వద్ద ఎన్ని ఉన్నా, ఆవలిస్తే పేగులు లెక్కవెయ్యగలిగే మేధావులు, విద్యావేత్తలు, తెలివైన ప్రజలు కూడా ఈ దేశంలో ఉన్నారని గ్రహించకపోవడం అవివేకమే అవుతుంది.
ఎ. అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక