పాలకుల చర్యలతో ఓడిన రాయలసీమ
ABN , First Publish Date - 2023-02-25T03:49:29+05:30 IST
రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటి కంటే అధికంగానే కృష్ణ, తుంగభద్ర నదులలో సగటు ప్రవాహం ఉంది. కానీ రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న...
రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటి కంటే అధికంగానే కృష్ణ, తుంగభద్ర నదులలో సగటు ప్రవాహం ఉంది. కానీ రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులు వాటికి కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందాలంటే తుంగభద్ర, కృష్ణా నదిలో వచ్చిన నీటిని నిలుపుకోవడానికి రిజర్వాయర్ల నిర్మాణం, తగిన సామర్థ్యంతో కాలువల నిర్మాణం, చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు చేపట్టాల్సి ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమ కరువు బారిన పడుతూనే ఉన్నది.
నదిలో నీరు ఉన్నా, ఆ నీటిని వినియోగించుకొనడానికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలు రూపొందించడంలో అంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పూర్తిగా విఫలమయింది. పాలకులపై ఒత్తిడి పెంచడంలో రాజకీయ పార్టీలు విఫలమవడంతో రాయలసీమ వెనకబడింది. కాదు... ఓడిపోయింది. పాలకుల సాగునీటి విధానాల వలన ఈ ప్రాంత వాసులు వలసబాట పట్టడానికి గల కారణాలకు కర్నూలు పశ్చిమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దర్పణం పడుతుంది.
కర్నూలు పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయిని తుంగభద్ర దిగువ కాలువ. ఈ ప్రాంతంలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణమైంది. 1945లో శంకుస్థాపన జరిగి, 1953లో నీటి విడుదల జరిగిన ఈ ప్రాజెక్టుకు తుంగభద్ర డ్యాం నుండి 24 టిఎంసిల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. గత పది సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ బ్రాంచ్ కెనాల్ అయిన ఆలూరు కాలువ ద్వారా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 15వేల ఎకరాలకు నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ సగటున ఎనిమిది వేల ఎకరాలకు కూడా నీరు లభించడం లేదు. హంద్రీ నది మీద నిర్మించిన సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు (జిడిపి) ద్వారా ఈ ప్రాంతంలో 24వేల ఎకరాలకు చట్టబద్ధ నీటి కేటాయింపులున్నాయి. కానీ గత పది సంవత్సరాలుగా 11వేల ఎకరాలకు కూడా నీరు లభించడం లేదు. ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు పొంది లబ్ధి పొందిన రైతుల కంటే, నీరు వస్తుందని పంటలు వేసి నష్టపోయిన రైతులే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్న వందలాది గ్రామాలు, పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు వర్షాకాలంలో కూడా తాగునీటికి అలమటిస్తున్నారు. తుంగభద్రలో నీరు లేదా అంటే సగటున 150 టిఎంసిలు ఈ ప్రాంతం దాటి శ్రీశైలం రిజర్వాయర్ చేరుతున్నాయి. ఈ సంవత్సరం 596 టిఎంసిలు ఈ ప్రాంతం గుండా ప్రవహించి శ్రీశైలం రిజర్వాయర్ చేరాయి. ఈ నీటిని సక్రమంగా వినిగించుకునే విధానాలు రూపొందించడంలో పాలకులు విఫలం అయ్యారనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు.
కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసల నివారణకు పందికోన ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. కృష్ణా మిగులు జలాల మీద నిర్మించిన హంద్రీనీవా ప్రాజెక్టుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించింది. హంద్రీనీవా మొదటి ఫేజ్‌లో భాగంగా నిర్మించిన పందికోన రిజర్వాయర్ కింద 61,400 ఎకరాల ఆయకట్టు ఉంది. 2012లో జాతికి అంకితం చేసిన ఈ ప్రాజెక్టు నుంచి పది సంవత్సరాల తరువాత 20వేల ఎకరాలకు కూడా నీరు లభించడం లేదు. ఈ రిజర్వాయర్ కింద పూర్తి నీటి హక్కులను వినియోగించడానికి చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో జీఓ విడుదల చేసింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన నూతన ప్రతిపాదనలను ఐదు సంవత్సరాల వరకు చేపట్టకూడదన్న నిబంధనను కూడా అందులో పొందుపరిచింది. ఈ చర్యలన్నీ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవడానికి ప్రతిబంధకం అవడమే కాకుండా, విలువైన నీరు సముద్రం పాలౌతున్నది. గత పది సంవత్సరాలుగా సగటున 200 టిఎంసిల కృష్ణా జలాలు సముద్రం పాలౌతున్నాయి. ఈ సంవత్సరం సుమారు 1200 టిఎంసిల నీరు సముద్రం పాలయింది.
చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టుల స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర వరద కాలువ, సిద్ధేశ్వరం అలుగు లాంటి అనేక ప్రాజెక్టులకు విశ్రాంత సాగునీటి నిపుణులు సుబ్బరాయుడు ప్రతిపాదనలు చేసారు. కృష్ణా నది జలాల సక్రమ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని చట్టం చేసింది. ఈ అంశాల పట్ల సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతే రాయలసీమ సాగునీటి హక్కులను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఈ ప్రతిపాదనల పట్ల పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు.
రాయలసీమకు చట్టబద్ధ నీటి హక్కులున్న తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టులతో సహా కేసీ కెనాల్, తెలంగాణలోని ఆర్‌డిఎస్ ప్రాజెక్టులకు సక్రమంగా తుంగభద్ర నది నుంచి నీటిని పొందడానికి వీలుగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కృషితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికకు అనుమతులు లభించాయి. తెలంగాణను ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే జలవనరుల శాఖ అలక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అదేవిధంగా వేదవతి ఎత్తిపోతల పథకానికి 2019లో పాలనాపరమైన అనుమతులు లభించాయి. కానీ ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించే దిశలో, దీని నిర్వహణ సామర్థ్యాన్ని మూడు టిఎంసిలకు తగ్గించారు. దీనిని ఎనిమిది టిఎంసిలకు పునరుద్ధరించి, వేదవతి పైన గూళ్యం వద్ద ఒక టిఎంసి సామర్థ్యంతో రిజర్వాయర్, తుంగభద్ర దిగువ కాలువ స్థిరీకరణకు చిన్న ఎత్తిపోతల పథకం చేపట్టాలన్న నిపుణల సూచనలను పరిగణనలోకి తీసుకోవడంలో జలవనరుల శాఖ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. హంద్రీనీవా ప్రాజెక్టుతో సహా, రాయలసీమలోని అనేక ప్రాజెక్టులకు, శ్రీశైలం రిజర్వాయర్ కింద త్యాగం చేసిన ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించడానికి, ఈ రిజర్వాయర్ పూడికను నివారించి దాని జీవితకాలం పెంచే ‘రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్దేశ్వరం అలుగు’ విషయంలో కూడా జలవనరుల శాఖ మొద్దునిద్ర పోతున్నది.
కృష్ణా జలాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం–2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి. సహజ న్యాయసూత్రాలను అనుసరించి ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కృష్ణా నదితో ఏ మాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో ఈ కార్యాలయం ఏర్పాటుకు జలవనరుల శాఖ మొగ్గు చూపింది.
కర్ణాటక రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, విజయాలను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రం ముందుకు పోవాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నది. కర్ణాటక ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించిన కార్యాచరణను అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం వుంది. తుంగభద్ర నది కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన నీటిలో అంతర్గతంగా సర్దుబాట్లతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే కర్నాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని కేంద్ర జలవనరుల శాఖ ఒక సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022లో పంపింది. కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. దీన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5300 కోట్ల రూపాయల నిధులను కొత్త బడ్జెట్‌లో ప్రకటించింది.
కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్‌లో కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీళ్ళను, పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాల్లో కర్నాటకకు లభించే 21 టిఎంసిల నీటిలో 2.4 టిఎంసిల నీటిని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కరువు పీడిత రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచి అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీంతో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలకు పసలేకుండా పోయిందని రాయలసీమ సమాజం భావిస్తున్నది.
దశాబ్ద కాలంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నిరంతర ప్రవాహంలా జరుగుతుంటే, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోని పాలకుల చర్యలను రాయలసీమ సమాజం నిశితంగా గమనిస్తున్నది... చైతన్యవంతమౌతున్నది. ఇప్పటికైనా చట్టబద్ధ రాయలసీమ నీటి కేటాయింపులను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టి, దీని అమలుకు రాజకీయ దౌత్యం చేపట్టాలి.
బొజ్జా దశరథ రామిరెడ్డి
అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి