రియలెస్టేట్ కోసమే ‘రీజినల్ రింగ్ రోడ్’!
ABN , First Publish Date - 2023-03-28T03:23:53+05:30 IST
హైదరాబాద్ నగరం చుట్టూ 2007లో నిర్మించిన జవహర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40కి.మీ. దూరంలో 340 కి.మీ. పొడవైన ‘రీజినల్ రింగ్ రోడ్డు’ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది...
హైదరాబాద్ నగరం చుట్టూ 2007లో నిర్మించిన జవహర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40కి.మీ. దూరంలో 340 కి.మీ. పొడవైన ‘రీజినల్ రింగ్ రోడ్డు’ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాంతీయ వలయ రహదారి కేంద్ర ప్రభుత్వం ‘భారత్ మాతా పరియోజన’ పథకం మొదటి ఫేజ్‌లో భాగంగా నిర్మాణం కాబోతుంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఏడు జిల్లాలు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భోనగిరి, నల్లగొండ, వికారాబాద్ గుండా చౌటుప్పల్ దగ్గర భోనగిరి నుంచి వచ్చే రోడ్డు కలుస్తుంది. ఈ జిల్లాలలోని 25 చిన్న పట్టణాలు, దాదాపు 300 గ్రామాలు ఈ రింగ్ రోడ్డు వల్ల ప్రభావితమవుతాయి. 100 మీటర్ల వెడల్పుతో నిర్మాణం కాబోతున్న ఈ రోడ్డును ఆరు లేదా ఎనిమిది వరుసల రోడ్డుగా తయారుచేస్తారట.
హైదరాబాద్‌కు ఉత్తర భాగాన రాబోతున్న ఈ రోడ్డు నర్సాపూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, యాదాద్రి, భోనగిరి మీదుగా చౌటుప్పల్‌కు 158 కి.మీ. దూరం సాగి సంగారెడ్డి దగ్గర రోడ్డు వలయం పూర్తి చేసుకుంటుంది. ఈ రోడ్డు వేయడానికి హైదరాబాద్‌కు ఉత్తర భాగాన 1852 ఎకరాల భూమి, దక్షిణ భాగాన దాదాపు రెండువేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించవలసి ఉంటుంది. మొత్తం భూసేకరణలో ప్రభుత్వం నుంచి వాడుకునేది అతితక్కువగా ఉంది. రైతుల నుంచి సేకరించడానికి ప్రక్రియ ప్రారంభించిన భూమి అంతా కూడా చిన్న, సన్నకారు రైతుల భూమి; ఈ భూములన్నింటిలోనూ వ్యవసాయం జరుగుతుంది. ఇన్ని భూముల్ని కబళిస్తూ నిర్మాణం కాబోతున్న ఈ రోడ్డు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు.
ఈ రోడ్డు నిర్మాణం గురించి రాష్ట్ర అసెంబ్లీలో చర్చించలేదు, క్యాబినెట్ సమావేశాలలో చర్చకు రాలేదు, గ్రామాలలో ప్రజలకు గ్రామసభల్లో సమాచారం అందించలేదు. రెవెన్యూ అధికారులు కనీసం మండల కేంద్రాలలో దానిపై అవగాహన, సమాచార కార్యక్రమాలు నిర్వహించలేదు. గత డిసెంబర్ నెలలో తెలుగు దినపత్రికలో జిల్లా కలెక్టర్లు ప్రచురించిన ‘భూసేకరణ’ నోటీసును గ్రామాలలో ఉన్న చదువుకున్న యువకులు, చిన్న రాజకీయ నాయకులు చూసి తమ గ్రామాల పేర్లున్నాయని, కొందరు గ్రామస్థుల పేర్లు కనబడుతున్నాయని తెలుపడంతో రైతులు భయాందోళనల్లో మునిగిపోయారు. ఆఫీసుల చుట్టూ పరుగెత్తి సమాచారం తెలుసుకున్నారు. భూసేకరణ నోటీసుల్లో పేర్లు ప్రకటించిన రైతులు అభ్యంతరం తెలపాలని తెలుసుకుని, భోనగిరి మండలంలోని ఏడు గ్రామాల రైతులు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా భోనగిరి –యాదాద్రి కలెక్టర్ ఆఫీసులో సమర్పించారు. అభ్యంతరాలకు వివరణ, సమాధానం ఏదైనా అధికారుల నుంచి లభిస్తుందేమో అని పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేశారు. కాని ఏ అధికారి కూడా రైతుల అభ్యంతరాలకు వివరణ గాని, అసలు రోడ్డు ఎందుకు అవసరమో గాని తెలుపలేదు.
మానవ హక్కుల వేదికకు చెందిన కార్యకర్తలు భోనగిరి మండలంలోని గ్రామాల్లో పర్యటించి భూసేకరణ జరుగుతున్న తీరు గురించి వివరాలు సేకరించారు. ఈ మండలంలోని గ్రామాల ప్రజలు ఆగ్రహంతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూసర్వేకు అధికారులు వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున భూసేకరణ, సర్వేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. భోనగిరి–రాయగిరి రోడ్డుపై వాళ్లు సేకరించిన పాలను కుమ్మరించారు. వాళ్ల భూముల్లో పండే కూరగాయలు, ఆకుకూరలు తెచ్చి రోడ్డుపై కుప్పలుగా పోశారు. అయినా అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా నిర్బంధ పద్ధతులలో భూసర్వే నిర్వహించారు. జనవరి మాసంలో సర్వే కోసం వచ్చినపుడు రాయగిరి గ్రామంలో రైతులందరినీ బలవంతంగా పోలీసులు ఇళ్లలోంచి తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. దాదాపు వందమంది పోలీసులు గ్రామంలో బీభత్సం సృష్టించారు. ఆడవాళ్లు గుంపులుగా ఏర్పడి రెవెన్యూ అధికార్లను ఆపడానికి ప్రయత్నిస్తే పోలీసులు పెద్ద తాళ్లను స్త్రీల గుంపుల చుట్టూ చుట్టి వారిని కదలకుండా నివారించారు. కొందరు మహిళలను బలవంతంగా పోలీసు వాహనాల్లో కూర్చోబెట్టారు. ఎర్రంబెల్లి గ్రామంలో కూడా 20 మంది రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా నివారించి పోలీసుల సహాయంతో సర్వే నిర్వహించారు.
ఈ మండలంలోని గ్రామాల్లో ఇప్పటికే మూడుసార్లు రైతుల దగ్గర నుంచి భూమి సేకరించారు. జాతీయ రహదారి–163 నిర్మిస్తున్నప్పుడు 98 ఎకరాలని భూమి సేకరించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ వేసినప్పుడు మూడు ఎకరాల భూమిని సేకరించారు. మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్ ద్వారా సూర్యాపేటకు వెళ్లే కాళేశ్వరం లింకు కాలువకు కొన్ని భూములను ఈ రైతులు కోల్పోయారు. గౌస్ నగర్‌లోని రైతులు ఆలేరు వాగుకు లింకు చేసే మూసీ కాలువకు కొంత భూమిని ఇచ్చారు. ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు ఒక వ్యక్తి నుంచి భూసేకరణ చేయడం, ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల ప్రకరణకు విరుద్ధం. ఇటువంటి భూసేకరణ చేపట్టరాదనే అంతర్జాతీయ ఒడంబడికపై భారత ప్రభుత్వం సంతకం కూడా చేసింది.
ఈ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్ట విరుద్ధంగా, నిర్బంధ పద్ధతుల్లో జరుగుతోంది. రోడ్డు నిర్మాణ దిశ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో రెండుసార్లు అలైన్‌మెంట్ మార్చారు. మొదటిసారి జారీ చేసిన గెజిట్‌లో రోడ్డు మాటకొండూరు గ్రామం పక్క నుంచి వెళ్లాలి. అక్కడ ఆలేరు ప్రజాప్రతినిధికి భూములున్నాయని, వాటిలో వెంచర్లు అభివృద్ధి చేశారని, అందువల్లనే అలైన్‌మెంట్ మార్చి రెండవ గెజిట్ ప్రకటన వచ్చిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రెండవసారి కూడా గెజిట్‌లో ఉన్న కొన్ని గ్రామాలను మినహాయించారని, భోనగిరి ప్రజాప్రతినిధి భూములకు నష్టం రాకుండా చూడడానికి ఈ మార్పు జరిగిందని ప్రజలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. రాయగిరి పక్కన ఉన్న ప్రభుత్వ భూమి లోంచి రోడ్డు వేసే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ భూమిని తాకకుండా తమ గ్రామాల్లోంచి రోడ్డు అభివృద్ధి జరిగితే, భవిష్యత్తులో విలువ పెరగడం వల్ల ప్రభుత్వమే లాభసాటిగా తమ భూములు అమ్ముకోవచ్చని ప్రజలు అంటున్నారు.
ఈ గ్రామాల్లో 25 ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులు లేరు. ఎక్కువ మంది ఏడెనిమిది ఎకరాల లోపు భూమి కలిగిన వారే. మూడు తడవలు భూములు కోల్పోయిన కుటుంబాలలో కొందరికి భూమి గుంటల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు ఆ భూమిని కోల్పోతే జీవనం సాగించేదెట్లా? అని రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.
ఇది ఇలావుండగా, ఇంకో విషయం కూడా రైతులను ఆవేదనకు గురి చేస్తున్నది. 2017లో ప్రభుత్వం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఎ)ని ఏర్పరచి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలో తిరుపతి లాంటి దేవాలయాభివృద్ధిని చేయాలన్న ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఈ మాస్టర్ ప్లాన్ తయారుచేశారు. ఈ ప్లాన్ ప్రకారం యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాల నుంచి 12,220 ఎకరాల భూసేకరణ చేపడతారు. అందులో 1390 ఎకరాల భూమిని ప్రత్యేక అభివృద్ధి జోన్ కోసం, 2015 ఎకరాల విస్తీర్ణాన్ని నగరంలో గృహ నిర్మాణాల జోన్‌గా ప్రకటిస్తారు. రాయగిరి చెరువు పక్క నుంచి ధరపల్లి, యాదగిరిపల్లి, సైదాపూర్ మీదుగా ఆరు కిలోమీటర్ల రింగురోడ్డు నిర్మాణం ప్రతిపాదన కూడా ఉంది. ఈ మాస్టర్ ప్లానులో రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రాయగిరి గ్రామం కూడా ఉంది. ఈ రోడ్డులో భూములు పోగా ఏమైనా భూమి మిగిలితే దాన్ని యాదగిరి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రజల్లో ఉన్న భయాలు, అనుమానాలు, దినదినం కమ్ముకొస్తున్న ప్రమాదంలో వాళ్ల జీవితాలు విధ్వంసం అవుతాయనే ఆవేదన లోంచి వచ్చే సందేహాలకు అధికారులు గాని, ప్రజలచే ఎన్నికోబడి అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు గాని ఏమీ సమాధానం చెప్పడం లేదు. కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు ఇంకో విషయం కూడా చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నార్కెట్‌పల్లి–వలిగొండ–భోనగిరి–తుర్కపల్లి–గజ్వేల్‌కు ఒక రోడ్డు పథకం ఉందని, అందుకోసం భూసేకరణ కూడా జరిగిందని, ఇప్పుడు మామూలుగా ఉన్న ఆ రోడ్లను వెడల్పు చేసి, నల్లగొండ, భోనగిరి, మెదక్ జిల్లాలకు అనుసంధానం చేయవచ్చు అంటున్నారు.
వెబ్‌సైట్‌లో చెప్పినట్టుగా ఇదివరకే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కి.మీ. దూరంలో ఈ రోడ్డు నిర్మాణం జరగడం లేదు. అన్ని వైపుల కూడా 30 కి.మీ. లోపు నుండే ఈ రోడ్డు వస్తుంది. నిజానికి ఇదివరకే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు అన్ని జిల్లాల రోడ్లకు, ఆ జిల్లాల్లో ఉన్న చిన్న పట్టణాలకు రోడ్లు నిర్మాణం చేసి అనుసంధానం చేశారు. ఇప్పుడు ఈ రోడ్డు అసలు అవసరమే లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, రాజకీయ నాయకుల ప్రయోజనం కోసమే ఈ రోడ్డు నిర్మాణం జరగబోతోందని ప్రజలు ఆగ్రహంతో చెబుతున్నారు.
యస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల వేదిక