రిజిజు లేఖ

ABN , First Publish Date - 2023-01-19T00:43:30+05:30 IST

న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నాయని ప్రజలకు తెలియాలంటే, ఆ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు స్థానం కల్పించాలని...

రిజిజు లేఖ

న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నాయని ప్రజలకు తెలియాలంటే, ఆ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు స్థానం కల్పించాలని ఇటీవల కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్‌ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులు చేరితే ఆ నియామక ప్రక్రియకు రిజిజు చెబుతున్న విలువలన్నీ అంటుతాయా? ప్రతి నియామకం సవ్యంగా జరుగుతోందని ప్రజలు నిజంగా నమ్ముతారా? కేంద్రానికీ, సుప్రీంకోర్టుకు మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధంలో రిజిజు లేఖ మరోమలుపు. నియామకాల్లో మా మాటకూ చోటిస్తేనే ఘర్షణకు స్వస్తిచెబుతామన్నది రిజిజు సందేశం. మంత్రి కోరినట్టుగా నియామకాల ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకూ స్థానం కల్పిస్తే, ఇప్పటివరకూ కొలీజియం వ్యవస్థను తిట్టిదిగబారబోసిన ప్రభుత్వపెద్దలంతా ఇకపై నోరువిప్పరన్నమాట.

కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమనీ, న్యాయస్థానాల్లో వేలాదికేసులు పేరుకుపోవడానికి ఇదే కారణమన్నారు గతంలో రిజిజు. పలు సందర్భాల్లో, అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఈ వ్యవస్థను తిట్టిపోస్తూనే ఉన్నారు. ఆ బాధ్యతను ఆ తరువాత ఏకంగా ఉపరాష్ట్రపతే స్వీకరించారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చీరాగానే తెచ్చిన ‘జాతీయ న్యాయనియామకాల కమిషన్‌–ఎన్‌జెఎసి’ని కొట్టివేయడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు పెద్దదెబ్బతీసిందన్నారు ఆయన. కేశవానందభారతి కేసులో వెలువడిన తీర్పును కూడా తప్పుబడుతూ రాజ్యాంగస్ఫూర్తిని పరిరక్షించే పేరిట పార్లమెంటు చేసిన చట్టాలను సుప్రీంకోర్టు వమ్ముచేయడం అక్రమమనీ, మిగతావ్యవస్థలన్నిటికన్నా పార్లమెంటే సుప్రీమనీ ధన్‌కర్‌ బల్లగుద్దారు. న్యాయవ్యవస్థను దారికితెచ్చుకోవడం కోసం ప్రభుత్వం అన్నివైపులనుంచీ నరుక్కొస్తున్నది. కొలీజియం సిఫారసులను తిరగ్గొట్టడం, తిరిగి పంపిన జాబితానుంచి ఒకరిద్దరిని ఆమోదించి మిగతాపేర్లు కాదనడం వంటి విన్యాసాలు అనేకం. తమ సిఫారసులను అడ్డుకుంటున్న వైనంమీద సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహించింది. ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ నచ్చకపోతే మీకు నచ్చినరీతిలో మరొక కొత్త వ్యవస్థను తెచ్చుకోండి. కానీ, అప్పటివరకూ అమల్లో ఉన్న చట్టానికి కట్టుబడి నడుచుకోండి అని అసహనం వ్యక్తంచేసింది కూడా.

రిజిజు లేఖ నడుస్తున్న యుద్ధంలో ఒక భాగమే తప్ప రాజీకాదు. ఈ లేఖమీద జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందించే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎన్‌జెఎసి రాజ్యాంగ వ్యతిరేకమని ఒకసారి తీర్పుచెప్పిన తరువాత, తన తీర్పును తానే నీరుగార్చే, కొలీజియం వ్యవస్థలో రాజకీయ జోక్యానికి తావిచ్చే ఏ ప్రయత్నాన్నీ న్యాయవ్యవస్థ అనుమతించదు. ప్రస్తుత ప్రక్రియను సవరించి ప్రభుత్వ ప్రతినిధులకు చోటివ్వాలన్న ఈ తరహా విజ్ఞప్తులు గతంలో నాలుగైదుసార్లు చేసినవే. జాబితాను కాదనగలిగే అధికారం ఒకసారికే పరిమితం కావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నందున నేరుగా నిర్ణయాధికారంలోనే వాటా కోరుతున్నట్టుంది. నిజానికి సెర్చ్‌ కమ్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీలో స్థానం అంటున్న రిజిజు లేఖకు అర్థంలేదనీ, ఇప్పుడున్న కొలీజియం విధానంలో అటువంటిదేమీ ప్రత్యేకంగా లేనందున న్యాయమూర్తులకు మాత్రమే పరిమితమైన ఓ వ్యవస్థలో ప్రభుత్వం నేరుగా తిష్టవేసేందుకు ఇలా ప్రయత్నిస్తున్నదని నిపుణుల ఆరోపణ.

పార్లమెంటు చేసే చట్టాలను సుప్రీంకోర్టు సమీక్షించడమేమిటి, పార్లమెంటు తీర్పులు చెప్పదుకదా! అని ఇటీవలే ధన్‌కర్‌ ఆగ్రహించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేస్తున్న పనిలో తనకూ చోటుకావాలని ప్రభుత్వం అడుగుతున్నది. సెలక్షన్‌ కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అంటే న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనని ఎన్‌జెఎసి తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టును దెబ్బతీయాలంటే ప్రభుత్వం దగ్గరున్న ఏకైకమార్గం కొత్తచట్టం చేసుకోవడమే. కొలీజియం కంటే గొప్పదీ, రిజిజు కోరుతున్న పారదర్శకత, జవాబుదారీతనం అద్భుతంగా ఉన్న చట్టాన్ని పార్లమెంటు నిరభ్యంతరంగా తేవచ్చు. దానిని మళ్ళీ సుప్రీంకోర్టు సమీక్షించకమానదు. నియామకాలన్నీ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం జరుగుతున్నవే కనుక, కీలకమైన కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రభుత్వాన్ని పెద్దగా ఇరకాటంలోకి నెట్టేస్తున్నదేమీ లేదు కనుక ఉన్నదానితో సరిపెట్టుకోవడం మరో మంచిమార్గం.

Updated Date - 2023-01-19T00:43:33+05:30 IST