ఎన్నికల హామీగా మిగిలిపోతున్న ‘చింతలపూడి’!
ABN , First Publish Date - 2023-09-14T01:19:51+05:30 IST
ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో మళ్లీ తెరపైకి చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది. మరలా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చింతలపూడి ఎత్తిపోతల పథకం...
ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో మళ్లీ తెరపైకి చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది. మరలా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాంత రైతులు, ప్రజలపై మోసపూరిత హామీల వర్షం కురిపిస్తున్నాయి. 2008లో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ.1701కోట్ల అంచనాతో ఫేజ్–1 పనులు ప్రారంభించారు. ఆ తర్వాత 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఫేజ్–2 డిజైన్ రూపొందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి (ప్రస్తుత ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల), ఉమ్మడి కృష్ణాజిల్లా (ప్రస్తుత ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల) పరిధిలో తొమ్మిది నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించేందుకు, గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం కలిపి 4 లక్షల 80 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేలా డిజైన్ రూపొందించారు. రూ.4909.80 కోట్లతో ఆమోదం తెలుపుతూ 2016 సెప్టెంబర్ 3న జీవో 94 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జీవో జారీ చేసి ఏడేళ్లు పూర్తి అవుతున్నది. 2017 సెప్టెంబర్ 17న శంకుస్థాపన చేయడంతో పనులు ప్రారంభించి ఆరేళ్లు పూర్తి కావస్తున్నది.
చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మొదటి లిఫ్టుగా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి గ్రామం వద్ద 14 పంపులను గోదావరి నదిపై ఏర్పాటు చేసి మూడు కిలోమీటర్ల దూరం పైపుల ద్వారా 28 మీటర్లకు నీటిని ఎత్తిపోసి కాలువకు మళ్ళిస్తారు. అక్కడ నుంచి 13.22కిలోమీటర్లు కాలువ ద్వారా నీరు గోపాలపురం మండలంలోని గుడ్డిగూడెం గ్రామం వద్దకు చేరుతుంది. గుడ్డిగూడెం వద్ద రెండవ లిఫ్ట్ ఏర్పాటు చేసి 14 పంపులతో 3.3 కిలోమీటర్ల పొడవు గల పైపులు ద్వారా 86 మీటర్లు ఎత్తుకు నీటిని తోడి చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి మళ్ళిస్తారు. అక్కడనుండి కాలువ దిగువకు చింతలపూడి గ్రామం వరకు ప్రవహించాక 82.15వ కిలోమీటర్ల నుండి ఒక లింకు కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ వేంపాడు మేజర్ కాలువకు కలుపబడుతుంది. ఈ లింకు పొడవు 12.85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వేంపాడు మేజర్ నుంచి 21వ బ్రాంచి కాలువ నూజివీడు బ్రాంచ్ కాలువ, జమలాపురం మేజర్, మైలవరం బ్రాంచ్ కాలువ మొదలగు వాటి ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మూడవ లిఫ్ట్ చింతలపూడి ప్రధాన కాలువ 30వ కిలోమీటర్ వద్ద ఉన్న రౌతు గూడెం గ్రామం దగ్గర ఆరు పంపులు ఏర్పాటు చేసి ఒక కిలోమీటర్ పొడవు పైపుల ద్వారా మూడు మీటర్లు ఎత్తుకు నీటిని తోడి జల్లేరు జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ చేసి ఆ నీటిని అవసరమైనప్పుడు ఈ పథకం పరిధిలో ఉన్న గ్రామాలకు సాగు మరియు తాగునీటి అవసరాలకు అందిస్తారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి 15 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైతాంగం, ప్రజానీకం చింతలపూడి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు, తాగునీరు కోసం ఎదురుచూస్తున్నారు. రైతులు, ప్రజల ఆశలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నాయి. వారి చూపులు ఎదురుచూపులుగా మిగిలిపోతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాస్త పనులు వేగవంతంగా జరిగినా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేకపోయింది.
ఈ పథకం ఫేజ్–1 కాలువ చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ముగుస్తుంది. ఇక్కడే భూ సేకరణ సమస్య తలెత్తింది. ఈ పథకంలో కాలువలు త్రవ్వడానికి 18317 ఎకరాల భూములు సేకరణ చేయాల్సి ఉండగా ఇందులో 6683 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల కంటే చింతలపూడి మండలంలో రైతులకు అతి తక్కువ పరిహారం రావడంతో న్యాయమైన పరిహారం ఇవ్వాలని భూ నిర్వాసిత రైతులు గత ప్రభుత్వ హయాంలో రోడ్డెక్కి పోరాడారు. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోలేదు. చింతలపూడి మండలం రైతులకు రూ.12.50 లక్షలు మాత్రమే పరిహారంగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చింతలపూడి ప్రాంతం వచ్చి చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోగా వారి భూములను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఈ భూములు అమ్ముకోవడానికి, ఈ భూములపై పంట రుణాలు ఇతర వ్యవసాయ రాయితీలు పొందడానికి వీలులేకుండా పోయింది. భూమి కోల్పోతున్న రైతులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు, ఇతర సమస్యలు ఏమి వచ్చినా వారు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. రైతుల భూముల మధ్యలోంచి కాలువ వెళ్లడం వలన ఒకవైపు బోరు మరోవైపు భూమి ఉండడంతో రైతులు పంటలు వేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రధాన కాలువపై చాలాచోట్ల వంతెనల నిర్మాణం జరగలేదు ఫలితంగా రైతులు తమ పంటలు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంది. కంచె చేను మేసినట్లుగా చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలే వ్యవహరిస్తున్నాయి.
మరలా ఎన్నికలు సమీపించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎజెండాగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో 4 లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరు, తొమ్మిది నియోజకవర్గాలలో 33 మండలాల్లో 410 గ్రామాల్లో 21 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలి. తగినన్ని నిధులు కేటాయించి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి.
కె.శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి