పగ, ప్రతీకారాల రోత రాజకీయం!
ABN , First Publish Date - 2023-09-28T01:03:52+05:30 IST
కొత్తప్రభుత్వాలు గద్దె ఎక్కగానే పాత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించడం, కుదిరితే కేసులు పెట్టడం లాంటి వ్యవహారాలు మన దేశ రాజకీయాల్లో కొత్త కాదు. కానీ అధికారం పొరలుగా కమ్మి ఉండగా...
కొత్తప్రభుత్వాలు గద్దె ఎక్కగానే పాత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించడం, కుదిరితే కేసులు పెట్టడం లాంటి వ్యవహారాలు మన దేశ రాజకీయాల్లో కొత్త కాదు. కానీ అధికారం పొరలుగా కమ్మి ఉండగా ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది చాలా కీలకం! పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాలు ఈ విషయంలో మనకు ఉదాహరణగా కనిపిస్తాయి. కరుణానిధి ఏలుబడి సాగుతున్న రోజుల్లో జయలలితకు శాసనసభలో ఎలాంటి పరాభవం జరిగిందో అందరికీ తెలుసు. 2001లో జయలలిత అధికారంలోకి రాగానే అన్ని పరిస్థితులూ మారాయి. కరుణానిధి ప్రభుత్వం అప్పటిదాకా సస్పెన్షన్‌లో ఉంచిన జెసిటి ఆచార్యులు అనే అధికారిని జయలలిత సర్కారు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. మినీ ఫ్లైఓవర్ల నిర్మాణంలో కరుణానిధి ప్రభుత్వం అప్పట్లో రూ.12 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆయన చేసిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదయింది. అర్ధరాత్రి వేళలో 78 ఏళ్ల కరుణానిధిని ఆయన ఇంటినుంచి అత్యంత కర్కశంగా ఈడ్చుకు వెళుతూ అరెస్టు చేసిన వైనం అప్పటికప్పుడు టీవీ చానెళ్ల ద్వారా ప్రపంచానికి తెలిసింది. స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఒక రకమైన సుహృద్భావ వాతావరణానికి శ్రీకారం దిద్దే వరకు, తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ పోరాటాలు కక్షలు, పగలకు ప్రతిరూపాలుగానే నడిచాయి.
సరిగ్గా అదే తరహా వాతావరణం ఇప్పుడు తెలుగు నేలమీద ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. నేరం సంగతి న్యాయస్థానాలు తేలుస్తాయి. కానీ దర్యాప్తు సంస్థలు చంద్రబాబు పట్ల ఎలా వ్యవహరించాయనేదే ఇప్పుడు చర్చనీయాంశం. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు పరారైపోయే వ్యక్తి కాదు. ఆయనను విజయవాడ నివాసంలోనే అరెస్టు చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అయినా సరే నంద్యాల పర్యటనలో తన బస్సులో విశ్రమించి ఉన్న సమయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు పోలీసులు ఆ బస్సును చుట్టుముట్టారు. ఎవరినైనా సంతుష్టుల్ని చేయాలని ఆరాటపడ్డారో ఏమో తెలియదు గానీ.. అప్పటికప్పుడు అరెస్టు చేయాలని పట్టుబట్టారు. చంద్రబాబు భద్రతాధికారులు, ప్రోటోకాల్ అనుమతించదని, ఉదయం వరకు ఆగాలని కరాఖండిగా చెప్పడం వల్ల ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు. 73 ఏళ్ల నాయకుడిని, రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిని రోడ్డు మార్గంలో సుమారు 330 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటల పాటు ప్రయాణింపజేసి తీసుకువెళ్లారు. ఈ ప్రయాణమే ఆయనకు నరక సదృశంగా తోచి ఉంటుందనడంలో సందేహం లేదు. రాత్రంతా విచారించి, వైద్య పరీక్షల లాంఛనం ముగించి చివరకు ఉదయం ఆరున్నరకు కోర్టులో ప్రవేశ పెట్టడం, ఆయనకు రిమాండు విధించడం జరిగింది.
చంద్రబాబు జైలుకు వెళుతున్నారనే వార్త రాగానే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, మంత్రులు బాణసంచా పేల్చి పండగ చేసుకున్న వైనం హేయమైనది. రాజకీయాలు పగల రూపు సంతరించుకున్నాయనడానికి అది పరాకాష్ఠ! చివరకు రాజమహేంద్రవరం జైలులో ఫ్యాను సరిగా పనిచేయడం లేదని, దోమలు కుడుతున్నాయని చంద్రబాబు ఆవేదనను పంచుకునే పరిస్థితులను కల్పించారు. దీనిని యావత్తు ప్రజానీకం గమనించింది.
చంద్రబాబును అరాచకంగా జైల్లో పెట్టినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో వ్యక్తమవుతున్నాయో గుర్తించడానికి పాలక పక్షానికి మనసు అంగీకరించకపోవచ్చు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించినప్పుడు చరిత్ర పునరావృతం అవుతుందేమో అనిపిస్తోంది. నందమూరి తారక రామారావును నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన పట్ల ఏ స్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అదే స్థాయిలో ప్రజలు చంద్రబాబు పట్ల తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. వారిలో ఆయన పట్ల ఉన్న విశ్వాసం, ఆయన కార్యశీలత పట్ల ఉన్న నమ్మకం ఈ సమయంలో వ్యక్తం అవుతున్నాయి. ఆ వాస్తవాన్ని గుర్తించడానికి వైసీపీకి అహంకారం అడ్డువస్తోంది.
కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ ‘‘చట్టానికి అనుగుణంగా వెళ్లడం కంటె, వ్యక్తిగత ఎజెండాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. కరుణానిధి, అప్పటి భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం నాయకుడు కాదు. కానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్య అది. దురదృష్టవశాత్తూ ఆ మాత్రం ధైర్యంతో ఒక మాట చెప్పగల సచివులు, మేధావులు ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో లేరు.
జగన్మోహన్ రెడ్డి పగల రూపంలోకి తీసుకువెళ్లిన రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉంటుందనేదే భయం కలిగిస్తోంది. సంక్షేమ పథకాల పేరిట ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పంచిపెడుతున్నందుకు తాను మళ్లీ గెలుస్తానని, ఈసారి గెలవగానే మరో ముప్పయ్యేళ్ల పాటు తనే ముఖ్యమంత్రిగా పాలించడం తథ్యమని జగన్ భావిస్తుండవచ్చు. కానీ, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. చంద్రబాబు చేతికి దక్కినప్పుడు పరిణామాలు ఎలా ఉండవచ్చో ఊహించలేని పరిస్థితి. లిక్కరు, మద్యం సహా ప్రతి చిన్న లావాదేవీలోనూ అపరిమితమైన అవినీతి ఆరోపణలను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. వీటిమీద ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే కేసులు పెట్టి బాధ్యులు, సంబంధం ఉన్నవారినందరినీ అరెస్టులు చేయిస్తుందని ఊహించవచ్చు. చంద్రబాబు ఇలాంటి పగల రూపం తెలియని పాతతరం రాజకీయాలకే అలవాటు పడిన నాయకుడు. కానీ, అలాంటి ఆయనకు కూడా అధికారం దక్కగానే ఎలా కక్ష సాధించాలో ఇప్పటినుంచే ఆలోచించుకొనేట్టు ఈ పరిణామాలు దోహదం చేస్తున్నాయి. తెలుగునాట ఎన్నడూ ఎరుగని రోత రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. అధికారంలో ఉన్న వారికి సంయమనం లేకపోతే.. కక్ష సాధించడం ఒక సరదా అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనడానికి ఈ ఎపిసోడ్ ఉదాహరణ. రేపటి తరం దిగజారుడు, హేయమైన, భయానకమైన రాజకీయాలకు ఇది ఒక బీజం.
దాసరి కృష్ణమోహన్
పాత్రికేయుడు, డల్లాస్