అవే దృశ్యాలు!

ABN , First Publish Date - 2023-02-25T03:46:43+05:30 IST

ఢిల్లీమున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక యుద్ధాన్ని తలపిస్తోంది. కమిటీ సభ్యుల ఎన్నికలో అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లదని మొన్ననే...

అవే దృశ్యాలు!

ఢిల్లీమున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక యుద్ధాన్ని తలపిస్తోంది. కమిటీ సభ్యుల ఎన్నికలో అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లదని మొన్ననే మేయర్‌గా ఎన్నికైన ఆప్‌ నాయకురాలు షెల్లీ ఓబెరాయ్‌ ప్రకటించడంతో బీజేపీ నాయకులు ఆగ్రహించారు. ఆప్‌, బీజేపీ కౌన్సిలర్లు పిడిగుద్దులతో పరస్పరం విరుచుకుపడ్డారు. జుత్తుపట్టుకొని ఒకరినొకరు ఈడ్చుకున్నారు. గొంతుల్నే కాదు, చొక్కాల్నీ చించుకున్నారు. కౌన్సిలర్ల పరస్పరదాడుల్లో అనేకమందికి గాయాలయ్యాయి, ఒక కౌన్సిలర్‌ సొమ్మసిల్లిపోయారు. గాయాలపాలైనవారినీ, మైకులముందు ఆగ్రహంగా మాట్లాడుతున్నవారినీ, రోదిస్తున్నవారినీ దేశం యావత్తూ చూసింది. భారతీయ జనతాపార్టీ, ఆమ్‌ ఆద్మీపార్టీ మధ్య ఉన్న రాజకీయవైరం హింసాత్మక రూపాన్ని సంతరించుకోవడం విషాదం.

ఉభయపార్టీలూ ఎదుటివారే రాక్షసులని రుజువుచేసేందుకు సామాజిక మాధ్యమాల్లో తమకు అనుకూలమైన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా అని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మేయర్‌ మీద కూడా బీజేపీ కౌన్సిలర్లు దాడిచేశారనీ, ఆమెను అవహేళన చేశారని ఆప్‌ ఆరోపణ. ఆరుగురు సభ్యుల స్టాండింగ్‌ కమిటీలో ఆధిపత్యం మేయర్‌ ఎన్నికకంటే ముఖ్యమైనది కనుక ఇరుపక్షాలూ దీనిని తీవ్రంగా తీసుకోవడం సహజం. ఏయే ప్రాజెక్టులు ఎక్కడెక్కడ చేపట్టాలో, వాటికి నిధుల కేటాయింపులు ఏ మేరకు జరగాలో నిర్ణయించగలిగే అధికారాన్ని చేజార్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, ప్రక్రియ కొనసాగనీయకుండా, ఉభయులకూ అంగీకారయోగ్యమైన విధానాన్ని సాధించకుండా రోజుల తరబడి ఇదే ఘర్షణ కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు. తాను ఎంతో సవ్యంగా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుంటే, బీజేపీ వారు ఒక మహిళ అని కూడా చూడకుండా తనతో ఉన్మాదుల్లాగా వ్యవహరించారని కొత్త మేయర్‌ ఆరోపిస్తున్నారు. మేయర్‌ పీఠం చేజారిపోయిన బీజేపీ హింసాత్మక దారుల్లో కార్పొరేషన్‌ను కబ్జా చేయడానికి చూస్తున్నదని ఆప్‌ ఆరోపణ. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండూ ఆప్‌ స్వాధీనం చేసుకున్నాక, గురువారం ఉదయం వరకూ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. శుక్రవారం తిరిగి ఎన్నికల ప్రక్రియ ఆరంభానికి కొద్దిముందే ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఒకరు బీజేపీలో చేరిపోవడం ‘ఆపరేషన్‌ కమల్‌’ ఆరోపణలకు మరింత ఉతాన్నిచ్చింది. బీజేపీ కండువా కప్పుకున్న సదరు కౌన్సిలర్‌ ఓటువేయడానికి వస్తున్నప్పుడు ద్రోహి అంటూ ఆప్‌ కౌన్సిలర్లు ఆగ్రహించడం, బీజేపీ సభ్యులు నవ్వుతూండటం విచిత్రమైన దృశ్యం.

ఎన్నికలు జరిగి మూడునెలలు అవుతున్నా, రెండు నెలల కాలంలో మూడుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదాపడిన స్థితిలో సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న తీవ్రమైన హెచ్చరికలతో వ్యవహారాన్ని దారినపెట్టవలసి వచ్చింది. 24గంటల్లో ఢిల్లీ కార్పొరేషన్‌ సమావేశానికీ, మేయర్‌ ఎన్నికకూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించవలసివచ్చింది. పదిహేనేళ్ళు పురపాలక సంఘాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీజేపీకి డిసెంబరులో జరిగిన ఎన్నికలు పెద్దదెబ్బకొట్టాయి. మూడు పురపాలక సంస్థలూ విలీనమై, ఒకే కార్పొరేషన్‌గా అవతరించిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో బీజేపీకంటే ఆప్‌ ముప్పైస్థానాలు ఎక్కువసాధించింది. ఆ తరువాత ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తన నామినేటెడ్‌ సభ్యులతో తొలిసమావేశంలోనే ప్రమాణం చేయించడంతో వివాదం రాజుకుంది. మేయర్‌, డిప్యూటీమేయర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక పూర్తయ్యాక మాత్రమే వీరి ప్రమాణస్వీకారోత్సవం జరగాల్సివుండగా, నామినేటెడ్‌ సభ్యులను ముందుగానే గవర్నర్‌ ఎందుకు సిద్ధం చేశారో తెలుస్తూనే ఉంది. ఆ తరువాత జరిగిన సమావేశాలన్నీ రసాభాసగానే ముగిశాయి. చివరకు, ఆప్‌ వాదననే నిర్థారిస్తూ మేయర్‌ ఎన్నికలో వీరికి ఓటుహక్కులేదని సుప్రీంకోర్టు తేల్చింది. విధిలేక మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను సజావుగా సాగనిచ్చినా, స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో మాత్రం ఎంతోకొంత నొల్లుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచి, ఇప్పుడు నగరపాలకసంస్థను కూడా ఆప్‌ స్వాధీనం చేసుకోవడం బీజేపీకి కంటగింపుగా ఉండటం సహజం. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి సోమవారానికి వాయిదాపడినా, అవే దృశ్యాలు పునరావృతమవుతాయనడంలో సందేహం అక్కరలేదు.

Updated Date - 2023-02-25T03:46:45+05:30 IST