సూడాన్‌లో రక్తమోడుతున్న బంగారం
ABN , First Publish Date - 2023-05-03T00:59:03+05:30 IST
ఖనిజాలు సహజ సంపదలు. అవి, ఏ దేశానికైనా దైవమిచ్చిన వరాలు. ఆ సిరిని సద్వినియోగపరిచిన పాలకులు తమ ప్రజలకు భాగ్యరాశులు సమకూర్చారు; స్వార్థానికి...
ఖనిజాలు సహజ సంపదలు. అవి, ఏ దేశానికైనా దైవమిచ్చిన వరాలు. ఆ సిరిని సద్వినియోగపరిచిన పాలకులు తమ ప్రజలకు భాగ్యరాశులు సమకూర్చారు; స్వార్థానికి ఉపయోగించుకున్నవారు పాలితులకు కష్టాలనే మిగిల్చారు. మన దేశంలో ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలోను, తెలుగు రాష్ట్రాలలోని కడప, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. అయినా అవి వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి! పాలకుల దక్షత కారణాన గల్ఫ్ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగాయి.
ఆఫ్రికాలోని అనేక దేశాలలో విలువైన వజ్రాలు, బంగారం, చమురు సహా విభిన్న సహజ వనరులు ఉన్నాయి. అయితే దేశాలన్నీ కూడ నిరంతరం వివిధ తెగల అంతర్యుద్ధాలతో నిమగ్నమై ఉంటాయి. ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో బంగారం నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ బంగారం గనులపై ఆధిపత్యానికై సూడాన్ సైన్యంలోని ఒక వర్గం చేసిన తిరుగుబాటే ఆ దేశంలోని ప్రస్తుత అస్థిర పరిస్థితులకు ఒక ప్రధాన కారణం.
ఆఫ్రికా దేశాలలో సంప్రదాయకంగా కొన్ని తెగలతో కూడిన సాయుధులు పాలకుడికి అత్యంత విధేయతగా ఉంటారు. సూడాన్‌లో సైతం, ఆ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన జనరల్ ఉమర్ బషీర్‌కు అనుకూలంగా జంజవీద్ తెగలకు చెందిన సాయుధులు ఉన్నారు. వీరు ఇటీవలి తిరుగుబాటును అణిచివేస్తూ బషీర్ సైన్యానికి సహకరించారు. ప్రస్తుతం ఆర్.యస్.యఫ్‌గా పిలువబడుతున్న ఈ సాయుధులు 25 లక్షల మంది పౌరులను తరిమికొట్టి, మరో 3 లక్షల మందిని హతమార్చారు.
ఈ నరమేధానికి ఉమర్ బషీరే బాధ్యుడని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కూడ. న్యూఢిల్లీలో మోదీ సర్కార్ నిర్వహించిన ఆఫ్రికా సదస్సులో పాల్గొన్న ప్రముఖులలో బషీర్ ఒకడు. అరెస్ట్ వారెంట్లతో తమకు సంబంధం లేదని, ఒక దేశాధినేతగా బషీర్ తమకు అతిథి అని మోదీ సర్కార్ తన వైఖరిని స్పష్టం చేసింది. అతడికి రాచమర్యాదలు చేసింది. ఆ తర్వాత ప్రజా తిరుగుబాటుతో బషీర్ తన అధికారం కోల్పోయినా ఆయనకు విధేయులుగా పని చేసిన జంజవీద్ తెగ సాయుధులతో పాటు సైనికులకు అధికారం దక్కింది. అధికారిక సైన్యానికి జంజవీద్ తెగల సాయుధులకు మధ్య జరుగుతున్న అధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. బంగారం వెలికితీతతో వచ్చిన ఆదాయంతో జంజవీద్ తెగ సాయుధులు ఏకంగా సైన్యానికి సవాల్ విసిరే స్థాయికి ఎదిగారు. సైన్యం వద్ద వాయుసేన, నౌకా దళాలు ఉండగా దేశంలోని దాదాపు భూభాగమంతా కూడా ఈ ఆర్.యస్.యఫ్ చేతిలో ఉంది.
సూడాన్‌లో సుమారు నాలుగు వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో అత్యధికులు గుజరాతీలే అని మరి చెప్పనవసరం లేదు. సాధారణంగా ఆఫ్రికా దేశాలన్నిటా గుజరాతీలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కద్దు. సూడాన్‌లో తెలుగు ప్రవాసులు ఇంచుమించు నాలుగు వందల మంది దాకా ఉంటారు. వీరిలో అత్యధికులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారే. వీరిలో పలువురు గల్ఫ్ దేశాలలో పనిచేసి ఇంకా అధిక వేతనాల కొరకు సూడాన్‌కు వెళ్ళిన వారున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖ రాజకీయ నాయకులకు చెందిన కాంట్రాక్టింగ్ సంస్థలు కూడ సూడాన్‌లో ఉన్నాయి. తెలుగు వాళ్ళు కొందరు పని చేస్తున్న సూడానీస్ ప్రాంతాలలో ఎలాంటి ఉద్రిక్తతలు, దాడులు లేవు. అయితే సరఫరాలు లేక క్రమేణా దుకాణాలు మూతపడుతున్నాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. మున్ముందు సరఫరాలకు పూర్తి విఘాతం ఏర్పడితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. మరికొందరు, ప్రత్యేకించి బాంబుల దాడులు తీవ్రంగా ఉన్న రాజధాని ఖార్తోంలో ఉన్న తెలుగు ప్రవాసులు ప్రాణాలను కాపాడుకోవడానికై స్వదేశానికి వెళ్తున్నారు. సూడాన్ మహిళలను వివాహం చేసుకున్న హైదరాబాద్ నగర ముస్లింలు ఆ దేశంలోనే స్థిరపడ్డారు.
సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులను సౌదీ అరేబియాకు తరలించి అక్కడి నుంచి భారతదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ కావేరి’ని ప్రారంభించింది. సౌదీ అరేబియా, అమెరికా దేశాలు సూడాన్‌లోని ఇరువర్గాలతో తాత్కాలికంగా కుదిర్చిన కాల్పుల విరమణతో ఈ తరలింపు కార్యక్రమం సులువయింది. ప్రధాని నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా యువరాజుతో ఉన్న సంబంధాలు కూడ ఇందుకు తోడ్పడ్డాయి. ‘మిషన్ కావేరి’ని మోదీ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తుండడం అభినందనీయం. కర్ణాటకలో సిద్ధరామయ్య, కాంగ్రెస్‌కు వీర విధేయులుగా ఉన్న హక్కి పిక్కీ అనే తెగకు చెందిన చాల మంది గిరిజనులు సూడాన్‌లో మూలికలు విక్రయిస్తుంటారు. కర్ణాటక ఎన్నికల దృష్ట్యా అక్కడి ప్రధాన నది అయిన కావేరి పేరుతో ఆ కార్యక్రమానికి నామకరణం చేసారనే విమర్శ కూడా ఉంది. ఇక, సూడాన్ నుంచి రోజూ వచ్చే ప్రతి ఒక్క భారతీయ బృందానికి న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ స్వాగతం పలుకుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు రోజూ మీడియాలో రావడం కూడా రాజకీయంగా షరా మామూలే.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)