‘సుప్రీం’ దెబ్బ!
ABN , First Publish Date - 2023-01-25T00:23:41+05:30 IST
కేంద్రన్యాయమంత్రి కిరణ్ రిజిజు మరోమారు ఆవేదనకు, ఆగ్రహానికి గురైనారు. ముగ్గురు న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా...
కేంద్రన్యాయమంత్రి కిరణ్ రిజిజు మరోమారు ఆవేదనకు, ఆగ్రహానికి గురైనారు. ముగ్గురు న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా నియమించమంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఏయే కారణాలతో తిరస్కరించిందో తెలియచెప్పే వివరాలను సుప్రీంకోర్టు ప్రజాక్షేత్రంలో ఉంచడం కేంద్రమంత్రి కోపానికి కారణం. ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్‌వింగ్ (రా) వంటి నిఘాసంస్థల నివేదికలను సుప్రీంకోర్టు ఉటంకించడాన్ని ఆయన అత్యంత ఆందోళనకర నిర్ణయంగా అభివర్ణించారు. నిఘా అధికారులు దేశం కోసం రహస్యంగా పనిచేస్తూ నివేదికలు ఇస్తున్నందున వాటిని ఇలా బహిరంగపరచడం కూడదన్నది సారాంశం. సుప్రీం చర్యతో నిఘాసంస్థలకు ఎదురయ్యే ఇబ్బందులేమిటో మనకు తెలియదుకానీ, ప్రభుత్వం మాత్రం తీవ్ర ఆత్మరక్షణలో పడిందని ఆయన వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.
కొలీజియం సిఫార్సులను పాలకులు తిరగ్గొడుతున్నప్పుడల్లా సుప్రీంకోర్టు ఆగ్రహించడం, ఆ తరువాత ప్రభుత్వం ఏవో కొన్నిపేర్లను ఆమోదించి మిగతా జాబితాను పక్కనపడేయడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ తిరస్కారానికి లోతైన కారణాలే ఉండివుంటాయని నమ్ముతున్నవారిని సుప్రీంకోర్టు ప్రజాక్షేత్రంలో ఉంచిన సమాచారం ఆశ్చర్యపరిచింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని హైకోర్టు నియామకాలకు సంబంధించిన ముగ్గురు సభ్యుల కొలీజియం, జనవరి 19న ఐదుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలన్న తన సూచనను పునరుద్ఘాటించడంలో భాగంగా, ముగ్గురు న్యాయవాదుల విషయంలో ప్రభుత్వ అభ్యంతరాలను, వాటిపై తన వివరణలను ప్రజాక్షేత్రంలో ఉంచింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేస్తున్న సౌరభ్ కిర్పాల్ స్వలింగ సంపర్కుడు కావడం, ఆయన భాగస్వామి ఒక విదేశీయుడు కావడం తిరస్కారానికి కారణం. మద్రాస్, బాంబే హైకోర్టుల్లో నియమించాలనుకుంటున్న జాన్ సత్యన్, సోమశేఖర్ సుందరేశన్‌లలో ఒకరు మోదీని సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే, మరొకరు ప్రభుత్వ విధానాన్ని బహిరంగ చర్చలో ప్రశ్నించడం కారణం. సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి బి.ఎన్.కిర్పాల్ కుమారుడైన సౌరభ్ కిర్పాల్ తన లైంగికధోరణిని బాహాటంగానే ప్రకటించినందుకు అభినందిస్తూ, అనేకమంది ప్రస్తుత, పూర్వ న్యాయమూర్తుల జీవిత భాగస్వాముల్లో కూడా విదేశీయులున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఇక, మిగతా ఇద్దరిపేర్లనూ ప్రభుత్వం తిరస్కరించడానికి వారు పాలకుల నిర్ణయాలను ప్రశ్నించడమే కారణమని అర్థమవుతూనే ఉంది. వీరిద్దరి విషయంలోనూ సుప్రీంకోర్టు చక్కని, లోతైన విశ్లేషణతో చేసిన సమర్థనను అటుంచితే, ప్రభుత్వ చర్యలను ఏ మాత్రం ప్రశ్నించని వీరవిధేయులే ఈ పదవులకు అర్హులనీ, రాజ్యాంగహక్కులు, ప్రజాస్వామిక విలువలు పరిరక్షించాల్సిన న్యాయమూర్తులకు కనీసం భావప్రకటనాస్వేచ్ఛ, వాక్‌స్వాతంత్ర్యాలు కూడా అనర్హమైనవేనని పాలకులు అంటున్నారని అర్థం. ఈ ముగ్గురూ కాక మరో ఇద్దరి విషయంలో ప్రభుత్వ తిరస్కార కారణాలను సుప్రీంకోర్టు బయటకు చెప్పలేదు కానీ, అమితేశ్ బెనర్జీ తండ్రి జస్టిస్ యు.సి. బెనర్జీమీద బీజేపీకి రెండుదశాబ్దాలనాటి ఆగ్రహం ఉన్నదని అంటారు. 2002లో గోధ్రా రైలుదహనం ఘటనలో ఎటువంటి కుట్రకోణాలూ లేవని సీనియర్ బెనర్జీ అప్పట్లో నివేదిక ఇచ్చారు. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన శ్యామల్‌సేన్‌తో ఉన్న గతవైరమే, ఇప్పుడు ఆయన కుమారుడు శాక్యసేన్ పేరును పాలకులు తిరస్కరించడానికి కారణమని అంటారు.
సుదీర్ఘకాలంగా ఈ నియామకాలకు సంబంధించి ఇరుపక్షాల మధ్యా నలుగుతున్న వాదనలను బహిరంగపరచడం ద్వారా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తేరుకోలేనంత దెబ్బకొట్టింది. అభ్యర్థుల విషయంలో ప్రభుత్వ అభ్యంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు అర్థమైపోయింది. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడ్డాయని విమర్శిస్తున్న పాలకులు ఇప్పుడు ఆ పారదర్శకతనే తప్పుపడుతున్నారు.