స్వచ్ఛమూర్తికి జై

ABN , First Publish Date - 2023-10-01T00:52:45+05:30 IST

ఆత్మశక్తిని నింపుకున్న ఆ చూపు ఎవరిది? విమోచనాన్ని అందించిన ఆ చిర్నవ్వు ఎవరిది? మారణహోమంలో మానవాళికై శాంతిబావుటా...

స్వచ్ఛమూర్తికి జై

ఆత్మశక్తిని నింపుకున్న ఆ చూపు ఎవరిది?

విమోచనాన్ని అందించిన ఆ చిర్నవ్వు ఎవరిది?

మారణహోమంలో మానవాళికై శాంతిబావుటా

ఎగరేసిన ఆ చేతులెవరివి?

అలుముకున్న అంధకారంలో

ఒక హితమై ఒక మతమై ఒక స్వతంత్రగీతమై

సాగిన ఆ అడుగులు ఎవరివి?

పాదయాత్రల మెరిసిన రాకెట్

దండియాత్రల విరిసిన బుల్లెట్ గుర్తొచ్చెనా?

నిస్వార్థమూర్తి నిరాడంబరమూర్తి జ్ఞప్తికొచ్చేనా?

ఒకవైపు అస్పృశ్యతాభావం

ఒకవైపు అసమానతా దృశ్యం

ఒకవైపు పారిశుధ్యలోపం

స్వచ్ఛ సమాజాన్ని వేధిస్తే

కలవరపడ్డది కలతపడ్డది ఎవరు?

స్వార్థం క్రోధం ద్వేషం వొదులుకొని

ప్రేమ త్యాగం సేవానిరతి తొడుక్కొని

గ్రామాభ్యుదయం కోరుకొని

ధర్మంతో నిగ్రహంతో సాగిందెవరు?

కుల మత వర్గ ప్రాంత భేదాలెరుగని

చూపుతో చిర్నవ్వుతో రా(చే)తలతో

పచ్చదనాన్ని ప్రసాదిస్తూ

గలగల గంగాప్రవాహమైందెవరు?

సర్వతోముఖ వికాసానికి, బలమైన జాతి నిర్మాణానికి

అక్షరాభ్యాసం చేయించిన ఆ మూర్తి ఎవరు?

చెత్త తగలెట్టే ఆ మూర్తికి జై!

ఆ స్వచ్ఛమూర్తి కి జై జై!!

కోటం చంద్రశేఖర్

(అక్టోబర్‌ 2: గాంధీజయంతి)

Updated Date - 2023-10-01T00:52:45+05:30 IST