అంపశయ్యపై ఉపాధ్యాయ విద్య

ABN , First Publish Date - 2023-09-13T03:42:52+05:30 IST

ఉపాధ్యాయ విద్యను తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యతలో వెయ్యోవంతు కూడా...

అంపశయ్యపై ఉపాధ్యాయ విద్య

ఉపాధ్యాయ విద్యను తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యతలో వెయ్యోవంతు కూడా ఉపాధ్యాయ విద్యకు ఇవ్వడంలేదు. ఒక మంచి వైద్యుడు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌ తయారు కావాలంటే ప్రాథమిక స్థాయిలోనే మంచి విద్యార్థిగా, మంచి మనిషిగా తీర్చిదిద్దబడాలి. ఉపాధ్యాయ దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలిస్తూ, మరోవైపు ఉత్తమ ఉపాధ్యాయులను తయారుచేసే శిక్షణాసంస్థలను గాలికి వదిలేయడం సరికాదు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచారు. ఇలా కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రతి చోట ఒక ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థను (డైట్‌)ను ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్న నాలుగు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, 10 డైట్‌ కళాశాలలు తప్ప పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్తగా ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కళాశాలల్లోనూ దారుణమైన పరిస్థితులున్నాయి. అన్నివర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ప్రారంభించింది. అయితే, వాటిలో నియమిస్తున్న ఉపాధ్యాయుల విద్యాప్రమాణ స్థాయి ఏ మేరకు ఉన్నదో ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. పదేళ్లుగా ఉపాధ్యాయ విద్యకు ప్రాముఖ్యత కల్పించకపోవడంతో అది అంపశయ్య మీదకు చేరుకుంది.


ప్రతి బీఈడీ కళాశాలలో నిబంధనల ప్రకారం ఒక ప్రిన్సిపల్‌తోపాటు 18 మంది బోధనా సిబ్బంది ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నాగార్జునసాగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌–మొత్తం నాలుగు కళాశాలలో 78 పోస్టులకుగాను ప్రిన్సిపాళ్లతో కలుపుకొని కేవలం అయిదుగురు మాత్రమే రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లోనూ అదే పరిస్థితి. ఒక్కోచోట ప్రిన్సిపాల్‌తో కలిపి 19 మంది బోధనా సిబ్బంది ఉండాల్సిన స్థానంలో ఇద్దరు, ముగ్గురు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 10 ప్రభుత్వ డైట్‌ కళాశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఈ మధ్యనే హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లోని డైట్‌ కళాశాల గుర్తింపును రద్దుచేస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాదికి చేపట్టే కౌన్సిలింగ్‌లో కొత్తగా విద్యార్థులను తీసుకోవద్దని ప్రకటించింది. ఇది ప్రభుత్వ విద్యారంగానికి తలవంపులు తెచ్చే అంశం. ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యధోరణిని కొనసాగిస్తే, రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ విద్య శిక్షణా సంస్థల గుర్తింపు రద్దయ్యే పరిస్థితి త్వరలో వస్తుంది. ఇప్పటికైనా బీఈడీ, డైట్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 70 సీనియర్‌ లెక్చరర్‌, 262 లెక్చరర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించడంతోపాటు, పాఠ్య పుస్తకాలను రచించడం, నూతన మూల్యాంకన పద్ధతులపై పరిశోధనలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ (ఎస్‌సీఆర్‌టీ)లోనూ సిబ్బంది కొరత ఉంది. ఎస్‌సీఈఆర్‌టీలో ప్రొఫెసర్లు, లెక్చరర్లు కలిపి మొత్తం 24 మంది పనిచేయాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. ఇదికూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణం ఈ పరిస్థితులను చక్కదిద్దడం ప్రభుత్వం బాధ్యత.

శివార్చక విజయ్‌కుమార్‌

రిటైర్డ్‌ డీఈఓ, మహబూబ్‌నగర్‌

Updated Date - 2023-09-13T03:42:52+05:30 IST