కుట్రల్లో చిక్కుకున్న తెలంగాణ కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-09-12T02:42:45+05:30 IST

రాష్ట్రకాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదుల కుట్రలకు బలవుతున్నట్టుగా అర్థమవుతుంది....

కుట్రల్లో చిక్కుకున్న తెలంగాణ కాంగ్రెస్

రాష్ట్రకాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదుల కుట్రలకు బలవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, కేసీఆర్ పాలనా వైఫల్యాలు చర్చకు రావాల్సిన సమయంలో, షర్మిల, కేవీపీ అంశాలు కాంగ్రెస్ చుట్టూ వార్తలుగా తిరుగుతున్నాయి. ఎన్నికల సమయంలోనే షర్మిల, కేవీపీ ఎందుకు చర్చకొస్తున్నారన్నది గమనిస్తే తెలంగాణ కాంగ్రెస్‌పై కుట్ర జరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. తాజాగా రాజశేఖర్ రెడ్డిపై రాసిన ‘రైతే రాజు’ పుస్తక విడుదల కార్యక్రమంలో కేవీపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నన్ను తెలంగాణ వాడిగా గుర్తించండి, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఓటేస్తున్నాను అని చెప్పుకొచ్చిన కేవీపీ మాటలు చూస్తే, తాను తెలంగాణ రాజకీయాల్లో దూరాలని చూస్తున్నట్టుగా ఎవరికైనా అర్థమవుతుంది. రైతే రాజు పుస్తకం హైదరాబాద్‌లోనే ఎందుకు రిలీజ్ చేశారు, అమరావతిలో ఎందుకు చేయలేదు? కేవీపీ ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? అనేవి ప్రశ్నలు.

తెలంగాణలో పరోక్షంగా కేసీఆర్‌కు మేలు చేసే విధంగా, తద్వారా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్న ధోరణి కేవీపీలో కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు గులాబీ నేతలు కూడా కేవీపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో, తెలంగాణ సెంటిమెంట్ రేగేలా సమైక్యాంధ్ర కుట్రలు కాంగ్రెస్ రూపంలో జరుగుతున్నట్టు అనుమానాలు తెరపైకొచ్చాయి. కేవీపీ చేసిన వ్యాఖ్యలు, షర్మిల పార్టీ విలీనం అంశాలను చూస్తుంటే వీటిని బీఆర్‌ఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వాడుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ఈ కేవీపీ ఎక్కడా కనపడలేదు. తెలంగాణ వైపు ఎన్నడూ నిలబడలేదు. పైగా తెలంగాణను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుంటూ, కుట్రలు చేస్తూ ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యాడు. తెలంగాణ వ్యతిరేకి అయిన కేవీపీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కేసీఆర్కు లబ్ధిచేకూర్చే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

2014లో కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కల్పించుకుని సీట్ల పంపకం సరిగ్గా జరగకుండా చేశాడన్న అపవాదు కేవీపీపై ఉంది. 2018లో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టించి రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి ఓటమి పాలవడం వెనక కేవీపీ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మళ్లీ కేవీపీ పుస్తక విడుదల కార్యక్రమ రూపంలో తెరమీదకు వచ్చారు. అమరావతిలో కాకుండా హైదరాబాద్‌లో ఆ కార్యక్రమం పెట్టుకుని మరీ ఇటువంటి వ్యాఖ్యలతో కేసీఆర్‌కి ఆయుధాన్నిచ్చారు. గులాబీ నేతలు దానిని అందిపుచ్చుకున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అంటూ పర్యటనలు చేస్తూ, తెలంగాణ అంతటా పోటీ చేస్తా అని చెప్పి ప్రచారం చేసిన షర్మిల తీరా ఎన్నికలు దగ్గరికొస్తున్న సమయంలో కాడెత్తేసి తన పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేస్తున్నారంటూ వీరంతా తెలంగాణ కాంగ్రెస్‌ను గాయిగాయి చేస్తున్నారు? అంటే, పక్కా ప్లాన్‌తోనే కేవీపీ, షర్మిల రూపంలో కాంగ్రెస్‌ని మరోసారి గట్టిగా దెబ్బతీసేందుకు కుట్రలు మొదలయ్యాయని సుస్పష్టం.


అసలు ఇక్కడ రాజన్న రాజ్యం వద్దనుకొనే కదా ప్రజలు తెలంగాణ కోరుకున్నారు. ఆనాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలను, వనరులను ఆంధ్రాకు తరలిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడింది పీజేఆర్ మాత్రమే. పైగా, ఇదే వైఎస్సార్ దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన తెలంగాణ ఠీవీ పీవీ నరసింహారావుని అవమానించారు. తెలంగాణలో రాజన్న రాజ్యమేంటి? 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. వైఎస్ వ్యతిరేకం కాకపోయి ఉంటే ఆనాడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేది. ఆయన అడ్డుకోబట్టే తెలంగాణ బిడ్డలు బలయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టీఆర్ఎస్, మిగతా రాజకీయ పార్టీలు ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం నిలబడితే, ఇదే షర్మిల, జగన్, కేవీపీ అందరూ సమైక్యాంధ్ర పక్షాన నిలిచారు.

వైఎస్సార్టీపీ అంటూ షర్మిల ఎంత హడావిడి చేసినా ఆ పార్టీకున్న బలమెంత? ఆదరణే లేని పార్టీని కాంగ్రెస్‌లో విలీన చేయడమంటూ చర్చల మీద చర్చలు చేయడంతో కీలకమైన సమయం వృధా అవుతోంది. ప్రజల్లోకి కాంగ్రెస్‌ పార్టీ తీసుకెళ్లాల్సిన అంశాలేవి ప్రధానంగా చర్చకు రావడం లేదు. పార్టీ డిక్లరేషన్, హామీలు ప్రజల్లోకి వెళ్లకుండా షర్మిల పార్టీ విలీనం, కేవీపీ వ్యాఖ్యల చుట్టూ కొట్టుమిట్టాడే ఈ పరిస్థితికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే రాష్ట్ర కాంగ్రెస్ మరోసారి కుట్రలకు బలికావడం ఖాయం. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఉంది.

బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక

Updated Date - 2023-09-12T02:42:45+05:30 IST