బిహార్‌ లెక్కల విహారంలో దేశం!

ABN , First Publish Date - 2023-10-10T01:32:01+05:30 IST

కులంపునాదిపై మీరు దేన్నీ నిర్మించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు.. ఒక నీతినీ నిర్మించలేరు. కులం పునాదులపై దేన్ని నిర్మించినా అది బీటలువారక తప్పదు– 1936లో అంబేడ్కర్‌ చాలా పదునుగా చేసిన విమర్శ అది...

బిహార్‌ లెక్కల విహారంలో దేశం!

కులంపునాదిపై మీరు దేన్నీ నిర్మించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు.. ఒక నీతినీ నిర్మించలేరు. కులం పునాదులపై దేన్ని నిర్మించినా అది బీటలువారక తప్పదు– 1936లో అంబేడ్కర్‌ చాలా పదునుగా చేసిన విమర్శ అది. మనిషి చేష్టలను, ఆలోచనలను, ప్రవర్తనను, నైతికతను సంకుచిత పరిధుల్లో ఉంచే కుల వ్యవస్థ స్వభావాన్ని ఇంతకు మించి సమర్థంగా చెప్పగలిగేది ఏదీ ఉండదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు ఆధునిక రాజ్యాంగాలకు, నాగరికతకు ఆయువుపట్టులు. వీటికి అడ్డంకిగా ఉండే ప్రతి భావాన్ని అంబేడ్కర్‌ విమర్శించారు. కులం ఆధారంగా వందల ఏళ్లు దేశంలో నడిచిన హిందూ సామాజిక వ్యవస్థను అందుకే తూర్పారపట్టారు. కులం పునాదిగా చరిత్ర పునరావృతం కాకూడదని కోరుకున్నారు. కానీ చరిత్రను పునరావృతం చేయటానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అలా జరిగినప్పుడు అది విషాదంగానూ, ప్రహసనంగానూ మారుతుందని 1852లో మార్క్స్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కులాల లెక్కలు వెలుగులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే అలానే అనిపిస్తుంది. కులాల లెక్కలను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి సామాజిక విప్లవానికి ద్వారాలు తెరుస్తున్నామనీ, విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ పదవుల్లో సామాజిక న్యాయాన్ని ఇంకా సమగ్రంగా అమలు చేయటానికి ఆ లెక్కలు దోహదం చేస్తాయనీ బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ కూడా గట్టిగా విశ్వసిస్తోంది. బిహార్‌ తరహా లెక్కలకు రాజస్థాన్‌ కూడా ఆమోదముద్ర వేసింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అన్ని చోట్లా ఈ లెక్కలను తేలుస్తామని రాహుల్‌ గాంధీ తరచూ చెబుతున్నారు. కులాల లెక్కలు తీయటం వెనుక రాజకీయ ప్రయోజనాలను చూసే వాళ్లూ ఎప్పుడూ ఉంటారు. బీజేపీ హిందూత్వ రాజకీయాలను, విపక్షాలను బలహీనపరిచే ఆ పార్టీ చర్యలను, సామాజిక న్యాయం అనే అస్త్రాన్ని ప్రయోగించకపోతే ఎదుర్కోలేమని భావించటంలో తప్పేమీ లేదు. కానీ సామాజిక న్యాయం పేరుతో జరిగే రాజకీయాలు నిజంగా కీలక సమస్యలను పట్టించుకుంటాయా? లేదా? అన్నది అంచనా వేయటానికి బిహార్‌ లెక్కలు కొంత ఉపయోగపడతాయి. అవి చెప్పే కఠోర వాస్తవాల లోతుపాతుల్లోకి వెళ్లకుండా సామాజిక న్యాయాన్ని ఇప్పుడున్న సంకుచిత పరిధులకు పరిమితం చేస్తే చరిత్ర విషాదభరితంగా మారుతుంది. ఆలోచనలు కులాల సరిహద్దుల్లో కొట్టుమిట్టాడుతాయి.

కులాలకు సంబంధించి అన్ని వివరాలనూ బిహార్‌ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. స్థూలంగా కొన్ని లెక్కలకు మాత్రమే పరిమితమైంది. వాటిని చూస్తే ఒక కీలక ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. మతపరంగా జనాభా లెక్కల వివరాలు ఇచ్చినప్పుడు హిందువులు 81.99 శాతం ఉన్నట్లు పేర్కొంది. ముస్లింల జనాభా 17.70 శాతంగా తమ లెక్కల్లో తేలినట్లు చెప్పింది. కానీ కులాల లెక్కల గురించి చెప్పినప్పుడు ముస్లింలను ప్రత్యేక వర్గంగా పేర్కొనలేదు. వీరిలో అగ్రకులాల సరసన చేర్చిన మూడు వర్గాలను మినహా మిగతా వారిని బీసీలుగా చూపించారు. ఇట్లా చూపించటం వల్ల ఓబీసీ (అదర్‌ బాక్‌వడ్‌ క్లాసెస్‌), ఈబీసీ (ఇక్స్‌స్ట్రీమ్లి బాక్‌వడ్‌ క్లాసెస్‌) వర్గాల సంఖ్య మొత్తం జనాభాలో 63.14 శాతానికి చేరింది. అలా కలపటానికి అనుసరించిన పద్ధతి ఏమిటో వివరించలేదు. ముస్లింలను మొత్తంగానో లేక మెజారిటీనో బీసీ వర్గంలో చేర్చటానికి ఏకాభిప్రాయం లేదు. కులపరమైన వెనుకబాటుని హిందూ వ్యవస్థకు చెందినదిగానే భావించటం వల్ల ముస్లింలను గుంపగుత్తగా బీసీల్లో చేర్చటానికి బీసీ కమిషన్లు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అంతెందుకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లను వర్తింపచేయాలని దశాబ్దాలుగా డిమాండు ఉన్నా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న ఈ విషయం ఎప్పటికి గట్టెక్కుతుందో తెలియదు. బిహార్‌లో మాదిరిగా ముస్లింలను గంపగుత్తగా బీసీల్లో కలిపేస్తే ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌, కేరళ, అసాంల్లో మొత్తం బీసీల సంఖ్య చాలా పెరిగిపోతుంది. ముస్లింలు 10 శాతానికి కొంచెం అటుఇటుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. దీనికి బీసీలు సైతం అంగీకరిస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. అగ్రకులాలు 15.52 శాతం (మూడు ముస్లిం వర్గాలను కూడా కలుపుకొని) ఉన్నట్లు నిర్ధారణ అయింది. 1931 నాటి జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో అగ్రకులాల వారు 13.7 శాతం ఉన్నారు. మూడు ముస్లింవర్గాలను మినహాయిస్తే నికరంగా అగ్రకులాల జనాభా 10.57 శాతంగా తేలుతుంది.


కుల జనాభా సంఖ్యను బట్టి విద్య, ఉద్యోగాలు, చట్ట సభల్లో వాటా ఉండాలన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన డిమాండుగా చెప్పుకోవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉండాలన్న వాదన అందులో భాగమే. కుల రిజర్వేషన్లకు ఇప్పుడు అమలవుతున్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలన్న డిమాండు అలా ఊపందుకున్నదే. జనాభా సంఖ్యకు అనుగుణంగా పదవులు పొందే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్నప్పుడు తమకెందుకు ఉండకూడదని బీసీలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నారు. సంఖ్యని బట్టి పదవులు అన్ని కులాలకు ఏకరీతిన వర్తింప చేయగలమా? ఏ స్థాయి వరకూ పరిమితం చేయాలి. రిజర్వేషన్లను ఒక తరానికే వర్తింపచేయాలా? కులాల్లో ఆదాయ, ఆస్తుల పరంగా పెరుగుతున్న వర్గ వ్యత్యాసాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలి? ప్రైవేటు పెట్టుబడుల ఆధారంగా నడిచే పోటీ ఆర్థిక వ్యవస్థలో కుల ఆధారిత కోటాలను అమల్లో చేయగలమా? లాంటి కీలక ప్రశ్నలను రాజకీయ పార్టీలు చర్చించటం లేదు. రిజర్వేషన్ల కోసం పట్టుబట్టుతున్న వాళ్లు అసలు ఆ ప్రశ్నలను సీరియస్‌గా పట్టించుకోవటం లేదు. ఆర్థిక వ్యత్యాసాలు, వాటి ఆధారంగా తలెత్తే వర్గాల విశ్లేషణ చేపడితే కులం ఆధారంగా చేసే డిమాండ్లకు దెబ్బ తగులుతుందని భావించటమే దీనికి కారణం.

సంఖ్యా కోణం నుంచి బిహార్‌ లెక్కలను చూస్తే మనకు చాలా సంగతులు తెలుస్తాయి. బిహార్‌లో నాలుగు అగ్రకులాలైన బ్రాహ్మణ్‌, రాజ్‌పుత్‌, భూమిహార్‌, కాయస్థ... జనాభా 10.57 శాతం ఉంది. సంఖ్యానుగుణ న్యాయం ప్రకారం మొత్తం అసెంబ్లీ స్థానాల్లో (243) వీరి సంఖ్య 26 మించకూడదు. కిందటి అసెంబ్లీలో (2015–2020) ఈ వర్గాల నుంచి 52 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో ఆ సంఖ్య 64కు పెరిగింది. తరతరాలుగా భూములు, ఆస్తులు, పదవుల మీద పట్టు ఉండటంతో ఏర్పడిన ఆధిక్యత కారణంగా జనాభా సంఖ్యతో పొంతన లేకుండా ఈ వర్గాలు అధిక పదవులు పొందుతున్నాయని భావించొచ్చు. అందులో సందేహం లేదు. ఇదే కోణం నుంచి ఓబీసీ వర్గంలో ఉన్న యాదవులను కూడా చూస్తే చాలా విషయాలు బయటపడతాయి. మొత్తం జనాభాలో యాదవుల సంఖ్య 14.27 శాతం. సంఖ్యానుగుణ సామాజిక న్యాయం ప్రకారం 35 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ కిందటి అసెంబ్లీలో యాదవ ఎమ్మెల్యేలు 61 మంది ఉన్నారు. ఈ అసెంబ్లీలో 52 మంది ఉన్నారు. కుష్వాహా కులం జనాభా 4.27 శాతం. కిందటి అసెంబ్లీలో ఈ కులం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. అంటే రెట్టింపు సంఖ్యలో ఎన్నికయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో 16 మంది ఉన్నారు. ఇక కుర్మీ కుల జనాభా 2.87 శాతం కాగా కిందటి అసెంబ్లీలో 12 మందికి, ప్రస్తుత అసెంబ్లీలో 9 మందికి ప్రాతినిధ్యం లభించింది. 2.31 శాతం ఉన్న బనియా కులం నుంచి కిందటి అసెంబ్లీకి 16, ఈ అసెంబ్లీకి 24 మంది ఎన్నికయ్యారు. బనియా అంటే మనం అగ్రకులం అనుకుంటాం. కానీ బిహార్‌లో చాలా బనియా వర్గాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి. ముస్లింలను మినహాయించితే తేలే ఈబీసీల సంఖ్య జనాభాలో కొంచెం అటుఇటుగా 23 శాతం ఉంటుంది. కిందటి అసెంబ్లీలో ఈ వర్గం నుంచి ఎంపికైంది 17 మంది మాత్రమే. ఈసారి ఆ సంఖ్య 19కి పెరిగింది. ఓబీసీల్లో నాలుగు ప్రధాన కులాలు (యాదవ, కుష్వాహా, కుర్మీ, బనియా) మొత్తం జనాభాలో 23.71 శాతం ఉంటే కిందటి ఎన్నికల్లో ఈ వర్గాల నుంచి 109 మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఈసారి ఆ సంఖ్య 101కి పరిమితమైంది. ఈబీసీలను కూడా కలుపుకొంటే అది 120కి చేరుతుంది. ఎస్సీ, ఎస్టీలను కూడా దీనికి చేర్చితే ఈ సంఖ్య 160కి వెళుతుంది. మైనారిటీలను కూడా కలిపితే 179కి చేరుతుంది. అగ్రకులాలకు అనుచిత ప్రాతినిధ్యం ఉందని భావించినా 243 అసెంబ్లీ స్థానాల్లో బహుజన వర్గాలుగా భావించే ఎమ్మెల్యేలు 179 మంది ఉండటం చిన్న విషయం కాదు.


ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే దాదాపు 50 శాతం అసెంబ్లీ సీట్లను ఓబీసీ, ఈబీసీ కులాల వాళ్లు బిహార్‌లో గెలుచుకుంటున్నారు. దీనికి కారణం రాజకీయ చైతన్యం. ఆధునిక ప్రజాస్వామ్యం దాన్ని రగిల్చింది. ఒకనాడు కులాలుగా కాకుండా వర్గాలుగా హక్కుల కోసం ప్రజలను కదిలించిన రాజకీయ పోరాటాల ఫలితమది. బిహార్‌ జనాభా లెక్కలను చూస్తే ఒక సత్యం స్పష్టమవుతోంది. ఓబీసీ–ఈబీసీలుగా గుర్తింపు పొందిన కులాలన్నీ ఒక స్థాయిలో లేవు. ఆర్థికంగా నిలదొక్కుకున్న కులాలు చట్టసభల పదవుల్లో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకున్నాయి. యాదవ సామాజిక వర్గమే ఇందుకు నిదర్శనం. ఆర్థిక వనరుల విషయంలో అగ్రకులాలతో ఆ వర్గం పోటీపడటం కొన్ని దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. రాజకీయ పదవులు, ఆర్థిక వనరులపై ఆధిపత్యం ఉన్న కులాలు ఉద్యోగాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించటం సహజం. అన్ని కులాల ఆర్థిక స్థితిగతులను తెలిపే వివరాలను బయటపెడితే బిహార్‌ సామాజిక చిత్రం అసలు రంగులు బయటపడతాయి. అగ్రకులాలతో పాటు రిజర్వేషన్ల కేటగిరిలో ఉన్న నయా ధనిక శ్రేణుల సంగతులూ తెలుస్తాయి. సరైన కుల లెక్కలు లేకపోవటంతో సంక్షేమ విధానాలను సమగ్రంగా రూపొందించలేకపోతున్నామని పైకి ఎన్నైనా భాష్యాలు చెప్పొచ్చు. ఆర్థిక అంతరాలు అన్ని కులాలను చుట్టివేస్తున్న నేపథ్యంలో వాటిని విస్మరించి కేవలం కులం చుట్టూ రాజకీయాలను నడిపితే ఆధిపత్యాలు, అసమానతలు సజీవంగానే ఉంటాయి. బిహార్‌ లెక్కలు చూపిస్తున్న సామాజిక దృశ్యం అదే.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2023-10-10T03:01:42+05:30 IST